-వ్యవసాయాన్ని పండుగచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ -కాళేశ్వరంతో కరువు శాశ్వత దూరం -త్వరలో మల్కపేట ప్రాజెక్టు ప్రారంభం -రైతు వేదికల నిర్మాణం మన ఘనతే -ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు

వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు,పంట పెట్టబడి సాయం, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తూ నేను రైతును అంటూ అన్నదాతలు గల్లా ఎగురేసి చెప్పుకునే ధీమా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి కే తారకరామారావు అన్నారు. పల్లెలు బాగుపడాలని పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామపంచాయతీలకు నెలకు రూ.338 కోట్లు, పట్టణ ప్రగతి కింద పట్టణాలకు రూ.148 కోట్లు విడుదలచేస్తున్నట్టు మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంతో ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 12:28 గంటలకు జిల్లా కేంద్రంలో రూ.3 కోట్లు వ్యయం చేసి కార్పొరేట్ హంగులతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కోనరావుపేట మండలకేంద్రం, చందుర్తి మండలం మూడపల్లిలో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగించారు. సాయంత్రం 4 గంటలకు వేములవాడకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని శివరాత్రి ఏర్పాట్లపై చర్చించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని విధంగా మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, స్వయాన కేంద్ర ప్రభుత్వమే వీటిని ప్రశంసించిందని తెలిపారు. మన రైతుబంధు పథకాన్ని సైతం కేంద్రం కాపీ కొట్టిందని అన్నారు. ప్రజలు మనకు పనిచేసే అధికారం ఇచ్చారని, ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలని అన్నారు. ఎన్ని శక్తులు ఎన్ని అడ్డంకు లు సృష్టించినా రాష్ట్ర అభివృద్ధి నిరాటంకంగా సాగుతుందని స్పష్టంచేశారు. మధ్యమానేరు ప్రాజెక్టు నిర్వాసిత యువతకు చేతినిండా ఉపాధి ఉండేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, స్వయం ఉపాధి పథకాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రైతు వేదికలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి శాస్త్రవేత్తలతో సలహాలు, సూచనలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దేశ చరిత్రలో రైతు వేదికలు నిర్మించిన తొలి సర్కారు తెలంగాణేనని పేర్కొన్నారు. దక్షిణ భారత దేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రం తెలంగాణే అని స్పష్టంచేశారు.
వాటర్ జంక్షన్‌గా మధ్యమానేరు కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే సీఎం లక్ష్యమని, అందుకే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి, భూములను సస్యశ్యామలం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పునరుద్ఘాటించారు. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలన్నీ నిండుకుండలా కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుని, 360 రోజులు నీరు నిలిచి మధ్యమానేరు వాటర్ జంక్షన్‌గా మారడం సంతోషంగా ఉన్నదన్నారు. సిరిసిల్ల జిల్లా నీటి వనరుల విషయం.. ఐఏఎస్ ఆఫీసర్లకు పాఠ్యాంశాలుగా చెప్పుకోవడం గర్వకారణమన్నారు. 3 టీఎంసీల సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తికాగానే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు జిల్లాలోని మూరుమూల గ్రామాలన్నింటినీ కేసీఆర్ సైకిల్‌పై తిరుగుతూ పర్యటించారని తెలిపారు. ఈ ప్రాంత సమస్యలన్నింటినీ అవపోసన పట్టి, స్వరాష్ట్రం సాధించుకున్నాక వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. రైతు వేదికలు నిర్మించాలని ఈ దేశంలో ఎవరూ ఆలోచించలేదని, రైతు బిడ్డ కాబట్టే సీఎం కేసీఆర్ వీటి నిర్మాణాన్ని చేపట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
తల్లి దండ్రుల ప్రోత్సాహంతో నే.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఇంత వాడినయ్యానని మంత్రి కేటీఆర్ చెప్పారు. చదువుకోవాలన్న తపన ఉన్న తనకు అన్ని విధాలుగా అండగా నిలువడం వల్లే అమెరికా వెళ్లి చదువుకొని ఇపుడు రాజకీయాల్లోకి వచ్చి మంత్రినయ్యానని గుర్తు చేశారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తే చదువులో రాణించి సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని చెప్పారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారిగా సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు.