తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉచితంగా ఎరువులు వచ్చే ఏడాది నుంచి అమలు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం -ఎకరానికి 4వేల చొప్పున సహాయం.. పైరవీలు లేకుండా నేరుగా ఖాతాల్లో నగదు -ప్రతి ఏటా మే నెలాఖరుకల్లా రైతు ఇంట్లో ఎరువులు.. ఏడాదికి 6-7వేల కోట్ల భారం మోస్తాం -రైతు పెట్టుబడి భారాన్ని పంచుకోవడమే లక్ష్యం.. గ్రామాల్లో వేల కోట్ల సంపదను సృష్టించాలి -రైతు బాగుపడితేనే బంగారు తెలంగాణ.. గ్రామాల్లో రైతుసంఘాలు ఏర్పాటు కావాలి -ప్రగతిభవన్‌లో తనను కలిసేందుకు వచ్చిన రైతులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

రైతు బాంధవుడు స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో రైతుల స్థితిగతులను మార్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం.. దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రూ.16 వేల కోట్లకుపైగా పంటరుణాలను మాఫీ చేసింది. సాగులో అత్యాధునిక పద్ధతులను ప్రోత్సహించటానికి భారీ సబ్సిడీ మీద యంత్రపరికరాలను అందజేస్తున్నది. నకిలీ విత్తన కంపెనీలపై ఉక్కుపాదం మోపుతున్నది. రైతులకు 9 గంటలపాటు కరెంటును సరఫరా చేస్తున్నది. మూడేండ్ల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అనుక్షణం అండగా నిలుస్తూ తీసుకున్న నిర్ణయాలు…
-36 లక్షల మంది రైతులకు రూ.16 వేల కోట్లకుపైగా రుణమాఫీ. -వ్యవసాయ యాంత్రీకరణకు బడ్జెట్‌లో రూ.300 కోట్లు. -ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతరులకు 50% సబ్సిడీపై యంత్రపరికరాలు. -దాదాపు 23 లక్షల మంది రైతులకు భూసార పరీక్ష కార్డుల పంపిణీ. -5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) ఉండేలా ఇటీవల 1300 ఏఈవో పోస్టుల భర్తీ. -రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా. -వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాల పంపిణీ. -నకిలీ విత్తన కంపెనీలపై ఉక్కుపాదం. పీడీయాక్ట్ నమోదు. నకిలీలను పూర్తిగా అరికట్టేలా నూతన చట్టాలకు కసరత్తు. -రైతు యూనిట్‌గా పంటల బీమాకు అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి విజ్ఞప్తి. -3,658 మంది ఎస్సీ రైతులకు 9,633.66 ఎకరాల భూమి పంపిణీ. -2.37 లక్షల ఎకరాల్లో రూ.758.32 కోట్ల వ్యయంతో బిందు, తుంపర సేద్యపరికరాలు. -1,005 ఎకరాల్లో రూ.301.5 కోట్లతో పాలీహౌస్‌లకు అనుమతి. -50 శాతం రాయితీతో కూరగాయల విత్తనాలు. పండ్లు, పూలు, కూరగాయల సాగులో రాష్ట్రం స్వయంసమృద్ధి సాధించేలా ప్రణాళికలు. -రూ.1024 కోట్ల నాబార్డు రుణంతో 315 గోదాంల నిర్మాణం ప్రారంభం. 230 గోదాంల నిర్మాణం పూర్తి. -జాతీయ స్థాయిలో పంటను విక్రయించుకోవటానికి వీలుగా జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) విధానం పకడ్బందీగా అమలు. -గిట్టుబాటు ధర వచ్చే వరకు పంటను నిల్వ ఉంచుకునేలా రైతుబంధు పథకం. నిల్వ ఉంచే పంటపై 75 శాతం వరకు రుణం. -దేశంలోనే తొలిసారిగా మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకంలో రిజర్వేషన్లు, మహిళలకు ప్రాధాన్యం. -ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.480 కోట్ల పాతబకాయిల పంపిణీ. అనంతరం మరో రూ.821 కోట్ల పంపిణీ. -90% సబ్సిడీపై డ్రిప్ సదుపాయం. ఒక ఎకరాకు ఉన్న రూ.లక్ష గరిష్ఠ పరిమితి రూ.6 లక్షలకు పెంపు.

