Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రతి ఎకరాకు సాగునీరు

-సాగర్ ఆయకట్టులో చివరి ఇంచువరకూ నీళ్లు పారిస్తాం
-గోదావరి నీళ్లు సాగర్ ఎడమకాల్వలో పడాలి
-ఏటా రెండు పంటలు పండేలా ప్రణాళిక
-నేనే స్వయంగా వస్తా.. రైతులతో మాట్లాడి పరిష్కారంచేస్తా
-లిఫ్టుల నిర్వహణ సర్కారుదే
-ప్రభుత్వంలోకి లిఫ్టుల సిబ్బంది
-హుజూర్‌నగర్ ప్రజాకృతజ్ఞతసభలో ముఖ్యమంత్రి కేసీఆర్
-హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్
-దారిపొడవునా ఘనస్వాగతం
-హుజూర్‌నగర్‌కు సీఎం వరాలు
-గ్రామానికి రూ.25 లక్షలు
-మండలానికి రూ.30లక్షలు
-రెవెన్యూ డివిజన్‌గా హుజూర్‌నగర్
-హుజూర్‌నగర్‌లో కోర్టుకు కృషి
-గిరిజన గురుకులం ఏర్పాటుకు హామీ

తెలంగాణలో ఏ ఇంచైనా.. ఏ మూలైనా నాదే.. ఎక్కడ నీళ్లు రాకపోయినా ఆ దు:ఖం నాదే.. ఆ బాధ నాకుంటది. తెలంగాణ యావత్తు 1.25 కోట్ల ఎకరాలకు నీళ్లు రావాలె. తెలంగాణ పచ్చబడాలె.. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొండి పట్టుదలతో ముందుకు పోతున్న అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మూడేండ్లపాటు అహోరాత్రులు కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశామని, ఇక నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాగార్జునసాగర్ ఆయకట్టును కాపాడుకోవాలని తెలిపారు. సాగర్ ఎడమకాల్వలోకి గోదావరి నీళ్లు పారినప్పుడే.. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇందుకోసం ప్రణాళిక తయారుచేస్తున్నామని వెల్లడించారు.

ఆశలు కోల్పోయి, అన్నిరకాల ఆగమైపోయి, అనేక ఇబ్బందుల పాలై, వలసలు, కరెంటు షాకులు, భరించలేని కరెంటు బిల్లులు రైతులు కూడా ఆత్మహత్యల పాలైనరు. అనేకరకమైన ఇబ్బందులు పడినం. ఆ సమయంలో గుండె దిటవు చేసుకొని.. పదిమందిమి ఉద్యమాన్ని ప్రారంభించినం. మీ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ఉద్యమ ప్రారంభంలో ఉన్న మిత్రుల్లో ఒకరు. అనేక అవమానాలు, ఛీత్కారాలు, నిందలు భరిస్తూ.. పక్షుల్లాగ తెలంగాణ అంతా తిరిగి, జాగృతం చేసి చివరకు తెలంగాణ సాధించినం. సాధించిన తెలంగాణను మీరు మా చేతుల్లో పెడితే.. కడుపు, నోరు కట్టుకొని అవినీతిరహితంగా కచ్చితంగా కొన్ని లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నం అని సీఎం చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా శనివారం హుజూర్‌నగర్‌లో ఏర్పాటుచేసిన ప్రజాకృతజ్ఞత సభకు సీఎం హాజరయ్యారు.

హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో హుజూర్‌నగర్ బయలుదేరిన సీఎంకు దారిపొడవునా టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జాతీయ రహదారిపై చిట్యాల, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, మునగాల వద్ద పూల వర్షం కురిపించారు. మార్గమధ్యంలో సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి మీదుగా 50 వ కిలోమీటర్ దగ్గర కాళేశ్వరం జలాలు పారుతున్న కాల్వ దగ్గర ఆగి పూలు చల్లి పూజలుచేశారు. చివ్వెంల వద్ద డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం హుజూర్‌నగర్ సభాస్థలికి చేరుకొని అశేష జనసందోహానికి అభివాదం చేశారు. సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసిన.

ఇదే హుజూర్‌నగర్‌లో ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో బసచేసిన. ఇదే పట్టణంగుండా పాదయాత్రచేసినపుడు ఇక్కడి బాధలు చూసిన. కృష్ణానదిపై ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కువ ప్రాజెక్టులు కట్టినందున చాలా సంవత్సరాలుగా రావాల్సినంత నీళ్లు రావడంలేదు. ఈ ఏడాది దేవుడు కరుణించి కడుపునిండా వస్తున్నప్పటికీ.. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మంజిల్లా ఆయకట్టు బాధలు తొలిగిపోతాయని, నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు బాధలు శాశ్వతంగా పోవాలంటే గోదావరి నీళ్లు సాగర్ ఎడమకాల్వలో పడాలన్నారు. కృష్ణా నీళ్లకోసం ఎదురుచూడకుండా రెండుపంటలు ప్రతి ఏడాది పండేలా ప్రణాళిక తయారుచేస్తున్నామని పేర్కొన్నారు. దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణ మొత్తం సస్యశ్యామలమవుతుందని సీఎం చెప్పారు.

