Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పరిషత్ పోరులో టీఆర్‌ఎస్‌ చారిత్రాత్మక విజయం

-449 జెడ్పీటీసీలు, 3571 ఎంపీటీసీలు టీఆర్‌ఎస్ కైవసం
-టాప్ గేర్‌లో కొనసాగిన కారు జోరు..
-ఆరు జిల్లా పరిషత్తుల్లో ప్రతిపక్షం కరువు
-కేసీఆర్ నాయకత్వానికి తెలంగాణ జై
-చిత్తుచిత్తయిన హస్తం, కమలం పార్టీలు..
-బడానేతల ఇలాకాలోనూ పరాభవాలే
-మూణ్ణాళ్ల ముచ్చటగా కాంగ్రెస్, బీజేపీ సంబురం
-ఎల్లుండి ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక..
-ఎనిమిదిన జెడ్పీ చైర్మన్ ఎన్నికలు

పల్లెల్లో గులాబీ తోటలు గుబాళించాయి! పరిషత్తు ఫలితాల్లో కారు టాప్‌గేరులో దూసుకుపోయింది! ఎన్నికలు ఏవైనా.. గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మరోసారి రుజువైంది! రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్న టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని దీవించిన ప్రజలు.. పరిషత్ ఎన్నికల్లో అపూర్వ.. అఖండ విజయాన్ని అందించారు! తమ విశిష్ట తీర్పుతో.. స్థానిక పాలనాపగ్గాలను కూడా గులాబీ దళాలకే అప్పజెప్పారు! తన పట్టు సడలలేదని నిరూపించుకున్న టీఆర్‌ఎస్.. మంగళవారం వెల్లడైన స్థానిక ఫలితాల్లో 538 జెడ్పీటీసీ స్థానాలకుగాను 449 స్థానాల్లో, 5816 ఎంపీటీసీ స్థానాలకుగాను 3571 స్థానాల్లో ఘనవిజయం సాధించింది! దేశచరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా మొత్తం 32 జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే దిశగా రికార్డు సృష్టించింది! కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలున్న ప్రాంతాల్లో సైతం జయకేతనం ఎగురవేసింది! గాలివాటు విజయాలతో అత్యాశలకు పోయిన కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డాయి! వెరసి.. మొత్తంగా 437కుపైగా ఎంపీపీ అధ్యక్ష పీఠాలను ఎలాంటి పోటీలేకుండా టీఆర్‌ఎస్ చేజిక్కించుకోనున్నది! మరో 27 స్థానాల్లో పోటాపోటీ ఉంటుందని భావిస్తున్నా.. అక్కడ గెలిచిన కొందరు స్వతంత్రులు టీఆర్‌ఎస్ టికెట్ లభించక ఇండిపెండెంట్‌గా పోటీచేసినవారే కావడంతో మరికొన్ని స్థానాలు గులాబీ ఖాతాలోకి చేరనున్నాయి!

పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది. అన్ని జిల్లాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. తమ గుండెల నిండా సీఎం కేసీఆరే ఉన్నారని మరోసారి యావత్ తెలంగాణ తీర్పు చెప్పింది. మంగళవారం విడుదలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కారు జైత్రయాత్ర కొనసాగింది. ఇప్పటికే వరుస విజయాలతో విపక్షాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న టీఆర్‌ఎస్.. సమీప భవిష్యత్తులో తనకు సాటివచ్చే శక్తులు లేవని నిరూపించుకున్నది. పరిషత్ ఎన్నికల్లో సింహభాగం స్థానాల్లో తమదే విజయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వెలిబుచ్చిన విశ్వాసం.. అక్షరాలా వాస్తవరూపం దాల్చింది.

పోస్టల్ బ్యాలెట్లతో టీఆర్‌ఎస్ దూకుడు మొదలు
రాష్ట్రంలో మొత్తం 5,816 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలుండగా.. నాలుగు జెడ్పీటీసీ, 158 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 5,658 ఎంపీటీసీ, 534 జెడ్పీటీసీ స్థానాలకు గతనెల ఎన్నికలు నిర్వహించి, మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు చేపట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా.. టీఆర్‌ఎస్‌కే ఎక్కువ పోలయ్యాయి. అనంతరం బ్యాలెట్ బాక్సుల సీల్ తీయగా ఆదినుంచీ తీర్పు టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా సాగింది. మంగళవారం రాత్రి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల ప్రకారం ఏకగ్రీవాలతో కలుపుకొని టీఆర్‌ఎస్ 3,571 ఎంపీటీసీలు, 449 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని దూసుకుపోయింది. కాంగ్రెస్ 1387 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 206 ఎంపీటీసీలు, ఎనిమిది జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 21, వామపక్షాలు 71 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన 581 ఎంపీటీసీ స్థానాల్లో, ఆరు జెడ్పీటీసీల్లో స్వతంత్రులు, ఇతరులు గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టింది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి-2 ఎంపీటీసీ స్థానంలో టీఆర్‌ఎస్, బీజేపీలకు సమాన ఓట్లు రావడంతో లాటరీ తీశారు. డ్రాలో బీజేపీ అభ్యర్థి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. మహబూబాబాద్ మండలం శీత్లా తండా ఎంపీటీసీలో కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కు 610 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 611 వచ్చాయి.