రాష్ట్రంలోని రైతులందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉచితంగా ఎరువులు అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎకరానికి రూ.4వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తామని తెలిపారు. ప్రతి ఏటా చినుకులు పడేలోపల రైతుల ఇండ్లలో ఎరువులు ఉంటాయన్నారు. తెలంగాణ ఉన్నంతవరకూ ఈ పథకం అమలు జరుగుతుందని చెప్పారు. రైతులకు పెట్టుబడి భారంగా మారిందని, అందువల్ల ఆ భారాన్ని పంచుకోవాలని నిర్ణయించి ఈ చారిత్రాత్మక నిర్ణయం ప్రకటిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు 25 లక్షల టన్నుల ఎరువులను వాడుతున్నారని, వారందరికీ ఎరువుల కొనుగోలుకు ప్రభుత్వ సహా యం ఇస్తామని చెప్పారు. రైతును ఆదుకునేందుకే రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశామని, 9 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించామని గుర్తుచేశారు. అదేరీతిలో ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి.. కోటి ఎకరాలకు నీరందించి తీరుతామని సీఎం కేసీఆర్ ప్రతిజ్ఞ చేశారు.
చారిత్రాత్మకం గ్రామీణ తెలంగాణలో విప్లవాత్మక మార్పులకు దారితీసే మహత్తర సంకల్పమిది! రాష్ట్ర వ్యవసాయరంగానికి మరో అపూర్వ సాయం! రైతన్న జీవితానికి మరో తిరుగులేని భరోసా! ఇది.. తెలంగాణ రాష్ట్ర రథసారధి తీసుకున్న మరో చారిత్రాత్మక నిర్ణయం! స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజని తేల్చిచెప్పారు! తనలాంటి లక్షలమంది రైతులను రాజులను చేసేందుకు నడుం బిగించారు! వ్యవసాయరంగ అభివృద్ధికి ఊతమిచ్చే అనేకానేక చర్యలతోపాటు.. ఎన్నికల ముందు 16వేల కోట్లకు పైగా రైతు రుణాలను మాఫీచేస్తామని హామీనిచ్చి.. దానిని పరిపూర్ణం చేసిన కేసీఆర్.. ఆ ఆనందంలో ఉన్న రైతుల సంబురాన్ని 24 గంటల వ్యవధిలోనే అంబరాన్ని తాకించారు! రాష్ట్ర వ్యవసాయరంగ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే మరో సంచలన నిర్ణయాన్ని వెలువరించారు! తెలంగాణ ఉన్నంతవరకూ రైతులందరికీ ఉచితంగా ఎరువులు ఇస్తామని చారిత్రాత్మక ప్రకటన చేస్తూ.. యావత్ దేశానికి వ్యవసాయ రంగ అభివృద్ధిపై కొత్త మార్గాన్ని నిర్దేశించారు! ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో పాలనంటే ఇదే అనిపిస్తూ.. వివిధ రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వ పెద్దల అభినందనలు అందుకుంటున్న సీఎం.. అపర భగీరథుడై వలసల జిల్లాకు పచ్చటి రంగేసినా..బీడు భూములకు యాసంగిలోనూ నీరు పారిస్తున్నా.. ఇంజినీరు పాత్ర పోషిస్తూ, రాష్ట్ర అవసరాలకు, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసినా.. రైతు బాగుండాలనేదే ఉద్దేశం! వ్యవసాయం పండుగ కావాలన్నదే ధ్యేయం! బంగారు తెలంగాణ నిర్మాణమే అంతిమ లక్ష్యం! ఆ క్రమంలో ఇప్పుడు మరో కీలక అడుగు ముందుకు వేస్తూ.. అన్నదాతలపై మరో భారాన్ని తొలగించి.. తనపై వేసుకున్నారు! ఇప్పటికే తెలంగాణ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను తమ వద్ద అమలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న వివిధ రాష్ర్టాలకు పాలన ఎలా సాగించాలో కొత్త పాఠం సిద్ధం చేశారు!రుణమాఫీని సంపూర్ణం చేసిన సందర్భంగా కృతజ్ఞతలు చెప్పేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, నాయకులతో గురువారం ప్రగతిభవన్‌లోని జనహితలో సమావేశమైన సీఎం వారినుద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభు త్వ విప్‌లు గంప గోవర్ధన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్ తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పేది వింటే దేశం దేశమే ఆగమైతది కావచ్చు.. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటువంటి 24 లక్షల టన్నుల ఎరువులు వందశాతం ఉచితంగా సరఫరా చేస్తం.. అని రైతుల నినాదాలు, హర్షాతిరేకాలు, చప్పట్ల మధ్య కేసీఆర్ భావోద్వేగపూరితంగా అన్నారు.

ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. టన్నుల ఎరువులను వాడుతున్నారు. వారందరికీ ఎకరానికి రూ.4 వేల చొప్పున ఎరువుల కొనుగోలుకు సహాయంగా అందిస్తాం. తెలంగాణ ఉన్నంత కాలం రైతాంగానికి నూరు శాతం ఉచితంగా ఎరువులను అందిస్తాం. రైతులను ఎన్నో రకాలుగా ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ కాదు. రైతు బాగుపడితే.. గ్రామంలోనే వేల కోట్ల సంపద సృష్టిస్తే.. అది బంగారు తెలంగాణ. ఆ బంగారు తెలంగాణ కోసమే ఆనాడు చావు నోట్లో తలకాయ పెట్టిన. నిమ్స్ హాస్పిటల్‌లో కొట్లాడిన. దేవుడు నన్ను బతికిచ్చిండు. బతికిచ్చుడేకాదు.. తెలంగాణ రప్పిచ్చిండు. ఈ రోజు కచ్చితంగా.. ఆరు నూరైనా సరే.. చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి రైతుకు ఫ్రీగా ఫర్టిలైజర్స్ సైప్లె కావాలె.. మొన్న మీరేమన్నరు? కరెంటు 9 గంటలు ఇస్తుంటే వద్దు సారు 6 గంటలే ఇయ్యుండ్రి చాలు అన్నారు. అట్లనే ఓ 50 శాతం భారం మేమే భరిస్తామని రైతులే ముందుకు వచ్చే దాక ఉచితంగా ఎరువులు ఇయ్యాలె.దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 36 లక్షల మంది రైతులకు చెందిన సుమారు రూ.17 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేసుకున్నందుకు అభినందనలు. ఇప్పుడు రైతులందరూ రుణ విముక్తులయ్యారు. సంతోషంగా ఉంది. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న రైతులకు సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం చేయాలనేదే నా ఆలోచన. అందుకే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌తోపాటు.. ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తున్నా.
రైతు బాగుపడితేనే బంగారు తెలంగాణ.. రైతులకు పెట్టుబడి భారంగా ఉంది. ఆ భారాన్ని పంచుకోవాలని నిర్ణయించాం. అందుకే ఈరోజు చారిత్రాత్మక నిర్ణయం ప్రకటిస్తున్నా. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు 25 లక్షల కేసీఆర్ నిర్ణయం దేశానికే ఆదర్శం ఎరువుల పంపిణీపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శం. మిగతా రాష్ర్టాలు కూడా రైతుకు నేరుగా ప్రయోజనం కలిగించే ఇలాంటి నిర్ణయాలుతీసుకోవాలి. రైతులకు ఉచితంగా ఎరువులు అందించాలన్నది చాలామంచి నిర్ణయం. దేశంలో అనేక రాష్ర్టాలు రైతుల రుణమాఫీ నిర్ణయాన్ని ప్రకటించినా, దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయాయి. కేసీఆర్ మాత్రం దాన్ని పూర్తిచేసి చూపించారు. రైతుల క్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు అభినందనలు. ఎరువుల పంపిణీ ఎంతో మంచి నిర్ణయం అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి. – యలమంచిలి శివాజీ, ఏపీ రైతు సంఘం నాయకుడు, మాజీ ఎంపీ
నూరు శాతం కోటి ఎకరాలకు నీరు.. ఉద్యమ సమయంలో ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నం. పోరాడి తెలంగాణ సాధించుకున్నం. నవ్విన నాపచేను పండింది అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చింది. రైతుల పరిస్థితి అత్యంత దీనంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రైతుల పరిస్థితుల్లో మార్పు రావాలని దృఢంగా నిర్ణయించాం. అందుకే కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనుకున్నాం. మిషన్ కాకతీయద్వారా చెరువులు బాగు చేసుకున్నం. నిజాంసాగర్‌ను మేడిగడ్డ ద్వారానే నింపడానికి ప్రణాళికలు వేశాం. చెరువులు నింపుతున్నం. ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తాం. నూటికి నూరు శాతం కోటి ఎకరాలకు నీరందించి తీరుతాం
రూ. 6-7 వేల కోట్లు ఇస్తే తప్పా.. రాష్ట్రంలో 55 లక్షల రైతులకు వంద శాతం ఉచితంగా ఎరువులు అందియ్యాలంటే ఏడాదికి రూ.6-7 వేల కోట్లు అవుతుంది. ఆ మాత్రం రైతులకు ఇయ్యలేమా? రైతులకు ఇస్తే తప్పా? ముఖ్యమంత్రిగా ఒక రైతు ఉన్నపుడు ఎకరానికి రూ.4 వేలు సపోర్ట్ చేయలేడా? తప్పకుండా చేస్తం. ఒక రైతుకు ఐదెకరాలు ఉంటే ఆయన ఎరువులకు అయ్యే మొత్తం రూ.20 వేలు ప్రభుత్వం ఇస్తది. ఏ పంటకైనా దుక్కి మందు కావాలె.. యూరియా కావాలె.. పొటాష్ కావాలె.. అవి నేనిస్తా. పురుగుమందులు మాత్రం మీరు పెట్టుకోండి. మరి నన్ను బయట మంది తిట్టద్దుకదా?
