హైదరాబాద్ నగర అభివృద్ధి, పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని అన్ని ప్రాంతాల ప్రజలకు మంచినీటి సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలంటూ అధికారులకు జలమండలి చైర్మన్, సీఎం కేసీఆర్ సూచించారు. సోమవారం సచివాలయంలో జలమండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రేటర్ పరిధిలోని తాగునీటి స్థితిగతులు, హైదరాబాద్ నగర మంచినీటి సరఫరాపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

-ఖర్చుకు సర్కారు వెనుకాడదు -నగర తాగునీటి సరఫరా సమీక్షలో సీఎం కేసీఆర్ -భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాస్టర్‌ప్లాన్ -మూడేళ్లలో తాగునీటి పథకాల పూర్తికి ఆదేశం తొమ్మిది జిల్లాలలో అమలు చేయనున్న జలహారం పథకానికి సమానంగా గ్రేటర్ పరిధిలో కూడా జలహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రజల తాగునీటి సరఫరా చేసే విషయంలో సర్కార్ ఖర్చుకు వెనుకాడదన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టాలని జలమండలి యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. నాగార్జునసాగర్ నుంచి మూడు దశల్లో కృష్ణా నీటిని తీసుకువస్తున్నట్లే ప్రత్యామ్నాయంగా శ్రీశైలం నుంచి తాగునీటిని సేకరించే మార్గంపై దృష్టి పెట్టాలని సూచించారు.
అతి తక్కువ ఖర్చుతో, అందులో పంపింగ్ ద్వారా కాకుండా గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు మంచినీటిని తీసుకువచ్చి, జంట జలాశయాల్లోకి తరలించే పద్ధతులపై అధ్యయనం చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పథకాలను రెండువైపుల నుంచి మంచినీటిని తెచ్చుకొనే వెసులుబాటు, నగరంలో వర్షపు నీరు నిలవకుండా జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సంయుక్త సమావేశాల ఏర్పాటు, అవుటర్ రింగురోడ్డుకు అనుకుని ఉన్న గ్రామాలకు తాగునీటి పైపులైన్లు వేయడం, ప్రాంతాలకు అతీతంగా నీటి సరఫరా అందించడం లాంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నగరంలో ప్రవేశపెట్టనున్న మన నగరం-మన సీఎం కార్యక్రమం అమలులో భాగంగా జలమండలికి సంబంధించి ప్రతి అంశాన్ని సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, జలమండలి ఎండీ జగదీశ్వర్, ఈడీ సత్యనారాయణ, ప్రభాకర్ శర్మ, డైరెక్టర్లు కొండారెడ్డి, రామేశ్వరరావు, ఎల్లస్వామి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ శివార్లలో తీరనున్న నీటి కష్టాలు ఇక శివారు ప్రాంతాల్లో మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలను గతంలోనే జలమండలి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం, పరిపాలనాపరమైన అనుమతి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే నిధులను మంజూరు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఇందుకు వెంకయ్యనాయుడు హామీ ఇవ్వడంతో జలమండలి అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.