Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాహుల్‌వి పచ్చి అబద్ధాలు

-స్క్రిప్టు చదువటం కాదు.. వాస్తవాలు తెలుసుకోవాలి
-రాహుల్ ఆరోపణలను తూర్పారబట్టిన మంత్రి కేటీఆర్
-తప్పుడు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని హితవు
-అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు ఆదిలాబాద్‌లో ఉంది
-ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పింది
-1.09 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి
-87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం
-32 వేల ఉద్యోగాల భర్తీ పూర్తయింది
-మిగిలినవాటి భర్తీని అడ్డుకున్నది కాంగ్రెస్సే
-రాష్ర్టానికి మోదీ, రాహుల్ తీరని అన్యాయంచేశారు
-అంబేద్కర్ పట్ల నిర్లక్ష్యం.. పీవీకి అవమానం
-మేం పీవీ పేరును యూనివర్సిటీకి పెట్టాం..
-వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటుచేశాం
-తెలంగాణ తరహాలోనే కర్ణాటకలో రుణమాఫీ
-రాహుల్‌కు ఆ విషయం కూడా తెలియదు
-2007లో 17వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాణహిత- చేవెళ్ల
-2008లో రూ.38,200 కోట్లకు, 2010లో రూ.40,300 కోట్లకు పెంపు..
-కాంగ్రెస్ హయాంలోనే అంచనా వ్యయం పెరిగింది: మంత్రి కేటీఆర్

తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నీ అసత్యాలు, అర్ధసత్యాలే మాట్లాడారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆయనకు తెలంగాణపై కనీస అవగాహన లేదని అన్నారు. ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదువటంకాకుండా.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాహుల్‌కు హితవుపలికారు. ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు తొలిగించారని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. రాహుల్, నరేంద్ర మోదీ ఇద్దరూ దేశాన్ని వంచించారని, తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాగా వేయడానికి కాంగ్రెస్ అనే వృద్ధ జంబూకం ప్రయత్నాలు చేస్తున్నదని ఎద్దేవాచేశారు. శనివారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు తొలిగించారంటూ రాహుల్ కుసంస్కారంతో, దుర్మార్గంగా మాట్లాడారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో రూపొందించిన ప్రాజెక్టులనుంచి సాగు, తాగునీరు శరవేగంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ డిజైన్లలోని తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నంలో చాలా ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ రిటైర్డ్ ఇంజినీర్ల సహకారంతో రీడిజైన్ చేయించారని తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు కొనసాగుతున్నదని, అది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నదన్న విషయాన్ని రాహుల్ తెలుసుకోవాలని సూచించారు. రాహుల్ తన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన కేటీఆర్.. ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.

అంబేద్కర్‌ను గౌరవించని కాంగ్రెస్
అంబేద్కర్ మరణించిన 34 ఏండ్ల తర్వాత ఆయనకు భారతరత్న అవార్డు దక్కిందన్న కేటీఆర్.. రాజ్యాంగ రచయితకు ఆ గౌరవాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో భారతరత్న ఇచ్చారని గుర్తుచేశారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ గుర్తించలేదనటానికి ఇదే నిదర్శనమని చెప్పారు. విజ్ఞతతో ఆలోచించాలని, ఏదిపడితే అది మాట్లాడవద్దని, చేసిన వ్యాఖ్యలను సవరించుకోవాలని రాహుల్‌కు సూచించారు. కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి జవసత్వాలు కల్పించి, దేశ ప్రధానిగా పనిచేసి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తెలుగు, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానించిందని కేటీఆర్ విమర్శించారు. పీవీ చనిపోతే ఆయన పార్థివదేహాన్ని కనీసం కాంగ్రెస్ కార్యాలయంలోకి కూడా తీసుకుపోనివ్వలేదని గుర్తుచేశారు. మాజీ ప్రధానులు అందరికీ ఢిల్లీలో ఘాట్లు, స్తూపాలు ఉంటే.. పీవీకి మాత్రం లేదని చెప్పారు. హైదరాబాద్‌లో పీవీ అంత్యక్రియలను కూడా సరిగా నిర్వహించలేదని, ఆయన భౌతికకాయం పూర్తిగా కాలకుండా నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటన్నింటినీ తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. కాంగ్రెస్ ఇలాంటి నీచమైన, కుసంస్కారమైన పార్టీ అన్నారు. కానీ నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్ పాలనలో పార్టీపరమైన తేడాలు చూడకుండా పీవీ నరసింహారావు పేరును ఒక యూనివర్సిటీకి పెట్టామని, వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ మీద స్థాపించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఏనాడూ ఉచ్ఛరించని కుమ్రంభీం పేరును కొత్త జిల్లాకు పెట్టామని, జయశంకర్, కొండాలక్ష్మణ్ పేర్లు యూనివర్సిటీలకు పెట్టామని తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు.

