Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతే రాజు కావాలి..

వ్యవసాయరంగానికి అన్ని విధాలా ప్రోత్సాహం లభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. సాగుకు పూర్వవైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని, రైతన్న రాజుకావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. వ్యవసాయానికి ఏ లోటూ రాకూడదని, సాగులో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. వారసత్వంగా వస్తున్న మూస పద్ధతులకు స్వస్తిపలికి.. రైతులకు మేలుచేసే విధంగా శాస్త్రీయ పద్ధతుల్లో ప్రణాళికలు రూపొందించాలని కోరారు. రాష్ట్రంలో పంట సంపద కావాలని, మార్కెట్‌కు అనుగుణంగా పంటల సాగు జరగాలని అన్నారు. పత్తికి బదులు.. మార్కెట్ గ్యారెంటీ లభించే మొక్కజొన్న, సోయాబీన్ వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. విత్తనోత్పత్తిపై సమగ్ర విధానం రూపొందించాలన్నారు. సాగు విధానాలపై భిన్నకోణాల్లో అధ్యయనం చేయాలని, వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఒక రకంగా, తక్కువగా ఉన్నప్పుడు మరోరకంగా ఉండేలా వ్యూహాలు రూపొందించాలని నిర్దేశించారు.

KCR-review-meeting-with-agriculture-department

-పంట సంపద కావాలి.. మార్కెట్‌కు తగినట్టుగా పంటల సాగు జరగాలి: సీఎం కేసీఆర్ -పత్తి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే ముద్దు -వ్యవసాయానికి ఏ లోటూ రానివ్వద్దు.. ఆధునిక పద్ధతులను ప్రోత్సహించాలి -కాలానికి అనుగుణంగా వ్యూహాలు రూపొందించాలి -విత్తన ఉత్పత్తిపై సమగ్ర విధానం.. వ్యవసాయ శాఖ అధికారులకు ఐప్యాడ్‌లు -వ్యవసాయ, ఉద్యానవర్సిటీల ఆన్‌లైన్ అనుసంధానం -చీడపీడలకు విరుగుడు చెప్పాలి.. వ్యవసాయశాఖపై బడ్జెట్ సమీక్షలో సీఎం

బడ్జెట్ కూర్పుపై శాఖలవారీ సమీక్షల్లో భాగంగా గురువారం న్యాక్‌లో సీఎం కేసీఆర్‌తో వ్యవసాయశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ ఆదాయాన్ని ఇచ్చే శాఖ కాదనే అభిప్రాయం ఉంది. కానీ లక్షల మంది రైతులను బతికించేది వ్యవసాయమే. వారంతా వ్యవసాయశాఖపైనే ఆధారపడి ఉన్నారు. ఆ శాఖపై గురుతర బాధ్యత ఉంది. ఈ విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి. ఆ మేరకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయింపులు జరిపేలా కృషి చేయాలి అని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తానికి ఏ మేరకు విత్తనాల అవసరం ఉంటుంది? ప్రభుత్వపరంగా ఎంతమొత్తంలో విత్తనాల ఉత్పత్తి జరుగుతున్నది? తదితర అంశాలను అధ్యయనం చేసి ఆ మేరకు విత్తనాలు ఉత్పత్తి చేసే సమగ్ర విధానాన్ని రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. పంటలకు వచ్చే చీడపీడలను గుర్తించాలని, వాటిని ఫొటోలు తీసి స్మార్ట్‌ఫోన్లు, ఐప్యాడ్‌ల ద్వారా పంపాలని అన్నారు. వాటికి అగ్రానమిస్టులు (పంటల నిపుణులు) విరుగుడు చూపించాలని కోరారు.

అందుబాటులో సరిపడా విత్తనాలు.. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలని, కల్తీ విత్తనాల బెడద లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయ విస్తరణ పనులు వేగంగా జరుగాలన్నారు. పంట తెగుళ్లను నివారించడంలో రసాయన మందుల వినియోగాన్ని తగ్గించేలా రైతుల్లో చైతన్యం తేవాలని, తద్వారా వారికి చాలామేలు జరగుతుందని పేర్కొన్నారు. అగ్రానమిస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని, వారి సహాయంతో రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు చేదోడువాదోడుగా ఉండాలన్నారు.

