Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతు అభివృద్ధితోనే దేశాభివృద్ధి

-అందుకే రైతులకు పెట్టుబడి ఇవ్వనున్నాం -వచ్చే వానకాలంనుంచి ఎకరాకు ఏటా 8వేలు -వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ -రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేశాం -నీతిఆయోగ్ వైస్ చైర్మన్‌కు వివరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలని వినతి

రైతు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తాము నమ్ముతున్నామని, ఈ మేరకు రైతులు అభివృద్ధి చెందేదిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, సభ్యులు రమేశ్‌చందర్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ముఖ్యంగా వ్యవసాయాభివృద్ధికి చేపడుతున్న చర్యలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. రాష్ట్రంలో సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే మిషన్ కాకతీయద్వారా చెరువుల పూడిక తీశామని, ఈ కార్యక్రమం చివరిదశ కొనసాగుతున్నదని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు భారీ ఎత్తున నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలని సీఎం కేసీఆర్ నీతిఆయోగ్ వైస్ చైర్మన్‌ను కోరినట్టు తెలిసింది.

రుణమాఫీతో రైతుకు ఊరట రాష్ట్రం ఏర్పడే నాటికి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారని, వచ్చీరాని కరెంటుతో వ్యవసాయం గుదిబండగా మారిందని నీతిఆయోగ్ బృందానికి సీఎం తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే రూ.లక్ష వరకు రైతులకు రుణమాఫీ చేశామని, దీంతో రైతుకు ఊరట లభించిందని చెప్పారు. ఇప్పటివరకు వ్యవసాయానికి తొమ్మిదిగంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేశామని, 2018 జనవరి నుంచి వ్యవసాయానికి 24 గంటల నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. ముందుగా ఉమ్మడి నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన నిరంతర విద్యుత్ సరఫరా విజయవంతమయిందని చెప్పారు. అనంతరం ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా రెండువారాలు వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరాచేశామని, అదికూడా విజయవంతమయిందన్నారు.

ఆర్థిక భరోసా కోసం పంట పెట్టుబడి రైతుకు ఆర్థికంగా భరోసా కల్పించాలని నిర్ణయించి, వచ్చే వానకాలం సీజన్ నుంచి సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.8 వేల పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. రైతు పెట్టుబడి కోసం అప్పులుచేసే బాధ తప్పుతుందన్నారు. రైతు పండించిన పంటకు మంచి ధర వచ్చేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఏ సీజన్‌లో ఎక్కడ ఏ పంట వేయాలన్నదానిపై రైతులకు అవగాహన కలిగిస్తున్నామని, ఇందుకోసం రైతు సమాఖ్యలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి దళారుల చేతికి వెళ్లకుండా భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నామని, దీంతోపాటు పలు అంశాలను సీఎం వారికి వివరించారు. ఈ సందర్భంగా 2017 సంవత్సర స్టాటిస్టికల్ పుస్తకాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌తో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ కేశవరావు, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, నీతిఆయోగ్ సభ్యులు రమేశ్‌చందర్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

2022 నాటికి రోల్‌మోడల్‌గా భారత్ : రాజీవ్‌కుమార్ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నించాలని నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో ట్రైనీ అఖిల భారత సర్వీస్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2022 నాటికి పేదరికం, అవినీతి, టెర్రరిజం నిర్మూలన జరిగి దేశం ప్రపంచానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాజీవ్‌కుమార్‌కు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి బీపీ ఆచార్య పోచంపల్లి స్టోల్ మెమొంటోను బహూకరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.