Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పునరుద్ధరణతో వెనకటి రోజులు

-పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రతిష్ఠాత్మకం -భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు -ఒక వర్షపు చుక్కా వృథాకావొద్దు: ఎంపీ కే కేశవరావు -రాజకీయాలకతీతంగా మిషన్:డిప్యూటీ సీఎం కడియం -నీటిగోస తీరుస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి

Mission Kakatiya

చెరువుల పునరుద్ధరణతో ఆయకట్టు, భూగర్భజలాలు పెరిగి వెనకటి రోజులు వస్తాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని సాబిత్‌నగర్ చెరువు, కందుకూరు మండలం జైత్వారంలో నామినివాణి చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, రాబోయే నాలుగేండ్లలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాలోని 2.75 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పారు.

ఈ ఎత్తిపోల పథకం ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు చెరువుల్లో నుంచి తీసే మట్టిని ట్రాక్టర్ల ద్వారా పొలాలకు తరలించేందుకు తక్కువ చార్జీలు తీసుకోవాలని కోరారు. చెరువు పనులపై ప్రజాప్రతినిధులు ప్రతిక్షణం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వర్షాకాలం ఆరంభంనాటికే చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో చెరువుల కళ తప్పి గ్రామీణుల అర్థికపరిస్థితి ఆస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సొమ్ము మనది.. సోకు ఆంధ్రోళ్లదని, స్వరాష్ట్రంలో సొమ్మూ మనదే.. సోకూ మనదేనన్నారు. ఒక్క వర్షపు చుక్క కూడా వృథా కాకుండా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పవర్ కట్ లేకుండా చేస్తున్న సీఎం కేసీఆర్ జిమ్మిక్కులు, జాదు ఎవరికీ అంతుబట్టడం లేదన్నారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మహేశ్వరం నియోజికవర్గం ఇన్‌చార్జి కొత్త మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి అజ్మీరా చందూలాల్ చెరువు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పనులు రాజకీయాలకతీతంగా సాగుతున్నాయని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రుల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ఆత్మ అయిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపట్టారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 250 టీఎంసీల వర్షపునీటిని ఒడిసిపట్టి పల్లెల బాగు కోసం మిషన్ కాకతీయ చేపట్టామన్నారు. అన్యాక్రాంతమైన చెరువు శిఖం భూములను తక్షణమే గుర్తించి సరిహద్దులు నిర్ధారించాలని అధికారులకు సూచించారు.

మంత్రి చందూలాల్ మాట్లాడుతూ చెరువులు, కుంటలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ చెరువులను బాగుచేయడమంటే తెలంగాణను పునర్నిర్మించడమేనన్నారు. ఒకనాడు గోరేటి వెంకన్నలాంటి కవులు పల్లే కన్నీరుపెడుతుందని ఉద్యమకాలంలో పాటలు రాశారని, ఇక మీదట పల్లె కన్నీరు పెట్టకుండా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలంలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చెరువు పనులను ప్రారంభించి మాట్లాడారు. రాష్ర్టాన్ని సుభిక్షం చేసేందుకు మిషన్ కాకతీయ దోహదపడుతుందన్నారు.

చెరువులకు పూర్వవైభవం: డిప్యూటీ స్పీకర్ పద్మ కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణబద్ధులై ఉండి మిషన్ కాకతీయ పేరుతో పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం చేబర్తిలోని పెద్ద చెరువులో పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పూడికను రైతులు పొలాల్లో వేసుకోవడం ద్వారా రసాయనిక ఎరువుల వాడకం 50శాతానికి పడిపోతుందన్నారు. మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట మండలం దంతెపల్లి, కాట్రియాల, పర్వతాపూర్‌లలో చెరువు పనులను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. చెరువులు కన్నతల్లుల్లాంటివి, చెరువుల్లో నీరుంటే పంటలు పుష్కలంగా పండి రైతులు సంతోషంగా ఉంటారన్నారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం పొన్కల్ చెరువు పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. పనులను పారదర్శంగా నిర్వహించాలని, జూన్ కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.