డిమాండ్ మేరకు పంటల సాగు.. అంతర్జాతీయంగా, దేశీయంగా వస్తున్న మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా డిమాండ్‌కు తగినట్లుగా పంటలను సాగు చేసే విధంగా రైతులను సన్నద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన పంట తడిచిపోకుండా, పంటకు సరైన గిట్టుబాటు ధర లభించేలా మార్కెటింగ్‌శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ అంశాలపై అధ్యయనం చేసి విధివిధానాలు రూపొందించాలన్నారు.

పత్తి వద్దు.. మొక్కజొన్న ముద్దు రైతులంతా ఒకే పంట వేయడంతో దానికి డిమాండ్ తగ్గి నష్టం వాటిల్లుతున్నదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్లు పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. పత్తి ఎగుమతులపై సుంకం విధిస్తున్నందున భవిష్యత్‌లో ఆ పంటకు మంచి ధర రాకపోవచ్చునని, ఈ నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సూచించాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదేనని చెప్పారు. తక్కువ పెట్టుబడి, గ్యారెంటీ మార్కెట్ ఉన్న మొక్కజొన్న పంటను ప్రోత్సహించాలన్నారు.

సోయాబీన్‌కు కూడా డిమాండ్ బాగా ఉన్నదని, ఆ పంటపైనా రైతుల్లో చైతన్యం పెంచాలని అన్నారు. తీవ్ర నష్టాలను మిగిలిస్తున్న పత్తి పంట నుంచి రైతులు వేరే పంటలకు మళ్లే విధంగా విస్త్రృత ప్రచారం నిర్వహించాలని, ఈ విషయంలో చర్చలు నిర్వహించాలని సూచించారు. సోయాబీన్ రైతులకు కావాల్సిన మేరకు అందుబాటులో ఉంచాలని, మొక్కజొన్నలో అధిక దిగుబడి వచ్చే వంగడాలు అందుబాటులో ఉన్న విషయాన్ని రైతులకు వివరించాలని చెప్పారు.

గ్రీన్‌హౌస్ కల్టివేషన్ పెంచాలి.. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయశాఖకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కేంద్ర పాధాన్యతలను గమనించి ఆ మేరకు ప్రణాళికలు రూపొందించాలని, తద్వారా అధిక నిధులు రాబట్టుకునేందుకు కృషి చేయాలని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచాలని, గ్రీన్‌హౌస్ కల్టివేషన్, మైక్రో ఇరిగేషన్‌ను అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని, రైతులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ మేరకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ర్టానికి అవసరమయ్యే కూరగాయలను ఇక్కడే పండించాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఎంతమేరకు గ్రీన్‌హౌస్ కల్టివేషన్ ఉండాలనే దానిపై అంచనాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మిరప, పసుపు, అల్లం వంటి పంటలు పండించేందుకు అనువైన భూములు రాష్ట్రంలో ఉన్నాయని, ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఆ పంటలు వేసేలా రైతులను చైతన్యం చేయాలని అన్నారు.

కొత్త వంగడాలపై విస్తృత పరిశోధనలు.. వ్యవసాయ యూనివర్సిటీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అధిక దిగుబడులు సాధించేలా కొత్త వంగడాలు సృష్టించాలని, ఈ దిశగా విస్త్రృత పరిశోధనలు జరగాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను వ్యవసాయ వర్సిటీ తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులను అగ్రానమిస్టులుగా తీర్చిదిద్దాలని కోరారు. వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు, వ్యవసాయ యూనివర్సిటీల మధ్య ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని, వ్యవసాయశాఖ అధికారులందరికీ ఐప్యాడ్‌లు అందివ్వాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక విత్తన ఉత్పత్తి సంస్థలున్నాయని, చాలా విత్తనాలు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.

ఈ కంపెనీలతో సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమన్వయం కుదుర్చుకుని రైతులకు అవసరమయ్యే విత్తనాలు అందించాలని అన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్ర ప్రజలందరికీ అవసరమయ్యే పాలు ఇక్కడే ఉత్పత్తి జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుతం మాంసం కూడా ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని, దీనిని నివారించేందుకు గొర్రెలు, మేకల పెంపకం పెంచాలని చెప్పారు. మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువులు పునర్వైభవం సంతరించుకోనున్నాయని, నీటి ప్రాజెక్టుల రిజర్వాయర్లు కూడా పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రానున్నాయని, వాటిలో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపట్టాలని సీఎం చెప్పారు. చేప విత్తనాల ఉత్పత్తిపై కూడా దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు.

ఈ సమీక్షలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి, పశుసంవర్దకశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ సంజయ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ మురళి, డైయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ నిర్మల, సమాచారశాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్, వ్యవసాయ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రవీణ్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.