రాష్ట్రంలో జరిగే పురపాలక, నగర పాలక ఎన్నికలను తన పనితీరుకు పరీక్షగా భావిస్తున్నానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. పురపాలక ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెరాస హయాంలో పురపాలక సంఘాలకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, అందులో 10 శాతమైనా ఇచ్చారా అని తాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సవాలు చేస్తున్నానని చెప్పారు. తెరాసను ఒంటరిగా ఎదుర్కొనలేక కాంగ్రెస్, భాజపాలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. చైతన్యవంతులు, విజ్ఞులైన ప్రజలు కుట్రపూరిత రాజకీయాలకు చరమగీతం పాడతారని చెప్పారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలో శనివారం కేటీఆర్ తెలంగాణభవన్‌లో ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
మీకు మజ్లిస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి ఆలోచనేదీ లేదు. మేం మొత్తం 3,148 వార్డుల్లో పోటీ చేస్తాం.
పురపాలక శాఖలో అవినీతిని కొత్త చట్టం నివారిస్తుందా? అవినీతి లేదని ఆత్మవంచన చేసుకోం. మా ప్రభుత్వ విధానాలు, చర్యలతో దీనిని గణనీయంగా తగ్గిస్తాం. చట్టం ద్వారా నమ్మకాన్ని కలిగిస్తూనే బాధ్యత విస్మరిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.
విపక్షాల నుంచి ఎలాంటి పోటీ ఉంది. విపక్షాలు మాకు పోటీనే కాదు. ఒంటరిగా ఎదుర్కొనలేక.. నిజామాబాద్, జగిత్యాల రాయికల్, వేములవాడ, గద్వాల, నారాయణపేట తదితర స్థానాల్లో కాంగ్రెస్, భాజపాలు పరస్పర అవగాహనతో పోటీ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కత్తులు దూసినట్లు నటిస్తూ ఇక్కడ పురపాలక ఎన్నికల్లో ఒక్కటై గతంలోలా తప్పుడు పద్ధతులు అవలంబిస్తున్నాయి. పార్టీలు కలిసినంత మాత్రాన ఓట్లు బదిలీ కావు.
ఏడు నెలల్లో మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఎలా ఎదుర్కొనబోతున్నారు? కేటీఆర్: పుర ఎన్నికల్లో మంచి మెజారిటీతో బ్రహ్మాండమైన విజయం సాధిస్తాం. పార్టీ తరఫున అన్ని విధాలా సన్నద్ధమయ్యాం. గెలుస్తామనే నమ్మకం వల్ల టికెట్లకు డిమాండు ఎక్కువగా ఉంది. అర్హుల్లో కొందరికి టికెట్ దక్కకపోవచ్చు, వారిని పార్టీ పదవుల్లో, ప్రభుత్వ నియమిత పదవుల్లో నియమించి గౌరవిస్తామని సీఎం స్వయంగా చెప్పారు.
ఎంపికలో ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు మా ఎమ్మెల్యేలపై పూర్తి నమ్మకం ఉంది. ఎంపీలు, ఎమ్మెల్సీల కంటే వారు ప్రజల మధ్యే ఉంటారు. తల్లి కోడి మాదిరిగా ప్రజాప్రతినిధులను, పార్టీశ్రేణులతో కలిసి ముందుకెళతారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువనిస్తూ వారికి బాధ్యతలు అప్పగించాం.
మీ హయాంలో పురపాలికల్లో వచ్చిన మార్పులేమిటి తెరాస హయాంలో పురపాలక సంఘాలు ప్రగతిని సాధించాయి. కొత్తవాటిని ఏర్పాటు చేయడంతో పురపాలికల సంఖ్య 62 నుంచి 141కి చేరింది. నూతనంగా 10 నగరపాలక సంస్థలు వచ్చాయి. సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం నగర ప్రాధికార సంస్థలు ప్రారంభమయ్యాయి. మా హయాంలో పురపాలికల ఆదాయం, రెవెన్యూ వసూళ్లు పెంచాం. మౌలిక వసతులపై దృష్టి పెట్టి పనిచేశాం. ఎప్పుడైనా ఇంతపెద్ద స్థాయిలో మంచినీటి పథకాలపై అవగాహన కాంగ్రెస్, భాజపా అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లో ఉందా? కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని వారెందుకు అనుకోలేదు? కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల్లో ఇలాంటి సంస్కృతి లేదు. అవగాహన రాహిత్యంతో హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న నిజాంపేట, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, బోడుప్పల్‌లను అప్‌గ్రేడ్ చేయకుండా పంచాయతీలుగా ఉంచడం వల్ల ఇబ్బందులు వచ్చాయి.
