Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పూర్తి బాధ్యతమీదే

-బుక్కులు, చెక్కుల పంపిణీపై మంత్రులు, కలెక్టర్లకు సీఎం శ్రీ కేసీఆర్ దిశానిర్దేశం -రైతుబంధు వందశాతం పూర్తయ్యేదాకా విశ్రమించొద్దు -తహసీల్దార్లు, ఎమ్మెల్యేలు మండలాల్లో పర్యవేక్షించాలి -నేటి నుంచి జూన్ 20 వరకు ఇదే పనిలో ఉండాలి -పాస్‌బుక్కులకు ఆధార్ అనుసంధానం -రికార్డుల నిర్వహణలో అవినీతిని సహించేది లేదు -పాస్‌బుక్‌లలో తప్పులు సరిదిద్దాలి -ఆ తర్వాతే ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి -వచ్చే నెలనుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం -భూమికి సంబంధించి ఇకపై ఒకటే లెక్క -గుంట భూమికీ యజమాని ఎవరో తేల్చాలి -జూన్ 20 కల్లా వివరాల నమోదు పూర్తికావాలి -వచ్చే నెల నుంచి రైతులకు జీవిత బీమా -కల్యాణలక్ష్మికి కుల ధ్రువీకరణ ప్రత్రం అవసరంలేదు -జూన్ 2న స్కూళ్లలోనూ అవతరణ వేడుకలు -హరితహారం కోసం ముమ్మర ఏర్పాట్లు చేయాలి -రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు దుస్తుల పంపిణీ -కలెక్టర్ల సమావేశంలో సీఎం శ్రీ కేసీఆర్

 

భూరికార్డుల ప్రక్షాళన, పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం నూటికి నూరుశాతం పూర్తయ్యేవరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బుక్కులు, చెక్కుల పంపిణీ పూర్తిచేసే బాధ్యతను జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లకు అప్పగించారు. ప్రతి జిల్లాకు ఒకరు చొప్పున 30 మంది అధికారులను నియమించారు. మండలాల్లో తహసీల్దార్లు, ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. గురువారం నుంచి జూన్ 20 వరకు అధికారులు, మంత్రులు ఇదేపని మీద ఉండాలని స్పష్టంచేశారు. భూరికార్డులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. విదేశాలలో ఉన్న ఎన్నారైలకు పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానం అనుసరించాలని అధికారులకు సీఎం కేసీఆర్ చెప్పారు. ఆధార్ సంఖ్య అనుసంధానం చేయడానికి ముందుకురానివారి పాస్‌పుస్తకాలను పక్కకు పెట్టాలని సూచించారు. కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంపై ప్రగతిభవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ సమీక్షించారు. జిల్లాలవారీగా ఇప్పటివరకు ఎన్ని పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు? ఎంతమందికి చెక్కులిచ్చారు? మిగతావారికి ఏ కారణంతో పంపిణీచేయలేదు? తదితరాలపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ప్రతి రైతుకూ పాస్‌పుస్తకం, చెక్కు అందడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకొన్నారు.

ఆన్‌లైన్ ఫ్రీజింగ్ ఎత్తివేయాలి భూమి వివరాలను నమోదు చేయడానికి ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఫ్రీజింగ్ ఎత్తివేసి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడానికి తహసీల్దార్లకు అవకాశం కల్పిస్తామన్నారు. భూముల అమ్మకం, కొనుగోలు వివరాలన్నీ నమోదు చేయాలని, అన్ని రకాల మ్యుటేషన్లు చేయాలని, వారసత్వ హక్కులు తేల్చాలని సీఎం ఆదేశించారు. కొత్తగా నమోదైన వివరాలతో పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలన్నారు. గుంట భూమికి కూడా యజమాని ఎవరో తేల్చాలని, ఈ రోజు వరకు జరిగిన ప్రతి అమ్మకం, కొనుగోలు నమోదు చేయాలని, భూ యాజమాన్యానికి సంబంధించిన అన్ని మార్పులు నమోదు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు పెండింగ్‌లో పెట్టరాదని, జూన్ 20 నాటికి వివరాల నమోదు కార్యక్రమం పూర్తి కావాలన్నారు. మే 24 నుంచి జూన్ 20 వరకు 25 రోజులపాటు మరో పని ముట్టుకోకుండా అధికార యంత్రాంగమంతా ఇదే పనిలో నిమగ్నం కావాలని సీఎం కేసీఆర్ చెప్పారు. భూమికి సంబంధించి ఇకపై ఒకటే లెక్క ఉండాలన్నారు. అధికారులతోపాటు జిల్లాలకు ఇంచార్జులుగా ఉన్న మంత్రులు కూడా 25 రోజులపాటు ఇదే పనిలో ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

నూటికి నూరు శాతం పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తిచేయాలి.. భూముల విషయంలో దశాబ్దాల తరబడి వివాదాలు, అస్పష్టతలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎన్నడూ శ్రద్ధ పెట్టలేదు. ప్రభుత్వశాఖల మధ్య కూడా భూవివాదాలున్నాయి. రెవెన్యూ, అటవీశాఖల మధ్య గొడవలున్నాయి. రికార్డులు సరిగా లేకపోవడంవల్ల గ్రామాల్లో గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ చరమగీతం పాడాలనే భూరికార్డుల ప్రక్షాళన చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ సాహసానికి పూనుకోలేదు. రాష్ట్రంలో ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమైంది. అధికారులు ఎంతో శ్రమకోర్చి రికార్డుల ప్రక్షాళనచేశారు. దాని ప్రకారం కొత్త పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందిస్తున్నాం. ఇంకా మిగిలినవారికి కూడా అందివ్వాలి. తలపెట్టిన కార్యక్రమం నూటికి నూరుశాతం పూర్తిచేయాలి. రైతు సమన్వయసమితులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అన్ని విధాలా రికార్డులు సిద్ధమైన తర్వాతే ధరణి వెబ్‌సైట్ ప్రారంభిద్దాం అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.

ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతుల సంఖ్య 18 లక్షలు రైతులు భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. చాలామంది చిన్న, సన్నకారు రైతులే. ఒక్క ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. ఇలాంటి పేదరైతు చనిపోతే వారి కుటుంబం ఉన్నట్టుండి అగాధంలో పడిపోతుంది. కాబట్టి మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌ఐసీ ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తాం. రైతుల తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తాం. రైతులు కోరుకున్న వారినే నామినీలుగా చేర్చాలి. బీమా పథకం అమలుకు సంబంధించి ఎల్‌ఐసీ అధికారులతో చర్చలు జరుపుతున్నాం. రైతు చనిపోయిన వెంటనే ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిహారం అందే విధానానికి రూపకల్పన చేయాలి అని సీఎం వివరించారు. అసైన్డ్ భూములు కొన్నవారు పేదలే అయితే వారి పేరుమీదే యాజమాన్య హక్కులు కల్పించాలి. వారికి రైతుబంధు పథకం వర్తింపజేయాలి అని సీఎం చెప్పారు.

రైతులకు అసౌకర్యం కల్పించిన అధికారులపై అసహనం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ వంద రోజులపాటు భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, ఇంకా కొన్నిచోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలు ఉండటం పట్ల సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు. సాంకేతిక కారణాలతోపాటు మానవ తప్పిదాలు కూడా ఉన్నాయని, దీనివల్ల రైతులకు కొంత అసౌకర్యం కలిగిందని, కొందరికి పాస్‌పుస్తకాలు అందలేదని సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులను వెంటనే సవరించాలని చెప్పారు.

కలెక్టర్లు కార్యక్షేత్రంలో విధులు నిర్వర్తించాలి జిల్లాల పునర్విభజన వల్ల కలెక్టర్లకు పర్యవేక్షణ సులభమైందని, దీన్ని సానుకూలాంశంగా తీసుకొని మరింత చిత్తశుద్ధితో కార్యక్షేత్రంలో విధులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఉద్బోధించారు. వచ్చేనెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానంతోపాటు రైతులకు జీవిత బీమా పథకం కూడా అమల్లోకి వస్తుందని, భూరికార్డుల ప్రక్షాళన పరిపూర్ణమై, భూమి యజమాన్యంపై స్పష్టత వస్తే తప్ప ఈ కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యంకాదని అన్నారు. కొన్ని సమస్యలు వచ్చినంతమాత్రాన అధైర్యపడవద్దని బుక్కులు, చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయడానికి పునరుత్తేజం పొందాలని సీఎం పిలుపునిచ్చారు.

రంజాన్ పండుగ, రాష్ర్టావతరణ వేడుకలపై కలెక్టర్లకు సూచనలు రంజాన్ పండుగ ఏర్పాట్లు, రాష్ట్ర అవతరణ వేడుకలు, కల్యాణలక్ష్మి, హరితహారం కార్యక్రమాలపై సీఎం కేసీఆర్.. జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా నియోజకవర్గాలవారీగా ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయాలన్నారు. పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకం అమలుచేస్తున్నందున కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని సీఎం సూచించారు. జూన్ 1 నుంచే పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని, జూన్ 2న అవతరణ వేడుకలను పాఠశాలల్లో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలో నిర్వహించే తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేయాలని, జిల్లాల్లో నర్సరీలను సందర్శించాలని, మొక్కలను సిద్ధంచేసే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎంలు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు పాల్గొన్నారు.

కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు -పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ వందశాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతోపాటు మంత్రులు స్వీకరించాలి. -భారతదేశానికి రాలేకపోతున్న ఎన్నారైలకు పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానం అనుసరించాలి. -ఆధార్ నంబర్ అనుసంధానించడానికి ముందుకు రానివారి పాస్‌పుస్తకాలను పక్కన పెట్టాలి. -భూమికి సంబంధించిన అన్ని వివరాలతో ధరణి వెబ్‌సైట్ నిర్వహించాలని నిర్ణయించినందున అందులో వివరాలు సరిగ్గా ఉండేందుకు రికార్డులు సరిగ్గా ఉండాలి, అసమగ్ర వివరాలతో ధరణిని నిర్వహించలేం. -భూరికార్డుల నిర్వహణలో అవినీతికి పాల్పడే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలి. -ప్రతి మండలంలో వందశాతం బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యతను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించాలి. జిల్లాల్లో మంత్రి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. -మాన్యువల్‌గా మ్యుటేషన్‌చేసిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేసి, దాని ప్రకారం కొత్తపాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఆన్‌లైన్‌లో మార్పులను నమోదుచేయడంలో నిలుపుదలచేయలేదు. ఈ విషయంపై తహసీల్దార్లకు ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.