32 జెడ్పీ పీఠాల కైవసం.. చారిత్రాత్మకం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు స్థానికసంస్థల ఎన్నికలు జరిగినా.. తాజా ఎన్నికల ఫలితాలు చరిత్రలో నిచిపోనున్నాయి. 32 జిల్లాల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఏపక్షంగా గెలుపు సాధించింది. దీంతో 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్ సొంతం కానున్నాయి. ఒక రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్ పీఠాలను ఒక పార్టీ క్లీన్‌స్వీప్‌చేయడం బహుశా ఇదే మొదటిసారని విశ్లేషకులు చెప్తున్నారు.

ఎల్లుండి ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక
పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఏడున మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. గురువారం సంబంధిత సభ్యులకు సమాచారమిచ్చి, శుక్రవారం ఉదయం నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలని ఎస్‌ఈసీ ఆదేశాలిచ్చింది. ఈ నెల ఎనిమిదిన జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగనున్నది.

కమలం కకావికలు
పరిషత్ ఫలితాల్లో కమలం కకావికలమయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ.. పరిషత్ పోరులో చతికిలపడిపోయింది. ఎంపీటీసీ ఎన్నికల్లో కనీసం మూడుశాతం స్థానాలు కూడా సాధించలేకపోయింది. ఎంపీటీసీల విషయంలో.. దాదాపు 11 జిల్లాల్లో బీజేపీ ఖాతానే తెరువలేదు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినచోట కూడా చిత్తుగా ఓడిపోయింది. పదిహేనుకుపైగా జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇక జెడ్పీటీసీ స్థానాల విషయంలో దారుణ ఓటమిని చవిచూసింది. 28 జిల్లాల్లో కమలం వికసించలేకపోయింది. మొత్తంగా 1.4శాతంతో ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలకే పరిమితమైంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలోనూ కాషాయ జెండా ఎగురలేకపోయింది. పట్టుందని చెప్పుకొన్న కరీంనగర్‌లో కేవలం 15 ఎంపీటీసీలు రాగా, ఒక్క జెడ్పీటీసీ కూడా గెలువలేకపోయింది. మొత్తంగా పరిషత్ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవటంతో బీజేపీ శ్రేణులు సైలెంట్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ విజయగర్వం ప్రదర్శించినా.. ఎవరి చేతిలో రాష్ట్రం ఉండాలో, ఎవరి నాయకత్వం రాష్ర్టానికి అవసరమో విజ్ఞతతో ఆలోచించిన తెలంగాణ ప్రజలు బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పారు.

పటిష్ఠమైన క్యాడర్ టీఆర్‌ఎస్ సొంతం
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి పరిషత్ పోరు ఇదే కావటం ఈ ఎన్నికల ప్రత్యేకత. తమది 125 ఏండ్ల చరిత్ర అని చెప్పుకొనే కాంగ్రెస్ ఒకవైపు, ప్రత్యామ్నాయం తామేనని జబ్బలు చరుచుకుంటున్న బీజేపీ మరోవైపు నిలువగా.. ఈ రెండు పార్టీలకు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ సవాలు విసిరింది. తెలంగాణ మూలాల్లోకి విస్తరించి ఉన్న టీఆర్‌ఎస్ క్యాడర్ శక్తి ముందు.. హస్తం, కమలం దారుణ ఓటమిని మూటగట్టుకున్నాయి. టీఆర్‌ఎస్ 2001లో ఆవిర్భవించినప్పటినుంచి రాష్ట్ర ఏర్పాటువరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. వాటిన్నింటినీ లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్ గట్టి పునాదులేసుకున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అది మరింత బలోపేతమైంది. అసెంబ్లీ, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుస్తూ వస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో బలమెంత? అనే అనుమానాలు ఉండేవి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. టీఆర్‌ఎస్.. తెలంగాణ ఇంటిపార్టీ అని, రాష్ట్రమంతటా పార్టీకి దృఢమైన మూలాలు ఉన్నాయని తెలంగాణ ప్రజలు నిరూపించారు. పరిషత్ ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పు చెప్పి తాము టీఆర్‌ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షమేనని నినదించారు.

