Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతుకు పక్కాగా పట్టాభిషేకం

-సేద్య ప్రగతికి మరిన్ని దారులు

దేశ ఆర్థికాభివృద్ధికి ఆస్తిహక్కు పునాది రాయి అని ఆధునిక పెట్టుబడిదారీ విధానకర్త ఆడం స్మిత్‌ ప్రవచించారు. కార్ల్‌ మార్క్స్‌ కూడా ఆస్తిహక్కు పాత్ర గురించి కీలక సూత్రీకరణలు చేశారు. విపణిలో క్రయవిక్రయాలకు, ఇతర లావాదేవీలకు ఆస్తిహక్కులు ప్రాతిపదికగా నిలుస్తాయి. ఈ హక్కులు ఎంత సమర్థంగా సంక్రమిస్తే అంత దీటుగా వనరులు వినియోగమవుతాయి. భూమి, ఇతర స్థిర చరాస్తులు ఉన్నవారు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. నవీకరణకు ప్రాధాన్యమిచ్చి ఉపాధి అవకాశాలు సృష్టిస్తారు. తద్వారా యావత్‌ ఆర్థిక రంగ పురోగతికి ఇరుసుగా నిలుస్తారు. ఆస్తిహక్కు అనగానే మొదట గుర్తొచ్చేది భూమిపై యాజమాన్య హక్కు మాత్రమే. నిజానికి దాన్ని హక్కు అనడంకన్నా హక్కులంటే సబబుగా ఉంటుంది. తన ఆస్తిని స్వీయ చిత్తానుసారం ఉపయోగించుకునే హక్కు, సదరు ఆస్తి నుంచి ఆదాయం ఆర్జించే హక్కు, సొంత ఆస్తిని ఇతరులకు బదలాయించే హక్కు, వీటిని చట్టప్రకారం అమలు చేయించుకునే సౌకర్యం… ఇవన్నీ ఆస్తిహక్కు కిందకు వస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర రావు రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేయడం ద్వారా భూమిపై హక్కును ఖరారు చేశారు. వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం ‘రైతుబంధు’ పథకం కింద వారికి నేరుగా నగదును బదిలీ చేస్తున్నారు. ఇది నిజంగా విప్లవాత్మక చర్య. ఇది రాష్ట్ర ఆర్థిక అభ్యున్నతికి గొప్ప ఊతమివ్వనుంది. మధ్య యుగాల్లో ఐరోపా దేశాలు తమ రైతులకు భూ యాజమాన్య హక్కులు కల్పించడం- సమర్థ విపణి వ్యవస్థ ఉద్భవించి వర్ధిల్లడానికి తోడ్పడింది. అంతకుముందు రాజకీయాధికారం వంశపారంపర్య రాచరికాల గుప్పిట్లో ఉండేది కాబట్టి రైతులను, చేతి వృత్తులవారినీ నిలువు దోపిడి చేస్తుండేవారు. వ్యాపారులపై ఎడాపెడా పన్నులు వేయడం, ధనికుల నుంచి తీసుకున్న అప్పులు ఎగ్గొట్టడం నాటి రాజులకు, కులీనులకు అలవాటు. వారు ఎవరి ఆస్తిని ఎప్పుడు లాక్కుంటారో ఎవరికీ తెలియదు. ఇలాంటి అవ్యవస్థలో భూ యజమానులు, వ్యాపారులు భూముల్లో కాని, మానవ వనరుల అభివృద్ధికి కాని, సాంకేతిక నవీకరణలకు కాని పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేవారు కారు. ఇంగ్లండ్‌లో కొన్ని కారణాల వల్ల 12వ శతాబ్దంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో తమ కౌలు విలువను పెంచుకోవడానికి రాజు, కులీనులు 13వ శతాబ్దంలో కొత్త భూ చట్టాలు తీసుకొచ్చారు. ఈ దోపిడి చట్టాలకు వ్యతిరేకంగా 1642లో ఇంగ్లండ్‌లో అంతర్యుద్ధం విరుచుకుపడింది. 1688లో గ్లోరియస్‌ విప్లవం సంభవించింది. ఈ పరిణామాలతో రాజకీయాధికారం రాజు చేతి నుంచి జారిపోయి భూ యజమానుల, పెట్టుబడిదారుల ఆస్తిహక్కులు పటిష్ఠమయ్యాయి. దీంతో ఇంగ్లండ్‌లో ఆర్థిక కార్యకలాపాలు ఉద్ధృతమై పారిశ్రామిక విప్లవానికి బాట వేశాయి.

