Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతుకోసమే రైతుబంధు

-ఎన్నికల్లో ఓట్లకోసం కాదు -రైతులకోసం మ్యానిఫెస్టోలో చెప్పని పథకాలూ అమలుచేస్తున్నాం -రెండో విడుత పంట పెట్టుబడి సాయం నవంబర్‌లో -ఇజ్రాయెల్ సాగు పద్ధతులను అధ్యయనం చేయాలి -ప్రభుత్వ ఖర్చుతో రైతు సమన్వయకర్తలను ఇజ్రాయెల్ పంపిస్తాం -ఆధునిక సేద్య విధానంపై రైతుల్లో అవగాహన కల్పించాలి -ఎన్నారైలకు పెట్టుబడిసాయంపై త్వరలో విధాన రూపకల్పన -మరోసారి భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలి -జూన్ 20 నాటికి బుక్‌లు, చెక్కుల పంపిణీ పూర్తిచేయాలి -ప్రతి రైతుకూ రూ.5 లక్షల జీవితబీమా -రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ల భేటీలో సీఎం కేసీఆర్ -పంట పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవిత బీమా అమలులో రైతు సమన్వయ సమితులదే కీలకపాత్ర -కాంగ్రెస్‌వి ఆపద మొక్కుల హామీలు -రూ.2 లక్షల రుణమాఫీ అమలు అసాధ్యం -దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలి: సీఎం కేసీఆర్

రైతులు అప్పులపాలు కాకుండాఉండేందుకే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్నది తప్ప ఎన్నికల్లో ఓట్లకోసం కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీచేయడం సాధ్యంకాదని, కేవలం ఎన్నికల్లో ఓట్లకోసం ఆపద మొక్కులు మొక్కినట్టే ఉన్నదని విమర్శించారు. రైతుబంధు పథకంద్వారా రైతులందరికీ కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందజేయడం, పంట పెట్టుబడి సాయం పంపిణీ, జీవిత బీమా పథకం అమలు విషయంలో రైతు సమన్వయసమితి సమన్వయకర్తలు అత్యంత కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు తాము చెప్పిన ప్రతి పనిని చేశామని, రైతుల సంక్షేమంకోసం మ్యానిఫెస్టోలో చెప్పని పథకాలు కూడా అమలుచేస్తున్నామని వెల్లడించారు. పంట పెట్టుబడిసాయం రెండో విడుత సాయాన్ని నవంబర్ నెలలో అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతుబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్లతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సమన్వయకర్తలనుద్దేశించి సీఎం ప్రసంగం ఆయన మాటల్లో..

రైతు సమితులదే కీలక పాత్ర తెలంగాణలో రైతులు ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికేవారు. మంచి వ్యవసాయం సాగేది. రైతులే ఇతరులకు దానాలు చేసే మంచి స్థితిలో ఉండేవారు. సమైక్య రాష్ట్రంలో అవలంబించిన విధానాల వల్ల వ్యవసాయరంగం దెబ్బతిన్నది. రైతులు అన్నివిధాలా నష్టపోయారు. తెలంగాణ వచ్చినంక రైతుల పరిస్థితి మారాలని అనుకున్నం. అందుకే వ్యవసాయరంగ అభివృద్ధికోసం అనేక చర్యలు తీసుకొన్నం. మొదట రైతులకు రుణమాఫీ చేసుకున్నం. సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతోపాటు ఇతర ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నయి. 2019 జూన్ తర్వాత ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా నీరు వస్తున్నది. 24 గంటల ఉచిత విద్యుత్ అందుతున్నది. ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇచ్చుకుంటున్నం. ఇట్ల చాలా చేసుకుంటూ పోతున్నం. భూ రికార్డుల ప్రక్షాళనచేసి, కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చాం. రైతులు పెట్టుబడికోసం అప్పులు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తున్నది. అందుకోసమే ఎకరానికి రూ.8 వేలు ఇస్తున్నాం. దీనితోపాటు రైతులకు జీవిత బీమా చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడంలో రైతు సమన్వయ సమితులు కీలక పాత్ర పోషించాలి.

