Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతుల సేవకే సమితులు

-సమన్వయ సమితుల్లోటీఆర్‌ఎస్ కార్యకర్తలు బరాబర్ ఉంటరు -సమితుల సభ్యులకు అధికారాలుండవు.. జీతాలు ఉండవు -రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే వారు పనిచేస్తరు -రికార్డుల ప్రక్షాళనతో వారికి సంబంధం లేదు -శాసనసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -నూతన సంవత్సరానస్వర్ణయుగంలోకి తెలంగాణ -డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి 24 గంటల విద్యుత్ -వ్యవసాయానికి రెప్పపాటు సమయంలో కూడా కరంటు పోదు -చివరి భూములదాకా నీళ్లందేందుకు రూ.1350 కోట్లతో పనులు -కాళేశ్వరం ఎత్తిపోతలతో ఏడు పాత జిల్లాలు సస్యశ్యామలం -నీళ్లు, ఎరువులు, విత్తనాలేకాదు.. -రైతులకు విజ్ఞానాన్నీ అందిస్తం -అసలు భూ పట్టాదారులే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం -రికార్డుల ప్రక్షాళన 46% పూర్తయింది.. -డిసెంబర్‌నాటికి వందశాతం 1/70 చట్టం అమలవుతున్న ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో సాయం: కేసీఆర్‌

టీడీపీ హయాంలో రైతుమిత్ర బృందాలెందుకు పెట్టారు?కాంగ్రెస్ పాలనలో ఆదర్శ రైతులను ఎందుకు నియమించారు?కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ ఎందుకోసం?ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తున్నందుకా? దేనికి నిరసన?మా ప్రభుత్వ చర్యలతో వారికి గుండెలు అదురుతున్నయ్ 23.60 లక్షల మోటర్లతో వ్యవసాయం ఎవరి పుణ్యం? నీళ్లు రావద్దు.. ప్రాజెక్టులు రావద్దు..ఇదే కదా కాంగ్రెస్ ఎజెండా!- కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్నదాతకు సేవచేసేందుకే రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేశామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. గతంలో ఆదర్శ రైతులకు ఇచ్చినట్టు ప్రభుత్వం సమన్వయ సమితి సభ్యులకు డబ్బులు ఇవ్వబోదని చెప్పారు. క్రాప్ కాలనీల విభజనతో రాష్ట్రంలో ఏ మూలన ఏ ఎకరంలో ఏ పంట పండించాలనే సమగ్ర లెక్కలు రూపొందుతున్నాయని తెలిపారు. ఈ డిసెంబర్ 31 అర్ధరాత్రి తరువాత.. అంటే జనవరి నుంచి తెలంగాణ స్వర్ణయుగంలోకి అడుగుపెడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మే విద్యుత్ ఉంటుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు, పరిమితులు, రాష్ట్ర రెవిన్యూ, జీఎస్టీ తర్వాత పరిణామాలు.. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఎకరానికి రూ.4వేల పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రికార్డుల ప్రక్షాళన 46% పూర్తయిందని, డిసెంబర్‌నాటికి వందశాతం పూర్తవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. శాసనసభలో సోమవారం రైతు సమన్వయ సమితులు-రూ.4వేల పెట్టుబడి అంశంపై సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రభుత్వం ఏకాణ ఇయ్యదు. రైతులకు ఇబ్బంది రాకుండా అధికారులు-రైతులకు మధ్య వారధిగా పనిచేయాలంతే. విత్తనం నాటే నుంచి దిగుబడి అమ్మే వరకు రైతు సమన్వయ సమితులు ముందుండి పైలట్ చేస్తరు అని వివరణ ఇచ్చారు. ఎక్కడ మక్కజొన్న బాగా పండుతది? ఎక్కడ కాటన్ మంచిగ పండుతదో నిర్ణయించడంలో సమన్వయ సమితులు పాత్ర పోషిస్తయి. సమన్వయ పరిచి.. విత్తనాలను ముందుగా తెస్తయి అని చెప్పారు. రైతు సమన్వయసమితుల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు తప్పనిసరిగా ఉంటారని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఏ అధికారం లేకపోయినా.. ఏమీ లేకపోయినా, అటుకులు బుక్కో.. అన్నం తినో.. ఉపాసం ఉండో.. నీళ్లు తాగో ఈ బక్కపేద టీఆర్‌ఎస్ కార్యకర్తలే 14 ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చారు. మీరందరూ పదవులలో సేదదీరిననాడు మీరు ఇదే టీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి జైళ్లలో వేసిన నాడు, మీరు కేసులు పెట్టిన నాడు పేగులు తెగేదాక కొట్లాడారు. ఇవ్వాల తెలంగాణ పునర్నిర్మాణానికి కూడా వాళ్లే పని చేస్తారు. రైతు సమన్వయ సమితులలో కూడా బరాబర్ ఉంటరు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

