ప్రభుత్వం చేపట్టే ప్రతి నిర్మాణం భావితరాలకు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్బోధించారు. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు దశలవారీగా టార్గెట్ విధించుకుని పనిచేయాలన్నారు. ఒక్కో సంవత్సరంలో ఏ మేరకు పనులు చేయగలమనేది అంచనా వేసుకుని దానికి అనుగుణంగా పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. -మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు.. -జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగులేన్ల రోడ్లు -దీర్ఘకాలిక లక్ష్యాలకు దశలవారీ టార్గెట్లు -నిర్దేశిత వ్యవధిలో పనులు పూర్తి కావాలి -ఏడాదిలోగా ఎమ్మెల్యేలకు కార్యాలయాలు -సకాలంలో పనులు పూర్తిచేస్తే 1.5 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలి -సీఎం, సీఎస్, స్పీకర్, మండలి చైర్మన్లకు అధికార నివాసాలు -ఐఏఎస్‌లకు అధునాతన క్వార్టర్లు.. సీఎస్ నేతృత్వంలో కమిటీ -రోడ్లు భవనాల శాఖ బడ్జెట్ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి మంచి రోడ్డు ఉండాలనేది ప్రభుత్వ విధానమని చెప్పారు. ఈ దిశగా ప్రతి ఊరికీ రహదారి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏడాదిలోగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మించాలని, ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మిస్తున్న కళాభారతిని కన్వెన్షన్ సెంటర్ కమ్ కల్చరల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారులు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్లకు నగరంలో అధికారిక నివాసాలు నిర్మించాలని నిర్దేశిస్తూ ఇందుకోసం సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు.
అంచనా ప్రతిపాదనలివ్వండి.. రహదారుల నిర్మాణంలో భాగంగా నదులు, ఉపనదులు, కాల్వలపై నిర్మించే వంతెనలకు నిధులు కేటాయించే సమయంలో ఏ సంవత్సరంలో ఎంత పని జరుగుతుందో అంచనా వేసి ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావలిసి ఉందని అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి ఊరికీ రహదారి సంకల్పం తీసుకున్నదని చెప్పారు. ఈ కార్యక్రమం ఒక పద్ధతిలో క్రమబద్ధంగా జరగవలిసి ఉందని అన్నారు. మన శక్తిని గమనించి ఒక్కో సంవత్సరం ఎన్ని గ్రామాలకు రహదారి వేయగలమో అంచనా వేసుకుని ఆ మేరకు పనులు చేపట్టాలన్నారు. దశలవారీగా ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. గ్రామంనుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి రాజధానికి రహదార్లు అనే ప్రాతిపదికను ప్రభుత్వం తీసుకున్నదని వివరించారు. రోడ్లు, భవనాల శాఖ ఏ పని చేపట్టినా అది ప్రజల అవసరాలకు తగినట్లుగా శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలన్నారు. ఆ నిర్మాణాలు భవిష్యత్ అవసరాలకు ఉపయోగ పడేలా డిజైన్ చేయాలని అన్నారు.