Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతుకు బీమా 5 లక్షలు

-కేసీఆర్ మరో వరం -అనారోగ్యంతోనైనా.. అకాలమరణమైనా వర్తింపు -70 లక్షల మంది రైతులకు వ్యక్తిగత బీమా.. -మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరిస్త్తుంది -ఈ యాసంగి నుంచే మద్దతు ధరలు కల్పిస్తాం -సమిష్టితత్వంతోనే సమస్యల పరిష్కారం -రెండు పంటలు పండే భూమి కోటి ఎకరాలపైనే -సమైక్య పాలనలో 75వేల చెరువులను నాశనం చేశారు -ఈ ఏడాదే కాళేశ్వరం నుంచి మిడ్ మానేరుకు నీళ్లు -సాగునీటి ప్రాజెక్టులకు దేశంలోనే భారీ బడ్జెట్ మనది -పల్లెల్లో ఎల్‌ఈడీ బల్బులు గులాబీ జెండా పుణ్యమే -కౌలు రైతులకు పెట్టుబడి ఇవ్వడం సాధ్యంకాదు -కరీంనగర్ ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ -రైతు వేదికల నిర్మాణానికి ముందుకొచ్చిన దాతలు -పంట పెట్టుబడి వదులుకుంటామని పలువురి హామీ

అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ రైతు లోకానికి మరో వరాన్ని అందించారు. రాష్ట్రంలో 70లక్షలకుపైగా ఉన్న రైతులకు రూ.5 లక్షల చొప్పున వ్యక్తిగత బీమా పథకాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని స్పష్టంచేశారు. సోమవారం కరీంనగర్‌లో రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజమాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వరంగల్‌రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సభ్యులు హాజరయ్యారు. సదస్సులో ఉదయం గంటా పది నిముషాలపాటు ప్రసంగించిన ముఖ్యమంత్రి, మధ్యా హ్నం సెషన్‌లో రైతుల ప్రశ్నలకు వివరంగా సమాధానాలిచ్చారు. వ్యవసాయరంగం బాగుకోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలు, రైతులు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు.

అన్నదాతలకు బీమా పథకం కరీంనగర్ గడ్డపై నుంచి నేను ఏది ప్రకటించినా సఫలీకృతమైంది. ఇదే గడ్డపై నుంచి ఈరోజు సంతోషకరమైన వార్త తెలంగాణ రైతు లోకానికి చెప్తున్నా. రైతులు అనారోగ్యానికి గురైనా, అకాల మరణం చెందినా ఐదు లక్షల రూపాయలు వ్యక్తిగత బీమా వర్తించే విధంగా రైతు బీమా పథకాన్ని ప్రకటిస్తున్నా. ఇందుకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ వేదికపై నుంచే అర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు చెప్తున్నా.. ఇంకా 500 కోట్లు అప్పు త్చ్చైనా సరే మన 70 లక్షల మంది రైతులకు బీమా చెల్లించాల్సిందే అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ సమయంలో సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది. జై కేసీఆర్ అంటూ అన్నదాతలు నినాదాలుచేశారు. సభావేదిక పైనున్న ప్రజాప్రతినిధులందరూ ఒక్కసారిగా లేచి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. బీమా చేయించే విషయంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు నాయకత్వం వహించాలని కేసీఆర్ సూచించారు. న్యాయబద్ధంగా ఒక్క రైతును విస్మరించకూడదని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు త్వరలో వస్తాయన్నారు.

సమిష్టితత్వమే సమస్యకు పరిష్కారం బాధ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా.. ఇవి రాజకీయ పదవులు కావు. మీరు తీసుకున్న బాధ్యత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే కొంత కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదు. ఒక్కరుగా ఏమీ చేయలేం. అదే సమిష్టిగా, సమూహంగా కదిలితే ప్రభుత్వం, రాజ్యాలే తలవంచుతాయి. దీనికి ఉదాహరణ ప్రత్యేక తెలంగాణ కోసం పదిహేనేండ్లు మనం చేసిన పోరాటమే. కరీంనగర్ గడ్డ మీద నుంచి సింహగర్జన చేసి ప్రారంభించి, తెలంగాణ సమూహం ఒక్కటై స్వరాష్టాన్ని తెచ్చుకున్నాం. ఈరోజు రైతాంగాన్ని పూర్తిస్థాయిలో ఆదుకుని, అన్ని రకాలుగా పైకి తేవడం బ్రహ్మపదార్థమేమీకాదు. వంద శాతం సాధించవచ్చు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అనుకున్న పద్ధతిలో పనిచేయాలే. ప్రభుత్వం, అధికారులు కలిస్తే గమ్యాన్ని చేరుకుంటాం అన్నారు.

