Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రాజెక్టుల పరుగు

-సీఎం కేసీఆర్ కృషితోనే పచ్చని పాలమూరు -ఆగస్టులో ముఖ్యమంత్రి చేతులమీదుగా తుమ్మిళ్ల ప్రాజెక్టు ప్రారంభం,గట్టు ఎత్తిపోతల శంకుస్థాపన -రాబోయే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ -ప్రాజెక్టులకు వ్యతిరేకం కాకుంటే కేసులు వెనక్కు తీసుకోండి -లేకుంటే పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ భూస్థాపితం: మంత్రి టీ హరీశ్‌రావు -టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అబ్రహాం, ఎడ్మ కృష్ణారెడ్డి

పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పరుగులు తీస్తున్నాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో నాడు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉంటే.. నేడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు జిల్లాలో ఇప్పటివరకు 6.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించామని తెలిపారు. ఈ ఏడాది మరో 1.50లక్షల ఎకరాలకు నీటిని అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఆగస్టులో తుమ్మిళ్ల ప్రాజెక్టు ప్రారంభం, గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఆర్డీఎస్ ఆయకట్టు నీటికోసం ఉద్యమ సమయంలో ఏడురోజులపాటు కేసీఆర్ పాదయాత్ర చేశారని, పాలమూరు రైతుల కష్టాలు సీఎంకు తెలుసని అన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రూ.783 కోట్లతో పది నెలల రికార్డు సమయంలో పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే యాసంగి నాటికి 87వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని హరీశ్ ప్రకటించారు. పాలమూరు జిల్లాలో వేసవి కాలంలోనూ చెరువులు మత్తళ్లు దూకడం టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనత అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇవి జరిగేవా? అని ప్రశ్నించారు. ఒకనాడు వలసల జిల్లాగా గుర్తింపు పొందిన పాలమూరు నేడు పచ్చని పొలాల జిల్లాగా మారడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషే కారణమని హరీశ్‌రావు చెప్పారు.. శనివారం తెలంగాణభవన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ కే దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వీఎం అబ్రహాం, ఎడ్మ కృష్ణారెడ్డిలు మంత్రులు టీ హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, కే లక్ష్మారెడ్డి, పీ మహేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి హరీశ్‌రావు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అలంపూర్ నియోజకవర్గాలకు చెందిన స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్ అన్నిస్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాకుంటే కేసులు వెనక్కు తీసుకోవాలని, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ పార్టీని పాలమూరు జిల్లాలో ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రైతులు ఆనందంగా ఉంటే కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నాయని హరీశ్ విమర్శించారు. పాలమూరు జిల్లా జాతీయ నాయకులను అందించినా అక్కడి ప్రజలకు మాత్రం వలసలే మిగిలాయని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రజాక్షేమం పట్టని కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ నాయకులకు ఎప్పుడు కుర్చీల కొట్లాటే తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్టదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి ఆరు గంటలు కూడా కరంటు ఇవ్వలేదని, ఎప్పుడు కరంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకపోయేదన్నారు. కానీ నేడు నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నామన్నారు.

పాలమూరులో వలసలు వాపసు సాధించుకున్న తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందుతున్నదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. పాలమూరు జిల్లా గతంలో ఏనాడూ అభివృద్ధికి నోచుకోలేదని, అతి పేదరికంలో మగ్గిందని అన్నారు. జిల్లాలో అన్ని ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిచేసి, వ్యవసాయాన్ని సాకారం చేస్తుండటంతో వలసలు తిరుగుముఖం పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రం చిచ్చర పిడుగులాగా అభివృద్ధి చెందుతుందన్నారు. రైతుబంధు పథకం ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఎస్ నిరంజన్‌రెడ్డి, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జడ్పీ చైర్మన్ బాస్కర్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి పీ రాములు, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ విజితారెడ్డి, బాలరాజ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిన దామోదర్‌రెడ్డి, అబ్రహాం, ఎడ్మ కృష్ణారెడ్డిలు.. అనంతరం మంత్రులతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని, బంగారు తెలంగాణగా మార్చుకుందామని సూచించారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు వీరే టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో బిజినేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు సుధాపరిమళ బాలరాజు, నాగర్‌కర్నూలు ఎం పీపీ బండి సత్తమ్మ, నాగర్‌కర్నూలు మున్సిపల్ కౌన్సిలర్లు రేణు బాబు, వజ్ర లింగం, కావలి శ్రీనివాసులు, ఇస్మాయిల్‌బేగం, ఎంపీటీసీ సభ్యులు ఎం ప్రకాశ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బాల్ రాములు, బిజినేపల్లి సర్పంచ్ తిరుపతయ్య, లింగసానిపల్లి సర్పంచ్ ఎస్ నరేందర్‌రెడ్డి, బండ్లపల్లి సర్పంచ్ రాములు, నడిగడ్డ సర్పంచ్ సత్యనారాయణగౌడ్, పెద్దాపూర్ సర్పంచ్ పర్వతాలు, రాయిపాకుల సర్పంచ్ సుదర్శన్‌రావు, నాగర్‌కర్నూల్ ఎంపీటీసీ చంద్రకళ, లట్టుపల్లి ఎంపీటీసీ చంద్రగౌడ్, మమ్మాయిపల్లి ఎంపీటీసీ బానయ్య, మరికల్ ఎంపీటీసీ వెంకట్‌రాంరెడ్డి ఉన్నారు. కల్వకుర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్‌తోపాటు ఐదుగురు కౌన్సిలర్లు కుటుముల పావని, కుర్షిదా బేగం, తలసాని సౌజన్య, జానకమ్మ, పద్మతోపాటు పీఏసీఎస్ వైస్‌చైర్మన్‌లు జనార్దన్‌రెడ్డి, రామస్వామి తదితరులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.