రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికోసం వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును మిషన్ మోడల్లో ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణను స్వయం సహాయక బృందాలకు అప్పగించాలన్న యోచనలో ఉన్నట్టు చెప్పారు. గుజరాత్లో రెండురోజుల పర్యటన విజయవంతమైందన్నారు. -స్వయం సహాయక బృందాలకు నిర్వహణ బాధ్యతలు! -గుజరాత్ పర్యటన విజయవంతం: మంత్రి కేటీఆర్ -సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పుకున్న గుజరాత్
వాటర్‌గ్రిడ్ అమలవుతున్న తీరుతెన్నులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి అధికారులతో కలిసి గుజరాత్లో మంత్రి కేటీఆర్ రెండోరోజుల పర్యటన ఆదివారం ముగిసింది. తెలంగాణలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకటాస్క్గా చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తిచేయాలనే పట్టుదలతో మంత్రి ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు విషయాలను గుజరాత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన అంశాలపై అక్కడి ఉన్నతాధికారులు, సీనియర్ చీఫ్ ఇంజినీర్లతో మంత్రి చర్చలు జరిపారు.
రాష్ట్ర అధికారుల బృందంతోపాటు అక్కడి అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. గుజరాత్లో చేపట్టిన వాటర్‌గ్రిడ్ నాలుగేండ్లలో 60శాతం పూర్తి చేశామని గుజరాత్ అధికారులు వివరించారు. అయితే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణలో మూడున్నర ఏండ్లలోనే పూర్తిచేయాలనుకుంటున్నామని, అందుకోసం ఎలా ముందుకెళ్లాలన్న అంశాలపై అధికారులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన పర్యటనల అనంతరం ఒక సమగ్రమైన నివేదికను అందజేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను అక్కడిక్కడే మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
గుజరాత్‌లోని గాంధీనగర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవ్దా వాటర్‌పంపింగ్ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. 12 మోటార్లను బిగించి నర్మదా డ్యాం నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని 2325 గ్రామాలకు, 38 పట్టణాలకు అందిస్తున్న పంపింగ్ విధానాన్ని మంత్రి మెచ్చుకున్నారు. ఈ పంపింగ్ విధానం పనితీరును అక్కడి మహిళలను అడిగి తెలుసుకున్నారు. వాటర్‌గ్రిడ్ నిర్వహణ బాధ్యతలను పన్నీ సమితి మహిళలే చూసుకుంటున్నారని అక్కడి అధికారులు వివరించారు.
రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక బృందాలను కూడా ఇదే తరహాలో వాటర్‌గ్రిడ్ నిర్వహణలో భాగస్వాములను చేసే అంశాలను పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా గుజరాత్ అధికారులు స్పందిస్తూ గుజరాత్‌లోని తాగునీటి అవసరాల్లో 60 శాతం నదులు నుంచి, 40 శాతం ఇతర జలవనరుల నుంచి తీసుకుంటున్నట్లు వివరించారు.
తెలంగాణలో ఏర్పాటు చేయబోయే వాటర్‌గ్రిడ్‌కు తగిన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని గుజరాత్ అధికారులు మంత్రి కేటీఆర్‌కు హామీఇచ్చారు. మంత్రి కేటీఆర్ వెంట బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఎన్సీ సురేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, తాగునీటి సరఫరా సలహాదారు చీఫ్ ఇంజినీర్ బాబూరావు తదితరులు ఉన్నారు.