Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రాజెక్టులకు 81 వేల కోట్ల

-త్వరలో రాష్ట్ర సమగ్ర జలవిధానం -ఈ ఏడాది కొత్తగా 60వేల డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు -క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

CM KCR press meet after cabinet meeting

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రానున్న మూండేండ్లలో ఏటా రూ.25వేల కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ ఏడాదిలో నెలకు వెయ్యి కోట్ల చొప్పున కేటాయిస్తామని తెలిపారు. త్వరలోనే తెలంగాణ జల సమగ్ర వినియోగ విధానాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మొత్తం రూ.81వేల కోట్లతో నభూతో నభవిష్యత్ అన్నట్లు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది కొత్తగా 60 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. ప్రజల నుంచి మిశ్రమ స్పందన ఉన్న నేపథ్యంలో ఈసారి చీప్‌లిక్కర్ ఉండదని, పాత మద్యం విధానమే కొనసాగుతుందని చెప్పారు. అదే సమయంలో గుడుంబా తయారీదారులపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. ఇందుకోసం కమిటీ వేశామని, అది నివేదిక ఇవ్వగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ మొదలవుతుందని వెల్లడించారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను అనంతరం సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు.

తెలంగాణ రైతులకు సంతోషం కలిగించేలా ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఓ కొలిక్కి వస్తున్నదని కేసీఆర్ చెప్పారు. గురువారంనుంచి గోదావరిపై లైడార్ సర్వే ప్రారంభమవుతుందని వివరించారు. పొరుగు రాష్ర్టాలతో పంచాయితీలు లేకుండా గోదావరి జలాల సమర్ధ వాడకానికి చర్యలు ప్రకటిస్తామన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తిచేసేందుకు ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటుపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. మరిన్ని కీలక నిర్ణయాలు సీఎం మాటల్లోనే..

డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శ్రీకారం: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పక్కా ఇండ్లను పూర్తి చేయడంతోపాటు ఈ సంవత్సరం 60వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మిస్తాం. వీటికి రూ.3,900 కోట్లు కేటాయిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలతో 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించాం. పట్ణణ ప్రాంతాలలో కూలీల రేట్లు ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.5.30 లక్షల వ్యయంతో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించాం. హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన ఇండ్ల నమూనాలోనే అన్ని ఇండ్లను నిర్మిస్తాం. గతంలో మంజూరైన ఇండ్ల నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుంది. నిజమైన లబ్ధిదారులను కలెక్టర్లు విచారణ చేసి, ఎంపిక చేసి ఎంపిక చేస్తారు. పూర్తయిన వాటికి బిల్లుల చెల్లింపు చేస్తాం. పూర్తికాని వాటిని పూర్తి చేస్తాం.

కొత్త జిల్లాలకు పచ్చజెండా దేశంలో 19 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని పది జిల్లాల్లో 3.5 కోట్ల జనాభా ఉంది. అంటే జిల్లాకు 35లక్షల జనాభా ఉంది. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా కొత్త జిల్లాల ఏర్పాటును అమలు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రెవెన్యూ ముఖ్య కార్యదర్శితో పాటు మరో నలుగురు అధికారులతో కమిటీ వేశాం. ఈ కమిటీ గురువారంనుంచే పనిచేస్తుంది. నివేదిక రాగానే జిల్లాల ఏర్పాటు మొదలవుతుంది. 1974 కొత్త జిల్లాల చట్టాన్ని అడాప్ట్ చేసుకుంటూ కొత్త జిల్లాల ఏర్పాటుకు ఈ కమిటీ వేస్తున్నం.

ఈసారి చీప్‌లిక్కర్ ఉండదు గుడుంబా తాగడంవల్ల కలిగే అనర్థాలను అరికట్టేందుకు చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని మొదట్లో అనుకున్నాం. గుడుంబాకు ప్రత్యామ్నాయం ఉంటేనే దాని నివారణ సాధ్యమవుతుందనుకున్నాం. గ్రామాలకు వెళ్లినపుడు ఈ గుడుంబా బారినుంచి రక్షించడానికి ఇంకా ఏదైనా మీరే (ప్రభుత్వమే) ప్రవేశపెట్టాలనే డిమాండ్ వచ్చింది. గుడుంబాలేకుండా చేయడంకోసం గుడుంబా ధరకే చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలని భావించాం. అయితే నిర్ణయం కాలేదు. కానీ సమాజం నుంచి మిశ్రమాభిప్రాయాలు రావడంతో ఈ ఏడాదికి పాతవిధానాన్నే కొనసాగించాలని నిర్ణయించాం. అదే సమయంలో గుడుంబాపై ఉక్కుపాదం మోపుతాం. ఐజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఫ్లయింగ్ స్కాడ్‌లను ఏర్పాటు చేస్తాం. అక్రమ మద్యం సరఫరాదారులు, గుడుంబా తయారీదారులపై అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతాం.

మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు రాష్ట్రంలోని 183 మార్కెట్ కమిటీల్లో పీసా చట్టంకింద ఉన్న పదమూడింటిని మినహాయిస్తాం. వీటిని పూర్తిగా ఎస్టీలకే కేటాయిస్తాం. మరో ఆప్షన్ లేదు. మిగతా 170 మార్కెట్ కమిటీలకు 50 శాతం మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తాం. ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు రిజర్వేషన్‌లుంటాయి. రిజర్వేషన్లులేని 85 మార్కెట్ కమిటీలకు లాటరీ పద్ధతిన ఎంపిక జరుగుతుంది. పైరవీలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం. తర్వాతి నుంచి రొటేషన్ పద్ధతిలో ఉంటుంది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖకు ఆదేశాలు వెళ్లాయి.

కరువు ప్రకటనపై తొందరపడం ఎవరికో పిచ్చి కోరికలు ఉంటాయి. వాళ్లిష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతారు. ప్రభుత్వానికో పద్ధతి ఉంటుంది. రాష్ట్రంలో పది జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ మినహాయిస్తే తొమ్మిది జిల్లాలకుగాను మూడు జిల్లాల్లో బాగా వర్షాలు పడ్డాయి. అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 85% వర్షం పడింది. వరంగల్‌లో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మినహా మిగతా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఈ రెండు ప్రాంతాలకు దేవాదుల ప్రాజెక్టులద్వారా నీళ్లు అందిస్తాం. మిగిలిన ఆరు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. సీజన్‌పూర్తి కాలేదు. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై ఆదరాబాదరా నివేదికలు ఇవ్వం. సీజన్ అయిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో పరిస్థితులను అంచనావేస్తాం. వంద శాతం డీల్ చేస్తాం. సర్వేచేసి ఆ తర్వాతే కరువు పరిస్థితులపై తగు నివేదికలు తయారవుతాయి. కేంద్రం నిధులు వచ్చేందుకు నిర్ణయం తీసుకుంటాం. రైతులు ఆత్మహత్యలపై కలెక్టర్లు సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నారు. వారిదగ్గర డబ్బులు ఉన్నాయి. రైతు ఆత్మహత్యగా నిర్ధారణ అయితే ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షల పెంపుపై ఆలోచిస్తాం.

జీహెచ్‌ఎంసీకి సిటీ ఆర్టీసీ బాధ్యత ఆర్టీసీ కార్మికులకు సమ్మె సమయంలో మంచి ఫిట్‌మెంట్ ఇచ్చాం. ప్రజలకు మంచి రవాణా సౌకర్యం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. టీఎస్‌ఆర్టీసీ రోజుకు 96 లక్షలమందిని చేరవేస్తున్నది. హైదరాబాద్‌లో ఈ సంస్థ రూ.218 కోట్ల నష్టంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా అర్బన్ ట్రాన్స్‌పోర్టు నష్టాల్లో ఉంది. అర్బన్ ట్రాన్స్‌పోర్టును ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. మనదగ్గర అలాంటి పరిస్థితి లేదు. మనదేశంలో ఆ విధానం ముంబైలో ఉంది. ఇక్కడ కూడా ఆ నష్టాన్ని జీహెచ్‌ఎంసీ పూడ్చాలని నిర్ణయం తీసుకున్నాం. నగరం పరిధిలో 3800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏరియా ఆర్టీసీ నష్టాలను ఇక జీహెచ్‌ఎంసీ భరిస్తుంది. దీనికోసం టీఎస్‌ఆర్టీసీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ బోర్డు మెంబర్‌గా ఉంటారు. బస్‌స్టాండ్ల నిర్వహణ తదితర అంశాలపై కమిషనరే నిర్ణయం తీసుకుంటారు. టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధి చెందేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ కాకుండా మిగతా ప్రాంతాల్లో లాభాలు సాధించి అప్పులు తీర్చే అవకాశం ఉంది. ఆర్టీసీ పూర్తిస్థాయిలో విభజన జరిగితే బాగా అభివృద్ధి చేయవచ్చు.

చైనా రియల్ కంపెనీల ఆసక్తి హైదరాబాద్ గృహనిర్మాణరంగంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టడానికి చైనా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. చైనా పర్యటనలో హార్డ్‌వేర్, ఇండస్ట్రీస్, ఇతర ప్రతినిధులతో చర్చిస్తాం. ఎవరెవర్ని కలవాలనే విషయంలో ఇంకా పరిశ్రమల శాఖ చర్చిస్తున్నది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు చైనా మనల్ని ఆహ్వానించింది. కొరియా, జపాన్‌కూడా తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించాయి. చైనా పర్యటన పూర్తయ్యాక మిగతా దేశాల పర్యటనల గురించి ఆలోచిస్తాం. 23 నుంచి అసెంబ్లీ ఈ నెల 23నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. విపక్షాలు ఎన్నిరోజులు కోరుకుంటే అన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తాం.

