Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రతి ఇంటికీ నల్లా

-తెలంగాణ స్టేట్ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ -మూడున్నరేండ్లలోనే పూర్తిచేయాలి – అధికారులు పట్టుబట్టి జట్టుగా పనిచేయాలి – 15 రోజుల్లో వాటర్ గ్రిడ్‌కు స్థలం గుర్తించాలి – రెండు నియోజకవర్గాలు ఒక డివిజన్‌గా సర్వే – అభివృద్ధిలో ఏపీతో మాకు పోటీ ఏంది? – గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుతో పోటీపడ్తాం – గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖల – రాష్ట్రస్థాయి ఇంజినీర్ల సమావేశంలో సీఎం

KCR-review-on-drinking-water-distribution మూడున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటి నల్లా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖల రాష్ట్రస్థాయి ఇంజినీర్ల అవగాహన సదస్సు, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్ తరహాలో తెలంగాణ స్టేట్ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ (టీఎస్‌డీడబ్ల్యూజీ)ని ఏర్పాటు చేయనున్నాం. సుమారు రూ.20వేల కోట్ల నుంచి రూ.25వేల కోట్ల అంచనా వ్యయంతో పెద్ద ఎత్తున సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నాం.

ఈ పథకం నాకు కొత్త కాదు. 20 ఏండ్ల కిందనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేట నియోజకవర్గానికి 65 కిలోమీటర్ల దూరం నుంచి పైపులైను ద్వారా మంచినీటి పథకానికి రూపకల్పన చేసి, విజయవంతంగా అమలుచేశాను. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఇంటికీ తాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ సమీకృత పద్ధతిలో పథకాన్ని రూపొందించి, మూడున్నరేండ్లలో అమల్లోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేయాలి అని చెప్పారు. ఏ పని చేయాలన్నా ఆత్మ విశ్వాసం ముఖ్యం. నేను చేపట్టిన ఏ పనుల్లోనూ ఇప్పటివరకు విఫలం కాలేదు. ఓటమి ఎరుగను. తెలంగాణ సాధిస్తానని చెప్పి సాధించాను. తెలంగాణ రాష్ట్ర సాధనకు మించిన కోరికలు లేవు. ఆ కోరిక కూడా తీరింది. ఇప్పుడు నాకు 61ఏండ్లు వచ్చినయి. ఎలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు లేవు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయం. ఆ దిశగా పని చేయాలి అని అన్నారు.

PUblic

అధికారుల్లో ఆత్మ విశ్వాసం ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుంటామనే ఆత్మవిశ్వాసం ఉందని అన్నారు. ఈ పథకానికి కావాల్సిన నిధులు, పరికరాలు, వనరులు సమకూర్చుకుందాం. రాష్ట్ర ప్రభుత్వంనుంచి నిధులు విడుదల చేయడమే కాకుండా కేంద్రంనుంచి నిధులు తీసుకొస్తాను. ఈ విషయం ప్రధానికి ఇప్పటికే చెప్పి ఉంచాను. ఆగస్టు 19న మనం నిర్వహించుకున్న సర్వేను దేశవ్యాప్తంగా కూడా నిర్వహించాలని కోరాను అని తెలిపారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని ఆచరణలో అమలు చేయాల్సింది అధికారులే. ఈ పథకాన్ని ప్రైవేటుకాంట్రాక్టర్లకు అప్పగించాలనే ఒత్తిడి వచ్చింది. కానీ అంగీకరించలేదు. ఉద్యోగులు తలుచుకుంటే సాధించి తీరుతారనే నమ్మకం ఉంది. సిద్దిపేటలో అధికారులు ఆ విధంగా నిరూపించారు. ఇప్పుడు కూడా అధికారులందరూ నరసింహావతారమెత్తి విజయవంతంగా ఈ పథకం పూర్తి చేయాలి. 15 రోజుల్లో వాటర్ గ్రిడ్‌కు కావాల్సిన స్థల సేకరణ చేపట్టాలి అని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగంలోని ఇంజినీర్లపై పూర్తి విశ్వాసం ఉంది. సర్వే మొదలు నిర్వహణ వరకు ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ప్రతి రెండు నియోజకవర్గాలను ఒక డివిజన్‌గా చేసి సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. తెలంగాణలో ఉన్న నీటి వనరులు, పైప్‌లైన్ల పనులు చేపట్టేందుకు, పరికరాలు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేస్తాం. అధికారులకు అవసరమైన వాహన సదుపాయంవంటి సౌకర్యాలు కల్పిస్తాం.

