Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రానున్నది శబ్ద విప్లవమే

-కూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు
-వందకుపైగా స్థానాల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం తథ్యం
-ఆరునెలల్లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి
-ఓట్లు డబ్బాలో పడేనాటికి ఇంటింటికీ భగీరథ నీళ్లు
-బంగారు తెలంగాణ ఆవిష్కృతమయ్యేవరకు కేసీఆరే సీఎం
-మేడిపల్లి ప్రజాఆశీర్వాద సభలో మంత్రి కే తారకరామారావు
-తెలంగాణకు అడ్డంపడ్డ గడ్డాలు ఒక్కటవుతున్నాయని విమర్శ

రాష్ట్రంలో శబ్దవిప్లవం వస్తుందని, డిసెంబర్ 11న మహకూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. వందకు పైగా సీట్లతో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ మారే వరకు సీఎంగా కేసీఆర్ ఉంటారని చెప్పారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకర్గం మేడిపల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు నేతృత్వంలో బుధవారం ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ప్రజలు అద్భుతమైన, అంచంచల విశ్వాసాన్ని చూపిస్తున్నారన్నారు. గతంలో తెలంగాణను అడ్డుకున్న గడ్డాలు.. చంద్రబాబు, ఉత్తమ్‌కుమార్, ఎల్ రమణ, జీవన్‌రెడ్డి ఇప్పుడు కేసీఆర్‌ను అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నారని విమర్శించారు. ఎన్ని గడ్డాలు, ఎన్ని గుంటనక్కలు కలిసినా కేసీఆర్‌ను ఓడించలేవన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం వరంగల్, మెదక్ ఉప ఎన్నికలు, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు.. ఇలా సందర్భం ఏదైనా ప్రజలు కేసీఆర్‌వైపు ఉన్నారని గుర్తుచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో 12 సీట్లు గెలిచామని, ఒక్క జగిత్యాలలో మాత్రమే ఓటమిచెందామని, ఇప్పుడు 13 సీట్లలో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేస్తుందన్న నమ్మకం కలుగుతున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చనిపోయినవారి పేర్లతో కేసులు వేయించిందని, కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలంటూ ఢిల్లీకి 30 లేఖలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్ నేతలు జట్టుకడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుందని, రేపటి రోజున పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులను చంద్రబాబు నిర్మించనిస్తాడా? అని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైంది
ఇప్పటికే టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్‌లో సింహంలాంటి మనిషి, మట్టిబిడ్డ కేసీఆర్ ఉన్నారని, కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఉత్తమ్, జీవన్‌రెడ్డి, జానారెడ్డి, అరుణమ్మ ఇలా నలభైమంది సీఎం అభ్యర్థులున్నారని ఎద్దేవాచేశారు. ఈనగాచి నక్కల పాలుచేయవద్దన్న కేటీఆర్.. సీల్డుకవర్ సీఎం కావాలో.. సింహంలాంటి సీఎంకావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు అరవైఏండ్లుగా తెలంగాణ ప్రజలను బానిసలుగామార్చి, వేలమంది ప్రాణాలుతీసిన రాహుల్‌గాంధీ కుటుంబానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని అభివర్ణించారు.

కండుపునిండా కరెంటు ఇస్తున్నాం
తెలంగాణ ఏర్పాటు సమయంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ తెలంగాణ చీకటి అవుతుందని, పంటలు పండవంటూ పిల్లి శాపనార్థాలు పెట్టారని గుర్తుచేశారు. కానీ.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత కరంటు విషయంలో మొదట దృష్టిసారించి, ఆరుమాసాల్లోనే విద్యుత్ విషయంలో సమృద్ధిని సాధిస్తే.. పిల్లిశాపనార్థాలు పెట్టినవారు మాత్రం కనుమరుగయ్యారని చెప్పారు. పక్క రాష్ర్టాలకు సైతం కరంట్ ఇచ్చేస్థాయికి నేడు తెలంగాణ చేరుకుందని, ఈ విషయాన్ని మనం గల్లా ఎగురవేసి చెప్పవచ్చునన్నారు. భవిష్యత్తులో వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

కాలంతో పోటీపడుతున్న కాళేశ్వరం పనులు
కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీపడి నిర్మిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. మరో ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని, పంట పొలాల్లోకి గోదావరినీళ్లు వచ్చి తీరుతాయన్నారు. ప్రాజెక్టులు శరవేగంగా సాగుతుంటే బెంబేలెత్తిన కాంగ్రెస్ నేతలు వాటిపై తప్పుడు కేసులువేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటింటికీ మంచినీరు ఇచ్చే మిషన్‌భగీరథ పనులు సైతం వేగంగా సాగుతున్నాయని, ఓట్లు డబ్బాలో పడేనాటికి ఇంటింటికీ మంచినీరు వస్తుందని చెప్పారు.

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్
అనేక సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతిగా నిరూపించుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆసరా పింఛన్లతో వృద్ధులకు పెద్దకొడుకుగా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడపిల్లలకు మేనమామగా సీఎం కేసీఆర్ అండదండలిస్తున్నారని చెప్పారు. పేదలకు ఇచ్చే బియ్యం విషయంలో ఆంక్షలెందుకన్న కేసీఆర్.. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నారని తెలిపారు. తన మనుమడు, మనుమరాలు తింటున్న సన్నబియ్యం అన్నాన్ని హాస్టళ్లు, స్కూళ్లలో పిల్లలకు పెడుతున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో పింఛన్లను రూ.2016కు పెంచుతున్నామని తెలిపారు. బీడీ కార్మికులకు సైతం పెన్షన్‌ను రూ.2016కు పెంచుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రైతుల కోసం రూ.17వేల కోట్ల రుణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మాఫీచేశారని, రానున్న రోజుల్లో లక్ష రూపాయల వరకు రుణాలను సైతం మాఫీ చేసేందుకు టీఆర్‌ఎస్ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఏ పాలకుడు ఇవ్వని విధంగా ఎకరానికి రూ. 4వేల చొప్పున ఏడాదికి రూ.8వేల పెట్టుబడి సాయం అందించి చరిత్ర సృష్టించిన కేసీఆర్.. రానున్న రోజుల్లో దీన్ని పదివేలకు పెంచబోతున్నారని తెలిపారు. రైతు కుటుంబాలను ఆపన్నకాలంలో ఆదుకునేందుకు ఐదు లక్షల ఉచిత బీమా వర్తింజేస్తున్నారని చెప్పారు. ఇలా 67 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పనులను కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిందన్నారు. ఈ సభలో కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కఠారి చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పేదలందరికీ బీమా యోచన
-మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి

రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రైతుబీమా పథకం తరహాలో అన్ని పేద కుటుంబాలను ఆదుకునేందుకు మరో బీమా పథకాన్ని తీసుకువచ్చేందుకు ఆలోచన చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి, టీఆర్‌ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ నగరశాఖ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్సేనని చెప్పారు. ప్రజలసంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ గనుకనే ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. రాష్ర్టాన్ని దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే టీఆర్‌ఎస్ అనునిత్యం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు గుండెల్లో నిలుపుకొన్నారని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారెడ్డి, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ రమేశ్, నాయకులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.