ఇజ్రాయిల్‌కు రైతు సమన్వయకర్తలు రైతులకు కరంట్ బాధ పోయింది. నీళ్ల బాధ పోతాంది. పెట్టుబడి ఎట్ల అనే రందిలేదు. ఇక కావాల్సింది గిట్టుబాటు ధర. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. దుక్కి దున్నిన దగ్గరనుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేవరకు ప్రతిదశలో రైతులకు ఏం కావాలో ప్రభుత్వం ఆ పనిచేస్తుంది. దానికి అనుగుణంగా రైతులను సమన్వయపరిచే బాధ్యత రైతు సమన్వయ సమితులు చేపట్టాలి. ఇజ్రాయెల్ దేశంలో లాభదాయక వ్యవసాయం సాగుతున్నది. అక్కడ ఉత్పత్తి, ఉత్పాదకత ఎక్కువ. అత్యాధునిక పద్ధతులు పాటించి, అత్యధిక దిగుబడులు పొందుతున్నారు. రైతు సమన్వయసమితుల జిల్లా కో-ఆర్డినేటర్లు ఇజ్రాయెల్ సందర్శించాలి. అక్కడి వ్యవసాయ పద్ధతులు చూసి నేర్చుకుని రావాలి. ప్రభుత్వమే ఖర్చు భరించి, ఇజ్రాయెల్ పర్యటన ఏర్పాటు చేస్తుంది.

కాంగ్రెస్‌వి ఆపద మొక్కులు తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీచేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. అన్ని విధాలా ప్రతి నెలా రాష్ట్రానికి రూ.10,500 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో రూ.2 వేల కోట్లు అప్పుల కిస్తీలు కట్టాలి. మరో రూ.6 వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, సబ్సిడీలు లాంటి తప్పక పెట్టాల్సిన ఖర్చులుంటాయి. ఇక మిగిలిన రూ.2,500 కోట్లు మాత్రమే ప్రభుత్వం చేసే పనుల కోసం ఖర్చుపెట్టే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే , ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించకుండా డబ్బులు జమ చేసినా, 20 నెలల సమయం పడుతుంది. ఉద్యోగుల జీతాలు, అప్పు కిస్తీలు కూడా కట్టకుండా ఏ పని చేయకుండా 20 నెలలు ప్రభుత్వం నడపడం సాధ్యమా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఆపదమొక్కుల మాదిరిగానే రుణమాఫీ అంటున్నది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.

ఎన్నారైలకు పెట్టుబడి సాయంపై త్వరలో విధానం భూ రికార్డులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, మార్పులు-చేర్పులను నమోదుచేసి జూన్ 20 లోగా కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తాం. విదేశాల్లో ఉన్న రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు త్వరలోనే ఒక విధానం రూపొందిస్తాం. ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున ఏర్పాటయిన క్లస్టర్లలో రైతు వేదిక నిర్మాణం ప్రారంభించాలి. దాతలు విరాళమిచ్చిన స్థలాల్లో వేదికలు నిర్మించాలి. మిగతావి ప్రభుత్వ స్థలాల్లో చేపట్టాలి. రైతులకు పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఇచ్చిన చెక్కులను కొందరు రైతులు తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఆ డబ్బులను రైతు సమన్వయ సమితి ఖాతాలో జమచేయాలి. గ్రామాల్లో నకిలీ, కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయించేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని సమన్వయకర్తలు అధికారులకు పట్టివ్వాలి.

పోచారం లక్ష్మీపుత్రుడు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్మీపుత్రుడని, అందుకే వ్యసాయానికి అంతా మంచే జరుగుతున్నదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆయన వ్యవసాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తెలంగాణలో వ్యవసాయానుకూల నిర్ణయాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. పోచారం నాయకత్వంలోనే తెలంగాణ రైతులు దేశంలోనే ధనిక రైతులుగా మారుతారని తనకు నమ్మకమున్నదని తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీ లక్ష్మారెడ్డి, రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు జోగినిపల్లి సంతోష్‌కుమార్, బీ వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, వివిధ జిల్లాల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

