Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రశ్నిస్తే.. ప్రజాప్రభుత్వాలను కూలగొడతరా?

-కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలుస్తారట!
-ఈ మాట స్వయంగా ప్రధానే అనవచ్చునా?
-ఎందుకు.. మేం ప్రజల ఓట్లతో గెలవలేదా?
-మహబూబ్‌నగర్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

‘కేసీఆర్‌.. నీ ప్రభుత్వాన్ని కూలుస్తా అని స్వయంగా ప్రధానే అంటే ఏందన్నట్లు? మేం పనిచేయం. మాకు చేతకాదు. మిమ్ములను చేయనియ్యం అన్నట్లే కదా! ఇది మంచి పద్ధతేనా? ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాన్ని చూసి ఇంత కండ్లమంటనా?’ అంటూ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగసభ వేదికగా బీజేపీ సర్కారు తీరును ఆయన ఎండగట్టారు. తెలంగాణ ప్రగతిని చూస్తూ ఎక్కడ వారి చేతగాని బయటపడుతుందోననే మోదీ కుట్రలకు తెగబడుతున్నారన్నారు.

‘తెలంగాణకు సహకరించాల్సిన కేంద్రం.. మన ప్రగతిని చూసి కన్నెర్ర చేస్తున్నది. మన పరుగుకు కట్టె అడ్డం పెడుతున్నది. రాష్ట్రానికి ఇచ్చే నిధులను ఆపాలె. వచ్చే పైసలు రాకుండా చెయ్యాలె. ఎఫ్‌ఆర్‌బీఎం మీద కోతలు పెట్టాలె. ప్రగతిని అడ్డుకోవాలె. ఇది సబబేనా? ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంటే దానికి అడ్డం పడుతరా? దేశ ప్రధాని, కేంద్రం చేయాల్సిన పనేనా ఇది? ఎదురుమాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడతాం అంటరు. స్వయంగా ప్రధానమంత్రే ఆ మాట అన్నడు. ఇదేనా పద్ధతి? నువ్‌ ఎట్ల గెలిచినవో మేం అట్ల గెలువలేదా? మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచినమా? ఏ కారణం చేత కూలగొడతవు?’ అంటూ కేసీఆర్‌ నిలదీశారు.

మోదీ పశ్చిమబెంగాల్‌కు చెందిన 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారని, ఓ ప్రధాని ఇలా మాట్లాడటం సబబేనా అని ప్రశ్నించారు. అనేకమంది సమరయోధులు ఉరికంబాలెక్కి స్వాతంత్య్రం తెచ్చింది ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాల కోసమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ప్రజలకు మంచి చేసేది లేదు, మంచినీళ్లు, సాగునీళ్లు ఇవ్వడం చేతకాదు, కరెంట్‌ ఇవ్వడం చేతకాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడం చేతకాదు, పేదల్ని ఆదుకోవడం చేతకాదు, ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు, పైగా ఉన్న ప్రభుత్వ కంపెనీలను కార్పొరేట్‌ గద్దలకు అమ్మేయాలె. ఇలాంటి దేశమేనా మనం కోరుకున్నది?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

యువకులు, విద్యావంతులు ఈ పరిస్థితులపై ఆలోచించకపోతే దేశం దెబ్బతినడం ఖాయమని, అందరం ఆగమైపోతమని హెచ్చరించారు. ప్రజలు దీనిపై ఆలోచన చేయాలని, ఇండ్లల్లో, గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరారు. చైతన్యవంతమైన సమాజముంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న సీఎం.. నాకెందుకులే అనుకుంటే రావని అన్నారు.

దేశ రాజధానిలో ఇప్పటికీ కరెంటు కోతలా!
ఐదేండ్లలోనే ప్రతి ఇంటికీ నల్లాపెట్టి నీళ్లు ఇయ్యకపోతే ఓట్లే అడగనని చెప్పి మాట నిలబెట్టుకున్నామని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. 24గంటల కరెంటు రెండేండ్ల లోపల ఇచ్చి తీరుతమని చెప్పి, సాధించి చూపామని వెల్లడించారు. రైతు బతుకులు బాగుపడాలని, వ్యవసాయం పండుగలా మారాలనే తాము రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు పథకాలు అమలు చేశామని.. ఓట్ల కోసమో, చిల్లర రాజకీయాల కోసమో కాదని స్పష్టంచేశారు. ఏటా వెయ్యి, రెండువేల కోట్లు నష్టమొచ్చినా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నదన్నారు. ‘దేశంలోనే తెలంగాణ రైతు కాలర్‌ ఎగరేసుకునే రోజు రావాలె. అన్నదాతలు అప్పుల్లేకుండా ఉంటేనే అది అసలైన బంగారు తెలంగాణ’ అని చెప్పారు. మిషన్‌ భగీరథ లాంటి పథకం పక్కనున్న కర్ణాటకలో లేదన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ తాగడానికి నీళ్లు లేవని, 24 గంటల కరెంటు లేదని విమర్శించారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఢిల్లీలో కరెంటు కోతలు, మంచినీటి కొరత ఉండటం సిగ్గుచేటని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.

