-టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా ప్రత్యేక ఇంటర్వ్యూ -టీఆర్‌ఎస్‌తోనే పట్టభ్రదుల సమస్యలు దూరం -ఆరేండ్లలో ఎంతో సాధించాం.. సాధిస్తూనే ఉంటం -తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన చరిత్ర నాది -ఎమ్మెల్సీగా సభకు ఒక్కరోజూ గైర్హాజరు కాలేదు

‘ప్రశ్నించడమే కాదు.. దానికి సమాధానం వెతకాలి. పరిష్కారం చూపించాలి. మీరు ప్రశ్నలు మాత్రమే వేయగలరు. మేము ప్రశ్నలకు సమాధానం, పరిష్కారం చూపగలం. కొత్త బిచ్చగాళ్లు మొదటిసారి ప్రశ్నిస్తున్నాం అనుకొని వస్తున్నారు. కానీ మేము ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేసి ఉన్నాం. ప్రశ్నను వదిలేయకుండా పరిష్కారం చూపించే కేసీఆర్ సైనికులం’.
ఎన్నికల ప్రచారం ఎలా సాగుతున్నది? పట్టభద్రుల నుంచి స్పందన ఎలా ఉన్నది? పల్లా: ప్రచారం అద్భుతంగా సాగుతున్నది. తెలంగాణ తెచ్చిన పార్టీగా, అనేక సమస్యలను పరిష్కరించిన పార్టీగా టీఆర్‌ఎస్‌పై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పట్టభద్రుల్లో సానుకూల స్పందన కనిపిస్తున్నది. మేం అనేక పనులు చేశాం. మాకు పనులు చేయడం తప్ప వాటిని చెప్పుకోవడం అలవాటు లేదు. ఎన్నికల సందర్భంగా మా ప్రభుత్వం చేసిన పనులను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరిస్తున్నాం. ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని, అసత్యాలను, అర్ధసత్యాలను తిప్పికొడుతున్నాం.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి శాసనమండలిలో ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై మాట్లాడలేదని మీ ప్రత్యర్థులంటున్నారు? ఆరేండ్లలో ఒక్కరోజు కూడా శాసనమండలి సమావేశాలకు నేను గైర్హాజరు కాలేదు. ప్రతి సమావేశంలో ప్రజల గొంతును, నన్ను ఎన్నుకున్న వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశా. ఉద్యోగుల సర్వీసు కండిషన్లు, రెగ్యులరైజేషన్, జీతభత్యాల పెంపు తదితర అంశాలపై మాట్లాడిన. పిటిషన్లు ఇచ్చిన. ప్రభుత్వ పెద్దలను ఆయా అంశాలపై కదిలించే ప్రయత్నం చేసిన. కేవలం సమస్యలను ప్రస్తావించడమే కాదు.. వాటిని పరిష్కరించే బాధ్యత కూడా తీసుకున్న. వీఆర్‌ఏల జీతం రూ.6,500 ఉంటే దాన్ని రూ.10,500 చేయించడంలో కీలకపాత్ర పోషించిన. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు.. ఇలా అనేక సమస్యలపై నేను సభాసాక్షిగా వారి గొంతుకగా పనిచేశాను. కొన్నిసార్లు నా ప్రయత్నాలు విఫలమయ్యాయి కూడా. వాటిని సాధించేందుకు మళ్లీ కొత్త మార్గాలను అన్వేషించి పరిష్కార మార్గం చూపించిన. కాంట్రాక్టు, అవర్లీబేస్డ్ వంటివారిని పర్మినెంట్ చేసేందుకు జీవో నం 16 జారీ చేయడంలో నా పాత్ర కూడా ఉన్నది. ఇక కాంట్రాక్టు టీచింగ్ సిబ్బందికి గతంలో 10 నెలలే జీతాలు వచ్చేవి. వీటిని 12 నెలలు చేయడంలో, సీఎల్‌లు ఇవ్వడంలో నాది ప్రధాన భూమిక. ఖమ్మంలో కేఎన్‌ఎం డిగ్రీకాలేజీలో 42 మంది సిబ్బందికి కొన్నేండ్లుగా జీతాలు రాలేదు, పర్మినెంట్ కాలేదు. వారు కోర్టుల చుట్టూ తిరిగారు. వారి సమస్యను పరిష్కరించిన.
