Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతు సంక్షేమానికే భూప్రక్షాళన

-జనవరి 26న కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ -త్వరలోనే భూముల లెక్కలకు ముగింపు.. -తహశీల్దార్లకు సబ్‌రిజిస్ట్రార్ అధికారాలు పారదర్శకంగా.. -ప్రణాళికాబద్ధంగా భూ ప్రక్షాళన నిర్వహిస్తున్నాం -అనంతరం అర్బన్ ల్యాండ్ వెరిఫికేషన్ -26 భద్రతా ప్రమాణాలతో పాస్‌పుస్తకాలు రూపొందిస్తున్నాం -నెలపాటు నీళ్లలో పడేసినా పాడుకావు.. -పాసుపుస్తకాలపై రాసేందుకు ప్రత్యేక పెన్నులు -కొరియర్‌ద్వారా రైతుల ఇండ్లకే చేరవేస్తాం -రెవెన్యూ బలోపేతానికి వెయ్యి కొత్త ఉద్యోగాలు -సాదాబైనామాల క్రమబద్ధీకరణలో రికార్డు.. -రైతు సమితుల చట్టంకోసం త్వరలో మార్గదర్శకాలు -నయీం ఆక్రమిత భూముల వివరాలు సభలో పెడుతాం.. -మియాపూర్ భూములపై చర్చకు సిద్ధం -అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. -రైతుకు ఒకే సర్వే నంబర్ ఉండాలని ప్రతిపాదన

రైతుల సంక్షేమం కోసమే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతులు ఆనందంగా ఉండేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా రైతుల్లో సంతోషం నింపుతామని చెప్పారు. మంగళవారం శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. అనంతరం సభ్యులు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చారు. భూ రికార్డుల ప్రక్షాళన పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్నదని తెలిపారు. దశాబ్దాల నిర్లక్ష్యాన్ని పరిష్కరించేందుకు చేపడుతున్న ఈ ప్రక్రియలో భాగంగా త్వరలోనే భూముల లెక్కలకు ముగింపు పలుకబోతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియను డిసెంబర్ 31వ తేదీతో ముగించి.. జనవరి 26వ తేదీన రైతులకు కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలు అందజేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఆ రోజున తమ తమ నియోజకవర్గాల్లో రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాలు అందజేయాలని కోరారు. నెలపాటు నీళ్లలో నానినా పాడుకాని విధంగా కొత్త పాసుపుస్తకాలు రూపొందిస్తున్నామని చెప్పారు. అత్యంత భద్రతాప్రమాణాలతో ఇవి ఉంటాయని తెలిపారు.

బాధ్యతతోనే ప్రక్రియ మొదలుపెట్టాం భూముల లెక్కలు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందునే.. రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. రికార్డుల ప్రక్షాళన నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నది కాదని స్పష్టంచేశారు. సుమారు 30 నుంచి 40 సమావేశాలు ఏర్పాటుచేసి, సమీక్షించి, ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నూటికి నూరు శాతం పారదర్శకతతో భూరికార్డుల ప్రక్షాళన జరుగుతున్నదని సీఎం చెప్పారు.

తెలంగాణది ఎడతెగని దుఃఖం తెలంగాణ ప్రజల కష్టం, ఎడతెగని దుఃఖం, రాసుకుంటే రామాయణం.. వింటే భారతం అవుతుంది. గత ప్రభుత్వాల దశాబ్దాల నిర్లక్ష ఫలితమిది. ప్రభుత్వం తరఫున మేం చేసేది చూస్తుంటే.. తప్పో ఒప్పో తెలిసివస్తది. సత్యదూరం అయిన ప్రకటనలుచేసే అవకాశం లేదు. తప్పుడు రికార్డులవల్ల పైరవీకారులు, ల్యాండ్‌మాఫియా, నకిలీ పత్రాలదారులు, డబుల్ రిజిస్ట్రేషన్‌దారులు లబ్ధిపొందుతున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుజ్జులతండా గ్రామంలో భయంకరమైన తేడాలున్నాయి. గ్రామంలో కాస్రాలో 1403 ఎకరాలుండగా.. 1బీలో 1795.13 ఉంది. లెక్కల్లో తేడా 392, మాతుసంగెంలో కాస్రాలో 1975 ఎకరాల 35 గుంటలుండగా.. 1బీలో 5251లో ఉంది. తేడా 3250. ఇంత ఘోరమైన తేడా ఉంది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం కేశవరం గ్రామంలో మిషన్ భగీరథ సమయంలో గమనిస్తే పెద్ద గందరగోళం ఉంది. లకా్ష్మపూర్ గ్రామానికి రెవెన్యూ మ్యాపేలేదు. విపక్ష ఎమ్మెల్యే భట్టివిక్రమార్క షేర్‌షా సూరి, మన్రోల వివరాలు చెప్తున్నారు. వాళ్లు తెలంగాణ సంస్కృతికి సంబంధం లేని వారు.