దోపిడీని రూపుమాపేందుకు మార్కెట్‌కు ధాన్యం తీసుకుపోయిన రైతు.. దానికి మద్దతు ధర రాకపోతే వాపసు తీసుకుపోలేక వచ్చినంతకు అమ్ముకుని దోపిడీకి గురవుతున్నాడని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. దీనిని రూపుమాపేందుకే సమన్వయ సమితులు ఏర్పాటుచేశామని చెప్పారు. మండలస్థాయి సమన్వయ సమితి రెండు పనులు చేస్తది. మార్కెట్లలో అడ్తిదారులు, వ్యాపారులతో మద్దతు ధర ఇస్తరా? లేదా? అని మాట్లాడుతది. లేకపోతే రాష్ట్ర సమితికి నేరుగ అమ్ముకుంటది. రాష్ట్ర సమితి బ్యాంకు గ్యారెంటీ, లేదా కావాల్సిన డబ్బుతో సిద్ధంగా ఉంటది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ధాన్యం వచ్చినా కొనుగోలు చేస్తది. వచ్చే సంవత్సరం నేను చేసి చూపిస్త అని సీఎం చెప్పారు.

విత్తనం నుంచి ఎమ్మెస్పీ వరకు.. పండిన పంటను తొందరగ అమ్ముకోవాలనే ఆర్తి రైతుకు ఉంటుందని సీఎం అన్నారు. రైతు ఎవరు ఎప్పుడు అమ్ముకుంటరో తెల్వదు. వందల, వేల క్వింటాళ్ల ధాన్యం ఒకేసారి మార్కెట్‌కు వస్తే ప్లేసుండదు. చివరకు గన్నీ బ్యాగులు కూడా దొరుకుతలేవంటరు. ఇది సిల్లీ ఇష్యూ. దీనికి పరిష్కారంగానే.. మండల రైతు సమన్వయ సమితులు. ఆ మండలంలో ఎన్ని ఊర్లు ఉన్నయి? ఎంత పంట పండింది? మార్కెట్ యార్డులో రోజుకు ఎంత ధాన్యం తీసుకునే కెపాసిటీ ఉంది? హమాలీలు ఎంతమంది ఉన్నరు? అనేది చూస్తరు. తర్వాత విడుతలవారీగా వివిధ గ్రామాల రైతులు మార్కెట్‌కు రావాలని చెప్తరు. ఇలా పదిరోజుల్లో అంతా అమ్ముతరు. రైతుకు విత్తనాలు ఇచ్చేనుంచి మార్కెట్లో మద్దతు ధర కల్పించేంత వరకు సమన్వయ సమితులు పాత్ర పోషిస్తాయి. రైతు సమన్వయ సమితులకు ఎలాంటి జీతం ఉండదు. కుర్చీలుండవు. భూ రికార్డుల్లో జోక్యం చేసుకోరు. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో వేలు పెట్టరు. ఎమ్మార్వో, ఆర్డీవో దగ్గరికి పోయి దరఖాస్తు చేసుకోవాలనుకున్నపుడు చదువురాని వాళ్లు సాయం కోరితే చేస్తరు తప్ప ఎలాంటి అధికారం ఉండదు అని సీఎం స్పష్టంచేశారు.

