Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పునర్నిర్మాణానికి మహాప్రస్థానం

రాష్ట్రాలకు సొంత పార్టీలే కాదు, ఆ రాష్ట్రాలను నడిపే నాయకుడు కూడా కావాలి… సొంత పంథా, సరికొత్త వ్యూహాలు, ఆచరణాత్మకమైన ప్రణాళికతో ప్రజలకు నాయతక్వం వహించ గలిగే లక్షణాలు ఉన్న నాయకుడు కావాలి… అరవై ఏళ్ల కలను నిజం చేసిన ప్రజా నాయకుడు కేసీఆర్ కుండే నాయకత్వ లక్షణాల్లో ఒక్కటైనా ఇతర పార్టీ నాయకులకుందా? అసలు రేపటి తెలంగాణను ఎలా తీర్చిదిద్దాలి అనే ఆలోచన ఉన్న నాయకుడు కేసీఆర్ తప్ప తెలంగాణలో మరెవరైనా ఉన్నారా?

అలుపెరగని ఉద్యమాలు, అనన్య త్యాగాలు చేసి చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత జరుగుతున్న మొదటి సాధారణ ఎన్నికలివి. ఇంతకు ముందెన్నడూ లేనంత ఉత్సాహంగా, భవిష్యత్తుపై కోటి ఆశలతో ఈసారి ఓటేయడానికి వెళుతున్న తెలంగాణ బిడ్డలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనందరి ఆకాంక్షలు నేరవేరాలని, కొత్తప్రభుత్వం, కొత్త పాలనలో అందరి జీవితాల్లో వెలుగు రావాలని మనసారా కోరుకుంటున్నాను. గతంలో కూడా మనం అనేక సార్లు ఓట్లేసాం. కానీ తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మొదటి సారి ఓటేస్తున్నాం. మన ఆశలు తీర్చే పార్టీ అధికారంలోకి రావాలని ఎవరైనా కోరుకుంటారు. గతంలో చాలా సార్లు ఓట్లేసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను అధికారంలోకి తెచ్చాం. సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పడి 58సంవత్సరాలు పూర్తయితే, అందులో 41 సంవత్సరాల పాటు కాంగ్రెస్, 17 ఏళ్ల పాటు తెలుగుదేశం పాలించాయి. కాబట్టి మంచి, చెడులన్నిటికీ ఈ రెండు పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు సీమాంధ్రకు చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని పాలనను వారిచేతిలో పెట్టారు. ఫలితంగా మనకు పరాయి పాలనే దక్కింది. సొంత పాలన రుచి చూడలేదు మనం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రెండు పార్టీలతో పాటు తెలంగాణ సాధనకోసమే పుట్టి, ఆశయాన్ని సాధించిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా పోటీలో ఉంది. ఈ మూడు పార్టీలతో పాటు మిగతా అనేక పార్టీలు పోటీలో ఉన్నాయి. రేపటి తెలంగాణను మేమే బంగారు తెలంగాణగా మారుస్తామని కూడా హామీలిస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది ఎన్నికల సమయంలో సహజ పరిణామం. ఇన్ని పార్టీల్లో ఏ పార్టీకి ఓటేయాలి? అని ప్రజలు ఆలోచిస్తున్న తరుణమిది. అందుకే ఈ సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను.

తెలంగాణది ప్రత్యేక చారిత్రక నేపథ్యం. భారతదేశంలో ప్రత్యేక చారిత్రక, రాజకీయ, భౌగోళిక నేపథ్యమున్న కొద్ది ప్రాంతాల్తో తెలంగాణ ప్రాంతమొకటి. శాతవాహనులు, కాకతీయుల కాలం నుంచి నిజాం కాలం వరకు తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాజ్యంగానే ఉంది. సహజ వనరులు, నదీ జలాలు, చెరువులు, కుంటలు, విస్తారమైన అడవులు, ఖనిజ సంపద, సమశీతోష్ణ వాతావరణం తెలంగాణ ప్రాంతానికున్న ప్రత్యేకమైన భౌగోళిక స్థితి. ఈ ప్రాంతానికి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలున్నాయి. ఈ ప్రాంతంలో పరాయి రాజ్యవంశాలు కూడా మనుగడ సాగించిన దాఖలాలు లేవు. ఎప్పుడూ స్వయం పాలనలోనే ఉంది. సమ్మక్క సారలమ్మ, కొమురం భీమ్ లాంటి వారు కూడా స్థానిక పాలన కోసం పోరాడి అసువులు బాసిన వారే. తెలంగాణ ప్రజలు ప్రాణాలైనా వదులుకున్నారు కానీ, ఎన్నడూ పరాయి పాలనను భరించలేదు. దేశమంతా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిన సందర్భంలో అయినా, ఫ్రెంచ్, పోర్చుగీసు లాంటి వారు అనేక భూభాగాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడు అయినా తెలంగాణ ప్రాంతమొక్కటే తన అస్తిత్వాన్ని కాపాడుకోగలిగింది. అందుకే సీమాంధ్ర ప్రాంతంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలు, నగరాలపైనా, అక్కడి ప్రజల సంస్కృతిపైనా, భాషపైనా బ్రిటిష్ వారి ప్రభావం ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతంలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ పరాయివారి ప్రభావానికి, ప్రాభవానికి లొంగలేదు. మొత్తం చరిత్రలో కేవలం ఈ 58ఏళ్లు మాత్రమే మనం సీమాంధ్ర పాలకుల బారిన పడ్డాం. ఫలితంగా ఎంత కోల్పోయామో 13 ఏళ్ల ఉద్యమ సమయంలో మనం అనేకసార్లు చర్చించుకున్నాం. వారినుంచి ఇప్పుడు విముక్తి పొందాం. మళ్లీ పరాయి పాలనను కలలో కూడా ఊహించుకోలేం. పూర్వ వైభవం కోసం, సొంత అస్తిత్వం కోసం పునర్నిర్మాణ బాట పట్టాం.

పునర్నిర్మాణం కోసం ఇప్పుడో మహాప్రస్థానం జరగాల్సి ఉంది. అందులో మొదటి అడుగు ఈ ఎన్నికలు. మొదటి అడుగు తడబడితే మొత్తం ప్రయాణమే అగమ్యగోచరం అవుతుంది. తెలంగాణ సాధించడంతో పాటు తెలంగాణ పునర్నిర్మాణ ఎజెండాతో ఇవాళ టీఆర్ఎస్ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం-బీజేపీ కూటమి కూడా ప్రజల మద్దతు కోరుతోంది. అయితే మనం ఇంతకాలం పోరాటం చేసిందీ, ఇన్ని త్యాగాలు చేసింది మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవడానికి తప్ప, పరాయి పాలన కొనసాగింపు కోసం మాత్రం కాదు. పేరుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఇంకా అనేక అంశాల్లో చిక్కుముడులున్నాయి. మనం ఇంతకాలం పోరాటం చేసిందే 58 ఏళ్ల పాటు జరిగిన నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో దోపిడీపైన. ఇప్పుడు ఈ అంశాల్లో ఇంకా పేచీలు అలాగే ఉన్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే ఉంది. గోదావరి, కృష్ణా నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలి. అక్రమంగా కట్టిన సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్లు తరలకుండా ఉంటేనే మన వాటా మనకు వస్తుంది. అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన వారిని ఇక్కడి నుంచి వారి సొంతూర్లకు పంపితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పోలవరం డిజైన్ మార్చితేనే మన ఆదివాసీలు గోదావరిలో మునగకుండా ఉంటారు. వీటితో పాటు ఇంకా అనేక విషయాలున్నాయి. వీటిపై టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సందర్భంలోనే పోరాడింది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తుంది. మరి మిగతా పార్టీలకు ఆ అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణలోనే కాదు సీమాంధ్రలో కూడా ఉంది. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ సీమాంధ్ర నాయకుల కనుసన్నల్లోనే నడుస్తుంది. ఎన్నికల సమయంలో పై విషయాలపై మీ వైఖరేంటి అని అడిగినప్పుడు ఏ ఒక్క తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు నోరు మెదపని వారు రేపు అధికారంలోకి వస్తే, తెలంగాణ ప్రయోజనాలు ఏం పట్టించుకుంటారు?

సీమాంధ్రకు చెందిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీది ఇంకా మరీ ఘోరం. చంద్రబాబు ఎన్నటికైనా సీమాంధ్ర నాయకుడే. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయిన నాటి నుంచి మొన్న పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భం వరకు చంద్రబాబు తెలంగాణ విషయంలో ఎంతటి ద్వేషాన్ని, కుట్రను ప్రదర్శించారో మనం కళ్లారా చూశాం. రేపు ఆ పార్టీ ఎవరి కోసం పోరాడుతుంది? చంద్రబాబు ఏనాడైనా ఆంధ్రోళ్లతో కొట్లాడి, తెలంగాణకు న్యాయం చేస్తడా? కేంద్రంపై వత్తిడి తెచ్చి తెలంగాణకు కావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు పట్టుకొస్తడా? అసలు అది మనం ఊహించగలమా? కాబట్టే తెలంగాణ ప్రజలకు సొంత గొంతుక ఉండాలి. సొంత పార్టీ ఉండాలి. తెలంగాణ ప్రయోజనాలే ఎజెండాగా పనిచేసే నాయకత్వం కావాలి. టీఆర్ఎస్ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. తెలంగాణ ప్రజలతో మమేకమైన పార్టీ. తెలంగాణ ప్రజలతో టీఆర్ఎస్‌ది పేగు బంధం. తెలంగాణ ప్రజల బాధలు, కష్టాలు తీర్చడంలో, తెలంగాణ హక్కులు సాధించడంలో టీఆర్ఎస్ కున్నంత పట్టింపు వేరే ఏ పార్టీకి ఉండదు. టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలే హైకమాండ్.

