-ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యాక అమలుచేస్తాం -ఉద్యోగులను గౌరవించుకోవడం ఉద్యమ పార్టీ బాధ్యత -మహిళా ఉద్యోగులపై వేధింపుల నిరోధానికి గ్రీవెన్స్‌సెల్స్ -వరంగల్ సదస్సును విజయవంతం చేయండి: ఎంపీ కవిత

ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళా ఉద్యోగులకు రక్షణగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల సెల్ ఏర్పాటుతోపాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో టాయిలెట్ సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడినట్టుగానే కొత్త రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ఉద్యోగులు తమవంతు బాధ్యత నిర్వర్తించాలని, ఇందులో మహిళా ఉద్యోగులు ముందుండాలని పిలుపునిచ్చారు. దశలవారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో టీఎన్జీవో ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కవిత మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ విజయంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు ఉద్యోగులను సంపూర్ణ భాగస్వాములను చేసిన టీఎన్జీవో ఉద్యోగ సంఘం పేరు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కొనియాడారు. పురుషులతో సమానంగా ఆ రోజు మహిళా ఉద్యోగులు, యూనివర్సిటీల్లో విద్యార్థినులు తెలంగాణ కోసం తెగించి కొట్లాడారని గుర్తుచేశారు. అలాంటి ఉద్యోగులను గౌరవించుకోవడం ఉద్యమ పార్టీ బాధ్యత అయినందుకే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగవర్గాలతో ఫ్రెండ్లీగా ఉంటున్నదని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీని ప్రకటించడమే దీనికి నిదర్శనమన్నారు.
ఆదాయం పన్ను మినహాయింపునకు కృషి ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని, ఎర్రజెండాల సంఘాలు కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని ఎంపీ కవిత మండిపడ్డారు. ఆశ వర్కైర్లెనా, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలైనా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాగానే పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తామని స్పష్టంచేశారు. మహిళా ఉద్యోగులకు రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను చెల్లింపులో మినహాయింపు ఇచ్చేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులపై వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్‌సెల్స్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. వచ్చే నెల 23,24 తేదీల్లో వరంగల్‌లో జరిగే అఖిల భారత మహిళా ఉద్యోగుల సదస్సును విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా తెలంగాణ పతాకాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించాలని సూచించారు. సదస్సులో పాల్గొనేందుకు వచ్చే 28 రాష్ర్టాల ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్రం తరఫున అతిథి, సత్కారాలు ఘనంగా ఉండాలని, అవసరమైన సహకారం ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసేలా కృషిచేస్తానని తెలిపారు.