Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతే ధర నిర్ణయించాలి

-అప్పుడే వ్యవసాయం లాభసాటి.. -ఆర్థికశక్తిగా రాష్ట్ర రైతు సమాఖ్య -అన్నదాతల భాగస్వామ్యాలతో గ్రామరైతు సంఘాల ఏర్పాటు.. -తనను కలిసిన నేతలతో సీఎం కేసీఆర్

రాష్ట్ర రైతు సమాఖ్యను ఆర్థికశక్తిగా మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులకు మంచి ధర ఇచ్చే విషయంలో, పండించిన పంటను ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి రాష్ట్ర రైతు సమాఖ్య అండగా నిలబడుతుందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాలి.

వ్యవసాయం లాభసాటిగా మారాలంటే ధాన్యం ధరను నిర్ణయించే శక్తి రైతులకే ఉండాలి. రైతు శక్తిమంతుడు కావాలంటే రైతు సంఘాలకు విశేష అధికారాలు కావాలి. అందుకే రైతులంతా కలిసి గ్రామ రైతు సమాఖ్యలుగా ఏర్పాటుకావాలి. గ్రామ, మండల, జిల్లా రైతు సమాఖ్యల కలయికతో ఏర్పడిన రాష్ట్ర రైతు సమాఖ్యను ఆర్థికశక్తిగా మారుస్తాం. రూ.500 కోట్ల బడ్జెట్‌తో మూలనిధిని ఏర్పాటు చేసి రాష్ట్ర రైతు సమాఖ్య ఖాతాలో వేస్తాం. దీనికితోడు బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశాన్ని కల్పిస్తాం. రైతును శక్తిమంతుడిగా మారుస్తాం అని పేర్కొన్నారు. రైతుకు మేలు చేసేందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ చెప్పారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విషయంలో రైతు సంఘాలకు అధికారాలు ఉంటాయన్నారు. రైతులు కనీస మద్దతు ధర కంటే కొంచెం ఎక్కువగా వచ్చినప్పుడే సరుకును మార్కెట్లో అమ్ముకోవాలని, లేదంటే రైతు సంఘాలకే పర్మిట్లు ఇచ్చి ప్రాసెసింగ్ (మిల్లింగ్) చేసే హక్కు కల్పిస్తామన్నారు. ఈ మేరకు రైతుల భాగస్వామ్యంతో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలలో రైతు సమాఖ్యలను ఏర్పాటు చేస్తామని వివరించారు.

సర్వే తర్వాత రైతు సమాఖ్యల ఏర్పాటు ప్రస్తుతం వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో భూములు, రైతుల వివరాలను నమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమం ముగిశాక గ్రామ రైతు సమాఖ్యలను ఏర్పాటుచేస్తామని, తరువాత మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యల ఏర్పాటు చకచకా జరుగుతుందన్నారు. వ్యవసాయానికి సంబంధించి ప్రతి దశలోనూ రైతు సంఘాలు ఎక్కడికక్కడ చొరవ తీసుకొని అన్నదాతకు మేలుచేసే కార్యక్రమాలను సమన్వయం చేస్తాయన్నారు. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలుచేసే విషయంలో, పరస్పర సమన్వయంతో రైతులు నిర్వహించుకునే వ్యవసాయ విధానాల్లో రైతు సంఘాలు సహాయకారిగా ఉంటాయన్నారు. రైతుకు ఎకరానికి రెండు పంటలకుగానూ రూ.8 వేల పెట్టుబడి కల్పించడం వల్ల రైతులు అప్పుల ఊబిలోకి వెళ్లే ప్రమాదం తప్పుతుందని సీఎం పేర్కొన్నారు.

ఎస్సారెస్పీ కాలువలు మరమ్మతు చేసుకోండి సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, వచ్చే ఏడాదికి కాళేశ్వరం పంప్‌హౌజ్‌ల నుంచి గోదావరి నీటిని తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఎంఎండీ(మిడ్ మానేరు డ్యామ్), ఎల్‌ఎండీ(లోయర్ మానేరు డ్యామ్)ల ద్వారా వరంగల్ జిల్లాకు నీళ్లు చేరుకుంటాయన్నారు. మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల వరకు ఉన్న ఎస్సారెస్పీ కాలువలన్నీ మరమ్మతు చేసుకోవాలని సూచించారు. ఎల్‌ఎండీ దిగువన కూడా 8వేల నుంచి 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నీటి ప్రవాహం ఉండేందుకు అనువుగా ఎస్సారెస్పీ కాలువలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. త్వరలోనే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఎస్సారెస్పీ కాలువలను పరిశీలిస్తారని కేసీఆర్ తెలిపారు. కాలువల మరమ్మతుకు అవసరమైన నిధులను కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, రైతులు, ప్రజాప్రతినిధులు కాలువల మరమ్మతుల విషయంలో శ్రద్ధ చూపాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్, మాజీ ఎమ్మెల్యే కవిత, సీనియర్ నాయకులు రామసహాయం రంగారెడ్డి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, రైతు నాయకులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.