Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రతి రైతుకూ.. సాగునీరు

-ప్రతి రైతుకూ..సాగు..సంపూర్ణంగా సాగునీరు
-ప్రభుత్వానికి అంతకుమించిన ప్రాధాన్యం లేదు
-చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందాలి
-అవసరమైతే కాలువల సామర్థ్యం పెంచాలి
-ఎస్సారెస్పీ వరద కాలువకు ఎక్కువ ఓటీలు
-అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయంచేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని.. వాటి ఫలితం రైతులకు అందాలంటే వీలైనంతవరకు ఎక్కువ భూములను సాగులోకి తీసుకురావడమే మార్గమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ సాగునీటికి గోస పడ్డదని, స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక సాగునీటిరంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. కాళేశ్వరంతోపాటు, పలు ప్రాజెక్టుల నిర్మాణంతో పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడిందని, వాటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతిరైతుకూ సాగునీరందాలని చెప్పారు. చిట్టచివరి ఆయకట్టు వరకు పుష్కలంగా నీళ్లందాలని.. ఇందుకోసం కాలువల సామర్థ్యం అనువుగా ఉన్నదా అనే విషయాన్ని మరోసారి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైతే కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. వివిధ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు సాగునీరందని భూములను గుర్తించి.. వాటిని వినియోగంలోకి తీసుకురావడంపై సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా నీళ్లందేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నీటితో ముందుగా చెరువులను నింపాలని, తర్వాత రిజర్వాయర్లను నింపి ఆయకట్టుకు నీటిని విడుదలచేయాలని సీఎం సూచించారు. ప్రణాళిక ప్రకారం నీటిని సరఫరా చేయడంవల్ల వానకాలంలో లభించే జలాలను పెద్దమొత్తంలో నిల్వ చేసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణలో చెరువులు, చెక్‌డ్యాములు ఎప్పుడూ నీటితో నిండి ఉండాలని, ఫలితంగా భూగర్భ జలమట్టం పెరిగి దాదాపు 45 వేల కోట్ల వ్యయంచేసి రైతులు వేసుకున్న బోర్లకు నీరందుతుందని చెప్పారు. అటు కాలువలు, ఇటు చెరువులు, మరోవైపు బోర్ల ద్వారా వ్యవసాయం సాగు సంపూర్ణమవుతుందని వివరించారు.

కల్వకుర్తి కింద ఈ ఏడాది 30 వేల ఎకరాలకు నీరు

‘ఈ ఏడాది కృష్ణానదిలోనూ నీటి లభ్యత ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికే నారాయణపూర్‌ నుంచి నీటిని వదిలారు. వెంటనే జూరాల, భీమా-2 లిఫ్టుల ద్వారా చెరువులకు నీటిని తరలించాలి. రామన్‌పాడు రిజర్వాయర్‌ను నింపాలి. కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ డీ 82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ పనులను వేగంగా పూర్తిచేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరందించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్దమొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్‌ను నిర్మించాలి. లేదంటే చెరువుల సామర్థ్యాన్ని పెంచాలి’ అని కేసీఆర్‌ చెప్పారు.

ప్రతి ప్రాజెక్టుకు నిర్వహణ ప్రణాళిక

తెలంగాణలో సాగునీటిరంగం ఉజ్వలంగా మారిందని, భారీప్రాజెక్టులు, కాలువలు, రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. చెరువులు కూడా బాగుపడటంతో కోటికిపైగా ఎకరాలకు సాగునీరందించే గొప్పవ్యవస్థ ఏర్పడిందని చెప్పారు. ఈ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం చాలాముఖ్యమని, ఇందుకోసం ప్రతిప్రాజెక్టుకు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణకోసం ప్రభుత్వం బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తున్నదని.. వేసవిలోనే అన్ని ప్రాజెక్టుల్లో అవసరమైన మెయింటనెన్స్‌ పనులు, రిపేర్లు పూర్తిచేసుకుని జూన్‌నాటికే సర్వం సిద్ధం కావాలని సూచించారు. పనిభారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణకోసం నీటిపారుదలశాఖను పునర్విభజించాలని, ఎక్కువజోన్లను ఏర్పాటుచేసి ప్రతి జోన్‌కు ఒక సీఈని బాధ్యుడిగా నియమించుకోవాలని చెప్పారు. ప్రాజెక్టులు, కాలువలు, రిజర్వాయర్లు, చెరువులు అన్నీ సీఈ పరిధిలోనే ఉండాలని పేర్కొన్నారు.

గతంలో మాదిరిగా భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ అంటూ నాలుగు విభాగాలుగా ఉండొద్దని.. నీటిపారుదలశాఖను అంతటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రతీస్థాయి అధికారికి అత్యవసర పనుల కోసం నిధులు మంజూరు చేసే అధికారం కల్పించాలని సూచించారు. సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పీ రాములు, ప్రభుత్వవిప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్లు, జైపాల్‌యాదవ్‌, రవిశంకర్‌, సంజయ్‌, కే విద్యాసాగర్‌రావు, కందాల ఉపేందర్‌రెడ్డి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఈఎన్సీలు మురళీధర్‌రావు, అనిల్‌, పలువురు సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ఫోన్లో సంభాషించిన కథలాపూర్‌ జెడ్పీటీసీ భూమయ్య, రైతు శ్రీపాల్‌రెడ్డిని కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఎస్సారెస్పీ కింద రెండుపంటలు పండాలి

‘కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్సారెస్పీ వరకు రెండుటీఎంసీల నీటిని తరలించే వెసులుబాటు కలిగింది. దీంతో ఎస్సారెస్పీ పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండుపంటలు పండించాలి. వరద కాలువ, కాకతీయ కాలువ, అప్పర్‌మానేరు, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు ఏడాది పొడవునా నీటితో నిండి జీవధారలుగా మారుతాయి. ఎస్సారెస్పీలోనూ 25 నుంచి 30 టీఎంసీల నీటిని ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. అవసరానికి తగ్గట్టు, పరిస్థితులకనుగుణంగా వాడుకోవాలి. గోదావరి నుంచి నీరువస్తే నేరుగా ఆ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలి. లేదంటే పునర్జీవ పథకం ద్వారా తరలించాలి’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

నిండని చెరువులను గుర్తించాలి

ఎస్సారెస్పీ పరిధిలో వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య దాదాపు 139 చెరువులున్నాయి. వాటిలో కొన్నింటికి నీరందడం లేదు. అలాంటి చెరువులను గుర్తించాలి. వరద కాలువకు వీలైనన్ని ఎక్కువ ఓటీలు పెట్టి ఆ చెరువులన్నింటినీ నింపాలి. రాబోయే మూడునాలుగు నెలల్లో ఇది పూర్తికావాలి. అటు ఎస్సారెస్పీ, ఇటు కాళేశ్వరం నుంచి వరద కాలువకు నీరందే అవకాశం ఉండటంతో 365 రోజులపాటు సజీవంగా ఉంటుంది. ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలకు వరద కాలువ ద్వారా నీరివ్వాలి. వరదకాలువ, కాకతీయకాలువ మధ్యభాగంలోనే కాకుండా.. వరద కాలువ దక్షిణభాగంలో నీరందని చెరువులను నింపాలి. ఈ పని ఆరు నెలల్లో పూర్తి కావాలి. ఎల్లంపల్లి నుంచి అందే నీటిలభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించారు. దాన్ని మార్చాలి. ఎల్లంపల్లి నుంచి 90వేల ఎకరాల్లోపే ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యమవుతుంది. మిగతా ఆయకట్టుకు ఎస్సారెస్పీ ద్వారా సాగునీరివ్వాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.