రాష్ట్రాలకు సొంత పార్టీలే కాదు, ఆ రాష్ట్రాలను నడిపే నాయకుడు కూడా కావాలి. రాష్ట్ర ప్రజలందరితో అనుబంధం కలిగి ఉన్న నేత కావాలి. రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉండడంతో పాటు, భవిష్యత్‌పై విజన్ ఉన్న నాయకత్వం కావాలి. అలాంటి నాయకులున్న రాష్ట్రాలే ఇవాళ దేశంలో ముందంజలో ఉన్నాయి. సొంత పంథా, సరికొత్త వ్యూహాలు, ఆచరణాత్మకమైన ప్రణాళికతో ప్రజలకు నాయతక్వం వహించ గలిగే లక్షణాలు ఉన్న నాయకుడు కావాలి. వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ పార్టీలు ప్రభావం చూపగలుగుతున్నాయంటే, కేంద్ర నాయకత్వాన్ని శాసించగలిగే స్థాయిలో ఉన్నాయంటే వాటి గొప్పతనమంతా నాయకత్వంలోనే ఉంటుంది. దేశంలో ప్రత్యేకత చాటుకుంటున్న తమిళనాడుకు అన్నాదురై, కరుణానిధి, జయలలిత లాంటి సమర్థ నాయకులుండబట్టే సాధ్యమైంది. బీహార్‌కు ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నుంచి పుష్కలంగా నిధులు వస్తున్నాయంటే నితీశ్ కుమార్ లాంటి వారి వల్ల అయింది. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్ లాంటి నాయకులు ఆయా రాష్ట్రాల్లో ప్రజా నాయకులుగా ఉన్నారు. రేపు తెలంగాణకూ అలాంటి సమర్థ నాయకులు కావాలి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలతో అలాంటి లక్షణాలున్న ఒక్క నాయకుడైనా కనిపిస్తడా? తెలంగాణ సమాజాన్నంతా ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, అరవై ఏళ్ల కలను నిజం చేసిన ప్రజా నాయకుడు కేసీఆర్ కుండే నాయకత్వ లక్షణాల్లో ఒక్కటైనా ఇతర పార్టీ నాయకులకుందా? అసలు రేపటి తెలంగాణను ఎలా తీర్చిదిద్దాలి అనే ఆలోచన ఉన్న నాయకుడు కేసీఆర్ తప్ప తెలంగాణలో మరెవరైనా ఉన్నారా?

తెలంగాణకు కూడా సొంత రాజకీయ అస్తిత్వం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఎన్నడో చెప్పిండు. దాని వల్ల ఇక్కడ ప్రజలకు ఎంత మేలో మనకు ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. కాబట్టి తెలంగాణలో కూడా సొంత రాజకీయ పార్టీ ఉండాలి. మన ఇంటి పార్టీ ఉండాలి. కేవలం రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాదు, కేంద్రం నుంచి అనేక రకాల ప్రయోజనాలు రాబట్టుకోవడానికి పెద్ద సంఖ్యలో తెలంగాణ పార్టీకి ఎంపీ సీట్లుండాలి. సంకీర్ణ శకంలో సంఖ్యాబలానికి చాలా ప్రాధాన్యముంటుంది. కేంద్రాన్ని శాసించే రీతిలో మన సంఖ్యాబలం ఉంటే తప్ప కేంద్రం మెడలు వంచడం సాధ్యం కాదు. తెలంగాణ ఏర్పడినా, దీన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవడానికి కేంద్రం సహకారం చాలా అవసరం. కొత్తగా కట్టుకునే నీటి పారుదల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు కావాలి. కొత్త రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు ప్రత్యేక గ్రాంట్లు కావాలి. విద్యుత్ కొరత ఉన్న తెలంగాణకు కేంద్రం నుంచి విద్యుత్ అందాలి. పోలవరంలో ఎవరూ మునగకుండా కాపాడుకోవాలి. ఇంకా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ సాధించాలంటే కూడా మనకు సొంత ఎంపీలుండాలి. మన ఎంపీల సహకారం లేకుండా ఏ కూటమి కూడా అధికారంలోకి రాలేదు అనే పరిస్థితి రావాలి. అప్పుడే మనకు పూర్తి న్యాయం జరుగుతుంది. – తన్నీరు హరీష్ రావు ఉపనేత, టీఆర్ఎస్ శాసనసభాపక్షం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.