బీజేపీ నేతలు తమను గెలిపిస్తే సింగరేణిని ప్రైవేటు కానివ్వబోమని చెప్తున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నింటినీ అమ్మేస్తామని.. వ్యాపారం చేయలేమని ఓ వైపు చెప్తున్నారు కదా.? సింగరేణిని ప్రైవేటుపరం కాకుండా కాపాడగలిగేది ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది. లేకపోయి ఉంటే వైజాగ్ స్టీల్‌లా సింగరేణిని బీజేపీ అమ్మకానికి పెట్టేది. తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుతున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే. ఆర్టీసీని ప్రైవేటుపరం కాకుండా చేశాం. బీహెచ్‌ఈఎల్‌ను అమ్మకుండా చేశాం. ప్రభుత్వ సంస్థలను బీజేపీ అమ్మేసింది. కంటెయినర్ కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వేలు.. ఇలా అనేక ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటుపరమయ్యాయి. బీజేపీ సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని చెప్పడం విడ్డూరం.
మీరు మరోసారి గెలిస్తే ఏం చేస్తారు? మీ ఎజెండా ఏమిటి? పట్టభద్రులకు సంబంధించి మూడు అంశాలు ఉన్నాయి. పీఆర్సీని త్వరితగతిన అమలు చేసి సర్వీస్ కండీషన్లు మెరుగుపరుస్తాం. చిరుద్యోగులకు ఉద్యోగ భద్రతతోపాటు వారి జీతభత్యాలు పెరిగేందుకు ప్రయత్నిస్త. పెన్షనర్లకు కూడా ఉపయోగపడేలా పీఆర్సీని అమలు చేయించేందుకు ప్రయత్నిస్త. ఉపాధ్యాయులకు హక్కుగా రావాల్సిన వారి పదోన్నతులు, బదిలీలు త్వరగా అయ్యేలా చూస్తా. పాలన వికేంద్రీకరణ వల్ల కొత్తపోస్టులు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. నిరుద్యోగులను ఎంటర్‌ప్రెన్యూర్లుగా మార్చాలన్నదే మా లక్ష్యం.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉద్యమంలో ఎక్కడున్నారు? మేము ఉద్యమకారులమని మీపై పోటీచేస్తున్నవారంటున్నారు. దీంట్లో నిజమెంత? తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లొచ్చిన వ్యక్తిని నేను. నాపై వివిధ పోలీసుస్టేషన్లలో 11 కేసులున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమంలో విద్యార్థులకు మద్దతుగా, ఆనాటి పోలీసుల దమనకాండకు నిరసనగా ర్యాలీలు చేశా. లాఠీ దెబ్బలు తిన్న. కావాలంటే నాతోపాటు పనిచేసిన విద్యార్థి నాయకులను అడగవచ్చు. ఇదే కోదండరాం నాతో ఉద్యమంలో కొన్ని వందలసార్లు మాట్లాడి ఉంటాడు. విద్యార్థి వేణుగోపాల్‌రెడ్డి మరణించినపుడు ఉస్మానియాలో విద్యార్థులతో కల్సి నడిచినందుకు నాపై కేసులు పెట్టించారు. 10 రోజులపాటు జైల్లో ఉన్నా. దరువు ఎల్లన్న నాతోపాటు జైల్లో ఉన్నాడు.
మూడు జిల్లాలతో మీకున్న వ్యక్తిగత అనుబంధం ఎలాంటిది? ఉమ్మడి వరంగల్ జిల్లా వేలేరు మండలం షోడషపల్లిలో పుట్టిన. అక్కడే ఏడో తరగతి వరకు చదువుకున్నా. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖమ్మంలో మా మేనమామ వద్ద ఉంటూ చదువుకున్నా. ఇంటర్మీడియట్ వరంగల్‌లో, డిగ్రీ మళ్లీ ఖమ్మంలో చదువుకున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పీహెచ్‌డీ చేశా. నల్లగొండ జిల్లాలో నా విద్యా సంస్థను స్థాపించా. నా భార్యది ఖమ్మం జిల్లా. ఇలా వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు జిల్లాలతో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది.
