Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రతి గింజకు మద్దతు ధర

-లాభసాటి సాగు మన లక్ష్యం
-క్రాప్‌ కాలనీల ఏర్పాటుయత్నం దేశానికే ఆదర్శం
-కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం
-పెరిగే దిగుబడులకు ప్రణాళిక సిద్ధం చేయండి
-మనం తినే ఆహార పదార్థాలను మనమే పండించాలి
-ఇతర రాష్ట్రాలు, దేశాలకు కూడా ఎగుమతి చేయాలి
-ఏ పంటలను ప్రోత్సహించాలనేదానిపై పదిరోజుల్లో సర్వే
-వ్యవసాయ అనుబంధశాఖలు సమన్వయంతో వ్యవహరించాలి
-రైతులకు కనీస మద్దతు ధర వ్యూహంపై అధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటిపారుదలరంగాన్ని అభివృద్ధిపరుస్తున్నామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అందుకు తగినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా అవసరమైన వ్యూహం ఖరారుచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గింజకు మద్దతు ధర.. లాభసాటి సాగు మన లక్ష్యమని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించే వ్యూహాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి , రైతులకు కనీస మద్దతు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలేమిటి? ఏది ఎంత తింటున్నారు? ఎంత పండిస్తున్నారు? ఎంత దిగుబడి చేసుకుంటున్నారు? ఎంత ఎగుమతి చేస్తున్నారు? తదితర అంశా ల్లో ఖచ్చితమైన గణాంకాలు రూపొందించాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఏమి పండించాలి? ఏమి పండించవద్దు? ఏ పంటల సాగును ప్రోత్సహించాలి? మొత్తం గా ఏది లాభదాయకం? ఏది ఉపయుక్తం? అనే విషయంలో నిర్దిష్ట అభిప్రాయానికి రావాలని చెప్పారు. ఈ అంశాల్లో ఖచ్చితమైన వివరాలు రాబట్టేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పదిరోజుల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఈ ఖచ్చితమైన అంచనాలతోనే రాష్ట్రంలో క్రాప్‌ కాలనీలు ఏర్పాటుచేయాలని చెప్పారు. రైతులు పండించిన ప్రతీ గింజకు మంచి ధర వచ్చే విధంగా ప్రభుత్వ విధానం ఉండాలని పేర్కొన్నారు. రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్‌శాఖ కొనుగోళ్లు జరుపాలని, నిధుల సేకరణ కోసం మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం పూచీకత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రైతులు పండించిన పంట మార్కెట్‌కు వచ్చి, కాంటా అయిన ఐదు నిమిషాల్లోనే రైతులకు చెక్కు ఇచ్చే పద్ధతి రావాలన్నారు. మార్కెటింగ్‌శాఖే కొనుగోళ్లు చేయడంవల్ల పోటీతత్వం పెరుగుతుందని చెప్పారు. మంచిధర వస్తుందన్నారు. మార్కెటింగ్‌ శాఖ రైతుల నుంచి కొనుగోళ్లు జరిపి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరూ సరుకులు కొనకుండా చూడాలని సీఎం ఆదేశించారు. దేశ విదేశాల్లో మార్కెట్‌ పోటీదారులను గుర్తించి, వారిని ఎదుర్కొనే వ్యూహం రూపొందించాలన్నారు.

తినేవాటినిబట్టి ఉత్పత్తి చేద్దాం
తెలంగాణలోని ప్రజలు ఏ ఆహార పదార్థాన్ని ఎంత తింటారో ఖచ్చితమైన అంచనా ఉంటే.. ఏది పండించాలో నిర్ణయించవచ్చునని, ఏ పంటకు మంచి మార్కెట్‌ ఉందో తెలుసుకుని పంటలను సాగుచేస్తే మంచి ధర వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే వ్యవసాయశాఖ అధికారులు , సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక్కో రైతు నుంచి వివరాలు తీసుకుని, ఏ గుంట భూమిలో ఏది సాగుచేస్తున్నారో వివరాలు సేకరించాలన్నారు. ‘బియ్యం ఎంత తింటున్నారు? కూరగాయలు ఎన్ని తింటున్నారు? పప్పుదినుసులు ఎంత తింటున్నారు? మసాలా దినుసులు ఎంత తింటున్నారు? నూనె గింజల వాడకం ఎంత? తదితర విషయాలు సేకరించాలి. ఖచ్చితమైన వివరాలు ఉంటే అందుకు అనుగుణంగా పంటలు సాగుచేయడానికి వీలుగా క్రాప్‌ కాలనీల ఏర్పాటు సాధ్యమవుతుంది. పండించిన పంటకు మంచి మార్కెట్‌ రావడానికి ప్రభుత్వమే పూనుకుని చర్యలు తీసుకోవాలి. రైతులు కూడా పండించిన పంటనంతా ఒకేసారి మార్కెట్‌కు తీసుకురాకుండా గ్రామాలవారీగా మార్కెట్‌కు తీసుకువచ్చే పద్ధతిని వారికి అలవాటు చేయాలి. రైతు సమన్వయ సమితులను ఉపయోగించుకోవాలి’ అని ముఖ్యమంత్రి వివరించారు. ‘మనం ప్రతీ రోజు కూరల్లో కొత్తిమీర, మెంతికూర, పుదీన, జిలుకర వేసుకుంటాం. కానీ అవి మనం పండించం.ఎక్కడినుంచో దిగుమతి చేసుకుంటాం. మామిడిపండ్లు, బత్తాయిలు, ఇతర పండ్లు తింటాం. వాటిని కూడా దిగుమతి చేసుకుంటాం. చివరికి కూరగాయలను కూడా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చింది.

