Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రాజెక్టులు పాతవే.. ఆపేదిలేదు

పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు కొత్తవేనంటూ ఇంతకాలం బుకాయిస్తూ వచ్చిన ఏపీకి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నుంచి గట్టి షాక్ తగిలింది. ఈ రెండూ ముమ్మాటికీ పాత ప్రాజెక్టులేనని నిరూపించే ఆధారాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించడంతోపాటు.. ఇతర అంశాలపై కేసీఆర్ వాగ్ధాటితో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కంగుతిన్నారు. కొత్త ప్రాజెక్టులంటూ ఇంతకాలం చేసిన వ్యాఖ్యల నుంచి వెనక్కు తగ్గి, మేం ప్రాజెక్టులను ఆపాలని కోరలేదు అని ఆత్మరక్షణలో పడి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఏపీ వాదనలను తూర్పారబట్టారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు పాతవేనని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామని స్పష్టంచేశారు. తమకు కేటాయించిన నీటికి లోబడే ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని చెప్పారు. -పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలపై అపెక్స్ కౌన్సిల్‌లో ఘంటాపథంగా చెప్పిన కేసీఆర్

cm-kcr-in-apex-council-meeting

-సాక్ష్యాధారాలు..కేసీఆర్ వాగ్ధాటితో కంగుతిన్న ఏపీ -కొత్త ప్రాజెక్టులనే వాదనపై ఆత్మరక్షణలో చంద్రబాబు -ఆపాలని కోరలేదని వివరణ ఇచ్చిన ఏపీ సీఎం -కేటాయింపులకు లోబడి ప్రాజెక్టుల నిర్మాణం -తక్షణం ప్రాజెక్టులవద్ద టెలిమెట్రీ వ్యవస్థ -పర్యవేక్షణకు సంయుక్త కమిటీ ఏర్పాటు -వివాదాల పరిష్కారానికి పరస్పర సహకారం -రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల అంగీకారం -ట్రిబ్యునల్ సత్వర తీర్పుకై చొరవ తీసుకుంటా -కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి హామీ -పట్టిసీమతో తెలంగాణకు 45 టీఎంసీల వాటా

ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలను అమలుపర్చరా? ఎన్నికల మ్యానిఫెస్టోల్లో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఇచ్చిన హామీలను సైతం మర్చిపోతారా? అని ప్రశ్నించారు. ఇన్ని ఆధారాలు ఉన్నా వీటిని కొత్త ప్రాజెక్టులంటూ ఏ విధంగా వ్యాఖ్యానిస్తారని కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు కూడా లేవు. వెరసి.. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు కొత్తవనే ఏపీ వాదన నీటి బుడగలా పేలిపోయింది. విభజన చట్టంలో లేని ప్రాజెక్టులు కొత్తవిగా భావించలేమన్న అభిప్రాయాన్ని ఏపీ ముఖ్యమంత్రి అంగీకరించాల్సి వచ్చింది. ఆయా రాష్ర్టాలకు ఇప్పటికే జరిగిన నీటి కేటాయింపులకు లోబడి కొత్త ప్రాజెక్టులను లేదా ఇంతకాలం పెండింగ్‌లో ఉండిపోయిన ప్రాజెక్టులను పూర్తిచేసుకోవడానికి ఒక రాష్ర్టానికి మరో రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయవద్దని, పేచీలు పెట్టుకోవద్దని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి చేసిన సూచనలకు రెండు రాష్ర్టాలు అంగీకరించాయి. రెండు రాష్ర్టాల మధ్య జల వివాదాలపై ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగినా.. చివరకు తెలంగాణ ప్రభుత్వం పది రోజుల ముందే చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా నిర్ణయాలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సంయుక్త అంగీకారంతో ప్రతి ప్రాజెక్టు దగ్గర టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. రెండు రాష్ర్టాల్లోని ప్రాజెక్టుల దగ్గర నీటి లభ్యతను, చేరికను, విడుదలను, వినియోగాన్ని పరిశీలించి పర్యవేక్షించేందుకు రెండు రాష్ర్టాల నిపుణులు, ఇంజినీర్లతో సంయుక్త పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు కూడా రెండు రాష్ర్టాలు అంగీకరించాయి. రెండు రాష్ర్టాల్లోని ప్రాజెక్టుల నీటి కేటాయింపుల ప్రక్రియను ట్రిబ్యునల్ త్వరగా పూర్తి చేయడంతో పాటు స్పష్టమైన అవార్డును ప్రకటించడానికి తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు. నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రాజెక్టుల నోటిఫికేషన్ వెలువరించుకోవచ్చునని రెండు రాష్ర్టాల సీఎంలకు సూచించారు.

టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ర్టాలకు ఆర్థిక ఇబ్బందులుంటే కేంద్రమే అందుకు అవసరమైన నిధులు కేటాయిస్తుందని చెప్తూ, టెలిమెట్రీల ఏర్పాటు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మొత్తంమీద తెలంగాణ చేసిన ప్రతిపాదనలన్నింటికీ ఈ సమావేశంలో స్పష్టత రావడం, నిర్ణయాలు జరుగడం ఆహ్వానించదగిన పరిణామం. అన్నింటికీ మించి పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణానికి ఇంతకాలం ఎదురైన ఆటంకాలను ఈ సమావేశం తొలగించింది. షెడ్యూలు ప్రకారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మొదలైంది. ప్రారంభోపన్యాసం చేసి సమావేశం ఆవశ్యకతను వివరించిన కేంద్రమంత్రి ఉమాభారతి.. వివాదాలను పరస్పర చర్చలద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. ఏకాభిప్రాయం సాధించి, రెండు రాష్ర్టాల ప్రయోజనాలకు ఒకదానికి మరొకటి సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కృష్ణా నది యాజమాన్య బోర్డు.. మొత్తం కృష్ణా బేసిన్‌కు సంబంధించి, ముఖ్యంగా రెండు రాష్ర్టాలకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. తొలుత ఏపీ ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇస్తూ పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కొత్తవని, వీటిని కట్టరాదని, కేంద్రం జోక్యం చేసుకుని ఆపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూలులో ఈ రెండు ప్రాజెక్టుల ప్రస్తావన లేదు కాబట్టి వీటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాలని ఏపీ సీఎం చంద్రబాబు, ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్ వాదించారు. ఈ ప్రాజెక్టుల కారణంగా ఏపీకి రావాల్సిన నీటిలో కోత పడుతుందని, కనుక వీటిని తక్షణం ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ వాదనకు సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ద్వారా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2013 ఆగస్టు 8న జీవో జారీ చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారుచేయాలని, సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీని ఆధారంగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు మొదలుపెట్టామని స్పష్టం చేశారు.

మోదీ ఇచ్చిన హామీలే అవి! తాము అధికారంలోకి వస్తే ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2014 ఏప్రిల్ 22న మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్రమోదీ హామీ ఇచ్చారని, ఆ వేదికపై చంద్రబాబునాయుడు కూడా ఉన్నారని వివరించిన కేసీఆర్.. ఆ సందర్భంగా మోదీ ప్రసంగం వీడియోను చూపించారు. మోదీ ఇచ్చిన హామీలను అమలుపర్చరా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కడతామని చెప్పి ఆ పని పూర్తి చేయలేదు. తల్లీ కొడుకులు (సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ) ఇంతకాలం నిద్రపోయారు అని మోదీ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సాగునీరు అందినట్లయితే ఆత్మహత్యలను ఆపడంతోపాటు బంగారాన్ని పండించవచ్చనికూడా మోదీ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను చూసిన చంద్రబాబు తదితర ఏపీ నేతలు కంగుతిన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు వాటివాటి ఎన్నికల ప్రణాళికల్లో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి స్పష్టమైన వాగ్దానాలు చేశాయని, వాటిని అమలుచేయడానికి ఈ పార్టీలు ప్రయత్నించవా అని కేసీఆర్ ప్రశ్నించారు. సదరు మ్యానిఫెస్టో ప్రతులను కూడా సమావేశంలో పాల్గొన్నవారికి తెలంగాణ అధికారులు పంపిణీ చేశారు. తెలంగాణ వాదనలకు బలం చేకూర్చేలా ఉన్న వీటిని చూసిన తర్వాత చంద్రబాబు నోట మాట రాని స్థితిని ఎదుర్కొన్నట్టయింది. ఇంతకాలం ఏపీ చేస్తున్న బుకాయింపులు అబద్ధాలని తేలిపోవడంతో కేసీఆర్ సమర్పించిన ఆధారాలపై ఆ రాష్ట్రం అధికారులెవరూ మాట్లాడలేదు. ఇప్పటికైనా ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఏపీ వాదనను లెక్కపెట్టాల్సిన అవసరం లేదని, ఈ రెండు ప్రాజెక్టులను కట్టి తీరుతామని, ఆపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.

ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులను రైతుల కడగండ్లను తీర్చడానికే పూర్తి చేస్తున్నామని, దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాకు మాత్రమే కాకుండా నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఆయన స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సహేతుకం కాదని చెప్తూ వీటిలో జోక్యం చేసుకోవద్దని కేసీఆర్ కోరారు. గోదావరిజలాల మళ్లింపు ద్వారా కృష్ణాజలాల్లో తెలంగాణకు వాటాతో పాటు సుదీర్ఘ కృష్ణా పరీవాహక ప్రాంతమున్న తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ట్రిబ్యునల్‌లోని పేరాలు, లెక్కలతో సహా కేసీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ర్టాలతో జలాల పంపిణీ విషయంలోనూ నిర్మాణాత్మక సమన్వయ వాతావరణాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

కేటాయింపులకు లోబడే నిర్మాణం ఈ రెండు ప్రాజెక్టులకు నీటిని తమకు దక్కిన కేటాయింపుల నుంచే వాడుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్పష్టంగా చెప్పారు. ప్రాజెక్టులు కొత్తవా.. పాతవా? అనే వివాదం వద్దని, అసలు అపెక్స్ కౌన్సిల్‌లో దీనిపై చర్చించాల్సిన అవసరమే లేదని అన్నారు. ఒక రాష్ర్టానికి దక్కిన కేటాయింపుల్లోని నీటిని ఎక్కడైనా ప్రాజెక్టును కట్టుకుని వినియోగించుకునే హక్కు ఉందని, తెలంగాణ కూడా అదే పని చేస్తున్నదని వివరించారు. ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారమే నీటిని వాడుకుంటున్నామని తెలిపారు. బ్రిజేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పుపై స్టే ఉన్నందున, ప్రస్తుతం అది విచారణను పూర్తి చేసి కేటాయింపులు చేసిన తర్వాత ఏ రాష్ట్రం ఎన్ని నీళ్ళను వాడుకోవాలో స్పష్టత వస్తుందని చెప్పారు. ట్రిబ్యునల్‌లో విచారణలు ముగిశాయని, కేంద్రం కూడా చొరవ తీసుకుని త్వరగా అవార్డు వచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సైతం కేసీఆర్ వాదనతో ఏకీభవించక తప్పలేదు.

నీటి వాటాలో స్పష్టత లేకే వివాదాలు నీటి వాటాలో స్పష్టత లేనందువల్లనే రాష్ర్టాల మధ్య జల వివాదాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేండ్లయినా నీటి కేటాయింపులు జరుగలేదని, దీనితో సమయం వృథా అయిందని అన్నారు. ట్రిబ్యునల్ విషయంలో అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం సుప్రీంకోర్టులో తాము పిటిషన్ వేశామని, ఇంకా విచారణలోనే ఉన్నదని గుర్తుచేశారు. కృష్ణా నదిపైనే కాకుండా గోదావరి నదిపై నిర్మిస్తున్న చాలా ప్రాజెక్టులు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూలులో లేవని, అంతమాత్రాన వాటన్నింటినీ కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టంచేశారు.

ఈ జాబితాలో కేవలం ఆరు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని, కానీ నిర్మాణంలో ఉన్నవి, పెండింగ్‌లో ఉన్నవి దాదాపు పాతికవరకు ఉన్నాయని వివరించారు. ఏఎంఆర్పీ, ఎస్‌ఆర్బీసీ, ముచ్చిమర్రి, ఎస్‌ఎల్బీసీ తదితరాలతో పాటు గోదావరి నదిపై నిర్మించే దేవాదుల, ప్రాణహిత, దుమ్ముగూడెం, ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ వరదనీటి కాల్వ, పోలవరం తదితర ప్రాజెక్టులు కూడా లేవని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం ముచ్చిమర్రి ప్రాజెక్టు కడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది కొత్తదా పాతదా? చెప్పగలరా? ఈ జాబితాలో లేదు కాబట్టి దీన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించవచ్చా? అని ప్రశ్నించారు. దీనికి ఏపీ నుంచి సమాధానం లేదు. చివరకు చంద్రబాబు సైతం జోక్యం చేసుకుని జాబితాలో చాలా ప్రాజెక్టులు లేవని, వాటన్నింటినీ కొత్త ప్రాజెక్టులుగా భావించలేమని అంగీకరించారు.