హైదరాబాద్ నగరంతోపాటు, విద్యాసంస్థలు, దవాఖానలువంటివన్నీ నిర్మించిన ప్రాతఃస్మరణీయుడు సాలార్‌జంగ్-1. పూర్తిచేసింది సాలార్‌జంగ్-2. ఈ విషయంలో సవరణలకు నేను సిద్ధం. 1932-34లో అప్పటి నిజాం జాగీర్దార్లు, జమీందార్లు ఉండగా సర్వే సెటిల్‌మెంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. నిజాంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే మా అభిప్రాయాలు మాకున్నాయి. ప్రపంచంలో ఎవరూచేయని మంచి పనులు చేసిన ఘనత నిజాం రాజుది. ఆదిలాబాద్ జిల్లాలో కుమ్రంభీం అనే ఆదివాసి యోధుడు జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో పోరాటం చేస్తే.. స్థానికంగా ఎందరో ఉన్నప్పటికీ హైమన్‌డార్ఫ్ అనే విదేశీయుడిని కమిషనర్‌గా వేసి మరీ రికార్డుల ప్రక్షాళనచేశారు. లక్ష ఎకరాలు ఆ కాలంలో పాత ఆదిలాబాద్ జిల్లాలోని వారికి పంచారు. రాజుగా ఉండి కూడా న్యాయవ్యవస్థను సర్వ స్వతంత్ర వ్యవస్థగా ఏర్పాటుచేశారు. ఇలా ఏర్పాటుచేసిన మొట్టమొదటి వ్యక్తి నిజాం. సమైక్యపాలకులు ఆనాటి చరిత్రను మలినంచేయడంవల్ల ఇలాంటి విషయాలు వెలుగులోకి రాలేదు. నా వరకు నా కుటుంబం విషయంలో నిజాం చర్యలవల్ల మేలుకలిగిన ఉదంతాలున్నాయి. 1931-40లో అప్పర్ మానేరుడ్యాంలో భూమి పోతే నిజాం ఇచ్చిన పరిహారం సరిపోనందున మా తండ్రిగారు కోర్టును ఆశ్రయించగా మరో 70 వేలు అదనంగా ఇవ్వమని తీర్పువచ్చింది. దీన్ని గౌరవించిన నిజాం ఆ మేరకు మాకు డబ్బు చెల్లించారు. తెలంగాణభూముల కోసం నక్ష వేసింది కూడా ఆయనే. నిజాం ఏలుబడిలో పలు రాష్ర్టాల వారికి భాగస్వామ్యం ఉన్నందున ఇప్పటికీ మన రెవెన్యూ రికార్డులో సేత్వారి, గోశ్వార్ వంటి పదాలు ఉన్నాయి అని సీఎం చెప్పారు.

ఇంత పక్కాగా.. లెక్కలు చేస్తున్నాం భూరికార్డుల ప్రక్షాళనలో పార్ట్ బీలో ఎక్కువ భూమిని చూపిస్తున్నారన్న విపక్ష ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అభ్యంతరాలు, అనుమానాలను సీఎం కేసీఆర్ నివృత్తిచేశారు. ప్రస్తుతం రెండు భాగాలుగా ప్రక్షాళన జరుగుతున్నదని సీఎం చెప్పారు. భూములకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు, ఫారెస్ట్, కోర్టు పరిధిలో ఉన్న భూముల జోలికి పోవద్దని అధికారులకు సూచించామని తెలిపారు. రెండోది.. కుటుంబ సభ్యుల మధ్య భూవివాదాలు ఉంటే వాటి వద్దకు అధికారులు వెళ్లడం లేదని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండే భూములను ప్రక్షాళన చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు. తామేమీ ఆషామాషీగా ఈ ప్రక్షాళన చేయడం లేదని సీఎం స్పష్టంచేశారు. రంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లు, మిర్యాలగూడ, భువనగిరి ఆర్డీవోలతో పైలట్ ప్రాజెక్టుకింద అధ్యయనంచేయించి ముందుకు సాగుతున్నామని వివరించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ భూభాగం 2.76 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 10,885 రెవెన్యూ గ్రామాలు, 10,806 గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

