Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రగులుతున్న జవాన్‌.. కుంగుతున్న కిసాన్‌

-రైతుకు మద్దతు ధర దక్కడం లేదు
-అగ్నిపథ్‌లో జవాన్‌ కాలిపోతున్నడు
-వీటిని చక్కదిద్దడం చేతకాని కేంద్రం
-చెడును ఖండించాలి.. తప్పును విమర్శించాలి.. మంచిని ప్రశంసించాలి
-మరుగుజ్జులు ఏనాటికీ మహాత్ములు కాలేరు: గాంధీ విగ్రహావిష్కరణలో సీఎం
-కేంద్రం దుర్మార్గమైన ప్రచారాలు
-సమాజాన్ని చీలుస్తున్న చిల్లర శక్తులు
-మేధావి లోకం వీటిని ఖండించాలి
-తెలంగాణ కోసం బయలెల్లినప్పుడు ఈ బక్కపల్చనోడితో ఏమైతదన్నరు
-మనసులో మహాత్ముడినే తలుచుకొన్నా
-గాంధీ మార్గంలోనే రాష్ట్ర సాధన: కేసీఆర్‌

దేశాన్ని రక్షించే జవాన్‌ ఈ రోజు అగ్నిపథ్‌లో నలిగిపోతూ రగిలిపోతున్నడని.. దేశానికి అన్నం పెట్టే కిసాన్‌ మద్దతు ధర లేక కుంగిపోతున్నడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శాంతి, సౌభ్రాతృత్వాలను పెంచి పోషించిన మహాత్ముడినే కించపరిచే మాటలు ఇవాళ వింటున్నామన్నారు. శాంతి లేకపోతే ఆస్తులెన్ని ఉన్నా.. జీవితం ఆటవికంగా మారిపోతుందని స్పష్టంచేశారు. మరుగుజ్జులెప్పుడూ మహాత్ములు కాలేరని ఉద్ఘాటించారు. గాంధీ మార్గంలోనే తాను తెలంగాణ సాధించానని చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్‌ గాంధీ వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 16 అడుగుల ఎత్తయిన గాంధీ ధ్యానమూర్తి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ధ్యానమూర్తి రాష్ట్రానికే గర్వకారణం
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని, గాంధీ వైద్యశాల ఆవరణలో మహాత్ముడి విగ్రహాన్ని ధ్యానమూర్తి రూపంలో ప్రతిష్ఠింపజేయడం సంతోషంగా ఉన్నది. తలసానికి చిరస్థాయిగా ఈ కీర్తి దక్కుతుంది. విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎంచుకొన్న స్థలం కూడా చాలా గొప్పది. కరోనా ప్రపంచాన్నే దడదడలాడించిన సందర్భంలో మన రాష్ట్రంలో, రాజధాని నడిబొడ్డున ప్రజల ప్రాణాలను మేం కాపాడతామంటూ ధైర్యంగా పనిచేసిన ఆరోగ్య సంస్థ గాంధీ దవాఖాన. ఇక్కడి వైద్యులు, వైద్య బృందం, ఆనాటి సూపరింటెండెంట్‌, సిబ్బంది నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది అందరూ గాంధీ ఆదర్శాన్ని పుణికిపుచ్చుకొని హాస్పిటల్‌కు గాంధీ పేరును నిలబెట్టారు. కరోనాపై యుద్ధం చేశారు. పీపీఈ కిట్లు ఉన్నా, లేకున్నా చాలా ధైర్యంగా కరోనా రోగులకు సేవలందించి ఆదర్శంగా నిలిచారు. గాంధీ స్ఫూర్తిని తీసుకొని పనిచేసిన వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు, వైద్యసిబ్బందికి నా సెల్యూట్‌. గాంధీ ధ్యానమూర్తి విగ్రహావిష్కరణ రాష్ర్టానికే గర్వకారణం. ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి ఆరోగ్యంగా, శాంతితో, సౌభ్రాతృత్వంతో అద్భుతంగా పురోగమించాలని సర్వేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లుగా ధ్యానమూర్తి విగ్రహం ఉన్నది. గాంధీ పుట్టిన దేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యఫలం. మహాత్ముడు ప్రతిపాదించిన అహింస, శాంతి, ధర్మం, సేవ, త్యాగనిరతి.. సార్వజనీనమూ, విశ్వవ్యాప్తమూ, శాశ్వతమైన సిద్ధాంతాలు. సమస్త మానవాళి, శాంతితో, సౌభ్రాతృత్వంతో సుఖంగా జీవించాలనేది మహాత్ముడి ప్రవచనం. గాంధీ సిద్ధాంతం శాశ్వతం. దానిని ఎవరూ చెరిపివేయలేరు.