సాగునీటి ప్రాజెక్టులపై లెక్కలతో మాట్లాడాలి
సాగునీటి ప్రాజెక్టుల గురించి రాహుల్‌గాంధీ లెక్కలతోసహా మాట్లాడితే మంచిదని కేటీఆర్ సూచించారు. కాళేశ్వరం విషయంలో రాహుల్ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును రూ.17 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారని, అదే ప్రాజెక్టుకు 2008లోనే రూ.38,200 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారని చెప్పారు. 2010లో సీఎంగా రోశయ్య ఉన్నప్పుడు రూ.40,300 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారని గుర్తుచేశారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందనే విషయాన్ని రాహుల్ గుర్తుంచుకోవాలన్నారు. తాజాగా కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ తుది అంచనా వ్యయం రూ.80,190 కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ అంచనా వ్యయం పెరుగటానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టుగానే 2013 భూసేకరణ చట్టంతో అంచనా వ్యయం కూడా భారీగా పెరిగిందన్నారు. ఈ చట్టానికి ముందు ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు పరిహారం చెల్లిస్తే.. ఆ తరువాత ఎకరానికి రూ.6 నుంచి రూ.12లక్షల వరకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రిజర్వాయర్ల సామర్థ్యం 16 టీఎంసీలు మాత్రమే ఉండగా రీడిజైన్‌లో పదిరెట్లు.. అంటే 160 టీఎంసీలకు పెంచామన్నారు. వీటితోపాటుగా మూడు బరాజ్‌లు, మూడు పంపుహౌస్‌లు అదనంగా నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ నిండుకుండలా ఉండాలని, రెండుమూడేండ్లు కరువు వచ్చినా ఇబ్బంది ఉండకూడదని తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. వీటన్నింటితోపాటు పెరిగిన ధరలు, జీఎస్టీ తదితరాలతో అంచనా వ్యయం పెరిగిందని వివరించారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగడంలేదా? 2010లో ఉన్న అంచనా వ్యయమే 2018లో కూడా ఉంటుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అబద్ధాలతో ఆరోపణలు చేయడానికి రాహుల్‌కు సిగ్గుగా అనిపించడంలేదా? అని నిలదీశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అవినీతి, దోపిడీ అంటూ మాట్లాడటం సరికాదన్నారు.

ఉద్యోగాలపై తెలుసుకుని మాట్లాడాలి
ఉద్యోగ కల్పన విషయంలోనూ రాహుల్ పూర్తి అసత్యాలు మాట్లాడారని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో స్వల్పకాలంలో 1.09 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందని రాహుల్ తెలుసుకోవాలన్నారు. ఇందులో 87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, వాటిలో 32 వేల ఉద్యోగాల భర్తీ పూర్తయిందని చెప్పారు. ఈ విషయాలు తెలుసుకోకుండా పదివేల ఉద్యోగాలే భర్తీచేశారనటం దుర్మార్గమైన, కుసంస్కార చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. మిగిలిన ఉద్యోగాలు భర్తీకాకుండా కోర్టు కేసులతో సైంధవ పాత్ర పోషించింది కూడా కాంగ్రెస్‌పార్టీయేనని విమర్శించారు. ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కిందే రాహుల్‌గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ అని చెప్పారు. ఆమె తెచ్చిన 371 డీని కూడా సరిగా అమలుచేయలేదన్నారు. తెలంగాణ యువత అభిప్రాయాలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తం అన్న సామెత మరోసారి గుర్తుకు వస్తున్నదని చెప్పారు.