మొదటగా గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలని సూచించాం. గ్రామీణ ప్రాంతాలకు మొదటగా ఎకరానికి 4వేల పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతాయి. 1,418 అధికారుల బృందాలు ఎండ, వానకు తట్టుకొని.. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. సెప్టెంబర్ 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 31న ముగుస్తుంది. జనవరి 26న కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందిస్తాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60% భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. మిగిలిన 40% త్వరలోనే పూర్తవుతుంది. మొదటి విడుతగా 6,246 గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. మూడు వేల గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తయింది. 14 జిల్లాల్లో 90% కార్యక్రమం పూర్తిచేశారు. జగిత్యాల జిల్లాలో ఇది 99 శాతంగా ఉంది. గ్రామంలో వివాదం లేకుండా ఎవరి భూమిని వారికి నిర్ధారించిన తర్వాత ఎవరి భూమి ఎంత అని పారదర్శకంగా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. మైక్ పెట్టి ప్రకటించడంతోపాటు గ్రామంలోని రైతులందరి భూముల వివరాలను గ్రామపంచాయతీ లేదా, పాఠశాల గోడలకు అతికించాలని సూచించాం. ఇలాంటి చర్యల ద్వారా 100 శాతం పారదర్శకత ఉంటుంది అని సీఎం వివరించారు.

వందల కోట్లు ఖర్చు చేయలేదు.. భూరికార్డుల ప్రక్షాళనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకోసం రూ.7.35 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని సీఎం వివరించారు. వందల కోట్లు ఖర్చు పెట్టారని భట్టి విక్రమార్క అనడం కరెక్ట్ కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీది వింతవైఖరి. అసెంబ్లీలో వివరణ ఇస్తే ఏకపక్షం అంటారు. పత్రికల్లో ఇస్తే సొంత ప్రచారం చేసుకుంటున్నారని అంటారు. ఇదేం వైఖరి? అని సీఎం ప్రశ్నించారు.

నయీం ముఠాను సృష్టించింది ఎవరు? నయీంలాంటి నరరూప రాక్షసులను పెంచిపోషించింది ఎవరు? సృష్టించింది ఎవరు? అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు. నయీం భూములు అనేటివి ఉండవని సభ్యులు తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. నయీం అనే వ్యక్తి మామూలు ప్రజల భూములను లాక్కున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై వివరాలు వచ్చిన తర్వాత సభ ముందు పెడుతాం. మియాపూర్ భూములపై పూర్తిస్థాయిలో వివరాలు సభముందు ఉంచడమే కాకుండా చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

గందరగోళం సరిదిద్దే డైనమిక్ నిర్ణయం భూముల రికార్డుల విషయంలో ఇప్పటివరకు గందరగోళం ఉందని సీఎం అన్నారు. మీసేవా విధానం ఫెయిలయింది. వెబ్ ల్యాండ్ అనేది ఓ గందరగోళం. ఈ రికార్డులను సరిచేసుకోవాలంటే కలెక్టరేట్లో మూడు నెలల పైగా ఉండాల్సి వస్తున్నదని ఎమ్మెల్యేలే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని సరిదిద్దుకునేందుకు డైనమిక్ నిర్ణయం రావాలి. మన దేశ పార్లమెంటు కమిటీలతోపాటుగా విదేశాల్లోని అధ్యయనాల ప్రకారం కూడా సమగ్ర, సరైన సమాచారం ఉంటే రెండు శాతం వృద్ధి రేటు కనిపిస్తుంది. అందుకే నిర్ణయం తీసుకున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.

రెవెన్యూ ఉద్యోగులకు అభినందనలు భూరికార్డుల ప్రక్షాళనలో ఎండ, వానకు తట్టుకొని రాత్రింబవళ్లు కష్టపడుతున్న రెవెన్యూ సిబ్బందిని రాష్ట్ర రైతాంగం తరపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిగా పనిచేసిన సిబ్బందికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించారు. యువ కలెక్టర్లు మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిన తర్వాత అర్బన్ ల్యాడ్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని సీఎం వివరించారు.

సాదా బైనామాల పరిష్కారంలో రికార్డు సాదా బైనామాల విషయంలో తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 2,93,654 దరఖాస్తులు వస్తే ఫీజు తీసుకొని 11,653 దరఖాస్తులు పరిష్కరించారు. అంటే కేవలం నాలుగు శాతం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. మా ప్రభుత్వంలో సాదాబైనామాలకోసం 11,19,111 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 6,18,368 దరఖాస్తులను పరిష్కరించాం. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. ఇవన్నీ ఒక్కరూపాయి కూడా ఫీజు తీసుకోకుండా చేసినవి. మిగతావాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు 55 లక్షల మంది ఉన్నారన్న అంచనా ఉందని, రికార్డుల ప్రక్షాళనతో రైతుల సంఖ్య ఎంతో స్పష్టంగా తెలుస్తుందని సీఎం చెప్పారు.