విశ్వమానవుడు గాంధీ
గౌతమ బుద్ధుడు, ఏసు క్రీస్తు కోవలో ప్రపంచాన్ని అహింసా సిద్ధాంతంతో ప్రభావితం చేసిన యుగపురుషుడు గాంధీ. ఆయన మానవోత్తముడు, విశ్వమానవుడు మహాత్మా గాంధీ. ప్రపంచవ్యాప్తంగా సమస్త మానవాళి రాచరిక వ్యవస్థల నేతృత్వంలో కత్తులు, కటార్లు, బరిసెలు పట్టుకుని కొట్టుకుసచ్చే సందర్భంలో.. అటువంటివి పనికిరావని చెప్పిన విశ్వమానవుడు. అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చాలా మంచి మాటలతో సందేశాన్నిచ్చి, గొప్ప మార్గాన్ని చూపిన వ్యక్తి. బ్రిటిష్‌ వాళ్ల దగ్గర తుపాకులున్నాయి, తూటాలున్నాయ్‌. మనం ఎదుర్కొగలమా? అని అడిగితే, ‘వి కెన్‌ షేక్‌ ద వరల్డ్‌’ అని చెప్పిన గొప్ప వ్యక్తి. కరుణ, ధైర్యం, ప్రేమ, ఆప్యాయతలతో దైన్యాన్ని, పేదరికాన్ని, అసహాయతను ఎదుర్కొనవచ్చని చెప్పిన మహానీయుడు. అందుకే ఆయనను మహాత్మా అని సంబోధించాడు రవీంద్రనాథ్‌ఠాగూర్‌. బాపూజీ అంటూ నోరారా పిలిచారు అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను నిర్మించిన సుభాష్‌చంద్రబోస్‌. మహాత్మా గాంధీ అహింసతో స్వాతంత్య్రాన్ని సాధిద్దామని ప్రతిపాదించారు. అదేకాలంలో సుభాష్‌ చంద్రబోస్‌ అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను నిర్మించారు. ఒక సందర్భంలో గాంధీ అహింస అంటున్నారు. మీరేమో మిలిట్రీ స్థాపిస్తున్నారు.. దీనికి మీ సమాధానం ఏంది? అని విలేకరులు అడగ్గా అప్పుడు సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పిన గంభీరమైన మాట చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ‘నేను కూడా మహాత్మాగాంధీని బాపూజీగా భావిస్తాను. నేనూ ఆయన శిష్యుడినే. అభిమానినే. గాంధీ పంథాలోనే, అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్య్రం రావాలని గుండెల నిండుగా కోరుకుంటున్నా. ఒకవేళ ఆ ప్రక్రియ విఫలమైతే స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపేందుకే సైన్యాన్ని తయారు చేస్తున్నాను తప్ప, గాంధీకి భిన్నమైంది కాదు’ అని చెప్పిన మహనీయుడు బోస్‌. అనేక మతాలు, జాతులు, భిన్న సంస్కృతులు, వేషభాషలు, ఆహారాలు, ఆహార్యాలు ఉండే భారతంలో.. ప్రతి భారతీయుడిలో స్వాతంత్య్ర కాంక్షను, స్వేచ్ఛను రగిలించి యావత్‌ భారతాన్ని కుల, మత, వర్గ రహితంగా స్వాతంత్య్ర సమరం వైపు నడిపించిన సేనాని మహాత్మా గాంధీ. కుల మత భేదభావాలు లేకుండా జాతి స్వాతంత్య్రమే లక్ష్యంగా మనమంతా ముం దుకు పురోగమించాలని చెప్పి, అనేక సంస్కృతుల సమ్మేళనంగా స్వాతంత్య్ర సమరాన్ని సాగించిన గొప్ప వ్యక్తి మహాత్మాగాంధీ.

జవాన్‌ నలిగిపోతున్నడు.. కిసాన్‌ నశించి పోతున్నడు
జై జవాన్‌- జై కిసాన్‌ పిలుపునిచ్చిన మాజీ ప్రధాని, నిస్వార్థ సేవాపరుడు, గొప్ప ధీరుడు, చైనా, పాకిస్థాన్‌తో యుద్ధాలను ఎదుర్కొని దేశాన్ని రక్షించిన మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌శాస్త్రి జయంతి కూడా ఇదే రోజు. ఆయన కూడా గాంధీ శిష్యుడే. ఆయన ప్రేరణతోనే పైకొచ్చి అనేక రంగాల్లో విజయం సాధించారు. అద్భుతమైన నినాదాన్ని చేశారు. దేశాన్ని రక్షించేవాడు జవాన్‌ అయితే.. దేశానికి అన్నంపెట్టే వాడు కిసాన్‌ అని చెప్పి.. ‘జై జవాన్‌- జై కిసాన్‌’ నినాదాన్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు మన కండ్ల ముందే దేశంలో ఏం జరుగుతున్నదో ఆలోచించాలి. సమకాలీన సమాజంలో మనం భాగస్వాములం కాబట్టి మన బాధ్యత కూడా ఉంటది. మనం మౌనం పాటించకూడదు. చెడును ఖండించాలి. తప్పును విమర్శించాలి. మంచిని ప్రశంసించాలి. ప్రోత్సహించాలి. అప్పుడే ఈ సమాజానికి ఆరోగ్యం. శాస్త్రి ప్రవచించిన జై జవాన్‌ ఈ రోజు అగ్నిపథ్‌లో నలిగిపోతున్నడు.. రగిలిపోతున్నడు. జై కిసాన్‌.. మద్దతు ధర లేక కృశించిపోతున్నడు. అనేక ఆత్మహత్యలు జరుగుతున్నవి. అయినప్పటికీ.. మేధావిలోకం మొత్తం దాన్ని ఎక్కడికక్కడ ఖండించి ముందుకు పోవాలి.