శ్రీశైలంలో కావాల్సినంత నీరుంది శ్రీశైలం ప్రాజెక్టుకు కావాల్సిన నీరు వస్తూ ఉందని, దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని, కేంద్ర జల సంఘం సైతం ప్రతి సంవత్సరం నీటి ప్రవాహం, లభ్యత, ఇన్‌ఫ్లో తదితరాలకు సంబంధించిన గణాంకాలను తయారుచేసిందని సీఎం కేసీఆర్ సమావేశంలో ప్రస్తావించారు. ఇంత నీరు ఉన్నందునే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం ప్రాజెక్టునే ప్రధాన వనరుగా పెట్టుకున్నామని తెలిపారు. జల సంఘం గణాంకాలను పరిశీలిస్తే సగటున ప్రతి సంవత్సరం శ్రీశైలంకు 1200 టీఎంసీలకు పైగా నీరు చేరుతూ ఉందని, సగటున వెయ్యి టీఎంసీల నీటిని వినియోగించుకోడానికి వీలు ఉందని తెలిపారు. గోదావరి నదిలో సైతం సగటున మూడు వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని, పకడ్బందీగా వినియోగించుకున్నట్లయితే సముద్రంలోకి వృథాగా పోయే నీటిని కూడా వాడుకోవచ్చునని అన్నారు. దీనిద్వారా తెలంగాణకు మాత్రమే కాకుండా ఏపీకి కూడా ప్రయోజనం ఉంటుందని స్పష్టంచేశారు. ఇంత నీటి లభ్యత ఉన్నప్పటికీ ప్రాజెక్టుల విషయంలో ఏపీ రాద్ధాంతం చేయడం సమంజసం కాదని చెప్తూ, వివరాల్లోకి వెళ్ళి సహేతుక దృష్టితో ఆలోచించాలని సూచించారు.

బతుకు.. బతుకనివ్వు.. ఇదే మా పాలసీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సమర్థవంతమైన వినియోగానికి ఎక్కువ విలువ ఇస్తుందని, పరస్పరం సహకరించుకునే ధోరణితో వ్యవహరిస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే లివ్ అండ్ లెట్ లివ్ పాలసీతో మహారాష్ట్రతో గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణంపై అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు. తాగునీటి అవసరాలకోసం కర్ణాటకతోసైతం స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నామని వివరించారు. పొరుగున ఉన్న ఏపీతోనూ అలాంటి సంబంధాలనే కొనసాగించాలని అనుకుంటున్నామని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. అయితే ఒకవైపు నుంచే కాకుండా రెండోవైపునుంచి కూడా అలాంటి సహకారం ఉంటే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయని అన్నారు. మిగిలిన రాష్ర్టాలతో తెలంగాణకు ఇలాంటి సత్సంబంధాలు ఉన్నప్పుడు ఏపీనుంచి ఎందుకు సాధ్యం కావడంలేదో ఆ రాష్ట్రం ఆలోచించాలని సూచించారు. ఏ రాష్ట్రంతోనూ తాము వివాదాలు కోరుకోవడంలేదని, అన్ని రాష్ర్టాలూ పరిమితంగా ఉన్న వనరులే అయినప్పటికీ సద్వినియోగం చేసుకుని సంతృప్తికరంగా ఉండాలనే భావిస్తున్నామని చెప్పారు.

కొత్త ప్రాజెక్టులంటూ వివాదాలొద్దు -ముగింపు ఉపన్యాసంలో కేంద్ర మంత్రి ఉమాభారతి విభజన చట్టంలో లేనంత మాత్రాన సదరు ప్రాజెక్టులు కొత్తవా? పాతవా? అన్న చర్చకు పోవద్దని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఇరు రాష్ర్టాలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూలు అప్పటి పరిస్థితుల దృష్ట్యా చాలా హడివుడిగా రూపొందిందని చెప్పారు. దీనితో అన్ని ఆన్‌గోయింగ్, పెండింగ్ ప్రాజెక్టులను అప్పటి కేంద్ర ప్రభుత్వం జాబితాలో చేర్చలేకపోయిందని, ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ర్టాలూ కొత్త ప్రాజెక్టులు అనే వివాదంలోకి వెళ్ళరాదని కోరారు. ఈ జాబితాలో ఉన్న ప్రాజెక్టులను ప్రామాణికంగా తీసుకోరాదని అన్నారు. రెండు రాష్ర్టాల అభిప్రాయాలను, వివరణలను విన్న తర్వాత ఉమాభారతి ముగింపు ప్రసంగం చేస్తూ ఈ సమావేశంలో కుదిరిన పరస్పర అంగీకారం, ఏకాభిప్రాయాల గురించి వివరించారు.