అవసరమున్నంత వరకే ఎరువులు వాడాలి.. నేను కూడా రైతు బిడ్డనే. అవసరమున్నంత వరకే ఎరువులు వాడాలి. మనం ఎన్ని ఎరువులు వాడుతం? ఎకరానికి దుక్కి మందు రెండు బస్తాలు.. ఓ మూడు యూరియా బస్తాలు ఏస్తం. మనంకూడా కావాల్సినంతే తినాలి. ఎక్కువ తింటే అజీర్తి చేస్తది. గట్లనే పంటలకు ఎంత కావాల్నో అంతే ఎరువులు వేయాలి.
నిజాయితీగా ఇంప్లిమెంట్ కావాలి ఈ కార్యక్రమం మంచిగ, నిజాయితీగా ఇంప్లిమెంట్ కావాలి. గవర్నమెంట్‌ల ఓ లంగపని చేద్దామంటే ఇబ్బంది రాదు. కానీ మంచిపని చేద్దామంటే ఎంతో బాధ. నేను మూడేండ్లు గవర్నమెంట్‌ను నడిపించి, నాకు ఎదురైన బాధలను చూసి చెప్తున్న. ఏదన్నా స్కీం పెట్టంగనే పైరవీకార్లు వస్తరు. అదేబాధ. 55 లక్షల మంది రైతులకు ఈ ఎరువుల సబ్సిడీ అందాలె. ఎట్ల అందాలె.. ప్రతి సంవత్సరం మే నెలలో చినుకు పడకముందు రైతు బ్యాంకు ఖాతాలకే డబ్బు పంపిస్తా. మళ్ళీ మీరు ఆఫీసుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ తిరుగవద్దు. ఆఫీసుకు పోతే వట్టిగైతదా? మళ్ళీ దందాలు మొదలాయె..
గ్రామ రైతు సంఘంగా ఏర్పడాలి… ఆ బాధ ఉండద్దంటే మీరు నాకు సాయం చేయాలె. మనం రైతులం. మనకు సాయం చేస్తే ఎవరికి అందుతుంది? మన అన్నదమ్ములకే గద. అందుకే గ్రామగ్రామాన రైతు సంఘం ఏర్పాటు కావాలె. అసలైన రైతులను గుర్తించాలె. ఇప్పుడు ఎరువులు ఇస్తం. మన రైతాంగం పండగ జేస్కుంటది.. చేస్కోవాలికూడా. ప్రభుత్వాలు ప్రజల కోసం ఉండాలి.. ప్రజల కోసం పనిచేయాలి. ఇందుకు మీరుకూడా సహకారం అందించాలి. మంత్రి పోచారంను కోరుతున్నా.. ఎవరికి భూమి ఉంటే వారే రైతు. ఒకాయనకు చేను పెద్దగా ఉంటే.. మరొకాయనకు చిన్నగుండొచ్చు. అందుకే ప్రతి ఊరికి గ్రామ రైతు సంఘం ఏర్పడాలి. వ్యవసాయ శాఖ ఈ పని వెంటనే చేపట్టాలి. గ్రామంలోని రైతు, ఆయనకున్న భూమి వివరాలు అన్నీ కావాలె. మీరు సంఘంగా ఎంత తొందరగా ఏర్పడితే అంత తొందరగా పని ప్రారంభిద్దాం. ఈ యాసంగి లోపల చేయగలిగితే మంచిది. ప్రతి రైతుకు సంబంధించిన లెక్క కావాలె. గ్రామాల పని అయితే మండల స్థాయిలో క్రోడీకరించాలి. వాటిని కంప్యూటర్‌లోకి ఎక్కించాలి. డబ్బు రైతులకు పోవాలె తప్ప డూప్లికేట్ మనుషులకు పోవద్దు. ఇక్కడి నుంచి మేము మీ బ్యాంకు అకౌంట్‌లో పైసలు వేస్తే.. అక్కడ రైతు తీసుకోవాలి. అందుకోసం ప్రతి రైతు బ్యాంకు అకౌంట్‌తో లిస్టులు తయారుకావాలె. ఇది జరుగాలంటే మూలం గ్రామ రైతు సంఘం. కాబట్టి ప్రతి గ్రామంలో రైతు సంఘాలు వచ్చి.. లిస్టులు కంప్యూటర్ల పెడితే వచ్చే మే నుంచి రైతుల ఖాతాల్లో డబ్బు వేసుకుందాం.