ప్రతి ఇంచు కూడా నీళ్లు పారాలి
సూర్యాపేట, కోదాడ నడిగూడెం, తుంగతుర్తిలో ఈరోజు కాళేశ్వరం నీళ్లు రావడానికి కారణం మూడేండ్లుగా అహోరాత్రులు పనిచేసి కాళేశ్వరం ప్రారంభించుకోవటమేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు నేను కొంత ఫ్రీ అయిన. ఇంగ కేసీఆర్ దెబ్బ నాగార్జునసాగర్ ఆయకట్టు మీద పడుతుందని మీ బిడ్డగా హామీ ఇస్తున్న అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను తీసుకొని రాబోయే పదిహేను రోజుల్లో కోదాడ, హుజూర్‌నగర్ నుంచి సాగర్ వరకు పర్యటించి రైతులతో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి మొత్తంతిరిగి ఐడియాకు రావాలని, ఆ తర్వాత తానువచ్చి ఎక్కడ ఏ లిఫ్ట్ కావాలో తెలుసుకొని మంజూరుచేస్తానన్నారు. త్వరలోనే కాల్వలైనింగ్, మరమ్మతులను పూర్తిచేస్తామని చెప్పారు. ఇంచుకూడా వదలకుండా ప్రతి ఎకరం పారేలాచేద్దాం. ఎట్ల పారదో చూద్దాం. అవసరమైతే కుర్చీవేసుకొని కూర్చొని పనిచేయిస్తా అని సీఎం తెలిపారు.

CMKCR2

లిఫ్టుల నిర్వహణ ఇక సర్కారుదే
సమైక్య పాలనలో ఎడమకాల్వ మీద లిఫ్టుల నిర్వహణ, కరంట్ బిల్లులు అన్నీ రైతుల నెత్తిన వేశారని, 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాతతే అప్పటి సమైక్యపాలకులు కుడికాల్వ మాదిరిగానే ఎడమకాల్వ కింద కరంట్ బిల్లులు చెల్లిస్తున్నారని సీఎం గుర్తుచేశారు. కొంత ఉపశమనం లభించినా, లిఫ్టుల నిర్వహణ బాధ్యత ఇంకా రైతులమీదనే ఉన్నదన్నారు. అందుకే ఇకపై లిఫ్టులన్నింటినీ రైతుల మీద ఎలాంటి భారంలేకుండా ప్రభుత్వమే ఆధీనంలోకి తీసుకుంటది. సిబ్బందిని కూడా ప్రభుత్వంలో కలుపుకొని జీతభత్యాలిస్తది. రాష్ట్రంలోని 500-600 లిప్టులకు ఇదే ఉపశమనం వస్తది. రైతులు సంతోషంగా ఉంటరు. తెలంగాణ ప్రజలందరికీ ఈ సభ ద్వారా ఈ శుభవార్తను తెలియజేస్తున్న అని సీఎం తెలిపారు.

హుజూర్‌నగర్‌కు వరాలు
హుజూర్‌నగర్‌లోని ఏడు మండలాలు, 134 గ్రామపంచాయతీల ప్రజలు టీఆర్‌ఎస్‌కు అందించిన ప్రేమకు, విజయానికి ప్రతిఫలం రావాలన్న సీఎం కేసీఆర్.. ప్రతి గ్రామపంచాయతీకి రూ.25 లక్షలు, మండల కేంద్రానికి రూ.30 లక్షల చొప్పున మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. హుజూర్‌నగర్ పట్టణాభివృద్ధికి సీఎం నిధుల నుంచి రూ.25 కోట్లు మంజూరుచేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలోని నేరేడుచర్ల అభివృద్ధికి మరో రూ.15కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉవ్వెత్తున ఉత్సాహపరిచే ఫలితాన్ని ఇచ్చినందుకు దానికి సరిసమానంగా హుజూర్‌నగర్ అద్భుతమైన, నిజమైన హుజూర్ అనే పరిస్థితి రావాలన్నారు. ఇక్కడి గిరిజన బిడ్డలకోసం రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. బంజారాభవన్‌ను కూడా నిర్మిస్తామన్నారు. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌తోపాటు అన్ని జిల్లాల్లో మంత్రివర్గంతోసహా తానే స్వయంగా వచ్చి.. ప్రజాదర్బారులు పెట్టి పోడుభూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా సిమెంట్ ఫ్యాక్టరీలున్న నేపథ్యంలో, కేంద్రంతో మాట్లాడి ఈఎస్‌ఐ దవాఖాన మంజూరుచేయిస్తామని చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు. మేళ్లచెరువువంటి ప్రాంతాలను కలిపి ఇక్కడే కోర్టును ఏర్పాటుచేసేందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో మాట్లాడుతానని తెలిపారు. వీలైనంత త్వరలో ఎక్కువమొత్తంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంజూరుచేస్తామన్నారు. పాత నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

