Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతు సంతోషమే ధ్యేయం..

రైతుల సంతోషమే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేయాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రైతు సమస్యలకు, వ్యవసాయానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూరేలా మార్కెటింగ్‌శాఖ సిబ్బంది, మార్కెట్ కమిటీ చైర్మన్లు పనిచేయాలని సూచించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం పెంచేందుకే మార్కెటింగ్‌శాఖ చరిత్రలో తొలిసారిగా భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్డీలో ఖరీఫ్ సీజన్‌కు మార్కెటింగ్ సన్నద్ధత, ఈ-నామ్, అభివృద్ధి కార్యకలాపాలపై వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడున్న చట్టంలో మార్పులు చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త చట్టం తీసుకురాబోతున్నట్టు మంత్రి తెలిపారు. -త్వరలోనే తెలంగాణ మార్కెట్ చట్టం -ఈ-నామ్ అమలుతోరైతుకు మరింత లాభం -దశలవారీగా పెద్ద మార్కెట్లల డ్రయ్యర్ల ఏర్పాటు -మార్కెటింగ్‌శాఖ వర్క్‌షాప్‌లో మంత్రి హరీశ్‌రావు

harish-rao-addressed-the-gathring-in-marketing-department-meeting

మార్కెటింగ్‌శాఖను మరింత బలోపేతం చేస్తున్నామని, కొత్తగా ఏర్పాటు చేసిన 30 మార్కెట్ యార్డులకు అదనంగా మరో పది యార్డులు నెలకొల్పనున్నామని చెప్పారు. ఈ సదస్సులో వ్యవసాయశాఖ కార్యదర్శి సీ పార్థసారథి, వ్యవసాయశాఖ కమిషనర్ ఎం జగన్మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ముంబై) డైరెక్టర్ చొక్కలింగం, పౌరసరఫరాల శాఖ జనరల్ మేనేజర్ రవికుమార్, నాగార్జున ఫర్టిలైజర్స్, కెమికల్స్ చైర్మన్ శ్యాముల్, నూతన మార్కెట్ కమిటీల చైర్మన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెటింగ్‌శాఖ అమలు చేస్తున్న రైతుబంధు, ఈ-నామ్ పోస్టర్లు, కరపత్రాలను, మార్కెటింగ్‌శాఖ నిబంధనలు తెలిపే ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సదస్సునుద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, బాగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిని కోరి ప్రత్యేకంగా ఈ శాఖను తీసుకున్నానని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మార్కెటింగ్‌శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

మార్కెటింగ్‌శాఖలో అనేక సంస్కరణలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెటింగ్‌శాఖలో అనేక సంస్కరణలను తెచ్చామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ధాన్యంలో తేమ శాతం కారణంగా రైతులకు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించి పంజాబ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ధాన్యం ఆరబెట్టే యంత్రాన్ని జనగామ మార్కెట్‌యార్డులో ఈ ఏడాది ఏర్పాటు చేశామన్నారు. దశలవారీగా పెద్ద మార్కెట్లలో డ్రయ్యర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతుకు దగ్గరగా మార్కెట్‌యార్డులు ఉంటే మరింత మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో సీఎం సూచనల మేరకు కొత్తగా 30 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేశామని, మొత్తం వాటి సంఖ్య 180కు చేరుకుందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో మార్కెటింగ్‌శాఖ ఈ ఏడాది 8 లక్షల 88వేల మొక్కలు నాటినట్టు చెప్పారు.

గతేడాది 4 లక్షల 15వేల మొక్కలు నాటితే 87శాతం మొక్కలు బతికాయని తెలిపారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు కనీస మౌలిక వసతులు, విశ్రాంతి తీసుకునేందుకు రైతు విశ్రాంతి భవనాలు, మహిళా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చేచోట మహిళా రైతు విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుకు ఎంతో మేలు చేసే ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. రైతులకు, మార్కెట్‌యార్డుల్లో పనిచేసే సిబ్బందికి ప్రమాద బీమా కల్పించే ఉద్దేశంతో రైతుబీమా పథకాన్ని తీసుకువచ్చినట్టు చెప్పారు. ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కనీస మద్దతు ధర కల్పించేలా మార్క్‌ఫెడ్, ఎఫ్‌సీఐ, సీసీఐ వంటి సంస్థలను రంగంలోకి దింపి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామన్నారు.

marketing-department-meeting

వినియోగదారులకు, రైతులకు మేలు జరిగేలా ప్రతి డివిజన్‌కు ఒక రైతుబజార్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. రైతు చేతుల్లో ధాన్యం ఉన్నప్పుడు ధర తక్కువగా ఉంటుందని, మధ్య దళారుల చేతుల్లోకి వెళ్లగానే రెండు నెలల్లోనే ధర రెట్టింపు అవుతున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దీన్ని నియంత్రించి రైతు పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ధాన్యాన్ని దాచుకునేందుకు రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చినట్టు చెప్పారు. రైతు మార్కెటింగ్‌శాఖ గోదాంలో ధాన్యం పెట్టగానే 75శాతం సొమ్మును ఎలాంటి గ్యారెంటీలు లేకుండానే ఇస్తున్నట్టు తెలిపారు. రైతుకు ఆరునెలల్లోపు తనకు ఇష్టంవచ్చినప్పుడు అమ్ముకునే వీలుంటుందన్నారు. దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర కల్పించగలుగుతామన్నారు. ప్రస్తుతానికి ఈ పథకాన్ని హుజూర్‌నగర్, కోదాడలో ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు.

