Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రతి ఎకరాకు నీరు..

ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి మూడు నియోజకవర్గాలకు సాగునీరు ఇస్తామని, దీనిపై ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన అన్నారు. జిల్లాలోని సమస్యలన్నీ తనకు తెలుసునని, వచ్చే ఐదారేండ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసి ఇంచు భూమి కూడా వదలకుండా సాగునీరు అందించే బాధ్యత తనదేనని కేసీఆర్ చెప్పారు. మోసపూరిత ప్రాజెక్టులు మాత్రం కట్టబోమని ఆయన స్పష్టం చేశారు. -ఐదారేండ్లలో సాకారం చేస్తాం

CM KCR inaugurated the lift irrigation project in Adilabad district

-ఆదిలాబాద్ సమీపంలో విమానాశ్రయం -మేం డూప్లికేట్ ప్రాజెక్టులు కట్టం -గతంలో కమీషన్లకోసం కట్టారు..మేం ప్రజల కోసం కడతాం -అడవులు కాపాడే బాధ్యత మీది.. అభివృద్ధి బాధ్యత నాది -ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ -గూడెం ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం మేం డూప్లికేట్ ప్రాజెక్టులు కట్టం. గతంలో ప్రాజెక్టులు అంటే కేవలం కమీషన్ల కోసం కట్టారు. మేం ప్రజల కోసం పనిచేస్తున్నాం..ప్రజలకు పనికి వచ్చేవే కడుతం అని ముఖ్యమంత్రి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను అందాల కాశ్మీరంలా ప్రముఖ పర్యాటక కేంద్రంగా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని ఆయన చెప్పారు. ఆదిలాబాద్‌లో త్వరలో విమానాశ్రయం కూడా వస్తుందని ప్రకటించారు. అరుపులు, పెడబొబ్బలు వదిలి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.

అడవులను కాపాడాలని కోరారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దండేపల్లి మండలం గూడెంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కడెం మండలం దేవునిగూడెంలో ఒకేచోట లక్ష మొక్కలు పెంచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో 12 ఇంచుల వర్షపాతం నమోదవుతున్నదని, అనేక వాగులు, వంకలు ఉన్నాయని అన్నారు. అయినా గత కాంగ్రెస్, తెలుగుదేశం పాలకుల వైఫల్యం వల్ల జిల్లాలో కరువు చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నీళ్లు రాని ప్రాజెక్టులు ఉమ్మడి పాలకులు మన వద్ద పేరుకే ప్రాజెక్టులు ప్రారంభం చేసి నీళ్లు ఆంధ్రా ప్రాంతానికి తరలించుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు ఉంటే కాలువలు లేవు.. కాలువలు కడితే ప్రాజెక్టులు లేవని అన్నారు. అసలు వారి ఉద్దేశం తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా అడ్డుకోవడమేనన్నారు. అంతర్రాష్ట్ర వివాదాలు సృష్టించే విధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ చేశారని, ఈ ప్రాజెక్టు కింద మహారాష్ట్రలో భూములు మునుగుతాయని అన్నారు. దీనితో ప్రాజెక్టు కట్టవద్దని, దానికోసం వెచ్చించే డబ్బులు వృథా అవుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందన్నారు. తాను మహారాష్ట్ర వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వం మీరు కావలిసిన నీళ్లు తీసుకువెళ్లండి, అభ్యంతరం లేదు..కానీ, మా భూములు మాత్రం మునగకుండా చూడండి అని చెప్పిందని తెలిపారు.

లక్షా50వేల ఎకరాలకు నీరందిస్తాం ప్రాణహిత చేవెళ్ల మీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిద్వారా గత ప్రభుత్వం జిల్లాకు 56వేలఎకరాలకు నీరందించాలని ప్రతిపాదించారని ఆయన తెలిపారు. అయితే తాము లక్షా 50వేల ఎకరాలకు నీరందించాలని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం తదితరాల నేపథ్యంలో దీనిపై కసరత్తు చేశామన్నారు. సాధ్యమైనంత మేర ముంపు తగ్గించడం, ఎక్కువ ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి నీటిని ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తామని ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీళ్లందుతాయని చెప్పారు.