కో-ఆర్డినేటర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు -నేల స్వభావం, మార్కెట్లో డిమాండ్ ఆధారంగా పంటల సాగు జరగాలి. -రైతులంతా ఒకేరకం పంట వేసి నష్టపోకుండా డిమాండ్‌కు తగినట్టుగా పంటలు పండించేలా రైతులకు అవగాహన కలిగించాలి. -ఆరుగాలం శ్రమించి అన్నదాతలు పండించే ప్రతీ గింజకు మంచి ధర వచ్చినప్పుడే సేద్యం లాభసాటిగా మారుతుంది. ఈ విషయాన్ని రైతులకు విడమరచి చెప్పాలి. -తెలంగాణ ప్రజలకు ఏమి కావాలనే విషయాన్ని ముందుగా తెలుసుకొని, దాని ప్రకారం పంటలు పండించాలి. నగరాలు, పట్టణాలకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో కూరగాయలు ఎక్కువగా పండించాలి. ఆయా నగరాలు, పట్టణాల్లోని ప్రజలు మన రైతులు పండించిన కూరగాయలే తినాలి. అది అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభదాయకం, ఆరోగ్యకరం. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నది. -వాతావరణం, నేల స్వభావం, గాలివేగం, వర్షపాతం, ఉష్ణోగ్రతల ఆధారంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూములను వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు క్రాప్ కాలనీలుగా విభజిస్తారు. ఆ విభజన ప్రకారం ఏ కాలనీలో ఏ పంట వేయాలనే విషయంలో సూచనలు చేస్తారు. దానికి అనుగుణంగా నిర్ణీత పంటలు వేసుకొనేలా రైతులకు చైతన్యం కలిగించాలి. -మార్కెట్‌కు నియమిత పద్ధతిలో పంటలు తేవాలి. అందరూ ఒకేసారి తమ ఉత్పత్తులు తేవొద్దు. ఏ గ్రామం రైతులు ఎప్పుడు మార్కెట్‌కు సరుకులు తీసుకురావాలో ముందుగానే నిర్ణయించాలి. ఉత్పాదకత పెంచే నైపుణ్యం రైతులకు కలిగించాలి. ఈ విషయంలో అవగాహన కలిగించేందుకు జిల్లా రైతు సమన్వయసమితి కో-ఆర్డినేటర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఇజ్రాయెల్ వెళ్లి వ్యవసాయ విధానాలు, అధ్యయనంచేసి రావాలి. తాము తెలుసుకొన్న విషయాలు గ్రామాల్లో పర్యటించి రైతులకు తెలియజెప్పాలి. -రైతు సమన్వయసమితుల ఏర్పాటుతో తెలంగాణ రైతులు సంఘటితశక్తిగా మారారు. ఎక్కువ పంట పండించే విధంగా, పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతు సమన్వయసమితులు కృషిచేయాలి. -సాగునీరు, విద్యుత్, పెట్టుబడి, గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత మూడేండ్లలో తెలంగాణలో మార్పు కనిపిస్తుంది. రైతుల ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. -రైతులకు ఆధునిక సాగు పద్ధతులను వివరించడానికి , పరస్పరం చర్చించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,500 రైతు వేదికలను నిర్మిస్తున్నాం. ఈ వేదికలను రైతులు ఉపయోగించుకొనేలా చూడాలి. -తెలంగాణలో రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా చేస్తున్నాం. ప్రభుత్వమే ప్రతీ రైతుకు రూ.2,271ల ప్రీమియం చెల్లిస్తుంది. సహజ మరణమైనా సరే రైతు కుటుంబానికి బీమా అందుతుంది. ఈ పథకం కోసం కొద్ది రోజుల్లోనే దరఖాస్తు ఫారాలు గ్రామాలకు అందుతాయి. రైతుల నుంచి నామినీ ప్రతిపాదిత పత్రాలు సేకరించి, వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా ఎల్‌ఐసీకి అందించాలి.15 ఆగస్టు నుంచి ఎల్‌ఐసీ బీమా సర్టిఫికెట్లను రైతులకు అందించాలి. -రైతు చనిపోయిన తర్వాత మరణ ధ్రువీకరణపత్రం సమర్పించిన 10 రోజుల్లోగా నామినీకి రూ.5 లక్షలు అందుతాయి. మరణించిన రైతు పేరుమీద ఉన్న భూమి ఎవరి పేరు మీదకు బదిలీ అవుతున్నదో, బీమా పాలసీ కూడా ఆ రైతు పేరు మీద బదిలీ అవుతుంది. అలా బదిలీ చేసే బాధ్యతను రైతు సమన్వయసమితులు స్వీకరించాలి.

సమైక్య రాష్ట్రంలో అవలంబించిన విధానాల వల్ల వ్యవసాయరంగం దెబ్బతిన్నది. రైతులు అన్నివిధాలా నష్టపోయారు. తెలంగాణ వచ్చినంక రైతుల పరిస్థితి మారాలని అనుకున్నం. అందుకే వ్యవసాయరంగ అభివృద్ధికోసం అనేక చర్యలు తీసుకొన్నం.. రైతులకు కరంట్ బాధ పోయింది. నీళ్ల బాధ పోతాంది. పెట్టుబడి ఎట్ల అనే రందిలేదు. ఇక కావాల్సింది గిట్టుబాటు ధర. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. దుక్కి దున్నిన దగ్గర నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేవరకు ప్రతిదశలో రైతులకు ఏం కావాలో ప్రభుత్వం ఆ పనిచేస్తుంది. దానికి అనుగుణంగా రైతులను సమన్వయపరిచే బాధ్యత రైతు సమన్వయ సమితులు చేపట్టాలి. – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.