-రెండు రాష్ర్టాల్లోనూ ప్రాజెక్టుల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు రెండు రాష్ర్టాల్లోని నిపుణులు, ఇంజినీర్లతోపాటు కేంద్ర జలవనరుల శాఖనుంచి కూడా ప్రాతినిధ్యం ఉండేలా సంయుక్త పర్యవేక్షణ కమిటీ ఏర్పడాలి. ఈ కమిటీ సభ్యులు రెండు రాష్ర్టాల్లోని ప్రాజెక్టుల్లో నీటి రాక, లభ్యత, వినియోగం, విడుదల తదితరాలపై అధ్యయనం చేస్తారు. తెలంగాణలోని ప్రాజెక్టులను ఏపీ అధికారులు, ప్రతినిధులు, ఏపీలోని ప్రాజెక్టులను తెలంగాణ అధికారులు, ప్రతినిధులు పరిశీలిస్తారు. దీంతో సంయుక్త భాగస్వామ్యంతో అంశాలపై చర్చించుకుని సామరస్యంగా నిర్ణయాలు తీసుకోడానికి వీలు పడుతుంది.

-ప్రాజెక్టుల దగ్గర టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఏ ప్రాజెక్టు దగ్గర ఎంత ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో ఉందో తెలుసుకోడానికి శాస్త్రీయ పద్ధతిలో టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలి. మూడు నెలల్లోనే ఈ వ్యవస్థ అన్ని ప్రాజెక్టుల దగ్గర ఏర్పాటు కావాలి. పరికరాలను సమకూర్చుకోవడంలో రాష్ర్టాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే కేంద్రమే ఆర్థిక సాయం చేస్తుంది. కానీ ఆర్థిక వనరులు లేవనే కారణంతో టెలిమెట్రీ ఏర్పాటులో జాప్యం జరుగొద్దు. మూడు నెలల పాటు ఈ వ్యవస్థ పనితీరును పరిశీలించిన తర్వాత అవసరమైతే అపెక్స్ కౌన్సిల్ మరోమారు సమావేశం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం 40 ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ సమావేశంలో ప్రతిపాదనలను వివరించింది.

-గోదావరి జలాలపై గతంలో బచావత్ ఇచ్చిన ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర జల సంఘం నుంచి అన్ని అనుమతులు లభించిన వెంటనే నాగార్జునసాగర్‌కు ఎగువన ఉన్న రాష్ర్టాలకు 80 టీఎంసీల నీటిని అందించాలన్న స్పష్టత ఉంది. ఇందులో తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీల నీటిని కేటాయించాల్సి ఉంది. ఆ విధంగా తెలంగాణకు ఇప్పుడు 45 టీఎంసీల నీరు లభించాల్సి ఉంది. దీన్ని వెంటనే అమలుచేయాలి. ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి రావాలి.

అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సార్థకత అపెక్స్ కౌన్సిల్ సమావేశం మొదలైన దగ్గర నుంచి రెండు రాష్ర్టాల మధ్య తీవ్రస్థాయి వాదనలు జరిగి, కొద్దిసేపటివరకూ ఎవరి అభిప్రాయానికి వారు కట్టుబడి ఉన్నారు. ఒక దశలో ఏపీ సీఎంపై తెలంగాణ నీటి వనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఈ సమయంలో రాజీ కుదరడం కష్టమనే అభిప్రాయం ఏర్పడినప్పటికీ నాలుగైదు అంశాల్లో రెండు రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయంతోపాటు అంగీకారం కూడా కుదిరింది. స్వచ్ఛందంగా రెండు రాష్ర్టాలూ పరస్పర అంగీకారానికి రావడంతో సమావేశం ఆశించిన ఫలితాన్ని ఒక మేరకు సాధించగలిగిందనే చెప్పుకోవచ్చు.