జగదీశ్‌రెడ్డిపై దుర్మార్గపు ప్రచారం
క్యాబినెట్‌మంత్రి అయిన జగదీశ్‌రెడ్డిని పట్టుకుని మూడు ఫీట్లు లేరని కొందరు దుర్మార్గపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవుని దయ, దేవుడిచ్చిన హైట్ ఉన్నాడని.. జగదీశ్‌రెడ్డి ఏడు ఫీట్లు హైట్ ఉన్నాడని తామెప్పుడూ చెప్పలేదని అన్నారు. ఇక్కడ ఏడు ఫీట్లున్న మాజీ మంత్రులు చేసిన ఘోరం చెప్తే తెల్లారేదాక నవ్వినవ్వి చావాలన్నారు. ఇయ్యాల మూడు ఫీట్లున్న మంత్రి 300 కిలోమీటర్ల నుంచి కాళేశ్వరం నీళ్లు తెచ్చి పెన్‌పహాడ్, తుంగతుర్తి, నడిగూడెం, కోదాడ వరకూ భూములను పునీతం చేస్తున్నాడు. రూ.30 వేల కోట్లతో యాదాద్రి అల్ట్రా మెగాపవర్ ప్లాంటును ఈ జిల్లాకు తెచ్చినాడు అని ప్రశంసించారు. యాదాద్రి ప్లాంటు పూర్తయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్థిక ముఖచిత్రమే మారుతుందని అన్నారు.

చిన్న చిన్న లిఫ్టులతో సమస్యలు
నిజాం కాలంలో మనకోసం తలపెట్టిన ప్రాజెక్టు నందికొండ అని.. ప్రస్తుతం మనం పిలిచే నాగార్జునసాగర్ ఒరిజినల్ కాదని సీఎం తెలిపారు. మనకు ముందుగా 180 టీఎంసీలు ఇచ్చే లక్ష్యంతో ప్రాజెక్టు ప్రారంభమైనా.. తర్వాత రకరకాలుగా మారి 105 టీఎంసీలకు కోతపెట్టారని.. చివరకు ఆ మేర నీళ్లు కూడా ఎన్నడూ రాలేదన్నారు. నల్లగొండ జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు నీరు పారాల్సి ఉన్నా.. ఏరోజూ 3.75 లక్షల ఎకరాలకు కూడా పారలేదన్నారు. రాజవరం, ముది మాణిక్యం, వజీరాబాద్, జాన్‌పహాడ్.. ఇలా అనేక మేజర్‌లున్నాయి. వీటికింద ఇంకా డిస్ట్రిబ్యూటరీ మేజర్‌లున్నాయి. వాటికింద లిఫ్టులు పెట్టారు. అందులో కొన్నే పనిచేస్తున్నాయి. సమగ్ర విధానం పాటించకపోవడం, చిన్నచిన్న లిఫ్టులు పెట్టడం వల్లే ఈ సమస్యలు అని చెప్పారు. వాటి మెయింటనెన్స్ లేకపోవడం, ఆ భారం రైతులపై వేయడంవల్ల సమస్యలు వస్తు న్నాయని చెప్పారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే హైదరాబాద్ వచ్చినప్పుడు తాను కనిపిస్తే చాలు.. దున్నలపోతులగండి లిఫ్టు, బొట్టలపాలెం వాడపల్లి స్కీము, తుంగపాడు బంధం ఏమైంది? కేశవాపురం లిఫ్టు ఏమైందని ప్రశ్నిస్తారని చెప్పారు. ఈ మూడు కలిస్తే వజీరాబాద్ మేజర్‌లో ఉండే టెయిల్‌ఎండ్‌లో 14వేల ఎకరాలకు నీరు వస్తుందని.. కొత్తగూడ ద్వారా 11 వేల ఎకరాలకు వస్తాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే చెప్తుంటారని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ మీదుగా పోయే లింగగిరి మేజర్ మీద, హాలియాలోని పేరూరు కాల్వమీద పేదవాళ్లు ఇండ్లు కట్టుకున్నారని, ఇటువంటి సమస్యల నివారణకు ప్రత్యేక నిధులు మంజూరుచేస్తామని చెప్పారు.

