-సేద్యం రాష్ట్ర జాబితాలోని అంశం -విద్యావిధానంలో స్థానికత ఏదీ? -ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు -రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు

తమ సమస్యలపై రైతులు చేస్తున్న ఆందోళనలకు కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగిస్తూ.. రైతు చట్టాలను తీసుకొచ్చేముందు కేంద్రం అనుసరించాల్సిన పద్ధతులను పాటించలేదని పేర్కొన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపించకుండా నేరుగా చట్టాలు తేవడంవల్ల ఇవాళ దేశ రైతాంగం ఆందోళనలో పడినట్టయిందని తెలిపారు. రైతుల సమస్యలను సానుకూల దృక్పథంతో చూసి పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఈ విషయంలో కేంద్రం రైతులతో చర్చలు జరుపడం సానుకూల పరిణామమని చెప్పారు. అన్ని వర్గాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని రైతు చట్టాల్లో సవరణలుచేయాలని కేంద్రానికి సూచించారు.
వ్యవసాయం రాష్ట్ర అంశం వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకుండానే చట్టాలు రూపొందించిందని కే కేశవరావు అన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ర్టాలు వ్యవసాయంపై నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. వారం క్రితం తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షించి.. మార్కెట్ కమిటీలు కొనసాగుతాయని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. స్థానిక నేలలు, వాతావరణం, ప్రజల ఆహారపు అలవాట్లు మొదలైన అంశాల ఆధారంగా ఆయా రాష్ట్రాలు వ్యవసాయ విధానాన్ని రూపకల్పన చేసుకొంటాయన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండెనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ప్రజాప్రతినిధులకూ వ్యాక్సిన్ ప్రజారోగ్యానికి కేంద్రం ప్రాధాన్యమివ్వడం అభినందనీయమని కే కేశవరావు చెప్పారు. కరోనా సమస్యను ఎదుర్కోవడం కోసమే కాకుండా ప్రజారోగ్య వ్యవస్థ మెరుగుకోసం గతంలో కంటే అధిక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఫ్రంట్లైన్ వారియర్లకు మొదట వ్యాక్సినేషన్ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేసమయంలో నిత్యం ప్రజా సమూహాల్లో తిరిగే ప్రజాప్రతినిధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరారు. జాతీయ విద్యావిధానాన్ని పక్కాగా అమలుచేయాలని, ప్రాంతీయ భాషలకు, ప్రాంతీయ సాంస్కృతిక, చారిత్రక, భౌగోళిక అంశాలపై విద్యార్థికి అవగాహన లేకుండా ఉండే పద్ధతుల్ని మార్చాలని సూచించారు.జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షలన్నింటికీ విద్యార్థులు హిందీతోపాటు ఆయా ప్రాంతీయ భాషల్లో రాసుకొనే అవకాశాన్ని కల్పించాలని కోరారు.