శాంతి లేకుంటే.. జీవితం ఆటవికమే
మహాత్ముడిని స్మరించుకొనే అవకాశం లభించినప్పుడు ప్రస్తుత సమకాలీన సమాజం పోకడలు, వైరుధ్యాలను కూడా మనమంతా ఆలోచన చేయాలి. నన్ను చాలామంది మిత్రులు.. ‘ఏంది కేసీఆర్‌..! ఈ మధ్య కొంచెం భిన్నంగా మాట్లాడుతున్నవ్‌.. ఎక్కడ మాట్లాడినా ఒక రకమైన వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నవ్‌.. ఎందుకలా మాట్లాడుతున్నవ్‌?’ అని అడిగారు. దేశం, సమాజం బాగుంటేనే.. శాంతి సామరస్యాలు ఉంటేనే మనమంతా సుఖవంతమైన జీవితం గడపగలుగుతాం. ఎన్ని ఆస్తులున్నా, అంతస్తులున్నా శాంతి లేనినాడు జీవితం ఆటవికమైతది. శాంతి, సౌభ్రాతృత్వంతో విలసిల్లే భారత దేశంలో మహాత్ముడినే కించపరిచే మాటలు వింటుంటే చాలా దుఃఖం కలుగుతది. సమాజాన్ని చీల్చే కొన్ని చిల్లర మల్లర శక్తులు చేస్తున్న ప్రయత్నాలన్నీ మీకు తెలుసు. వెకిలి వ్యక్తులు చేసే వెకిలి ప్రయత్నాల వల్ల మహాత్ముడి ప్రభ తగ్గదు. మరుగుజ్జులు ఏనాటికీ మహాత్ములు కాలేరు. ఏనాటికైనా.. ఏ రోజుకైనా విశ్వమానవుడైన గాంధీ చెప్పిన సిద్ధాంతమే విశ్వజనీనమై శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గాంధీజీ విగ్రహాన్ని అందజేస్తున్న పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌. చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌

గాంధీ అడుగుజాడల్లో ఎందరో
ఆయన ఏం చెప్పినా.. చేసినా అదొక సందేశమే. చరఖా చేపట్టినా, నూలు వడికినా, చీపురు పట్టి మురికి వాడలు శుభ్రం చేసినా అద్భుతమే. ప్రతి మాట, ప్రతి అడుగు అనుక్షణం ఆచరణాత్మకంగా ఉండేది. నెహ్రూ, పటేల్‌, అబుల్‌ కలాం ఆజాద్‌ వంటి ఎందరో గాంధీజీ నుంచి ప్రేరణ పొందారు. వాళ్లు ఎంత ధనవంతులైనప్పటికీ.. ఆయన బాటలో నడిచారు. గాంధీ న్యాయవాది అయినప్పటికీ, తన ఆస్తిని, కుటుంబాన్ని త్యాగం చేసి, పోరాటం చేసి.. జైలు పాలవుతున్న ఘటనలను చూసి స్ఫూర్తి చెంది ఎందరో స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యారు. వారు అందించిన స్వేచ్ఛా వాయువులే ఈ రోజు మనం అనుభవించే 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రం.

