Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రానున్నది నవశకం

-గురుకులాలతో పదేండ్లలో రాష్ట్రంలో విప్లవమే -మైనారిటీ సంక్షేమంలో దేశం చూపు తెలంగాణ వైపే -మన పిల్లలు నాసాకు వెళ్లిరావడం గర్వకారణం -అజ్మీర్ రుబాత్‌కు త్వరలో శంకుస్థాపన -అల్లా దయతో తెలంగాణ సిద్ధించింది -31 జిల్లాలవారితో ప్రత్యేక రైలులో -అజ్మీర్ వెళ్లి మొక్కు తీర్చుకుంటాం -దావతే ఇఫ్తార్‌లో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్

మైనారిటీల సంక్షేమం విషయంలో దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపు చూస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, ప్రత్యేకించి పేద మైనారిటీ పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ విద్యాసంస్థలను చాలా బాగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద పిల్లల గురుకులాల ద్వారా రాబోయే పదేండ్లలో తెలంగాణకు నవశకం రాబోతున్నదని, తద్వారా రాష్ట్రం కొత్త విప్లవానికి నాంది పలుకుతుందని చెప్పారు. దీనిని మీరంతా చూస్తారని అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దావతే ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన బాలబాలికలు నాసా పిలుపుమేరకు అమెరికా వెళ్లి రావడం గర్వించతగిన విషయమన్నారు. విద్యార్థులను ఈ స్థాయిలో తీర్చిదిద్దిన తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థ (టెమ్రీస్) చైర్మన్ ఏకేఖాన్, కార్యదర్శి షఫిఉల్లాలను సీఎం అభినందించారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నదని వివరించారు.

అల్లా అనుగ్రహంతో ముందంజ అల్లా దయతో తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. నాలుగేండ్ల క్రితం ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాటంచేశామని, ఆ అల్లాహా తాలా (భగవంతుడి)తో తెలంగాణ ఏర్పాటుచేయాలని ప్రార్థించేవారమని గుర్తుచేసుకున్నారు. మా సంకల్పం, లక్ష్యం తెలంగాణ సాధించడం. మా లక్ష్యం మంచి ఉద్దేశంతో కూడుకున్నది కనుకనే తెలంగాణ సాధనలో మాకు విజయం అందించాలని పదేపదే ప్రార్థించేవాళ్లం. ఆ భగవంతుడి ఆశీర్వాదం, అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం మనకు దక్కింది అన్నారు. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంది కనుకనే దేశంలోని 19 రాష్ర్టాలతో పోల్చుకుంటే అనేకరంగాల్లో, అనేక విషయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. ప్రతి విషయంలో ఆదర్శంగా నిలుస్తూ ముందుకు పోతున్నామన్నారు. ఉద్యమ సమయంలో అజ్మీర్ వెళ్లి తెలంగాణ ఇప్పించాలని మన్నత్ మాంగ్‌కర్ (మొక్కుకుని) వచ్చామన్న సీఎం.. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కనుక మరోసారి అక్కడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే 31 జిల్లాల ప్రజలను తీసుకుని, ప్రత్యేక రైలులో బ్రహ్మాండంగా అజ్మీర్‌కు వెళుతామని ప్రకటించారు.

అజ్మీర్ రుబాత్‌కు త్వరలో శంకుస్థాపన హైదరాబాద్ రాష్ట్రం నుంచి వెళ్లేవారికి ఉచిత వసతి కల్పించడానికి సౌదీ అరేబియాలోని మక్కాలో నిజాం రుబాత్ (గెస్ట్‌హౌస్)లను హుజుర్ నిజాం ఆనాడు ఏర్పాటుచేశారని కేసీఆర్ గుర్తుచేశారు. అలాగే తెలంగాణ నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌దర్గాకు వెళ్లే వారికోసం అక్కడ రుబాత్ నిర్మించేందుకు స్థలం కేటాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ దీనికోసం రాజస్థాన్ సీఎం, అక్కడి ప్రభుత్వంతో అనేక సంప్రదింపులు చేశారని చెప్పారు. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం తెలంగాణ రుబాత్ కోసం ఎకరం స్థలాన్ని అజ్మీర్‌లో కేటాయించిందన్నారు. త్వరలోనే ఎంపీ అసదుద్దీన్, ఇతర ప్రముఖులతో అజ్మీర్ వెళ్లి రుబాత్‌కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. రుబాత్ కోసం ఇప్పటికే రూ.5 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణ నుంచి అజ్మీర్‌కు వెళ్లే భక్తులకు అక్కడ నిర్మించబోయే తెలంగాణ రుబాత్‌లో వసతి కల్పిస్తామని చెప్పారు.

పదెకరాల్లో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌ను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నామని, దీనికోసం 10 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించామని సీఎం కేసీఆర్ చెప్పారు. నాంపల్లిలో అనీసుర్ గుర్బా (అనాథాశ్రమం) చాలా బాగా కడుతున్నామన్నారు, ఎస్సీ, ఎస్టీల్లో పేదలకు కల్పించే సౌకర్యాలను ముస్లింలకు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉందన్నారు. మైనారిటీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం యావత్ దేశానికి రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఏకంగా రెండువేల కోట్ల రూపాయల నిధులను బాజాప్తాగా బడ్జెట్‌లో కేటాయించిందని చెప్పారు. ఆ భగవంతుడి దయతో న్యాయబద్ధంగా అన్ని నిధులు మైనారిటీల సంక్షేమానికి ఈ ఏడాది ఖర్చు పెడుతామని పేర్కొన్నారు. గత నాలుగేండ్లుగా తాము ఇక్కడ పనిచేస్తున్నామని, ఏం చేస్తున్నామో, ఏం జరుగుతున్నదో మీరంతా మీడియాలో, ఇతర సాధనాల ద్వారా చూస్తున్నారని అంటూ.. మీకు అంతా తెలుసునని, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలనుద్దేశించి అన్నారు. అంతకుముందు వేదికపై మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మరికొందరు ముస్లిం ప్రముఖులకు సీఎం కేసీఆర్ ఖర్జూర పండ్లు తినిపించి ఇఫ్తార్ చేయించారు. మంత్రి హరీశ్‌రావు, అసదుద్దీన్ ఒకరికొకరు ఖర్జూర పండ్లు తినిపించుకున్నారు.