రైతు సంఘాలు అద్భుత వేదికలుగా కావాలి.. రాబోయే రోజుల్లో గ్రామ రైతు కమిటీలు టెక్నాలజీని, ఆధునిక వ్యవసాయ పనిముట్లను, యంత్రాల వాడకాన్ని తెలుసుకునేందుకు పర్యటనలు చేయాలి. ఈ రోజుల్లో మహిళలు పొలాల్లో పనులకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో వచ్చేవారు ఉండరు. ఈ తరం మహిళలు నాట్లు వేస్తరా? వారికి దాని కథనే తెల్వదు. బురదలో దిగుమంటే గజం దిగి వెంటనే వెనుకకు వస్తరు. ఉషారు పడకపోతే మనం ఆగమైపోతం. మిషిన్లు వచ్చినయి.. టెక్నాలజీ వచ్చింది.. ట్రైనింగు తీస్కోవాలి. దానికి గ్రామ రైతు సంఘాలు ఒక అద్భుతమైన వేదికగా మారాలి. ఏడాదికి రూ.100 ఫీజు పెట్టుకుని ఫండ్ జమ చేసుకుంటె.. ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్ళవచ్చు. సర్కారు ఇచ్చేది సర్కారు ఇస్తది. మీరు పెట్టుకునేది మీరు పెట్టుకోవచ్చు.
రైతాంగానికి అభినందనలు.. ఈ రోజు తెలంగాణ రైతాంగం రుణమాఫీ రూ. 17 వేల కోట్ల వరకు పూర్తిచేసుకున్నందుకు అందరికీ అభినందనలు. అదే కాకుండా శాశ్వతంగా ఇంకో లబ్ధి పొందుతున్నందుకు కూడా సంతోషం. ఎర్రజొన్న బకాయిలు ఇచ్చినం. మంచి మనసుతో చేస్తే.. తప్పకుండా మంచి జరుగుతది. కళ్యాణలక్ష్మి పథకం తెచ్చి పేదల ఇండ్లల్లో పెండ్లి చేసుకోవడానికి ఇబ్బందులు ఉండవద్దని పెట్టినం.. సర్కారు ఇచ్చే డబ్బులతోనే పెండ్లి ఎల్లదీస్కునేవారు ఉన్నారు. ప్రజలకు రంది లేకుండా అయిపోయింది. అట్లనే రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం.. అన్నం తింటలేను అనకుండా అయిపోయింది పరిస్థితి. పప్పో.. తొక్కో వేస్కుని తింటున్నారు. దానిక్కూడా బాధ లేకుండా అయిపోయింది. కరెంటుకూడా బాధ లేకుండా పోయింది. అదే విధంగా రైతులు భవిష్యత్తులో బంగారం లాంటి పంటలు పండించి.. నిజంగా ఇది బంగారు తెలంగాణ అనే కేసీఆర్ మాట నిలబెట్టాలని మా అన్నదమ్ములను, తల్లిదండ్రులను కోరుతున్నాను. అని కేసీఆర్ అన్నారు.రైతులకు పెట్టుబడి భారంగా ఉంది. ఆ భారాన్ని పంచుకోవాలని నిర్ణయించాం. రైతులను ఎన్నో రకాలుగా ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ కాదు. రైతు బాగుపడితే.. గ్రామంలోనే వేల కోట్ల సంపద సృష్టిస్తే.. అప్పుడు అది బంగారు తెలంగాణ. ఆ బంగారు తెలంగాణ కోసమే ఆనాడు చావు నోట్లో తలకాయ పెట్టిన. దేవుడు నన్ను బతికించిండు. ఈరోజు చారిత్రాత్మక నిర్ణయం ప్రకటిస్తున్నా. తెలంగాణ ఉన్నంత కాలం రైతాంగానికి ఉచితంగా నూరు శాతం ఎరువులను అందిస్తాం- సీఎం కేసీఆర్