రైతులకు సేవ చేయాలనే అంకితభావముంటేనే.. మాకు కార్యకర్తలు తక్కువేం లేరు. టీఆర్‌ఎస్‌కు 56 లక్షలమంది కార్యకర్తలున్నరు. ఇంకా చేరుతూనే ఉన్నరు. బూత్ కమిటీ సభ్యులను వేసుకునేంత ఖర్మ మాకు లేదు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సంపూర్ణ అవగాహన, అంకితభావంతో పనిచేసే వారినే సమితుల్లో నియమిస్తం. మా కార్యకర్తలు రైతులు కాదా? వారికి అర్హత లేదా? మేం చేసేది తప్పయితే రైతులు మమ్మల్ని శిక్షిస్తరు.. కరెక్టు అయితే మళ్లీ గెలిపిస్తరు. ప్రభుత్వ లక్ష్యానికి గండి కొట్టకుండా, ఉద్దేశాన్ని అర్థం చేసుకొని అంకితభావంతో పని చేసేవాళ్లను సమితుల్లో నియమించాలనేది ప్రభుత్వ పాలసీ. సమితిల్లో శత్రువులు చేరితే ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొడుతరు అని చెప్పారు. మార్కెట్ కమిటీలు, కో ఆపరేటీవ్ సొసైటీలు ఉండగా సమితులు ఎందుకని కొందరు ప్రశ్నించడంపై మాట్లాడుతూ.. ఇవన్నీ ఉండగానే టీడీపీ ప్రభుత్వం 2003లో రైతుమిత్ర బృందాల పేరుతో రూ.350 కోట్లు ఖర్చుచేసి, రెండులక్షల మందికి సభ్యత్వం ఇచ్చింది. ఎందుకో వారే చెప్పాలి. 2007లో వైఎస్ 50 వేల మంది ఆదర్శ రైతులను ఎంపికచేశారు. రూ.60 కోట్లు ఖర్చు చేశారు. ఆనాడు ఆదర్శ రైతులుగా మెకానిక్‌లు, ఆటో డ్రైవర్లను ఎంపికచేశారు. అవి ఎందుకు వేశారో చెన్నారెడ్డి చెప్పాలి. మీ హయాంలో డీసీసీబీలు, కోఆపరేటీవ్ సొసైటీలున్నాయి. అందరి సాక్షిగానే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని సీఎం అన్నారు.

చివరి భూమిదాకా సాగునీరు.. సాధ్యమైనంత త్వరగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి నీళ్లు తీసుకురావాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్ ఉన్న ఒక సమావేశంలో.. వచ్చే ఏడాదినుంచి టెయిలెండ్‌కు నీళ్లు పోలేదంటే కాళ్లు ఇరగ్గొడుత అని చెప్పిన. టెయిలెండ్‌కు నీళ్లు ఎట్ల పోవని అడిగితే.. రూ.1350 కోట్లు ఖర్చయితవి సార్ అన్నరు. శాంక్షన్ చేసిన. మహబూబాబాద్‌ల 25 ఏండ్ల కిందట కాల్వలు తవ్వినా నీళ్లు రాలేదు. రైతులు ఆ కాల్వలను దున్ని చదును చేసుకున్నరు. అట్లాంటివి గుర్తించి బాగుచేస్తున్నరు. సభ్యులందరూ అట్ల ఉన్నవి గుర్తించండి. వచ్చిన నీళ్లను చివరి భూముల వరకు తరలించేందుకు మార్గమధ్యంలో రిజర్వాయర్లు కట్టి సత్వరం రైతులకు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం అని సీఎం చెప్పారు.