సుదీర్ఘ పోరాట ఫలితం ఆస్తిపర వర్గాలు ఆర్జించే కౌలు, లాభాలకు చట్టపరమైన, రాజకీయపరమైన భద్రతలు ఉంటాయి. హక్కుల కోసం పోరాడే సత్తా ఈ వర్గాలకు ఉండటంతో ఆస్తిహక్కులు, రాజకీయాధికార స్వరూప స్వభావాలు మారిపోవడం అనివార్యం. అయితే ఆస్తి లేని వర్గాలకు రాజకీయాధికారం కానీ, ఆర్థిక గుత్తాధిపత్యం కానీ లభించవు. పూర్వ హైదరాబాద్‌ సంస్థానంలో, బ్రిటిష్‌ పాలనలోని కోస్తాంధ్రలో ఇది స్పష్టంగా గోచరించింది. నిజాం పాలనకు గ్రామస్థాయిలో పోలీస్‌ పటేల్‌ (శాంతిభద్రతలు), మాలీ పటేల్‌ (రెవిన్యూ), పట్వారీలు (భూరికార్డుల సేకరణ, నిర్వహణ) మూలస్తంభాలుగా నిలిచేవారు. వీరికి పై అంచెలో గిర్దావార్‌, తహశీల్దార్లు (రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లు), తాలూక్‌దార్‌ (కలెక్టర్లు) ఉండేవారు. పోలీస్‌, మాలీ పటేల్‌, పట్వారీ పదవులు వంశపారంపర్యంగా సంక్రమించేవి. వారంతా నిజాముకు పరమ విధేయులుగా ఉండేవారు. పూర్వ హైదరాబాద్‌ సంస్థానంలోని 5.3 కోట్ల ఎకరాల భూమిలో 60 శాతంపై (మూడు కోట్ల ఎకరాలపై) ప్రభుత్వం శిస్తు వసూలు చేసేది. దీన్ని దివానీ లేదా ఖల్సా వ్యవస్థ అనేవారు. 1.5 కోట్ల ఎకరాలు (30 శాతం) జాగీర్దారీ వ్యవస్థ కింద ఉంటే, మిగిలిన 10 శాతం భూమి నిజాం సొంత భూమిగా పరిగణన పొందేది. నిజాం సొంత భూములను సర్పే ఖాస్‌ అనేవారు. 30 శాతం భూమి కొద్దిమంది జాగీర్దారుల గుత్త సొత్తు. మిగిలిన 10 శాతం భూమిపై నిజాం కుటుంబానికి సర్వంసహాధికారాలు ఉండేవి. జాగీర్దార్లలో చాలామంది నిజాం బంధువులు, అంతేవాసులే ఉండేవారు. దివానీ (ప్రభుత్వ) భూములకన్నా సర్పే ఖాస్‌, జాగీరు భూముల్లో భూమి శిస్తు 10 రెట్లు ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో పేద రైతుల నుంచి 110 మంది జాగీర్దారులు, పైగాదారులు ఏటా రూ.10 కోట్ల శిస్తు పిండుకునేవారు. తెలంగాణ రైతుల రక్తాన్ని పీల్చి పిప్పిచేసేవారు. నిజాం హయాములో తెలంగాణ వ్యవసాయ రంగం బొత్తిగా వెనకబడిపోయింది. ఈ ప్రాంతం సామాజికంగా, సాంస్కృతికంగా అణచివేతకు గురైంది. దీనిపై జనం తిరగబడ్డారు. దున్నేవాడిదే భూమి అంటూ ఉద్యమించారు. దాని ఫలితంగా భూ సంస్కరణలు అమలయ్యాయి. కౌలుదారీ చట్టం వర్తించింది. భూముల పంపిణీ మొదలైంది. కానీ, అప్పటి భూస్వామ్య వర్గాల ఒత్తిడి వల్ల కానివ్వండి, చట్టంలో, అధికార యంత్రాంగంలో ఉన్న లొసుగులవల్ల కానివ్వండి- తెలంగాణలో భూ పంపిణీ సవ్యంగా జరగలేదు. రైతులు తమకు పంపిణీ అయిన భూములపై నికార్సైన హక్కుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అభద్రత, ప్రభుత్వపరమైన అసమర్థత వారిని దెబ్బతీస్తున్నాయి. ఈ లోపాలవల్లనే తెలంగాణలో హరిత విప్లవం ముందుకు సాగలేదు. పలు రాష్ట్రాల్లో హరిత విప్లవం చలవతోనే రైతులు సంపన్నులై ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగ్గా, తెలంగాణలో అది సాధ్యపడలేదు.