పురపాలక సంఘాల ఆర్థిక పరిస్థితులేమిటి మా ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిచ్చింది. రూ.2500 కోట్ల నిధులిచ్చాం. టీఎఫ్‌యూఐడీసీ ద్వారా పనులు చేయించాం. వరంగల్ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌లకు 100 కోట్ల రూపాయల చొప్పున.. బడ్జెట్ నుంచి నేరుగా ఇచ్చాం. కాంగ్రెస్ హయాంలో మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులెన్ని? ఆదాయమెంత అనేది మేం శ్వేతపత్రం విడుదల చేస్తాం. మేమిచ్చిన నిధుల్లో కనీసం 10 శాతమైనా ఇచ్చారా అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు సవాలు విసురుతున్నా.
ఎన్నికల తర్వాత మీ ప్రణాళిక కొత్త పురపాలక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, ప్రజలకు సాంత్వన కలిగిస్తాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అందుబాటులోకి తెస్తాం. అత్యుత్తమ పౌరసేవలందిస్తాం. కేవలం పాలకమండళ్లకే కాకుండా, పురపాలక, టౌన్‌ప్లానింగు సిబ్బందితో మూడు నెలలకోసారి నేను సమావేశమవుతాను. అవినీతికి తావులేకుండా ఇంటి అనుమతులిస్తాం. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతుల స్వీయ ధ్రువీకరణ చట్టం అమలు చేస్తాం.
ఎన్నికల్లో తెరాస పార్టీకి, ప్రభుత్వానికి సానుకూలత ఉందా? చరిత్రలో ఎన్నడూ లేనంత నిధులు, మౌలిక వసతులు, సంస్కరణలు, విధాన రూపకల్పనలు మా హయాంలో జరిగాయి. కొత్త పంచాయతీ చట్టం, పురపాలక చట్టం వచ్చాయి. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం వస్తోంది. వీటివల్ల రాష్ట్రంలో బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి. ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు ప్రజలకు అందుతున్నాయి. వారు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరో నాలుగేళ్లు మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది.
స్థానికంగానే ఎన్నికల ప్రణాళికలు రూపొందించారట కదా.. సమస్యలు అంతటా ఒకేలా ఉండవు. సిరిసిల్లలో ఉన్నవి పక్కనే ఉన్న కామారెడ్డిలో కనిపించవు. భగీరథ, స్థానికంగా సమస్యలు, పరిస్థితులు, అవసరాలు, ప్రాధాన్యంగా స్థానికంగా ఎన్నికల ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆదేశించాం. ఎవరికి వారే ప్రచారం చేసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించాం. సభలు, రోడ్‌షోల కంటే ఇంటింటికీ, గడప గడపకీ ప్రచారం చేయడమే మేలని భావిస్తున్నాం.
111 జీవోపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ జీవోపై సమీక్షిస్తామని మా ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చాం. ఇప్పటికే జడ్పీ, మండల పరిషత్‌లు, ప్రతి గ్రామం నుంచి తీర్మానాలు చేశారు. దీనిపై సమయం, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. జంట చెరువులకు నష్టం లేకుండా భావితరాలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎన్‌జీటీ మార్గదర్శకాల మేరకు పర్యావరణహితంగా ఉండాలి. ప్రజలకు డిమాండ్లు, ఆలోచనను సమర్థించేలా ఉద్యోగావకాశాలు, ఆర్థికంగా తోడ్పాటు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటాం.