Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రద్దుల దిక్కా.. పద్దుల దిక్కా?

-బీజేపీ విధానం రద్దు.. ఆ పార్టీకి ఓటు వద్దు
-ఊడగొట్టే బీజేపీయా.. ఉద్యోగాల టీఆర్‌ఎస్సా..
-దొడ్డువడ్లు కొంటామని చెప్పి ఓట్లు అడగాలి
-కమలం పార్టీకి ఓటేస్తే పదేండ్ల ప్రగతి వెనక్కి
-సంక్షేమ టీఆర్‌ఎస్‌కు అండగా నిలవండి: మంత్రి హరీశ్‌రావు

వినూత్న పథకాలతో తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల బతుకుకు భరోసా ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న పథకాలను ఊడగొట్టి కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నది. కొత్త పథకాలతో సంపద సృష్టిస్తూ రాష్ట్రంలో 1.30 లక్షల ఉద్యోగాల కల్పన చేశాం. రద్దుల దిక్కుంటారో.. సంక్షేమ పద్దుల దిక్కుంటారో ప్రజలు ఆలోచించుకోవాలి’ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికుల బీమా రద్దు చేస్తే, అలాంటి పథకాన్ని మళ్ళీ తెచ్చేందుకు తెలంగాణ సర్కార్‌ ఆలోచిస్తున్నది. చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను తొలగించిన బీజేపీ విధానం రద్దు.. ఆ పార్టీకి ఓటేయొద్దు.

-మంత్రి హరీశ్‌రావు

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ఉద్యోగాలను ఊడగొడ్తున్నది. వినూత్న కార్యక్రమాలతో సంపద సృష్టిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. మరో 50 వేల ఉద్యోగాలకు రంగం సిద్ధం చేస్తున్నది.

సబ్బండ వర్ణాల ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వైపు ఉంటారా?, చేనేత కార్మికులకు వర్తించే అన్ని పథకాలను రద్దు చేసిన బీజేపీ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం రద్దు అంటే.. మనం వద్దు అనాలని చెప్పారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, హుజూరాబాద్‌ మండలాల్లో హరీశ్‌రావు పర్యటించారు. మొదట ఇల్లందకుంటలో రూ.27 లక్షలతో చేపట్టిన రేణుక ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేసి, గౌడ కులస్థులతో సమావేశమయ్యారు. జమ్మికుంటలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.10 కోట్లు, స్త్రీనిధి కింద రూ.కోటి, వడ్డీ లేని రుణాలు రూ.4.18 కోట్ల చెక్కులను అందజేశారు. అనంతరం జమ్మికుంట, వీణవంక మండలాలకు చెందిన చేనేత కార్మికులకు వివిధ పథకాల కింద వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు. సాయంత్రం హుజూరాబాద్‌లో ‘టీఎన్‌జీవో కృతజ్ఞత సభ’కు హాజరయ్యారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల బతుకు నిలబెడుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ కార్మికుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. ఆలిండియా హాండ్లూమ్‌ బోర్డును, 4 శాతం ఉన్న త్రిఫ్ట్‌ పథకాన్ని రద్దు చేసిందని మండిపడ్డారు. బీజేపీ సర్కారు 4 శాతం త్రిఫ్ట్‌ ఫండ్‌ను రద్దు చేస్తే.. సీఎం కేసీఆర్‌ 16 శాతం ఫండ్‌ను ఇస్తున్నారని గుర్తుచేశారు. బీజేపీ చేనేత కార్మికుల బీమా రద్దు చేస్తే.. అలాంటి పథకాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. చేనేత రుణమాఫీ, చేనేతమిత్ర, వర్క్‌షెడ్‌, టెస్కా, ఎక్స్‌గ్రేషియా, మరమగ్గాల అధునీకరణ, క్యాష్‌క్రెడిట్‌, రూ.30 కోట్లతో త్రిఫ్ట్‌ పథకాలను తెచ్చి కార్మికుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నామని పునరుద్ఘాటించారు. నేతన్నల కోసం కోకాపేటలో రూ.100 కోట్ల విలువజేసే రెండున్నర ఎకరాల భూమిని, భవన నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేసినట్టు గుర్తుచేశారు. జమ్మికుంట శత్రంజి సంఘానికి రూ.1.17 కోట్లు, బాలాజీ సంఘానికి రూ.32.90 లక్షలు, వినాయక మ్యాక్స్‌కు రూ.18.91 లక్షలు, వాసవి మ్యాక్స్‌ సంఘానికి రూ.13.49 లక్షల యార్న్‌ సబ్సిడీ చెక్కులు అందజేశారు. వీణవంక మండలం దేశాయిపల్లిలో 4 చేనేత సొసైటీలకు రూ.2.81 కోట్ల చెక్కులను అందజేశారు.

ఒకే ఏడాదిలో 50 వేల మందికి ప్రమోషన్లు
కేంద్రం పదేండ్లకు 15 శాతం పీఆర్సీ ఇస్తే రాష్ట్ర సర్కార్‌ ఐదేండ్లకే 30 శాతం పీఆర్సీ ఇచ్చిందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఒకే ఏడాదిలో 50 వేల మందికి ప్రమోషన్‌ ఇచ్చామని, దేశ చరిత్రలో ఇలాంటిది ఎక్కడా లేదని తెలిపారు. ఒక సూపర్‌ న్యూమరీ పోస్టు క్రియేట్‌ చేయడానికి టీఎన్జీవో ఉద్యోగులు గతంలో చెప్పులరిగేలా తిరిగేవారని, ఇప్పుడు గంటల్లోనే జీవోవిడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, అరూరి రమేశ్‌, కోరుకంటి చందర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, టీఎన్టీవోఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్‌ పాల్గొన్నారు.

హరీశ్‌రావు సమక్షంలో భారీగా చేరికలు
మంత్రి హరీశ్‌రావు సమక్షంలో నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇల్లందకుంట పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌, బీజేపీ నేత కందాల కొమురెల్లి మంత్రి హరీశ్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు ముశ్యం కాశీనాథ్‌, మారం రాజిరెడ్డి, చింతిరెడ్డి సమ్మిరెడ్డితోపాటు మరో 15 మంది నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీణవంకలో ఘన్ముక్ల గ్రామ మాజీ సర్పంచ్‌ రవియాదవ్‌, బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పరవేన రంజిత్‌, మరో 50 మంది బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

నోటికాడి బువ్వ లాక్కున్న బీజేపీ
కార్మికుల నోటికాడి బువ్వను లాక్కున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బతుకునిచ్చిందని చెప్పారు. గీతవృత్తిని ప్రోత్సహిం చేందుకు పల్లెప్రకృతి వనాల్లో ఈత, తాటి చెట్లు పెంచుతున్నామని, హైదరాబాద్‌లో కల్లు డిపోలు ప్రారంభించి లక్ష మందికి ఉపాధి కల్పించినట్టు చెప్పారు. చెట్టు పన్నుతోపాటు బకాయిలు రద్దు చేశామని, కార్మికులకు 50 ఏండ్లకే పింఛన్‌ ఇస్తున్నట్టు వివరించారు. బీజేపీ పథకాలను తొలగిస్తుంటే.. టీఆర్‌ఎస్‌ వంద పథకాలు తెచ్చి పాలన కొనసాగిస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు. కార్మికుల ప్రయోజనం కోసం నీరా పాలసీ తెచ్చిందని.. నీరా ప్యాకెట్లను విక్రయించేందుకు ద్విచక్ర వాహనాలను సైతం అందించే ఆలోచన చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. మొసలి కన్నీరు కారుస్తూ బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టకపోవడానికి కారణమెవరో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.