తెలంగాణ జాగీర్దారీ వ్యవస్థ కింద ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటిష్‌వారు రైత్వారీ వ్యవస్థను అమలుచేశారు. అంటే ఆంధ్రలో రైతులే తమ పొలాలకు యజమానులు. వారికి స్పష్టమైన భూ హక్కులు ఉండేవి. బ్రిటిష్‌ వలస ప్రభుత్వానికి వారు నేరుగా భూమి శిస్తు కట్టేవారు. ఆంధ్ర రైతులు సక్రమంగా శిస్తు చెల్లిస్తున్నంతకాలం వారి భూములు లాక్కోవడం ఎవరి తరమూ కాదు. రైత్వారీ వ్యవస్థలో భూమి రైతు పేరు మీదే రిజిస్టరై ఉంటుంది కాబట్టి, దాన్ని అతడు వేరేవాళ్లకు కౌలుకు ఇవ్వొచ్చు. లేదా తనఖా పెట్టొచ్చు, అమ్ముకోవచ్చు, బహుమతిగా ఇవ్వొచ్చు. ఇష్టమైతే సేద్యం చేయవచ్చు లేదా మానుకోవచ్చు. తనకున్న మొత్తం భూమిలో కాని, కొంత భాగంలోకాని పంట వేసుకొనే స్వేచ్ఛ అతడికి ఉంది. ఆంధ్ర రైతు మీద జాగీర్దారుల నిర్బంధమేమీ లేదు. ఈ స్వేచ్ఛకు తోడు నీటిపారుదల వసతులు నెలకొనడం, హరిత విప్లవ కాలంలో ప్రభుత్వం నుంచి అండదండలు లభించడంతో ఆంధ్ర రైతాంగం, ముఖ్యంగా కృష్ణా గోదావరి డెల్టా రైతులు వ్యవసాయంలో మిగులు సాధించారు. క్రమంగా ఆ మిగులు పరిశ్రమలు, వినోదం, సేవా రంగాల్లోకి పెట్టుబడులుగా ప్రవహించింది. కోస్తాంధ్రతోపాటు హైదరాబాద్‌లోనూ ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయి. తెలంగాణ ఈ చారిత్రక పరిణామంలో వెనకబడింది. ఇప్పటికైనా తెలంగాణ రైతును భూమిపై నిజమైన హక్కుదారుడిగా నిలపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ సర్కారు నిశ్చయించింది. వ్యవసాయాన్ని ఆధునీకరించి, చిన్న సన్నకారు రైతులకు గిట్టుబాటైన వృత్తిగా మలచడానికి ఉద్యమ ప్రాతిపదికపై నడుం బిగించింది. తెలంగాణ రైతులకు భూములపై స్పష్టమైన హక్కులు ప్రసాదించడంతోపాటు రైతుబంధు కార్యక్రమం కింద సేద్యానికి పెట్టుబడులూ సమకూరుస్తోంది. దీంతోపాటు చెరువుల పునరుద్ధరణ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టి సేద్యానికి సమృద్ధిగా జల వసతి కల్పించడానికి కట్టుబడి ఉంది. తోడుగా విద్యుత్‌, గ్రామీణ రహదారులు, నిల్వ సౌకర్యాలు, పంట బీమా, వ్యవసాయ విస్తరణ సేవలు కల్పిస్తూ తెలంగాణ పల్లె జీవితాన్ని పరిపుష్టం చేస్తోంది. నిజాం ఫ్యూడల్‌ పాలనపై తిరగబడినప్పటి నుంచే తెలంగాణ రైతు తన భూమిపై తనకే స్పష్టమైన యాజమాన్య హక్కు ఉండాలని తపించాడు. కేసీఆర్‌ సర్కారు దాన్ని నెరవేరుస్తోంది. చిన్న, సన్నకారు రైతులను హరిత విప్లవంలో భాగస్వాముల్ని చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టీకరణకు