రైతుబంధు సమితి అధ్యక్షుడిగా మీ పనితీరు ఎలా ఉంది? రైతుబిడ్డగా వ్యవసాయంతో నాకున్న అనుబంధాన్ని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను రైతుబంధు సమితి అధ్యక్షుడిగా నియమించారు. రైతు వేదికల నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించా. అద్భుతమైన రైతుబంధు పథకం ద్వారా రైతులకు రూ.15వేల కోట్లకుపైగా సాయం అందించాం. కరోనా కష్ట సమయంలో 7500కు పైగా ధాన్యం సేకరణ కేంద్రాలు పెట్టి వరిధాన్యం, మొక్కజొన్న, ఇతర పంటలు కొన్నాం. గత సీజన్‌లో 24 గంటల హెల్ప్‌లైన్ పెట్టి ప్రతి గింజా కొనుగోలు చేశాం. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం. ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇచ్చాం. నియంత్రిత సాగు అమలుపై ప్రతి జిల్లాకు పోయి రైతులకు అవగాహన కల్పించాం.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి కదా? ప్రతిపక్షాలు కేవలం రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తుంటాయి. గత ఆరేండ్లలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో అక్షరాల లక్షా 32వేల ఉద్యోగాలు ఇచ్చాం. 9,350 మందిని గ్రామ పంచాయతీ కార్యదర్శులగా నియమించాం. 10,500 మందిని గురుకులాల్లో నియమించడం వాస్తవం కాదా? 18వేలకు పైగా టీచర్ రిక్రూట్‌మెంట్లు జరిగాయి. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 32వేల మంది భర్తీ అయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ 108 నోటిఫికేషన్లు ఇచ్చి దేశంలో ఏ రాష్ట్ర సర్వీస్ కమిషన్ ఇవ్వనన్ని ఉద్యోగాలు ఇచ్చింది. విద్యుత్‌శాఖలో నేరుగా తొమ్మిదివేల మంది రిక్రూట్ అయ్యారు. 24వేల మందిని పర్మినెంట్ చేసుకున్నాం.
ఓటర్లకు మీరు చేసే విజ్ఞప్తి? చాలామంది ప్రశ్నించే గొంతు అంటున్నారు. తెలంగాణలో ప్రశ్నించడం ఇప్పుడే మొదలు కాలేదు. ఈ గడ్డ మీద పుట్టిన ఎవరైనా చనుబాలు తాగుతూనే ప్రశ్నించడం నేర్చుకుంటారు. ఇలాంటి లక్షల ప్రశ్నలకు సమాధానమే 2014లో తెలంగాణ సాధన. ప్రశ్నించడమే కాదు.. దానికి సమాధానం వెతకాలి. పరిష్కారం చూపించాలి. మీరు ప్రశ్నలు మాత్రమే వేయగలరు. మేము పరిష్కారం చూపగలం. కొత్త బిచ్చగాళ్లు మొదటిసారి ప్రశ్నిస్తున్నాం అనుకొని వస్తున్నారు. కానీ మేము ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేసి ఉన్నాం. ప్రశ్నను వదిలేయకుండా పరిష్కారం చూపించే కేసీఆర్ సైనికులం.
ఐటీ రంగంలో ఎంతమందికి ఉపాధి లభించింది? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐటీ రంగంలో కొత్తగా రెండు లక్షల 11 వేల ఉద్యోగాలు వచ్చాయి. ఈ ఏడాది కొత్తగా మరో 30-40వేల ఉద్యోగాలు రానున్నాయి. ఖమ్మంలో కొత్తగా ఐటీ హబ్‌పెడితే 15 సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వచ్చాయి. వరంగల్‌లో సైయంట్, టెక్‌మహీంద్రా కంపెనీలు తమ బ్రాంచీలను పెట్టాయి. నల్లగొండలో కట్టంగూరు వద్ద భూమిని ఇప్పటికే గుర్తించారు. ఈ మూడు జిల్లాల్లో కూడా ‘టాస్క్’ ఆద్వర్యంలో శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. టూటైర్ సిటీలకు ఐటీని విస్తరిస్తున్నాం.