Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రతిపక్షాలది గుడ్డి వ్యతిరేకత

-తోటపల్లి పై దళారీల పక్షాన కాంగ్రెస్ -బాబు చేతిలో కిషన్‌రెడ్డి కీలుబొమ్మ -నటించే వారిని చరిత్ర క్షమించదు -బీజేపీ ఇక్కడ కాదు.. ఢిల్లీలో ధర్నాలు చేయాలి -మండిపడ్డ మంత్రి హరీశ్‌రావు

Harish-Rao-participated-in-Harithaharam-Programme-at-Narsampet-constituency01

ప్రతిపక్ష నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు కండ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నటించే వారిని చరిత్ర క్షమించదని హెచ్చరించారు. మంత్రి హరీశ్‌రావు మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో మిషన్ కాకతీయలో పునరుద్ధరించిన చెరువుల కట్టలపై హరితహారంలో భాగంగా ఒకే రోజు లక్ష మొక్కలు నాటిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం ఊరుగొండలోనూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు కట్టపై అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావుతో కలిసి హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరదకాల్వ నిర్మాణంలో భాగంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి 2006-07లో టెండర్లు పిలిచిందన్నారు. తర్వాత ఎనిమిదేండ్లలో తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. ఈ రిజర్వాయర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డిజైన్‌తో ఆరు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, 35 వేల ఎకరాలకే సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముంపు సమస్య లేకుండా చేసిన రీడిజైన్‌తో ముంపు అసలే లేదని, తక్కువ ఖర్చుతో 40వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ఇవేవీ పట్టించుకోకుండా దళారుల పక్షాన నిలుస్తున్నదని, రాత్రికి రాత్రే రిజర్వాయర్ ప్రతిపాదిత స్థలంలో వెలిసిన గుడిసెల దళారులకు డబ్బులు ఇప్పించి పంచుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రాజెక్టు నిర్మించాలంటున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.840 కోట్లు కేటాయించిందని, శాసనసభ ఈ బడ్జెట్‌కు ఆమోదం కూడా తెలిపిందని గుర్తుచేశారు. బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన వారిలో సభ్యులైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు కిషన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు.

ఇది ఆత్మవంచన, ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం మహబూబ్‌నగర్‌లో ధర్నా చేయడాన్ని మంత్రి హరీశ్‌రావు తప్పుపట్టారు. కిషన్‌రెడ్డి ధర్నాలు చేయాల్సింది తెలంగాణలో కాదు..దేశ రాజధాని ఢిల్లీలో అని హితవుపలికారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలోని కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని, తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను ఏపీ సీఎం ఇవ్వకపోయినా పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయకు నిధులు ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి గడపగడప తిరిగినా మోదీ ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ఇవ్వలేదని, అదే ఆంధ్రాలోని పోలవరం ప్రాజెక్టుకు మాత్రం నిధులు కేటాయిస్తున్నదని ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపుల్లోను కేంద్రం తెలంగాణపై వివక్ష ప్రదర్శించిందన్నారు. ఇటీవలి స్మార్ట్ సిటీల ఎంపికలోనూ ఏపీలో నాలుగు ఎంపిక చేసి, తెలంగాణలో రెండు నగరాల ఎంపికతోనే సరిపెట్టిందని ధ్వజమెత్తారు. డిండి ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపాలని ఏపీ సీఎం చంద్రబాబు సీడబ్ల్యుసీకి లేఖ రాశారని, తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. అలాంటి చంద్రబాబుతో బీజేపీ రాష్ట్రంలో కలిసి పనిచేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు వ్యతిరేకిస్తున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులు కట్టమంటారా..వద్దంటారా అని కిషన్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రానాయకత్వం, ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. బీజేపీ విధానాలు నచ్చక ఆ పార్టీలో పనిచేసిన నేతలు ఒకరి తర్వాత మరొకరు కమలానికి గుడ్ బై చెబుతున్నారని గుర్తుచేవారు. మొన్న రామగళ్ల పరమేశ్వర్, నిన్న జగ్గారెడ్డి బీజేపీని వీడడం, మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన ధర్నాలో నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొనకపోవడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణ ద్రోహుల పార్టీ టీడీపీతో కలిసి ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో బీజేపీ కూడా ద్రోహుల పార్టీయే అవుతుందన్నారు. కిషన్‌రెడ్డి ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.