అదే సమయంలో కాళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి ఆ నీటిని మిగతా జిల్లాలకు తరలిస్తామని చెప్పారు. ఎవరు కూడా అరుపులు, పెడబొబ్బలు పెట్టాల్సిన అవసరం లేదని, ఈ జిల్లాలో సమస్యలు తనకు తెలుసునని కేసీఆర్ అన్నారు. వట్టివాగు వట్టిపోయి 10ఎకరాలకు నీరు పారే పరిస్థితి లేదు. చాలా ప్రాజెక్టులు అడ్డగోలుగా కట్టారు. కట్టిన ప్రాజెక్టులు సక్కగ చేసుకుందాం. సదర్‌మాట్ ఇంకా ఉన్న దాని కంటే పెద్దగా చేసే అవకాశం ఉంది. తప్పకుండా చేసుకుందాం. వాటన్నింటిని అద్భుతంగా నీరిచ్చేలా చేసే బాధ్యత నాది. ఆల్‌రెడీ సాగునీటి శాఖ అధికారులను నివేదిక అడిగిన.

అధికారులు అధ్యయనం చేసి నివేదికలు ఇస్తారు. 2,3 ప్యాకేజీలుగా చేసి నీరిచ్చే బాధ్యత నాది అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడితే లాభం పొందే మొట్టమొదటి జిల్లా ఆదిలాబాదేనని తాను ముందే చెప్పానన్నారు. ఇక్కడ నీటిని సద్వినియోగం చేసుకుంటే జిల్లాకు వాడుకోగా మిగతా జిల్లాలకు కూడా సరఫరా చేయవచ్చన్నారు. జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు

CM KCR addressing in Harithaharam programme in Mancherial

అందాల కాశ్మీరం చేస్తాం… ఆదిలాబాద్‌ను అందాల కాశ్మీరం చేసేంతవరకు అహర్నిశలు కృషి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అద్భుతమైన అందాలు ఉన్న జిల్లా ఇది. కొన్ని సమస్యల వల్ల టూరిజం గతంలో పెరగలేదు. ఇప్పుడు దేశ విదేశాల నుంచి విపరీతంగా టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది అన్నారు. జిల్లా కేంద్రానికి త్వరలో ఎయిర్‌పోర్ట్ వస్తుందన్నారు.

త్వరలోనే మూడురోజులు పర్యటిస్తా… గూడెం సభలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు తమ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని చేసిన విజ్ఞప్తిపై సీఎం మాట్లాడుతూ ఇప్పుడు కాదు.. త్వరలో జిల్లాలో జరిపే మూడురోజుల బస్సు యాత్ర సందర్భంగా ఇస్తానని చెప్పారు. అప్పుడు అధికార యంత్రాంగం అంతా ఉంటుంది. అన్ని సమస్యలు సత్వరం పరిష్కరించే దిశగా పనులు చేద్దాం అని చెప్పారు. మన ప్రభుత్వం పనితీరు అగో ఇగో అంటే ఆర్నెళ్లు అన్నట్లు ఉండదు… నేను హామీ ఇచ్చిన అంటే మూడురోజుల్లో జీవో వస్తుంది, ఆ వెంటనే పని అవుతుంది అని చెప్పారు.

అడవుల బాధ్యత మీది..అభివృద్ధి నాది… అడవులను కాపాడే బాధ్యత మీది.. అభివృద్ధి బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేవునిగూడెంలో ఒకేచోట లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఏం చేయాలో ఇక్కడ చేసి చూపారని అభినందించారు. తెలంగాణ ఎలా పచ్చగా ఉండాలని నేను కోరుకుంటున్నానో.. అదే విధంగా ఇక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. ఇందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. 80 హెక్టార్ల భూమిలో ఎక్కడైతే అడవిని నరికారో.. నరికినచోటే ఒకేసారి లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినందుకు అటవీశాఖ మంత్రి జోగు రామన్న, అటవీ అధికారులు, జిల్లా కలెక్టర్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్న అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, బీసీ సంక్షేమ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్, విప్ నల్లాల ఓదెలు, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, జడ్పీ చైర్‌పర్సన్ వడ్లకొండ శోభారాణి, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోవ లక్ష్మి, విఠల్‌రెడ్డి, బాపూరావు, కోనేరు కోనప్ప, తూర్పు, పశ్చిమ జిల్లా అధ్యక్షులు పురాణం సతీష్, లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, డీసీఎంస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.