శ్రీకారం చుడుతోంది. భూమిపై రైతుకు స్పష్టమైన యాజమాన్య హక్కు ఇచ్చిన దేశాలు వేగంగా ప్రగతి సాధిస్తాయని, ఆ హక్కు ఇవ్వని దేశాలు ఎదుగూబొదుగూ లేకుండా మిగిలిపోతాయని చరిత్ర చెబుతోంది. భద్రమైన ఆస్తిహక్కు, సమానావకాశాలు కల్పించడం ప్రగతికి అనివార్యం. భూమితోపాటు నీటి వసతీ ఉన్నప్పుడే అది అసలు సిసలు ఆస్తిహక్కు అనిపించుకుంటుంది.

అభివృద్ధికి ఆలవాలం కేసీఆర్‌ ప్రారంభించిన రైతు సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లడానికి ఈ నెల 18న ఓ కార్యశాల నిర్వహించారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీ, రైతుబంధు కింద నగదు పంపిణీ గురించి కార్యశాలలో చర్చించారు. ఈ సందర్భంగా తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఓలు, ఏఈఓలు, ప్రత్యేక అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు విలువైన సూచనలు చేశారు. వాటి సారాంశమేమంటే- పట్టాదారు పాస్‌ పుస్తకాలు, రైతుబంధు పథకాలకు రైతుల నుంచి గొప్ప స్పందన వస్తోంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందాలన్నా, ప్రభుత్వం నుంచి, వ్యవసాయ శాఖ నుంచి, సహకార సంస్థల నుంచి సేవలు పొందాలన్నా పట్టాదారు పాస్‌ పుస్తకాలను తప్పనిసరి చేయాలి. ఇంకా ఈ పుస్తకాలు అందనివారికి యుద్ధప్రాతిపదికపై వాటిని అందించాలి. సరైన అర్హతలున్న వీఆర్‌ఓలను కొత్తగా నియమించి పని పూర్తిచేయాలి. పాత వీఆర్‌ఓలకు వెంటనే పునశ్చరణ తరగతులు నిర్వహించి కొత్త రీతుల్లో శిక్షణ ఇవ్వాలి. ధరణి సాఫ్ట్‌వేర్‌ను మరింత సమర్థంగా ఉపయోగించడానికి వీలుగా రిజిస్ట్రేషన్‌ చట్టంలో తగు మార్పుచేర్పులు చేయాలి. పొలం గట్లను కచ్చితంగా నిర్ణయించాలి. అవసరమైన సందర్భాల్లో వ్యవసాయ భూములను గృహ నిర్మాణానికి మళ్లించడానికి అనువుగా ఖాళీ భూముల చట్టాన్ని సవరించాలి. సదాబైనామా అమలుకు కోర్టుల వల్ల అంతరాయం కలగకుండా జాగ్రత్త వహించాలి. రెవిన్యూ అధికారుల వద్ద పెండింగులో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు, ట్రైబ్యునళ్లను నెలకొల్పాలి. ఎవరికీ చెందని భూముల వ్యవహారాన్ని శీఘ్రంగా కొలిక్కి తెచ్చి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలి. తెలంగాణలో వ్యవసాయ విప్లవం తీసుకొచ్చినప్పుడు పారిశ్రామిక, సేవా రంగాలు మరింత శీఘ్రగతిన అభివృద్ధి సాధిస్తాయి!

– డాక్టర్‌ శ్రీ రమేశ్‌ చెన్నమనేని (రచయిత- రాష్ట్ర శాసన సభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.