నిధులకు కొరతలేకుండా చూస్తాను. ఎంత ఖర్చుచేసైనా ఈ పథకం విజయవంతం చేయాలి అని సీఎం అన్నారు. ఉద్యోగులకు ఉన్న శక్తిసామర్థ్యాలను కించపర్చుకోవద్దని, అలాగని అతిగా భరోసాకూడా పెట్టుకోవద్దని హితవు పలికారు. ఎక్కడో ఒక అధికారి తప్పు చేసినంత మాత్రాన అధికారుందరికీ ఆపాదించటం సరైందికాదని అభిప్రాయపడ్డారు. మన అధికారులను మనం నమ్ముదాం. ఏఈలు, ఈఈలు, డీఈలు, ఎస్సీలు సహా అధికారులందరూ బాధ్యతతో పని చేయాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక డీఈ, మండలానికో ఏఈ, ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఒక పంపు మెకానిక్ ఉండాల్సిందే. ఏ అధికారికి ఉండే బాధ్యతలు ఆ అధికారికి ఉంటాయి అని ముఖ్యమంత్రి వివరించారు. గ్రామీణ నీటిపారుదల శాఖలో 2030 మంది అధికారులు ఉంటే 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. టీఎస్‌డీడబ్ల్యుజీ నిర్వహణలో భాగంగా విద్యుత్ సంబంధ వ్యవహారాలు చూసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌లోనే ప్రత్యేకంగా విద్యుత్ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం.

మన ఇంటిలోని చెత్తను మనమే ఎత్తేసుకోవాలి. కర్రుబుర్రు అంటే కుదరదు. గత పదేండ్లలో గందరగోళం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలన వేరు. మన రాష్ట్రంలో పాలన వేరు. గతం గురించి ప్రస్తావించను. ఆ జోలికెళ్లొద్దు. ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడాల్సిన అవసరం లేదు. అవసరమైతే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాలతో పోటీ పడుదాం అని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2584 గ్రామ పంచాయతీలున్నాయి. ఆయా గ్రామాలకు ఎంత నీరివ్వాలి? అందుబాటులో ఉన్న నీటి వనరులు ఏమిటి? పైపులైన్లు, ట్యాంకులు, ఇతర అవసరాలకు సంబంధించి గ్రామం వారీగా నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాలి. అందుకు సమగ్ర సర్వే నిర్వహించడం అవసరం.

సర్వే నిర్వహించేందుకు ఇతర శాఖల ఇంజినీర్ల సహకారం తీసుకోవాలి. వాటర్ గ్రిడ్ నిర్వహణ బాధ్యతను గ్రామీణ నీటి సరఫరా శాఖకు అప్పగిస్తాం. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి 10 శాతం తాగునీటికి, మరో 10 శాతం నీటిని పరిశ్రమల అవసరాలకు సరఫరా చేసేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలి అని ఇంజినీర్లకు సీఎం కర్తవ్యబోధ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు 20 లక్షల ఎకరాళ ప్రభుత్వ భూములు అనుకూలంగా ఉన్నాయి. అందులో 10 లక్షల ఎకరాలు ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు లేకుండా స్పష్టంగా ఉన్నాయి.

పరిశ్రమల స్థాపనలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అనుమతులు సులువైన పద్ధతుల్లో అందించేందుకు సింగిల్ విండో పద్ధతిని ప్రవేశపెడుతున్నాం అని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణ నీటిసరఫరాశాఖ చీఫ్ ఇంజినీర్ సరేందర్‌రెడ్డి, మంచినీటి సరఫరా రాష్ట్ర సలహాదారు ఉమాకాంత్‌రావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితాసబర్వాల్, టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, గ్రామీణ నీటిపారుదల, పారిశుధ్యశాఖల వివిధ జిల్లాల ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

వాటర్ గ్రిడ్‌కు ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు తెలంగాణ గ్రామీణ తాగునీటి సరఫరా ఉద్యోగులు తమ వంతు సాయం అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తెలంగాణ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు తమ ఒక రోజు వేతనాన్ని తెలంగాణ గ్రిడ్ ఏర్పాటుకు విరాళంగా ప్రకటించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్‌డబ్ల్యూఎస్ జియాలజిస్టు కరణం ప్రసన్న సకల జనుల సమ్మె కాలంలో ప్రభుత్వం చెల్లించిన 42రోజుల వేతనాన్ని తెలంగాణ గ్రిడ్ ఏర్పాటుకు విరాళంగా ప్రకటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.