Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతు సంక్షేమ రాజ్యం

-అన్నదాతల అభివృద్ధికోసం రాష్ట్ర సర్కారు తపన -నిన్న రుణమాఫీ, నేడు పంటసాయం -పంద్రాగస్టు నుంచి రైతు జీవిత బీమా -57 లక్షల రైతు కుటుంబాలకు భరోసా -వినూత్న పథకం విజయవంతానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు -పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రైతుబీమా అవగాహన సదస్సులు -అన్నదాతల బతుకుల్లో ఇక శుభఘడియలు -వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి -తెలంగాణ స్ఫూర్తితో ఇతర రాష్ర్టాల్లో రైతు ఉద్యమాలు -రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా

రైతును రుణవిముక్తుడిని చేసిన వ్యవసాయ రుణాల మాఫీ! రైతు పంటలకు సాగునీళ్లు అందించేందుకు కాలంతో పోటీపడి పూర్తవుతున్న ప్రాజెక్టులు! పొలాలకు నీళ్లు తోడుకునేందుకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా! సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు! తాజాగా.. అన్నదాతలు సాగుకు సిద్ధమయ్యేందుకు రైతుబంధు పేరిట వ్యవసాయ సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం పంపిణీ! దానితోపాటే రికార్డుల ప్రక్షాళనతో రైతు పట్టాలన్నింటికీ పక్కాగా లెక్కతేల్చి ఇచ్చిన కొత్త పాస్‌బుక్కులు! రైతును రాజును చేసే దిశగా అహరహం శ్రమిస్తున్న తెలంగాణ సర్కారు.. ఇప్పుడు మరో విప్లవాత్మక నిర్ణయాన్ని అమలుచేయబోతున్నది. రైతుకు అన్ని విధాలా అండగా ఉండటమేకాకుండా.. అనుకోని పరిస్థితుల్లో ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డునపడకుండా భరోసానిచ్చేందుకు పంద్రాగస్టు నుంచి 57 లక్షలమంది రైతులకు ఐదు లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నది. తద్వారా రైతు సంక్షేమాన్ని పరిపూర్ణం చేసేందుకు.. రాష్ర్టాన్ని రైతు సంక్షేమరాజ్యంగా మార్చేందుకు పునాదులేస్తున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చేపట్టని ఈ వినూత్ననిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంచేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా రైతు సమన్వయ సమితుల సహకారంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది.

ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతులకోసం అనేక సంక్షేమపథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ రైతుపక్షపాతిగా నిలిచారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రైతుబిడ్డకు పిల్లను ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అదే ప్రభుత్వ ఉద్యోగం బంట్రోతైనా పిల్లను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారన్నారు. దానికి కారణం ప్రతి రైతు కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోవడమేనన్నారు. రైతుకు అప్పు, రైతు తాతకు అప్పు, తండ్రికి అప్పు.. రైతు కొడుక్కూ, మనవడికి, చివరికి పుట్టబోయే మునిమనవడికి కూడా అప్పు ఉంటే రైతు కుటుంబాలు ఎలా బాగుపడతాయని మంత్రి ప్రశ్నించారు. స్వయానా రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి రైతుల బతుకులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రైతుల బతుకుల్లో శుభఘడియలు ప్రారంభమయ్యాయని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగే రోజులు త్వరలోనే చూడబోతున్నామని స్పష్టంచేశారు.

రక్తాన్ని చెమటగా మార్చి తిండి పెట్టేది రైతన్న: ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశంకోసం రక్తం చిందించేది వీర జవాన్లయితే.. తన రక్తాన్ని చెమటగా మార్చి తిండి పెట్టేది రైతన్నలని చెప్పారు. రైతులే తన సంపద అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదని, రైతు దుఃఖానికి చరమగీతం పాడే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకున్నదని తెలిపారు. ఏనోటితోనైతే తెలంగాణను అవహేళన చేసేలా మాట్లాడారో.. ఆ నోర్లే ఇప్పుడు తెలంగాణను పొగిడేలా చేసుకున్నామని చెప్పారు. కేంద్రం, ఆర్బీఐ తీరు మారాలని అన్నారు. పారిశ్రామికవేత్తల ముసుగులో నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా వంటివాళ్లు లక్షల కోట్లు ఎగ్గొడితే పట్టించుకోని బ్యాంకులు.. పేద రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్తే అనేక కోర్రీలు పెట్టాయని గుర్తుచేశారు. రూ.8.20 లక్షల కోట్లను నిరర్థక ఆస్తులుగా ప్రకటించిన బ్యాంకులు.. రైతు రుణమాఫీకి రూ.17వేల కోట్లు సహాయం చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో రైతుల కోసం రూ.17వేల కోట్లను మాఫీచేశారని గుర్తుచేశారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల స్ఫూర్తితో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లలో రైతులు ఉద్యమిస్తున్నారని తెలిపారు. రైతుల కోసం ముఖ్యమంత్రి అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా మారుతున్నాయన్నారు. రైతుల కోసం అమలుచేస్తున్న పథకాలను ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించినప్పుడు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలంగాణ వైపు చూశారని చెప్పారు. గుంట భూమి ఉన్న రైతుకు సైతం బీమా పథకం వర్తిస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఏజెన్సీలో గిరిజనేతర రైతుల వివరాలు సేకరించి వారికి బీమా సౌకర్యం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 48 గంటల్లోనే డబ్బులు చెల్లించినట్టు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.