పంటలపై సరైన లెక్కలు లేవు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయో లెక్కలు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. మన ఆహార అవసరాలు ఏమిటో తెలియదని చెప్పారు. అందుకే మన యూనివర్సిటీవాళ్లు సర్వే చేసి, అన్ని వివరాలు సేకరించారని తెలిపారు. ఉదాహరణకు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మనిషి ఐదు గ్రాములు ఉప్పు తినాలి. కానీ మనం 20 గ్రాములు తింటున్నం. అందుకే మనకు రోషం ఎక్కువ. దీంతో బీపీ ఎక్కువవుతున్నది అని సీఎం అనగానే సభలో నవ్వులు విరిశాయి. బంగారు తెలంగాణ కావాలంటే పాడి, పంట సమృద్ధిగా ఉండాలే. మూడున్నర కోట్ల ప్రజలు మూడు పూటలా కడుపునిండా తిని, కంటి నిండా నిద్రపోతే అది బంగారు తెలంగాణకు తొలి మెట్టు అన్నారు. రైతులు అప్పుల్లేకుండా ఉండాలని, బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉండవద్దన్న లక్ష్యంతో సమితులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. దీనిపై లేవనోడు, లేసినోడు, ఏమీ తెలియనోడు అడ్డంపొడుగు మాట్లాడుతున్నారు అని విమర్శించారు. రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేస్తే స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతాయని కాంగ్రెస్ చెప్పడాన్ని కొట్టిపారేశారు. స్థానిక సంస్థలకు, దీనికి సంబంధమేంటని నిలదీశారు.

రెండు పంటలు పండే భూమి కోటి ఎకరాలపైనే రాష్ట్రంలో కోటికి పైగా ఎకరాల్లో రెండు పంటలు పండించే భూమి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. మరో 50 లక్షల ఎకరాల వరకు ఒక పంట పండించే భూములున్నాయని అన్నారు. వాటికికావాల్సింది నీరు. సమైక్య రాష్ట్రంలో చెరువులు దారుణంగా దెబ్బతిన్నాయి. మన వాటా మనకివ్వక పోగా, ప్రాజెక్టు కడుతామని చెప్పి వాటిని కాగితాలకే పరిమితం చేశారు. అందుకే మనం మేజర్ ప్రాజెక్టులతోపాటు మిషన్ కాకతీయ పనులు చేస్తున్నాం. సమైక్య పాలనలో 75 వేల చెరువులు నాశనం చేశారు. మళ్లీ వాటిని పునరుద్ధరించుకుంటున్నాం అని తెలిపారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమాతోపాటు పెండింగ్‌లో ఉన్న ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ సంవత్సరంలోనే మధ్యమానేరుకు నీరు వచ్చేలా పనులు చేస్తున్నామని, వరదకాల్వ ద్వారా ఎస్సారెస్పీ వరకు నీటిని తీసుకెళ్తామని అన్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి భద్రాద్రి వరకు 460 టీఎంసీలను వినియోగించుకునేలా అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులకు రూపకల్పన చేయడమేకాకుండా, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని వివరించారు. కాళేశ్వరం పూర్తయితే నేను బతికుండగా రైతులు వాన కోసం మొగులువైపు చూడాల్సిన అవసరం రాదు అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 230 కిలోమీటర్లు ప్రవహించే గోదావరి ఏడాది పొడుగునా 65 టీఎంసీలతో కళకళలాడుతుందని చెప్పారు. అది తన కల అన్నారు. ప్రజలంతా దాన్ని చూస్తారని చెప్పారు. పలు కొత్త ప్రాజెక్టులతోపాటు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి, అనుకున్న లక్ష్యం మేరకు సాగు, తాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు. ఇందుకోసం దేశంలో ఏ రాష్ట్రం పెట్టనంత బడ్జెట్‌ను ఈసారి ప్రాజెక్టులకు కేటాయించనున్నట్టు తెలిపారు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఈసారి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

చిమ్మచీకట్లు అవుతాయన్నోడే సన్నాసైండు రాష్ట్రంలో 23 లక్షల పంపుసెట్లు ఉన్నాయి. తెలంగాణ వస్తే కరంటు రాదని, చిమ్మచీకట్లు అవుతాయని ఓ పుణ్యాత్ముడు విమర్శించాడు. మీరు సన్నాసులు అవుతారని చెప్పాడు. కానీ చెప్పినోడే సన్నాసైండు. మనం కాలేదు అని సీఎం అన్నారు. ఇప్పుడు 24 గంటల కరంటు ఇచ్చుకుంటున్నాం. ఇకముందు తెలంగాణలో సెకన్ కూడా కరంటు పోదు అని ఉద్ఘాటించారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి రెండు పంటలకు ఎకరానికి రూ.8వేల చొప్పున 12వేల కోట్లను బడ్జెట్‌లో పెట్టుకొని పెట్టుబడి అందిస్తామని చెప్పారు. ఈ చెక్కులను ఎమ్మెల్యేలద్వారా అందిస్తామని తెలిపారు. రైతులు సంఘటితంగా ఉండి ఈ ఏడాది మంచి విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో యూనియన్ అంటూ లేనిది ఒక రైతాంగానికేనన్నారు. దేశంలో సంఘటిత శక్తి బలమేందో తెలియదని, అది తెలిసి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. వచ్చే వానకాలం సీజన్‌లో తెలంగాణలోకి ఎవరైనా కల్తీ విత్తనం తీసుకురావాలంటే వణుకు పుట్టాలని అన్నారు.

పంటల వివరాలు లేకే మార్కెట్ల వద్ద లొల్లి వచ్చే జూన్ నుంచి ఏ ఎకరంలో ఏ పంట ఉందన్న విషయం తెలియాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం లెక్కలు, వివరాలు లేకపోవడం వల్లే మార్కెట్ కమిటీల వద్ద లొల్లులు జరుగుతున్నాయని అన్నారు. ఇక ఈ విధానానికి స్వస్తి పలికే విషయంలో రైతు సమన్వయ సమితులు ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. మార్కెట్ దగ్గర లొల్లి అయితే చాలు.. గతంలో సమైక్య రాష్ర్టాన్ని ఏలిన పాలకులే జెండాలు పట్టుకొని దిగుతారు. ఈ దుస్థితికి కారణం ఎవరో ఒక్కసారి రైతులు ఆలోచన చేయాలి అని సీఎం విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో నేను స్వయంగా చూశాను. టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్లు ఎండిపోయిన కంకులు, కందిళ్లు పట్టుకొని వచ్చేవారు. సమైక్య పాలనలో అసెంబ్లీకి ఎండిపోయిన కంకులొచ్చాయే తప్ప రైతులకు కరంటు మాత్రం రాలేదు. కరంటు తెచ్చింది, ఇచ్చింది, ఇచ్చేది ఒక్క గులాబీ జెండాయే. ఇప్పుడు అసెంబ్లీలో ఎండిపోయిన కంకులు, కందిళ్లు బందయ్యాయి. పల్లెల్లో, తండాల్లో, గూడేల్లో ఎల్‌ఈడీ బల్బులు వెలుగుతున్నాయి. ఇది గులాబీ జెండా పుణ్యమే. ఇదే గులాబీ జెండా కోరుకుంటున్నది అని సీఎం చెప్పారు.

యాసంగి నుంచే మద్దతు ధరలు సాధిద్దాం రైతులు నియంత్రిత పద్ధతిలో పంట వేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ యాసంగి నుంచే కనీస మద్దతు ధర రాబట్టే ప్రయత్నం చేద్దామని చెప్పారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి రూ.7500 కోట్లతో ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని, అవసరమైతే రూ.10 వేల కోట్లకు కూడా గ్యారంటీ ఇస్తామని అన్నారు. రైతు సమన్వయ సమితులు నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సమన్వయ సమితుల్లో వందకు వందశాతం టీఆర్‌ఎస్ వాళ్లే ఉంటారని తేల్చి చెప్పారు. తెలంగాణ కోసం కోట్లాడిందే వారే కాబట్టి ప్రస్తుతం వారే ఉంటారని అసెంబ్లీలోనే చెప్పానని గుర్తుచేశారు. మీపై గురుతరమైన బాధ్యత ఉంది. రైతులు విజయం సాధించే విషయంలో బాధ్యతాయుత పాత్ర పోషించాలి అని సమన్వయ సమితుల సభ్యులకు సీఎం సూచించారు. వీటితోపాటు త్వరలో రిజిస్ట్రేషన్ విధానంలో తెచ్చే మార్పులు, తద్వారా చేకూరే ప్రయోజనాలు, తహసీల్దార్ కార్యాలయంలో ఇందుకోసం అనుసరించాల్సిన పద్ధతులను సీఎం సవివరంగా తెలియజేశారు. ఈ సమయంలో రైతులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేస్తూ జై కేసీఆర్ అంటూ నినదించారు. గోదాముల నిర్మాణం, శీతల గిడ్డంగులు, పుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు, రైతు వేదికల నిర్మాణాలు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి సీఎం వివరించారు.

కౌలు రైతులకు పెట్టుబడి ఇవ్వాలంటూ ఓ రైతు కోరగా, సీఎం స్పందిస్తూ అది సాధ్యం కాదని తేల్చిచెప్పారు. రైతు వేదికల నిర్మాణానికి స్వచ్ఛందంగా విరాళాలు, భూములు ఇవ్వడానికి ముందుకు రావాలని సీఎం ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించింది. ధనిక రైతులు పంట పెట్టుబడి సహాయం వదులుకోవడానికి ముందుకు రావాలని కోరగా.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకొచ్చారు. ముందుకొచ్చిన వారి పేర్లను సభావేదికపై నుంచి సీఎం చదివి వినిపించారు. ఈ సదస్సులో స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కల్వకుంట్ల కవిత, వినోద్‌కుమార్, బాల్క సుమన్, శ్రీనివాసరెడ్డి, పాటిల్, నగేశ్, దయాకర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కరీంనగర్‌లోనే సీఎం బస రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సు అనంతరం సోమవారం సాయంత్రం.. సీఎం కేసీఆర్ కరీంనగర్ మండల తీగల గుట్టపల్లెవద్ద గల తన నివాసానికి రాత్రి బసచేసేందుకు వెళ్లారు. అక్కడ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో రాత్రి వరకు వివిధ అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తున్నది. ముఖ్యమంతి మంగళవారం ఉదయం పది గంటలకు అక్కడ నుంచి బయలుదేరుతారు. మంగళవారంనాడు పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.