హిందూముస్లింలను వేరు చేసే కుట్ర
తెలంగాణలో హిందువులను, ముస్లింలను వేరుచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని కేటీఆర్ విమర్శించారు. మైనార్టీలను ఓట్లు వేసే యంత్రాలుగా కాంగ్రెస్ చూసిందన్నారు. కానీ.. టీఆర్‌ఎస్ ఆ విధంగా ఏనాడూ చూడలేదని చెప్పారు. ఢిల్లీలో 2733 మంది సిక్కులను ఊచకోతకోశారు. దీనిపై కాంగ్రెస్ ఏనాడైనా క్షమాపణ చెప్పిందా? జగదీశ్‌టైట్లర్ ఉదంతంపై కనీసం విచారం వ్యక్తం చేసిందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు చార్మినార్ దగ్గర సద్భావన గురించి రాహుల్ మాట్లాడుతున్నారన్న కేటీఆర్.. 1989లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి తనను గద్దె దించడానికి పాతబస్తీలో అలర్లు సృష్టించారని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి సంస్కృతి వారిదని, ఇప్పుడు రాహుల్‌గాంధీ నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కర్ఫ్వూ అన్నారు. ఇప్పుడు అవార్డు పొందిన రోశయ్య హయాంలోనే నాలుగురోజులు కర్ఫ్యూ విధించిన సంగతిని ప్రస్తావిస్తూ.. టీఆర్‌ఎస్ పాలనలో ఒక్క గంట కూడా కర్ఫ్యూ పెట్టలేదని చెప్పారు. తాము అన్ని వర్గాలను కలుపుకొనిపోతున్నామని తెలిపారు.

తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పింది
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రాహుల్ చెప్పడాన్ని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ మాటలు మాట్లాడటానికి రాహుల్‌కు సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ దేశాన్ని యాభై ఏండ్లు పరిపాలించింది కాంగ్రెస్. ఈ రోజు రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్ బాధితులు మీకు గుర్తుకొచ్చారు. ఇక్కడి ప్రజలు గల్ఫ్‌కు పోవటానికి రాష్ట్రాన్ని 50 సంవత్సరాలకు పైగా పాలించిన కాంగ్రెస్ కారణం కాదా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు వారికి ఉద్యోగాలు కల్పించి ఉంటే వారు గల్ఫ్‌కు పోయేవారా? అంటూ నిలదీశారు. నాలుగేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును 90% పూర్తిచేశామని, కానీ ఎస్సారెస్పీలాంటి ప్రాజెక్టు పనులను కాం గ్రెస్ 2014 వరకు చేసిందని చెప్పారు. దీన్నిబట్టి కాంగ్రెస్ పాలన అసమర్థత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తెలంగాణకు న్యాయంగా వాటా వచ్చి ఉంటే రైతుల ఆత్మహత్యలు ఉండేవా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. 2014లో 1347 మంది, 2015లో 1400 మంది చనిపోతే.. 2016లో 645 మంది మాత్రమే చనిపోయారని లెక్కలతోసహా వెల్లడించారని చెప్పారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయనడానికి ఇదే నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కూడా అడ్డుతగిలింది కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ విమర్శించారు. చనిపోయినవారి పేరుమీదుగా కేసులువేసి తెలంగాణ రైతుల కడుపు కొడుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగానికి కన్నీళ్లను మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీ మరోసారి అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న కేటీఆర్.. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. 2009లో కాంగ్రెస్ ఆరుగంటలు కూడా రైతులకు కరంటు ఇవ్వలేదన్నారు. రైతుబంధులాంటి విప్లవాత్మక కార్యక్రమాలను అమలుచేయాలన్న ఆలోచన ఏనాడైనా కాంగ్రెస్‌కు వచ్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాలమూరు జిల్లాలో వలసలు వాపస్ వస్తున్నాయని తెలిపారు. నాలుగేండ్లలో 25 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. రైతుకు సమృద్ధిగా నీరు, కరంటు, పంట పెట్టుబడి అవసరమన్న కేటీఆర్.. రాష్ట్ర రైతాంగానికి అన్ని రకాలుగా అండగా ఉన్నాం కాబట్టే ఆత్మహత్యలు తగ్గుముఖంపట్టాయని చెప్పారు. కర్ణాటకలో ఏ విధంగా రుణమాఫీ చేశామో.. ఇక్కడ కూడా అదే విధంగా రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పడాన్ని కేటీఆర్ ఎద్దేవాచేశారు. కర్ణాటకలో అమలవుతున్నది తెలంగాణ తరహా విధానమే అనే విషయం రాహుల్‌గాంధీ తెలియదేమోనన్నారు. తప్పులను సవరించుకుంటే ఆయనకే మంచిదని హితవు చెప్పారు.