మరికొన్ని క్యాబినెట్ నిర్ణయాలు -రైతుల పంట రుణాలపై క్యాబినెట్ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఈ సహకార బ్యాంకుద్వారా రైతులకు పంటరుణాలు, దీర్ఘకాలిక రుణాలు, మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) అదేవిధంగా బంగారు ఆభరణాలపై రుణాలిచ్చేందుకు నాబార్డు నిబంధనల మేరకు రూ.2500 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2016 మార్చి నాటికి రైతులకు రూ.5 వేల కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. -రాష్ట్రంలోని పరపతి సహకార సంస్థలలోని ప్రభుత్వ వాటా ధనం ఆయా సంస్థల్లో 25 శాతానికి మించితే దాన్ని గ్రాంటుగా మార్చుతారు. -ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ వినతి మేరకు సెల్యూలార్ పరిశ్రమకు కొన్ని రాయితీలు కల్పించాలని నిర్ణయించారు. -తెలంగాణకు పుష్కలంగా నీటిని అందించగల ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నదుల నీటి లభ్యతను పూర్తి స్థాయిలో వాడుకునేందుకు ఏకగ్రీవ అంగీకారం. -పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు విషయంలో హోంమంత్రి సహా, డీజీపీతో చర్చించి నిర్ణయం. -ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవినీతి చోటు చేసుకున్నట్లు రుజువైతే కఠిన చర్యలు. -కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తిస్థాయిలో అమలుపరచాలని నిర్ణయం. -ఉద్యోగుల విభజన దాదాపు 75 శాతం పూర్తి కావచ్చింది. -జీహెచ్‌ఎంసీ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద రూ.2,630 కోట్లు విడుదల. 20 మల్టీలెవల్ ైఫ్లెవోవర్లు, జంక్షన్లకు యాన్యుటీ పద్ధతిలో టెండర్లు. -ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయం. -మహబూబ్‌నగర్‌లోని పాలెంలో అగ్రికల్చర్ కళాశాల, కరీంనగర్ జమ్మికుంటలో, నిజామాబాద్‌లోని నాగిరెడ్డిగూడ మండలం, మాల్‌తుమ్మెదలో పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు. -జల విధానం రూపొందించడం పూర్తయ్యాక ఉచిత విద్యపై దృష్టి సారించాలని నిర్ణయం. -కొత్త జిల్లాలకోసం సీఎస్ అధ్యక్షతన కమిటీ -చీప్ లిక్కర్ లేదు.. గుడుంబాపై ఉక్కుపాదం -హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బాధ్యత జీహెచ్‌ఎంసీకి -పూర్తిస్థాయిలో కాంట్రాక్టు క్రమబద్ధీకరణ -ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు -కాళేశ్వరం లిఫ్ట్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు -పాలమూరు ఎత్తిపోతలకు ప్రాజెక్టు అథారిటీ -నేటి నుంచి గోదావరిపై లైడార్ సర్వే -మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు -నగరంలో ైఫ్లెవోవర్లు, జంక్షన్లకు 2630 కోట్లు -మహబూబ్‌నగర్‌లోని పాలెంలో అగ్రికల్చర్ కళాశాల -కరీంనగర్ జమ్మికుంటలో పాలిటెక్నిక్ కళాశాల,నిజామాబాద్ జిల్లా మాల్‌తుమ్మెదలో మరోటి -23నుంచి అసెంబ్లీ సమావేశాలు -విపక్షాలు కోరుకున్నన్ని రోజులు నిర్వహిస్తాం -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నా కంఠంలో ప్రాణమున్నంత వరకూ తెలంగాణకు నష్టం జరుగనీయను తెలంగాణ తేవడంలో ప్రధాన భూమిక పోషించింది కేసీఆర్. ఐ యామ్ ఏ ఫైటర్. ఐ యామ్ ఏ క్రూసేడర్. తెలంగాణకు నష్టం జరిగే పని నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జరగనివ్వను. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.. ఇబ్బందులన్నీ పెట్టి పైగా ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ సర్కార్ అన్యాయం చేసిందంటూ చంద్రబాబు తొండి చేస్తున్నారు.. తెలంగాణతోపాటు ఏపీలోని ప్రజలు, రైతులు మంచిగ బతకాలని కోరుకుంటున్నాం.. ఎక్కడ లభ్యత ఉందో అక్కడి నుంచి.. పొరుగు రాష్ర్టాలతో సఖ్యత చేసుకుని కచ్చితంగా నీళ్లు వచ్చే విధానాలు అవలంబిస్తం తప్ప.. పిచ్చిపిచ్చి పనులు ప్రభుత్వం చేయదు. మేం ఈ రోజు చేసేది తెలంగాణ రాష్ట్ర పునాది. తెలంగాణ రాష్ర్టానికి ఏర్పడిన తొలి ప్రభుత్వం ఇది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు పని చెయ్యం. పూర్తి వాస్తవాల పునాదుల మీద భవిష్యత్తు నిర్మిస్తాం. ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు ఇప్పటికైనా మానుకుంటే మంచిది

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.