ఆయన చిరస్మరణీయుడు..
నేను పార్లమెంట్‌ మెంబర్‌గా ఉన్న సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మన దేశానికి వచ్చారు. పార్లమెంట్‌లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం మొదట్లోనే ఆయన ‘గాంధీ అనే వ్యక్తి ఈ భూగోళంపై పుట్టి ఉండకపోతే బరాక్‌ ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’ అని చెప్పారు. ఒబామా మాటలు స్వయంగా వినే అదృష్టం అప్పుడు నాకు కలిగింది. మరో సందర్భంలో 2009లో అమెరికాలో ఓ సమావేశంలో బరాక్‌ ఒబామాను ఓ విద్యార్థి ‘మరణించిన వారిలో గానీ, జీవించి ఉన్నవారిలో ఎవరితో కలిసి భోజనం చేయాలనే కోరిక ఉన్నది?’ అని అడిగారు. అప్పుడు ఒబామా ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ‘ఒకవేళ అవకాశమే ఉంటే.. ఆయన లేరు కానీ ఉంటే మాత్రం మహాత్మాగాంధీతో కలిసి భోజనం చేయడాన్ని కోరుకొంటున్నా’ అని చెప్పారు. ఆయనను ఐక్యరాజ్య సమితి ‘పర్సన్‌ ఆఫ్‌ ది మిలీనియం’గా ప్రకటించింది. వెయ్యి సంవత్సరాల్లో ఇంతటి మహాత్ముడు మరొకరు పుట్టలేదని ప్రకటించింది. యూఎన్‌వోలో ఎప్పుడో 80 ఏండ్ల క్రితం గాంధీ చేసిన ప్రసంగాన్ని టెక్నాలజీ సాయంతో ఇటీవలే వివిధ దేశాధినేతలు వీక్షించారు. అనేకరకమైన పద్ధతులు, అహింసా సిద్ధాంతం ప్రబోధించిన మహాత్ముడు మనకు ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు, సదాస్మరణీయుడు. 153 సంవత్సరాల క్రితం పుట్టిన గాంధీ అద్భుతమైన ఆచరణాత్మక, శాంతియుత, అహింసా సిద్ధాంతాన్ని మనకు అందించారు. ఆ బాటలో మన దేశం నేటి వరకు నిలబడి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకు నిలబడుతున్నది. విశ్వసామరస్య విజ్ఞాన సంధాత గాంధీ తాతగారికి మన రాష్ట్రం పక్షాన మరోసారి హృదయ పూర్వక అంజలి ఘటిస్తున్నాను.

గొప్ప గొప్పోళ్లకు స్ఫూర్తి ప్రదాత
స్వతంత్ర వజ్రోత్సవాలు దేశమంతా ఒకవిధంగా జరుగుతుంటే, తెలంగాణలో 15 రోజుల పాటు మహాత్మాగాంధీని స్మరించుకొంటూ కార్యక్రమాలు నిర్వహించాం. గాంధీ జీవితంపై అటెన్‌బరో తీసిన చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించాం. దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు చిత్రాన్ని వీక్షించారు. గాంధీ జీవితాన్ని, పోరాటాన్ని వారంతా తెలుసుకొని ఆదర్శంగా తీసుకొనేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప నేతలు గాంధీని అనుసరించారు. అభిమానించారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ లాంటి వ్యక్తి.. ‘జీసెస్‌ నాకు సందేశం ఇస్తే.. గాంధీ నాకు ఆచరణలో చూపించారు. నేను ఆ మార్గాన్ని అనుసరిస్తున్నా’ అని చెప్పారు. ‘మానవతావాదాన్ని సంపూర్ణంగా తెలుసుకొన్న గాంధీజీ నాకు ఆదర్శప్రాయుడు’ అని దలైలామా చెప్పారు. ‘ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ ధరిత్రిపై నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మవేమో’ అని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ చెప్పారు. మార్టిన్‌ లూథర్‌కింగ్‌ మొదలు నెల్సన్‌ మండేలా వరకు మహాత్ముడి ఆచరణాత్మక సిద్ధాంతమే పోరాటాలకు దారి చూపింది. సంకెళ్ల నుంచి విముక్తి కల్పించింది.

గాంధీయే నాకు ప్రేరణ
తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు నన్ను చాలా ఎగతాళి చేశారు. ఈ బక్కపల్చనోడు ఏం చేస్తడు.. వీడితో ఏమైతదని అవహేళన చేసినవాళ్లున్నరు. వాళ్ల దూషణలు, హేళనలు వినాల్సి వచ్చినప్పుడు నేను కండ్లు మూసుకొని మహాత్మాగాంధీని తలచుకొనేవాడిని. ఆయన చూపిన ఆచరణలోనే మనం తెలంగాణ సాధించుకొన్నాం. అదే బాటలో ముం దుకు పోతున్నాం. మహాత్ముడు చెప్పిన పారిశుద్ధ్యం కోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేసినం. అనేక అవార్డులను అందుకొంటున్నం. ఈ కార్యక్రమాలకు గాంధీయే ప్రేరణ.

గాంధీ విలువ మరింత పెరిగింది
మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
మహాత్మాగాంధీ ఆదర్శాలు, భావజాలం గతంలో కంటే ఇప్పుడు మనకు ఇంకా ఎక్కువ అవసరమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శాంతి, సామరస్యం ప్రబోధించిన గాంధీ శాంతిదూత అని నివాళి అర్పించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.