రబీలో దిగుబడి పెరుగుతుంది ఇటీవల కురిసిన వర్షాలతో జలవనరులు బాగా పెరిగాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌తో చేపట్టిన మిషన్ కాకతీయతో రాష్ట్రంలోని 30వేల చెరువులు పూర్తిగా నిండాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అదేవిధంగా ప్రాజెక్టుల్లో నీటి వనరులు పెరిగినందున ఈ రబీలో పంటల దిగుబడి చాలా పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతులు, వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, రైతుకు కావాల్సిన నీరు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా 25వేల కోట్లు బడ్జెట్‌లో ఖర్చుచేసి ప్రాజెక్టులు పూర్తిచేస్తుందన్నారు. కాళేశ్వరం, పాలమూరు పథకాలు పూర్తయితే వర్షాలు లేకున్నా పంటలు పండించుకోవచ్చన్నారు. రైతు రుణమాఫీపై ఏటా రూ.4వేల కోట్లు, రైతుకు నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చేందుకు రూ.4,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. బడ్జెట్‌లో దాదాపు 35శాతం రైతు, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. ఇవికాకుండా రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేలా విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి ఈ ఏడాది రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు.

ఇబ్బందులు ఎదురైనా ఈ-నామ్ అమలు తప్పనిసరి నూతన విధానాలు అమలులోకి వస్తున్నప్పుడు చిన్నచిన్న ఇబ్బందులు సహజమేనని, అయితే ఎన్ని సమస్యలు ఉన్నా రైతుకు ఎంతో మేలు చేసే ఈ-నామ్ (ఎలక్ట్రానిక్) విధానాన్ని తప్పక అమలుపరుస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ విధానంలో తూకం సక్రమంగా జరుగుతుందని, సకాలంలో రైతులకు చెల్లింపులు జరుగుతాయని, అన్నింటికీ మించి రైతు ఉత్పత్తులకు పోటీతత్వం పెరిగి మంచి గిట్టుబాటు ధర ఇప్పించగలుగుతామని తెలిపారు. ఈ-నామ్ అమలుతో లాభాలు తగ్గుతాయని ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లు అపోహ పడుతున్నారని, ఆ అనుమానాలను పోగొట్టేందుకు త్వరలోనే వారితో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

నాణ్యతపై రాజీలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మండలానికి ఒక గోదాం ఉండాలన్న సీఎం కేసీఆర్ సూచనతో కొత్తగా 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రూ.1024కోట్లు ఖర్చు చేసి 330 గోదాంలు నిర్మిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గోదాంలు అందుబాటులోకి వస్తే మండలాలవారీగా రైతులు ఎరువులు, విత్తనాలు, పౌరసరఫరాల బియ్యం, రైతుబంధు పథకంలో ధాన్యం నిల్వ.. ఇలా బహుళ ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చన్నారు. గోదాం ల నిర్మాణంతోపాటు అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ఏమాత్రం రాజీపడకుండా థర్డ్‌పార్టీ దర్యాప్తు చేయిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ గోదాంలు అందుబాటులోకి వస్తున్నందున ప్రైవేట్ గోదాంల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి సీ పార్థసారథి మాట్లాడుతూ, మార్కెటింగ్ వ్యవస్థపై రైతుల్లో నమ్మకాన్ని కలిగించేలా చైర్మన్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్టు, రైతు తలరాతను రాసేవాటిలో వర్షాలు, మార్కెట్ ధర అత్యంత ప్రధానాంశాలన్నారు. మార్కెటింగ్‌శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్ లక్ష్మీబాయి మార్కెటింగ్‌శాఖ చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. రైతులకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్ అన్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తరలింపుపై ఆలోచన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ప్రస్తుతం ఉన్న చోటునుంచి మరోచోటికి తరలించాలంటూ వస్తున్న ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం నాడిక్కడ ఎన్‌ఐఆర్డీలో ఖమ్మం, వరంగల్ మార్కెట్ కమిటీల చైర్మన్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్థలం సరిపోవడం లేదని, ఇరుగ్గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైనప్పుడు విశాలమైన మరో స్థలం ఎంపిక చేసి తరలించే ప్రతిపాదనలు పరిశీలిస్తామని మంత్రి అన్నారు. అయితే ఈ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా మార్కెట్‌ను ఎంతమేరకు వీలైతే అంతవరకు విస్తరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల పునర్విభజన పూర్తయినందున ఆయా జిల్లాల్లో ఎప్పటికప్పుడు వ్యవసాయ మార్కెట్లను సందర్శించి అక్కడి స్థితిగతులు పర్యవేక్షించాలని కలెక్టర్లను కోరారు. రైతులకు మేలు జరిగేలా సహకరించాలని ట్రేడర్లను మంత్రి కోరారు. ట్రేడర్లకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, వారి సమస్యలు పరిష్కరిస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.