కృష్ణా, గోదావరి జలాలతో సుభిక్ష తెలంగాణ కృష్ణా, గోదావరి జలాలతో రాష్ట్రం సుభిక్షమవుతుందని సీఎం ధీమా వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టులు పూర్తయితున్నయి. దేవాదులకు కేంద్రం కొన్ని నిధులిస్తున్నది. దీనిద్వారా వరంగల్‌కు వంద టీఎంసీలు తీసుకునే వీలుంది. ఇప్పటికే 50% నీళ్లు తీసుకుంటున్నరు. జనగామ, బచ్చన్నపేట ప్రాంతాల్లో చెరువులు నింపుతున్నరు, పంటలు పండిస్తున్నరు. కాళేశ్వరం పథకంతో పాత ఏడు జిల్లాలు సస్యశ్యామలం అవుతయి. కృష్ణాజలాలపై రోజూ పంచాయతీ. పేపర్ల చూస్తున్నం. కేటాయింపులున్నందున రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు కృష్ణాజలాలను సంపూర్ణంగా అందించి సుభిక్షంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నం అని సీఎం అన్నారు.

నకిలీ విత్తనాలపై కొరడా.. నకిలీవిత్తనాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని సీఎం చెప్పారు. కల్తీ విత్తనాలను పెంచి పోషించిందెవరు? ఖమ్మం జిల్లాలో కొంతమంది నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని మా దృష్టికొస్తే నేను చెప్తే పోలీసులు పట్టుకొని పీడీ యాక్టు పెట్టినరు. వాళ్లు కోర్టుకు పోతే వెంటనే స్టే వచ్చింది. వాళ్ల మీద పీడీ యాక్టు పెట్టమని ఇప్పుడున్న డీజీపీ మహేందర్‌రెడ్డికి చెప్తే.. కోర్టు స్టే ఉంది సార్.. అది యాక్టులో లేదు అంటే నిన్ననే బిల్లు కూడా పాస్ చేసుకున్నం. దానిని ఆర్డినెన్స్‌గా తీసుకొచ్చి పీడీ కింద మార్చి నకిలీ విత్తనాలను నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నం. సెక్రటరీ స్థాయిలో ఫ్లయింగ్ స్వాడ్‌లు పెట్టి వందలమందిపై కేసులుపెట్టినం అని సీఎం చెప్పారు.

రూ.350 కోట్లతో రైతు వేదికలు ఐదు వేల క్లస్టర్లలోని రైతులు, అధికారులు కూర్చుని మాట్లాడేందుకు రూ.350 కోట్లతో రైతు వేదికలు కూడా ఏర్పాటు చేయబోతున్నామని సీఎం తెలిపారు. నీళ్లు, కరంటు, సకాలానికి ఎరువులు, విత్తనాలు ఇచ్చిన తర్వాత రైతులను వాళ్ల ఖర్మ అని గాలికి వదిలేయకుండా.. పంటలపై విజ్ఞానం కూడా అందిస్తం. అందుకోసం రాష్ట్రంలో ఐదు వేల హెక్టార్లకు ఒకరు చొప్పున 2638 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించినం. వాళ్లకు అత్యాధునిక ఐప్యాడ్‌లను ఇచ్చినం అని సీఎం వివరించారు. రాష్ట్రంల ఒక్క ఆగ్రానమిస్టు లేడు. వ్యవసాయ వర్సిటీ ప్రభ తగ్గిపోయింది. అందుకే రాష్ట్రంలోని మండల వ్యవసాయాధికారులు అందరికీ ఆగ్రానమిస్టులుగా శిక్షణ ఇస్తున్నం. రాష్ట్రంలో వెయ్యిమంది ప్రధాన అధికారులున్నరు. దశలవారీగా 100-200 మంది చొప్పున ఇజ్రాయెల్‌కు తీసుకుపొమ్మని ఆదేశాలిచ్చిన. ఆ తర్వాత అధికారులే కొందరు రైతులను ఇజ్రాయెల్‌కు పంపిస్తరు. ఇవన్నీ జరిగిన తర్వాత మైక్రో ఇరిగేషన్, ఇతర అంశాలపై చర్చించి.. క్రాప్ కాలనీలుగా విభజించి అవగాహన కల్పిస్తరు. అధికారులు, రైతులు కూర్చుని నిర్ణయించుకొని పంట పండిస్తరు. అట్ల రాష్ట్రంలో ఏ ఎకరంలో ఏ పంట పండించినరో లెక్కలుంటయి అని చెప్పారు.