26 భద్రతా ప్రమాణాలతో పట్టాదార్ పాస్‌పుస్తకం కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలను 26 భద్రతా ప్రమాణాలతో రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. పాస్‌పోర్టు తరహాలో పటిష్టంగా పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉంటాయన్నారు. కొత్తగా వచ్చే పట్టాదార్ పాస్‌పుస్తకాలు నెల రోజులు నీటిలో పడేసినా ఏమీ కానంత భద్రంగా వాటర్ ప్రూఫ్‌తో ఉంటాయని చెప్పారు. ప్రత్యేకమైన పెన్నుతో రాస్తేనే తప్ప ఇష్టమొచ్చిన పెన్నుతో రాస్తే దానిపై పడదు. సంబంధిత అధికారులకు కేటాయించిన ప్రత్యేకమైన పెన్నులతోనే ఆ పాస్‌పుస్తకాలపై రాసే వీలుంటుంది. పాస్‌పుస్తకాల కోసం రైతులు తిరుగాల్సిన అవసరం లేకుండా.. వాటిని కొరియర్‌ద్వారా వారి ఇంటికి చేరుస్తాం అని సీఎం చెప్పారు. ప్రతి రైతుకు ఒక సర్వే నంబర్ కేటాయించాలనేది తన ప్రతిపాదన అని సీఎం తెలిపారు. రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఒకే సర్వే నంబర్ ఇస్తే బాగుంటుందని చెప్పారు. తద్వారా బై నంబర్లు ఇతరత్రా తలనొప్పులు తప్పుతాయని అభిప్రాయపడ్డారు.

తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారం రాష్ట్రంలోని 445 తహశీల్దార్ కార్యాలయాలకు సబ్ రిజిస్ట్రార్ అధికారాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. తహసీల్దార్లకు మ్యుటేషన్ అధికారం ఇస్తాం. 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలను యథాతథంగా కొనసాగిస్తాం. 1000 మంది ఐటీ అధికారులను శాశ్వత ప్రాతిపదిక నియమిస్తాం. రెవెన్యూడిపార్ట్‌మెంట్ ఐటీ ఆఫీసర్ అనేది వీరి పేరు. సర్వర్ డౌన్ వంటి సమస్యలు రాకుండా బ్యాండ్‌విడ్త్ కల్పిస్తాం. తద్వారా రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఒకసారి వెళ్తే సరిపోయేలా చేస్తాం. భూముల క్రయ, విక్రయాల వివరాలు ఒక్క రోజులోనే ఆన్‌లైన్‌లో తెచ్చేందుకు ఈ సంస్కరణలు. కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ మాదిరిగా ఎక్కడ లావాదేవీ జరిగినా.. వెంటనే అప్‌డేట్ అయ్యేలా భూముల వివరాలు తీసుకువస్తాం. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు అధికారులు పాస్ పుస్తకం తనఖా పెట్టుకునే సమస్యను తొలగించి, ప్రభుత్వ వెబ్‌సైట్లోనే ఏ రైతుకు ఎంత, ఎక్కడ భూమి ఉందో తెలిసేలా ఆన్‌లైన్లో సమస్తం అప్‌డేట్ చేస్తాం. ఇందుకోసం డబ్బు ఖర్చయినా భరించేందుకు సిద్ధం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.

మా సొంతూరిలో కూడా.. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులవల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయని సీఎం కేసీఆర్ వివరించారు. నా స్వగ్రామం చింతమడక దగ్గర ఉన్న పడమటిగడ్డలో 93 ఎకరాల భూమిని 136 మందికి పంచారు. ఒక్కదానికీ తొవ్వ లేదు. అక్కడికి ఎలా వెళ్లాలి? అనేది వారే చెప్పాలి. ల్యాండ్ సీలింగ్ చట్టం చేసిన పీవీ నరసింహారావుకు అభినందనలు. లేకుంటే మరింత అసమగ్రంగా ఈ రికార్డులు ఉండేవి అని అన్నారు. జీవో 58 ద్వారా 3,36,694 దరఖాస్తులు రాగా ఇందులో హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయని సీఎం తెలిపారు. 1,25,000 మంది పేదలకు ఉచితంగా భూమిని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేశాం. జీవో 59 కింద 28,191 దరఖాస్తుల వస్తే 13,500 పరిష్కారమయ్యాయి. జీవో 59 ద్వారా రూ.530 కోట్ల ఆదాయం అంచనా వేయగా.. ఇప్పటికి 330 కోట్లు వచ్చింది. అని వివరించారు. రైతు సమన్వయ సమితులకు సంబంధించి ఇప్పటివరకు చట్టం రూపొందించలేదని, త్వరలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.