తెలంగాణకు రాహుల్, మోదీ అన్యాయం
మోదీకి దగ్గరయ్యారంటూ కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్కారవంతంగా మాట్లాడితే మంచిదని రాహుల్‌నుద్దేశించి అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశాన్ని వంచించారని, తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. వారిద్దరూ ఒకే తాను ముక్కలన్నారు. నాలుగేండ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్న విషయాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలని కోరారు. మత సామరస్యాన్ని ఎలా కాపాడుకుంటూ వెళుతున్నామో రానున్న కాలంలోనూ అదే విధంగా ముందుకుపోదామని చెప్పారు. టీఆర్‌ఎస్ ఎప్పుడూ ఇంటికో ఉద్యోగం అనే హామీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. అది చంద్రబాబు ఇచ్చిన హామీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థని చెప్పారు. బీజేపీకి అన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా లేరని, 100కు పైగా స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని అన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టాంకాం చైర్మన్ రంగారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు.

వాస్తవాలు తెలుసుకోవాలి
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్‌తో అనేక అవాస్తవాలు చెప్పించారు. తెలంగాణలో ఇప్పటికే మిషన్ భగీరథలో నీళ్లిస్తున్న గ్రామాలకు వెళ్లి చూడాలి. కుమ్రంభీంను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందనడం విడ్డూరం. కొత్త జిల్లాకు ఆయన పేరు పెట్టిన విషయం తెలియదా? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చలేదు. ఇప్పటికీ డాక్టర్ అంబేద్కర్ పేరుమీదే ఉంది.
– వినోద్‌కుమార్, ఎంపీ

అబద్ధాలకంటే ముందే కాంగ్రెస్ పుట్టింది
రాష్ట్ర నాయకులు రాసిచ్చిన ప్రసంగాన్ని చదువుతూ ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు కనీస అవగాహన లేకుండా మాట్లాడటం దురదృష్టకరం. అబద్ధాలకంటే ముందుగానే కాంగ్రెస్ నేతలు పుట్టినట్టుగా ఉన్నారు. కేసీఆర్ ఏనాడూ ఇంటికో ఉద్యోగం అని అనలేదు. అలా అన్నది రాహుల్ కొత్త ఫ్రెండ్ చంద్రబాబే. తెలంగాణలో 94 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.
– కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ

రాహుల్.. ఈ నోట్ల కట్టలేంది?
టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పరిస్థితి పాము నోట్లో ఇరుక్కున్న కప్పలాగా తయారయింది. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసేందుకు చంద్రబాబు నోట్ల కట్టలు పంపుతూ దొరికిపోయారు. తాజాగా దొరికిన డబ్బులపై రాహుల్ సమాధానం చెప్పాలి. టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మ్యానిఫెస్టోను విడుదల చేస్తే కాంగ్రెస్ దుకాణం మూసు కోవాల్సిందే.
– గట్టు రాంచందర్ రావు, టీఆర్‌ఎస్ కార్యదర్శి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.