రూ.4వేల పెట్టుబడి ప్రారంభమే.. ప్రతి సభ్యుడు రైతు సమన్వయ సమితులపై నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఏ సలహా ఇచ్చినా భేషజాలు లేకుండా స్వీకరిస్తం. ప్రస్తుత పరిస్థితులు, పరిమితులు, రాష్ట్ర రెవిన్యూ, జీఎస్టీ తర్వాత పరిణామాలు.. అన్నింటినీ పరిశీలించినంకనే ఎకరానికి రూ.4వేల పెట్టుబడి ఇవ్వాలని అనుకున్నం. మక్కజొన్నకు రూ.33వేలు అవుతయని చిన్నారెడ్డి అంటున్నరు.. కానీ అంత ఉంటదా? నేను కూడా మక్కజొన్న వేస్త. నాకు తెలుసు. ప్రాథమికంగా రైతు కొంత పెట్టుబడి పెడ్తరు. కొంత ప్రభుత్వం ఇస్తది. మొత్తానికి మొత్తం ప్రభుత్వమియ్యాలంటే అది సాధ్యం కాదు. మేం ప్రారంభం చేస్తున్నం అని సీఎం చెప్పారు.

రైతులే మాకు ప్రయారిటీ తమ ప్రభుత్వానికి అసలు రైతులే ప్రయారిటీ అని సీఎం చెప్పారు. అసలు రైతు గాల్లకు పోయిండు.. కౌలు రైతు గురించి మాట్లాడమంటరు. టెనెంట్ యాక్ట్ చాలా ప్రమాదకరమైనది. రైతులు ఉరి అన్న పోసుకుంటరుగానీ.. తాత, తండ్రులనుంచి వచ్చిన ఆస్తిని వదులుకునేందుకు ఇష్టపడరు. ఎమోషనల్ బాండేజ్ ఉంటది. అంత కష్టపడి ఉంచుకున్న భూమిని.. చట్టంలో ఉంది కదాని వదులుకొమ్మంటె ఎట్ల? అది ఫండమెంటల్ రైట్. అందుకే పట్టాదారు, అసలు రైతులకే ప్రభుత్వం పెట్టుబడి ఇస్తది. రైతులు-కౌలుదారుకు సంబంధం వాళ్లిద్దరి మధ్య ఉండేది. కౌలుదారు శాశ్వతంగా ఉండరు. ఒకసారి ఒకరికి కౌలు ఇచ్చిన భూమి.. మళ్లోసారి రూ.200 ఎవరైనా ఎక్కువిస్తే వాళ్లకిస్తరు. కోనేరు రంగారావు సిఫార్సులు తెలంగాణకు సరిపోవు. కౌలుదారు చట్టం పేరిట అసలుదారును మునుగమనడం మంచిది కాదు. అసలుదారును రక్షిస్తం. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడిని కౌలుదారుకు ఇవ్వడం ఆయన ధర్మం. అందుల ప్రభుత్వమెట్ల జోక్యంచేసుకుంటది? అన్నారు. ప్రభుత్వం కరంటు, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి ఇచ్చినంక మేమే చేసుకుంటమని 99% మంది రైతులు నిర్ణయించుకున్నారని తమకు సమాచారం ఉందని సీఎం వెల్లడించారు.