నీటి వాటా తేల్చేందుకు 8 ఏండ్లు చాలవా?
‘అనాడు కాంగ్రెస్‌ నాయకులు, ఇప్పుడున్న ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌ జిల్లాలో సభలు పెట్టి.. పాలమూరు హమ్‌ బనాయేంగే అంటే హమ్‌ బనాయేంగే అని హామీలిచ్చారు. ఏం చేశారు? కిదర్‌గయే అబ్‌తక్‌. క్యూనహీ ఆయా?’ అంటూ కేసీఆర్‌ నిలదీశారు. కేంద్ర ప్ర భుత్వానిది అంతా పైన పటారం.. లోన లొటారమని విమర్శించారు. కేంద్రానికి దండం పెట్టామని, కడుపుల తలపెట్టి 150 దరఖాస్తులు స్వయంగా ఇచ్చానని కేసీఆర్‌ గుర్తుచేశారు. కరువు జిల్లా పాలమూరు, ఫ్లోరైడ్‌ జిల్లా నల్లగొండ, ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి.. ఈ మూడు జిల్లాలు హక్కు కలిగి ఉన్న కృష్ణాలో తెలంగాణ వాటా తేల్చాలని కోరామని తెలిపారు. ఎనిమిదేండ్లుగా ఎటూ తేల్చడం లేదని నిప్పులు చెరిగారు. ‘అద్భుతమైన ప్రచారాలు చేసుకునే ప్రధానికి 8 ఏండ్ల సమయం సరిపోలేదా? వాటా చెప్పడానికే ఇన్నేండ్లయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలె? ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలె? నీళ్లు ఎప్పుడు రావాలె? మా మనుమండ్లు, మునిమండ్లయినా చూస్తరా? లేకపోతే ఎప్పటికీ రానేరావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

మనకు 3 లక్షల కోట్ల నష్టం
తెలంగాణ ఏర్పడిన రోజు రాష్ట్రం బడ్జెట్‌ 62వేల కోట్లు కాగా, ఇవాళ రూ. 2.5 లక్షల కోట్లకు చేరుకున్నదని, 5.5 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్‌డీపీ 11.5 లక్షల కోట్లకు చేరుకుందని కేసీఆర్‌ వెల్లడించారు. కష్టపడి, అవినీతి రహితంగా, క్రమశిక్షణతో రాత్రింబవళ్లు పనిచేస్తేనే అది సాధ్యమయ్యిందని, డైలాగులు కొడితే కాలేదని తెలిపారు. తెలంగాణ పనిచేసిన విధంగా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం పని చేసి ఉంటే మన జీఎస్‌డీపీ రూ.14.5 లక్షల కోట్లుగా ఉండేదన్నారు. అసమర్థ కేంద్రం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఏకంగా రూ.3 లక్షల కోట్ల వరకు నష్టపోయిందని వివరించారు.

ఈ ప్రగతిని ఊహించినమా..?
తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్‌ జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటవుతుందని ఊహించలేదని, కానీ స్వరాష్ట్రంలో పాలమూరు జిల్లాలో 5 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేయడం సంతోషంగా ఉన్నదని కేసీఆర్‌ చెప్పారు. దళిత కుటుంబాలు తరతరాలుగా అణగిపోయి ఉన్నరు కాబట్టి వాళ్లకు ఎలాంటి షరతులు లేకుండా రూ.10లక్షలతో ఇష్టమున్న వ్యాపారం పెట్టుకునే అవకాశం కల్పించామన్నారు. అలాంటి పద్ధతి దేశంలో ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. మెడికల్‌, ఫర్టిలైజర్‌, బార్‌, వైన్స్‌ షాపుల్లో, లైసెన్స్‌లు ఇచ్చే ఇతర దుకాణాల్లో, కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఎన్నడైనా ఇచ్చారా? గౌడ సోదరులకు బార్‌ వైన్స్‌ల్లో రిజర్వేషన్లు ఇచ్చిన రాష్ట్రం ఇండియాలో ఎక్కడన్న ఉన్నదా? అని ఆయన ప్రశ్నించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.