CMKCR4

కేసీఆర్ రైట్, కేసీఆర్ గోహెడ్
ఇప్పుడు రాష్ట్రంలో కరంట్ బాధలు పోయాయని, మిషన్‌భగీరథ ద్వారా 56 లక్షల ఇండ్లకు నీళ్లిచ్చే కార్యక్రమం చిట్టచివరకు వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, గురుకుల పాఠశాలలు వంటి అనేక కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మారాయన్నారు. మీ అందరి దీవెన ఇదేవిధంగా ఉంటే ఎవరు ఎన్ని నిందలు పెట్టినా భయపడకుండా మీ సేవలో ముందుకుపోతాం. మరోసారి వచ్చినపుడు జాన్‌పాడ్ దర్గా, మట్టపల్లి నర్సింహస్వామి ఆలయాల్ని దర్శించుకుంటా. వాటినీ అభివృద్ధి చేయాల్సిన అవసరమున్నది. కులాలు, మతాలు లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తూ ముందుకు తీసుకుపోతున్న ఈ రాష్ర్టాన్ని చూసి కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నరు. కొన్ని అవాంఛనీయ ప్రకటనలు చేస్తున్నరు. ఓర్వలేక అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నరు. వారందరికీ దీటైన సమాధానం చెప్పి అద్భుతమైన మెజార్టీతో అభ్యర్థి సైదిరెడ్డికి విజయాన్ని చేకూర్చి.. కేసీఆర్ రైట్, కేసీఆర్ గోహెడ్ అని చెప్పి తెలంగాణకు హుజూరునగర్ నుంచి మీరేదైతే సందేశాన్ని ఇచ్చినారో దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తామని, రాష్ట్ర ప్రజల సేవలో తరిస్తామని హామీ ఇస్తున్నా అని చెప్పారు.

ఈ సభలో మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీ మాలోతు కవిత, రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్, మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ కర్నె ప్రభాకర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, నోముల నర్సింహయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నన్నపనేని నరేందర్, హరిప్రియ, పైలా శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, తాతా మధుసూదన్, సోమ భరత్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, జనగామ, ములుగు జెడ్పీ చైర్మన్లు పాగా సంపత్‌రెడ్డి, కుసుమ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

CMKCR3

కిక్కిరిసిన సభా ప్రాంగణం
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జనంతో హుజూర్‌నగర్ పట్టణం కిక్కిరిసిపోయింది. ప్రజా కృతజ్ఞతసభకు ముందు భారీ వర్షం కురిసి.. సభా ప్రాంగణం బురదమయంగా మారినా.. జనం వెరువలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సభకు తండోపతండాలుగా తరలివచ్చారు. సీఎం ప్రసంగంతో సభికుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఇప్పటికే ఘన విజయంతో సంబురాలు జరుగుతుండగా.. కేసీఆర్ సభతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది.

అభివృద్ధి ఘనత సీఎం కేసీఆర్‌దే: మంత్రి జగదీశ్‌రెడ్డి
హుజూర్‌నగర్, నమస్తే తెలంగాణ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత ప్రభుత్వాలు 60 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని తెలంగాణ సర్కారు ఐదేండ్లలో చేసిందని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా వెనుకబాటును గుర్తించిన సీఎం కేసీఆర్ నాలుగున్నరేండ్లలో రూ.50 వేల కోట్లను కేటాయించి అభివృద్ధి చేశారని చెప్పారు. రెవెన్యూ ప్రక్షాళన విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హుజూర్‌నగర్ ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించి నిరూపించారని పేర్కొన్నారు.

ఇది చరిత్రాత్మకమైన తీర్పు: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హుజూర్‌నగర్, నమస్తే తెలంగాణ: ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పునిచ్చారని హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రణాళికబద్ధంగా పనిచేశారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి గత మూడు శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని.. ఒక్క ఉప ఎన్నికలోనే సైదిరెడ్డికి ప్రజలు ఇచ్చారని సంతోషం వ్యక్తంచేశారు.

ప్రజలకు రుణపడి ఉంటా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్‌నగర్, నమస్తే తెలంగాణ: ప్రతిపక్షాల మాయమాటలు నమ్మకుండా తనను ఎమ్మెల్యేగా గెలిపించి సేవచేసేందుకు అవకాశం కల్పించిన హుజూర్‌నగర్ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నెరవేర్చుతానని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.