బడ్జెట్‌లో మొదటి ప్రాధాన్యం రైతులకే.. మన రాష్ట్రంల బడ్జెట్ పాస్ అయిందంటె అన్నదాత అయిన రైతులకు మొదటి పద్దు పోవాలె. ఈ పద్ధతిలో జరుగాలె. భూముల్లో రైతులు బంగారాన్ని పండించే పరిస్థితి ఉంటేనే .. బంగారు తెలంగాణ ఐతది. కచ్చితంగా రైతుకు అట్లాంటి ప్రోత్సాహం రావాలె.. ఇంకా కొన్ని పనులుకూడా నేను ఆలోచన చేస్తున్న. ఇయ్యాల పోచారం శ్రీనివాసరెడ్డి నాతోని కొట్లాడి రూ. 250 కోట్ల బడ్జెట్ సరిపోతలేదు.. జనం నా జట్టు పీకుతుండ్రు అని చెప్పి నాబార్డు నుంచి రూ. వేయి కోట్లు తెచ్చి 80 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్‌కు ఇచ్చేందుకు నాతో సంతకం పెట్టించుకున్నరు. శ్రీనివాసరెడ్డి లక్ష్మీ పుత్రుడు.. ఆయన వ్యవసాయ శాఖ చేపట్టిన తరువాత వినూత్నంగా రైతులకు ఏం కావాలో అవన్నీ అందించేలా పట్టుబట్టి సాగుతున్నారు. ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇయ్యని విధంగా డ్రిప్ ఇరిగేషన్‌కు సబ్సిడీపై ఇస్తున్నరు. ట్రాక్టర్లుకూడా సబ్సిడీపై ఇస్తున్నరు.
ఈ ఏడే ఇద్దామనుకున్నా.. అసలు ఈ సంవత్సరం యూసంగికే ఎరువులు ఇద్దామనుకున్నా. కానీ.. రైతులు ఎందరు? ఒక్కొక్కరికి ఎంత భూమి ఉంది? ఎంత అవుసరం? ఇట్లా లెక్కలన్నీ తేలాల్సి ఉంది. ఆలస్యం అయితది. లెక్కలు లేకుంటే.. చిక్కిరిబిక్కిరి అయితే.. పైరవీకార్లు వస్తే కష్టమైతది. ఉన్నోంది లేనట్టు రాసి, లేనోంది ఉన్నట్టుగా రాసి అబద్ధాలు చేస్తరు. మనకు అది ఉండొద్దు. ఏదన్న ఇచ్చినా తెలంగాణ సర్కార్ బ్రహ్మాండంగా ఇస్తుంది అనాలి. ఇచ్చేది ఏదైనా చినుకు పడటానికి ముందే రైతుకు అందాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక కల్చర్ కావాలి. గ్రామరైతు సంఘాల లెక్కలు వస్తె.. అపుడే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమైపోతుంది. మధ్యల పైరవీకారు ఉండడు. లంచమిచ్చేది లేదు. దఫ్తరుకు పోయేది లేదు.. దండం పెట్టేది లేదు. అట్ల చేస్తం. ఎక్కడన్న భూములు అమ్ముడు కొనుడు జరిగినప్పుడు అప్‌డేట్ చేయాలని తాసీల్దార్లకు ఆదేశాలిస్తాం. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు (వీడీసీలు) వేస్తుంటం.. అదే పద్ధతిలో గ్రామ రైతు సంఘం ప్రతి గ్రామంలో రావాలె. నిజాయితీగా గ్రామ రైతుల జాబితా తయారుచేయాలె.. లెక్క ప్రకారం డబ్బులు బ్యాంకులో పడ్తయి. అట్లా అయితేనే రైతు బాజాప్త డబ్బు తీసుకుని ఎరువులు కొనుక్కుంటడు. ప్రతి రైతు బ్యాంకు అకౌంట్ నంబర్‌తో సహా తయారు కావాలి. వచ్చే మే (2018) నుంచి దీనిని అమలు చేసేలా సంఘం సిద్ధంగా ఉండాలి. మే 30 లోపల డబ్బు రైతుకు చేరాలి.