
-పాములు, ముంగీసలు ఏకమైనయి -కలికాలం కాబట్టే కాంగ్రెస్, టీడీపీ కలిసినయి -చంద్రబాబు వేటికి అడ్డుపడ్డారో చెప్తే పెద్దచిట్టా అవుతుంది -బ్రీఫ్డ్ మీ.. అన్నది ఇంకా మనందరికీ గుర్తున్నది -లోకేశ్ తరహాలో సుహాసినిని ఏపీలో నేరుగా మంత్రిని చేయవచ్చుకదా? -లోకేశ్ ఓడిపోతాడనే కూకట్‌పల్లిలో పోటీచేయించడంలేదు -ఎన్నికలనగానే ఆయనకు తెలంగాణ గుర్తుకొచ్చింది -గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికలను అడ్డుపెట్టుకొని రాష్ర్టానికి పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఈ రాజకీయపర్యాటకులను ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఈ పొలిటికల్ టూరిస్టులు రంగురంగుల జెండాలు కప్పుకొని గంగిరెద్దుల వలే తిరుగుతుండటంతో ఊర్లలో ప్రజలు పరేషాన్ అవుతున్నారని, సంక్రాంతి గంగిరెద్దులు డిసెంబర్లోనే వస్తున్నయేందని ఆశ్చర్యపోతున్నారని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో పర్యటించారు. తొలుత మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడలో ప్రజా ఆశీర్వాదసభలో ప్రసంగించిన కేటీఆర్.. ఆ తర్వాత కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు.

టీఆర్ఎస్ అభ్యర్థులు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్లను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన రోడ్‌షోలకు జనం బ్రహ్మరథం పట్టారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, పాటిమీది జగన్మోహన్రావు, కార్పొరేటర్లు పా ల్గొన్నారు. ఆయాచోట్ల కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణల ఏమూలకన్నపో.. కరంట్ తీగలు పట్టుకో.. కరంట్ ఉన్నదో లేదో చెప్పు అంటూ ప్రధాని మోదీని నిలదీశారు. పాములు, ముంగీసలు ఏకమైనయి. నాలుగైదు కండువలు కప్పుకొని తిరుగుతుంటే తెలంగాణ జనమంతా ఆగమైతున్నరు అని కూటమి నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబుగారూ.. మీరే తప్పూ చేయలేదా? మా ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించలేదా? మీరు పంపినాయన రూ.50 లక్షలతో అడ్డంగా దొరుకలేదా? మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఫోన్లో అనలేదా? ప్రాజెక్టులను అడ్డుకునేందుకు 30 ఉత్తరాలు రాయలేదా? ఏమీ తెలియదన్నట్టు ఇప్పుడు సన్నాయినొక్కులు నొక్కడమేమిటి? అంటూ ప్రశ్నించారు.

రాజకీయాలంటే తెలియని సుహాసినిని కూకట్‌పల్లిలో నిలబెట్టారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. నందమూరి కుటుంబంపై చంద్రబాబుకు నిజంగానే ప్రేమ ఉంటే ఆయన కుమారుడు లోకేశ్‌ను చేసినట్లు ఆమెను కూడా ఏపీలో డైరెక్ట్‌గా మంత్రిని చేయొచ్చు కదా? లోకేశ్‌నే కూకట్‌పల్లిలో పోటీకి దించొచ్చు కదా అని నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు వచ్చివెళ్లిన చంద్రబాబుకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలనగానే తెలంగాణ గుర్తుకొచ్చిందని విమర్శిం చారు. ఇక్కడివారంతా తెలంగాణ బిడ్డలేనని, ప్రాంతా లు, రాష్ర్టాలు, కులాలు, మతాలకతీతంగా అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని తెలిపారు.