గ్రీన్‌హౌజ్‌లో నంబర్‌వన్‌గా.. ఎన్నడూలేని విధంగా యువత వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నదని సీఎం సంతోషం వ్యక్తంచేశారు. దళితులు, గిరిజనులకు మైక్రో ఇరిగేషన్‌లో వంద శాతం సబ్సిడీ ఇచ్చినం. ఏ రాష్ట్రంలోలేని విధంగా గ్రీన్ హౌజ్‌ను ప్రోత్సహించి, 75% సబ్సిడీ ఇచ్చినం. హైదరాబాద్ చుట్టూ కూరగాయలు పండించేందుకు వెయ్యి ఎకరాల్లో గ్రీన్‌హౌజ్ కల్టివేషన్ జరుగుతున్నది. రంగారెడ్డి, మెదక్ పోతున్నపుడు గ్రీన్‌హౌజ్‌లను చూస్తే సంతోషంగా ఉంది అని చెప్పారు.

విజయవంతంగా భూరికార్డుల ప్రక్షాళన రాష్ట్రంలో రైతులకు ఊరట కలిగించి, దరికి చేర్చాలని చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతో రైతులు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి, చేయెత్తి దండం పెట్టినా పూర్తికాని పనులు.. ఇప్పుడు అధికారులే రైతుల దరికి వచ్చి చేస్తున్నరు. ఇప్పటికే 46% విజయం సాధించినం. రెవిన్యూ సిబ్బందిని రైతాంగంపక్షాన అభినందిస్తున్న. డిసెంబర్‌వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ట్యాపరింగ్‌కు వీల్లేకుండా, నకిలీ దందాలు లేకుండా కొత్త పాస్ పుస్తకాలను ఇస్తం.

1/70 ప్రాంతాల్లో మానవతాదృక్పథంతో సాయం 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో గిరిజనులే భూ యజమానులుగా ఉండాలని చట్టం చెప్తున్నది. కానీ గిరిజనేతరులుంటే వారి రుణాలను మాఫీచేస్తే ఆడిట్ వాళ్లు పట్టుకుంటరు. అలాంటి చోట రుణమాఫీ సాధ్యంకాదు. వ్యవసాయ మంత్రి పోచారం, సంబంధిత అధికారులు ఆ ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశమై, 1/70 ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఏ రూపంలో సాయం చేయాలనేది నిర్ణయిస్తరు అని సీఎం చెప్పారు.

నాడు సమితిలకు అన్ని అధికారాలు.. నేడు ఏవి? జీవన్‌రెడ్డి సమితి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఉపాధ్యాయ నియాకాలతోపాటు వైద్యం, ఇతర పనులన్నీ సమితి ప్రెసిడెంట్లే చేసేవారు. ఆనాడు వీడీవోలు పవర్‌ఫుల్. ఆనాడు స్థానిక సంస్థలకు ఉన్న అధికారాలను మీ (కాంగ్రెస్) హయాంలోనే పీకేశారు. చివరకు ఉపాధి హామీ పథకం కూలీలకు డబ్బులు ప్రధాని నేరుగా కూలీల అకౌంట్‌లో వేస్తరు. కొత్తపంచాయతీరాజ్ చట్టం తెద్దామని అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంటే విస్తుగొలిపే విషయాలు వస్తున్నాయి. పంచాయతీలకు ఏమీ లేదు. మండల, జిల్లా పరిషత్తులకు అధికారాల్లేవు. మొత్తం ఊడబీకారు. నాడు వ్యవసాయశాఖ విధులు కూడా పంచాయతీలకిందనే ఉండేవి. మీ హయాంలోనే కదా విత్తనాలకోసం రైతులు చెప్పులు వరుసలో పెట్టింది,ఎరువులనుఠాణాల్లో విక్రయించింది అని సీఎంఅన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.