కేసీఆర్ ప్రజెంటేషన్‌లో మరికొన్ని ముఖ్యాంశాలు -ఆలోచన దశలోనే ఉంటేనే కొత్త ప్రాజెక్టులు.. ఒక ప్రాజెక్టు ప్రక్రియను పరిశీలిస్తే.. ఆలోచన (కాన్సెప్ట్), సర్వే (ఇన్వెస్టిగేషన్), డిజైన్, వాస్తవిక అమలు.. చివరగా ప్రాజెక్టు పూర్తి అనే దశలుంటాయి. ప్రాజెక్టు కేవలం ఆలోచన దశలోనే ఉండి.. ఒక రూపునకు రాకపోతే అప్పుడు కొత్త ప్రాజెక్టుగా అభివర్ణించవచ్చు. కానీ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టిన ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి మిగులు జలాల్ని వాడుకునే స్వేచ్ఛ కల్పించిన తర్వాతనే ఈ ప్రాజెక్టులకు కేటాయింపులు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేగంగా ఈ ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని సంకల్పించింది. తెలంగాణకు జరిగే కేటాయింపులకు లోబడే ఈ రెండు ప్రాజెక్టులద్వారా నీటి వినియోగం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టులవల్ల కృష్ణా డెల్టా రైతులకు అన్యాయం జరుగదు.

బచావత్ ట్రిబ్యునల్‌ను అమలు చేయండి.. పోలవరం ప్రాజెక్టుద్వారా 80 టీఎంసీల గోదావరిజలాల్ని కృష్ణా బేసిన్‌కు మళ్లించనున్నందున ఆ మేరకు సాగర్ ఎగువన ఉన్న రాష్ర్టాలకు అంతే మొత్తంలో కృష్ణాజలాల్లో హక్కుగా వాటా వస్తుందని గోదావరి ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80 టీఎంసీల గోదావరిజలాల్ని కృష్ణా డెల్టాకు మళ్లించేందుకు పట్టిసీమ అనే కొత్త ప్రాజెక్టును చేపట్టింది. పోలవరం ప్రాజెక్టును ఆధారిత జలాల ప్రాతిపదికన డిజైన్ చేస్తే.. పట్టిసీమను మిగులుజలాలపై చేపట్టారు. దీంతో పట్టిసీమ పోలవరంలో అంతర్భాగం కాదని లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది. దీంతో గోదావరిజలాల మళ్లింపునకు అనుగుణంగా కృష్ణాజలాల్లో తెలంగాణకు వాటాకు కల్పించేలా బచావత్ ట్రిబ్యునల్‌ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది.

తెలంగాణకు జరిగిన అన్యాయమే ఇది.. నాగార్జునసాగర్ ఎగువన కృష్ణా బేసిన్ (కే7) 22,952 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండగా.. అందులో తెలంగాణ 20,164 (88 శాతం), ఆంధ్రప్రదేశ్ 2788 చదరపు కిలోమీటర్లు (12 శాతం) పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పరివాహక ప్రాంతంలో 40 లక్షల సాగుయోగ్య భూమి ఉంటే అందులో ఐదు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వసతి ఉంది. అదేవిధంగా కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు సంబంధించి రెండు కోట్ల జనాభా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కేవలం 78 లక్షల జనాభా మాత్రమే ఉంది.

సంయుక్త పర్యవేక్షణ ఉండాలి.. ప్రస్తుతం కృష్ణాపై ఉన్న రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోతోపాటు నీటి వినియోగానికి సంబంధించిన వ్యవస్థ పారదర్శకంగా ఉండాలి. కానీ ఈ వ్యవస్థ ఏర్పాటు ఇప్పటివరకు సంతృప్తికరంగా లేదు. అన్నిచోట్ల ప్రధాన ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోల వద్ద ఈ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి. దీంతోపాటు ఈ టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేసే పాయింట్లను రెండు రాష్ర్టాల ఇంజినీర్లతో కూడా సంయుక్త కమిటీ పర్యవేక్షించాలి. కృష్ణా యాజమాన్య బోర్డు వర్కింగ్ అరేంజ్‌మెంట్ కోసం కేంద్ర జల వనరుల శాఖ పరిష్కార మార్గాలను గుర్తించేదుకు చేసిన కృషిని తెలంగాణ ప్రభుత్వం అభినందిస్తున్నది. అయితే నిపుణుల కమిటీ వేసే ముందు కేంద్రం ఎవరినీ సంప్రదించలేదు. కమిటీ చైర్మన్, సభ్యులు ఏకపక్షంగా వ్యవహరించేవారు కాకుండా తటస్థులు ఉండాలి. కమిటీలోని సభ్యులపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలను తెలిపింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.