కలిసి పోటీచేసినా ఫలితం లేదు..
పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలుపుకంటే టీఆర్‌ఎస్ ఓటమికోసమే కాంగ్రెస్, బీజేపీ ఎక్కువగా పనిచేశాయనేది బహిరంగరహస్యమే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 3, బీజేపీ 4 లోక్‌సభ స్థానాలను గెలిచాయి. టీఆర్‌ఎస్ మొత్తం 17 స్థానాలకుగాను మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి పదిస్థానాలు సొంతం చేసుకున్నది. అంటే మెజారిటీ స్థానాల్లో గెలుపు సాధించింది. స్వల్ప మెజారిటీతో మూడు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ విజయగర్వాన్ని ప్రదర్శించాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమంటే మేమేనంటూ రెండోస్థానం కోసం ఆశపడ్డాయి. ఒక దశలో ఆ రెండు పార్టీల నాయకులు టీఆర్‌ఎస్ నాయకత్వంపై అవాకులు చెవాకులు పేలారు. అదే సమయంలో గెలిస్తే పొంగిపోం.. ఓడితే కుంగిపోం. మెజారిటీ స్థానాల్లో గెలిచినప్పటికీ, 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేశాం అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినమ్రంగా చెప్పారు. అంతేకాదు.. పరిషత్ ఫలితాల్లో భారీ విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. కేటీఆర్ విశ్వాసాన్ని తాజా తీర్పుతో తెలంగాణ ప్రజలు నిజంచేశారు.

కారు జోరును అడ్డుకోలేకపోయిన విపక్షాలు
టీఆర్‌ఎస్ దూకుడును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎన్నో కుట్రలకు తెరలేపాయి. సిద్ధాంతాలను మరిచి చేతులు కలిపాయి. అయినా ఎక్కడా బలాన్ని చాటుకోలేకపోయాయి. పరిషత్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుపొందింది. దేశంలోనే బహుశా తొలిసారి 32 జెడ్పీ చైర్మన్లను కైవసం చేసుకొని చరిత్ర తిరగరాయనున్నది. లోక్‌సభ ఎన్నికల్లో గాలివాటున కొన్ని స్థానాలు గెలిచిన కాంగ్రెస్, బీజేపీల సంతోషం పట్టుమని పదిరోజులు కూడా నిలువలేదు. ఆ రెండు పార్టీలకు క్షేత్రస్థాయిలో ప్రజామద్దతు లేదని స్థానిక ఫలితాలు తేల్చిచెప్పాయి. టీఆర్‌ఎస్ దరిదాపుల్లో కూడా నిలువలేకపోయాయి. పరిషత్ ఎన్నికల్లో కారు వేగానికి హస్తం నలిగిపోయింది. ఎంపీటీసీ ఫలితాల్లో నల్లగొండ, సంగారెడ్డి మినహా మిగతా అన్ని జిల్లాల్లో డబుల్ డిజిట్‌కే పరిమితమైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మేడ్చల్, వనపర్తి, వరంగల్ అర్బన్, గద్వాల, సిరిసిల్ల, నారాయణపేట జిల్లాల్లో కాంగ్రెస్‌కు 20లోపే ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. 16 జిల్లాల్లో 20 నుంచి 50 ఎంపీటీసీ సీట్లతో సరిపెట్టుకుంది. మిగతా జిల్లాల్లో ఆశించినన్ని సీట్లు సాధించలేక చతికిలపడింది. మేడ్చల్, వరంగల్ అర్బన్‌లో కాంగ్రెస్‌కు అత్యల్పంగా 12 ఎంపీటీసీ స్థానాలే వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ 1387 ఎంపీటీసీలు గెలువగా.. జోరులో ఉన్న టీఆర్‌ఎస్ ఏకంగా 3571 స్థానాలను సొంతం చేసుకున్నది. జెడ్పీటీసీల విషయంలోనూ ఇదే రిపీట్ అయ్యింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, గద్వాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్.. మొత్తం ఐదు జిల్లాల్లో కాంగ్రెస్ ఖాతానే తెరువలేకపోయింది. ఎనిమిది జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీతో తృప్తిపడింది. కాంగ్రెస్ కేవలం 75 జెడ్పీటీసీ లతో సరిపెట్టుకోగా, టీఆర్‌ఎస్ 449 స్థానాల్లో విజయపతాకనెగురవేసింది. ఆరు జిల్లాల్లో ప్రతిపక్షాలకు ఒక్క జెడ్పీటీసీ కూడా లేకపోవడం విశేషం. మరో ఎనిమిది జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీతో ప్రతిపక్షాలు సరిపెట్టుకున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.