అనాథ బాలలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు అనీసుర్ గుర్బా అనాథ బాలలను కలిసిన సీఎం కేసీఆర్.. వారికి రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం అక్కడే ఇటీవల తమ ప్రాజెక్టు రిపోర్టును నాసా అంతరిక్ష కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించేందుకు అమెరికా వెళ్లి వచ్చిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులతో ముచ్చటించారు. నాంపల్లి వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న అనీసుర్ గుర్బా నమూనా చిత్రపటాన్ని ఏకేఖాన్, షహాన్‌వాజ్ హుస్సేన్‌లు సీఎంకు బహూకరించారు.

ఇంత అభివృద్ధి మరే రాష్ట్రంలో కనిపించదు: మహమూద్ అలీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేండ్లుగా రాష్ర్టాభివృద్ధికి కృషిచేస్తూ రాష్ర్టాన్ని ప్రగతిపథంవైపు నడిపిస్తున్నదని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ అన్నారు. దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉండటం మనందరికీ గర్వకారణమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. నేడు దేశంలో మన రాష్ట్రంలో ప్రజల మధ్య కనిపించే ప్రేమాభిమానాలు మరే రాష్ట్రంలో కనిపించవని మహమూద్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ప్రత్యేకించి రంజాన్ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు, మైనారిటీల సంక్షేమం విషయంలో సీఎం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ మరే రాష్ట్రంలో కనిపించవన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం, రాష్ట్ర అభివృద్ధికి, బంగారు తెలంగాణ నిర్మాణానికి అల్లాహాతో దువా చేయాలని ముఫ్తీలు, ఉలేమాలను ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, శాసనమండలి చైర్మన్ కే స్వామిగౌడ్, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు టీ హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మౌలానా ఖుపుల్ పాషా షుత్తారి, మక్కామసీదు ఖతీఫ్ హాఫెజ్ ఉస్మాన్, మౌలానా రిజ్వానుల్ ఖురేషి, వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్‌సలీం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్‌హుస్సేన్, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీఉల్లాఖాన్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫారుఖ్‌హుస్సేన్, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ మందా జగన్నాథం, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, తెలంగాణ ఉర్దూ అకాడమీ కార్యదర్శి ప్రొఫెసర్ ఎస్‌ఏ షుకూర్, సెట్విన్ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీబాక్రీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ సలహాదారు ఏకే ఖాన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జీఏడీ ప్రిన్సిపల్ కార్యదర్శి అధర్‌సిన్హా, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి దానకిశోర్, టెమ్రీస్ కార్యదర్శి షఫీఉల్లా, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ షహాన్‌వాజ్ ఖాసీం, వికారాబాద్ కలెక్టర్ సయ్యద్ ఉమర్‌జలీల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా తదితరులు పాల్గొన్నారు. చివరిలో అతిథులతో కలిసి సీఎం కేసీఆర్ విందు ఆరగించారు.

రంజాన్ శుభాకాంక్షలతో సీఎం షాయరీ ప్రసంగం చివర్లో కేసీఆర్ అందరికీ పవిత్ర రంజాన్ నెల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చాంద్ సే రోషన్ రోజా హో.. రంజాన్ తుమార్హా. ఇబాదత్ సే భరాహో రోజా తుమార్హా. రోజా అవుర్ నమాజ్ హో ఖుబుల్ తుమ్హారీ. యే హై అల్హాసే హై దువా హమారీ.. ఖుద్హాఫీజ్ (చంద్రుడి కంటే ఎక్కువ వెలుగునిచ్చే ఉపవాస దీక్ష మీది. రంజాన్ నెల మీది, భక్తిభావంతో నిండిన ఉపవాస దీక్ష మీది. మీ దీక్ష, నమాజు ఆమోదం కావాలి, ఇదే ఆ భగవంతుడితో మా ప్రార్థన.. నమస్తే.) అంటూ ఉర్దూలో షాయరీ వినిపించారు.

సోమాజీగూడలో గిఫ్ట్ ప్యాకెట్లు అందించిన సీఎం రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని పేద ముస్లింలకు ప్రభుత్వం అందజేస్తున్న గిఫ్ట్ ప్యాకెట్లను శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని సోమాజీగూడ వద్ద పంపిణీ చేశారు. కత్రియ హోటల్ సమీపంలోని సుభానీ మసీదు వద్ద డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో 500 గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు అనంతరం సీఎం తన నివాసానికి వెళుతూ మార్గమధ్యంలో సుభానీ మసీదు వద్ద ఆగి.. పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్లు అందించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని , మైనారిటీ సంక్షేమశాఖ సలహాదారు ఏకే ఖాన్, టీఆర్‌ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి తదితరులున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.