రాష్టంలో 142 మున్సిపాలిటీలున్నాయి. నగర జనాభా 50 శాతానికి చేరుకుంటున్నది. ప్రజలకు అవసరమైన కూరగాయలను ఆ పట్టణాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పండించవచ్చు. కానీ పండించడంలేదు. గతంలో గ్రామాల్లో పండించే కూరగాయలను పట్టణాలకు తీసుకొని వెళ్లి అమ్మేవారు. కానీ నేడు వేరే ప్రాంతాల నుంచి పట్టణాలకు దిగుమతి చేసుకుని, పట్టణాల నుంచి కూరగాయలను గ్రామాలకు తీసుకొని వెళ్లి అమ్ముతున్నారు. ఈ పరిస్థితి పోవాలి. మనం తినే కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను మనమే పండించుకోవాలి. ఒక్క బస్తా బియ్యం కూడా తెలంగాణకు దిగుమతి కావద్దు. మనమే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకోవాలి. అంకాపూర్‌ రైతుల మాదిరిగా దేశంలో ఏ పంటకు ఎక్కడ మంచి మార్కెట్‌ ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలకు మంచి ధర రాబట్టుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.

తెలంగాణ ప్రయత్నం దేశానికే ఆదర్శం
‘తెలంగాణ రాష్ట్ర ఆలోచన ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో క్రాప్‌ కాలనీలు ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వం ఇటీవలే అధికారులను ఆదేశించింది. రైతులకు కనీస మద్దతు ధర లభించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం. ఇదే విధంగా రైతులకు మంచి ధర లభించడం కోసం ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సమగ్ర వ్యూహం రూపొందించాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రంలో వరి, మక్కలు, పత్తి ఎక్కువగా పండిస్తున్నారు. పండ్ల తోటలున్నాయి. ఇతర పంటలను కూడా అక్కడక్కడ పండిస్తున్నారు. కానీ ఈ పంటల సాగు శాస్త్రీయంగా లేదు. మార్కెట్‌ పరిస్థితులను బట్టి పండించడం లేదు. ఉత్పాదకత పెరుగాలి. నాణ్యత పెరుగాలి. అప్పుడే రైతులకు మంచి ధర వస్తుంది. కల్తీ విత్తనాలు లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. ఇంకా కఠినంగా ఉంటుంది. పత్తి దిగుబడి ఎక్కువ రావడం కోసం అనువైన భూముల్లోనే పత్తిసాగు చేయించాలి. మేలురకమైన పత్తి సాగు విధానాలు ప్రపంచంలో ఎక్కడున్నా వాటిని అధ్యయనం చేసి అనుసరించాలి’ అని సూచించారు. పంజాబ్‌ సహా వరి సాగు బాగా జరిగే ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలని, మెళకువలు నేర్చుకుని, రైతులకు నేర్పించాలని చెప్పారు. ‘తక్కువ క్యాలరీలు , తక్కువ షుగర్‌ ఉన్న వరి వంగడాలు సాగుచేయాలి. వరిలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతులను తీర్చిదిద్దాలి. మక్కజొన్నకు మంచి డిమాండ్‌ ఉంది. మంచి విత్తనాలు తయారుచేయాలి. ప్రతీరోజు వంటలో వాడే చింతపండుకు కొరత ఉంది. తెలంగాణలో విరివిగా చింతచెట్లు పెంచాలి. హరితహారం కింద కనీసం 5 కోట్ల మొక్కలను రైతులకు ఉచితంగా సరఫరా చేయాలి. పసుపు కొమ్ములను పసుపు పొడిగా, మిరపకాయలను కారం పొడిగా, కందులను పప్పుగా మార్చి అమ్మే పనిని మహిళా సంఘాల ద్వారా చేయించాలి. స్వచ్ఛమైన పల్లినూనె, నువ్వుల నూనెలను తయారుచేయాలి. దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుంది. మహిళలకు ఉపాధి దొరుకుతుంది. కల్తీ సరుకులు కొనే బాధ వినియోగదారులకు తప్పుతుంది. మేలు రకమైన సాగు పద్ధతులను రైతులకు నేర్పడానికి వ్యవసాయ విస్తరణాధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దాలి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆగ్రానమీ ట్రైనింగ్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలి. యూనివర్సిటీలో ఆగ్రానమీ కన్సల్టెన్సీని పెట్టాలి’ అని చెప్పారు.

మంచి ఆహార అలవాట్లపై అవగాహన
‘మనం తినే ఆహారంలో ఏది ఆరోగ్యకరం? ఏది కాదు? అనే విషయంలో కూడా ప్రజల్లో అవగాహన పెంచాలి. మంచి ఆహార పదార్థాలను ప్రోత్సహించాలి. ఆకుకూరలు, పండ్ల వాడకాన్ని పెంచాలి. తెలంగాణ సోనా రకం బియ్యం మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తున్నారు. అలాంటి ఆహార పదార్థాలను ప్రోత్సహించాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘కొన్ని పండ్లను ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలోనే ఆయా పండ్ల సాగుకు ఏ ప్రాంతం అనువైనదో గుర్తించి సాగు చేయించాలి’ అని పేర్కొన్నారు. వ్యవసాయశాఖకు ఉద్యానవనశాఖ, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు తదితర శాఖలు అనుబంధంగా ఉండాలని, దీనికోసం అధికార వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.