Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతులకూ బీమా

– ఎస్సీ, ఎస్టీలకు ఉచిత మంచినీటి సరఫరా – ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ – రాష్ర్టాన్ని పంట కాలనీలుగా మార్చాలి – ఇక్కడి అభివృద్ధి అధ్యయనానికి … – ఇజ్రాయెల్ వాళ్లూ రావాలి – ఆ విధంగా తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధి కావాలి – నిజమైన ఆదర్శ రైతులతో త్వరలోనే సమావేశం – 24 గంటల నీటి సరఫరాపై .. – త్వరలో మంత్రుల కమిటీ – ప్రజల్లో నమ్మకం కుదిరితేనే … – ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు – పోలీసుల పనిలో రాజకీయ నేతల జోక్యం వద్దు – శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ – రెండో రోజు 4 అంశాలపై నిపుణుల ప్రసంగాలు – పార్టీల్లోనూ బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పన జరుగాలి – వచ్చే బడ్జెట్‌కు టీఆర్‌ఎస్‌లో ఈ ప్రయత్నం చేస్తాం – శాసనసభలు జరిగే తీరుతెన్నులు మారాలి: సీఎం

KCR addressing in Orientation programme

రాష్ట్రంలో వ్యవసాయదారులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టంచేశారు. దళితులు, పేదలకు ఉచితంగా మంచినీటి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలపాటు తాగునీటిని సరఫరా చేయాలనే ఆలోచన కూడా ఉందని తెలిపారు. పోలీసుల పనివిధానంలో రాజకీయ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమమని సీఎం అభిప్రాయపడ్డారు. బడ్జెట్ రూపకల్పనపై అన్ని పార్టీల్లోనూ చర్చ జరగాలని, అప్పుడే ప్రజాప్రతినిధులందరి భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణ తరగతులలో రెండో రోజైన ఆదివారం వ్యవసాయం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-చట్టసభలు, పట్టణాభివృద్ధి, శాంతిభద్రతలు అనే అంశాలపై ఆయా రంగాల నిపుణులు ప్రసంగించారు. వారు మాట్లాడే సమయంలో సీఎం కేసీఆర్ సందర్భోచితంగా చొరవ తీసుకొని వివిధ అంశాలపై వివరణలు ఇవ్వడంతోపాటు కొన్ని ప్రకటనలు చేశారు. భవిష్యత్ లక్ష్యాలను, రానున్న కాలంలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతినిధులు ఆసక్తిగా చర్చల్లో పాల్గొంటుండటంతో షెడ్యూలుకన్నా అదనపు సమయం తరగతులు కొనసాగుతున్నాయి. దీంతో ఆదివారం కేవలం నాలుగు అంశాలపైనే తరగతులు జరిగాయి. మిగిలిన రెండు అంశాలను సోమవారం చేపట్టనున్నారు. విత్తన భాండాగారంగా తెలంగాణ

రాష్ర్టాన్ని విత్తన భాండాగారంగా మార్చాలన్న తన అభిలాషను ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి చాటారు. వ్యవసాయం అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌రావు ఆదివారం ఉపన్యసించారు. ఈ సమయంలో కేసీఆర్ కూడా మాట్లాడారు. రాష్ట్రంలో మంచి విత్తనాలు అందుబాటులో ఉండాలని, నేల స్వభావాన్ని గుర్తించి పంటలు వేయాలని చెప్పారు. త్వరలో వ్యవసాయ శాఖలో రెండు మూడు వేలమంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమిస్తామని ప్రకటించారు. అవసరమైన మేరకే నీటి వినియోగం జరగాలని సీఎం అన్నారు. తెలంగాణను పంటల కాలనీలుగా మార్చాలి. ఈ విషయంలో వ్యవసాయ వర్సిటీ, వ్యవసాయశాఖ చొరవ చూపాలి. త్వరలోనే నిజమైన ఆదర్శ రైతులను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడతా. వారితో చర్చించిన తర్వాత వ్యవసాయ విధానం ఖరారుచేస్తాం. వ్యవసాయంవల్ల ఆదాయం పెద్దగా రాదనే భావన ఉంది. కానీ వ్యవసాయంద్వారా చాలామంది ఉపాధి పొందుతున్నారు. పంటలు బాగా పండితే వ్యవసాయదారులు ఆర్థికంగా బలపడతారు. ఈ పరిణామం పరోక్షంగా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా మారడం ఖాయం. తెలంగాణలో 400కుపైగా విత్తనోత్పత్తి కేంద్రాలున్నాయి. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. సబ్సిడీలు పెంచాం. అధ్యయనంకోసం ఇజ్రాయెల్ పోవడం కాదు.. ఇజ్రాయెల్ వాళ్లు మన దగ్గరికి వచ్చి నేర్చుకునే పరిస్థితి ఉండాలి. వ్యవసాయంలో ఉత్పత్తి పెరగడం కాదు.. ఉత్పాదకత పెరగడమే నిజమైన వృద్ధి. ఎక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండటం కాదు.. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండాలి. ప్రతి గ్రామానికి ఇద్దరు రైతులను ఎంపిక చేసుకొని ఆధునిక పద్ధతులద్వారా, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేయించాలి. అది మిగతావారికి ఆదర్శంగా ఉంటుంది. పశు సంవర్థక శాఖను బలోపేతం చేయాలి. పశుపోషణ కూడా చాలా ముఖ్యం. విత్తనాలు, ఎరువులకొరత లేకుండా చూడాలి. పంటలకు మార్కెటింగ్ కల్పించాలి. గోదాంల సంఖ్యను బాగా పెంచుతున్నం. గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయి. మార్కెట్ ఇంటర్‌వెన్షన్‌కోసం రూ.100 కోట్లు కేటాయించాం అని కేసీఆర్ చెప్పారు. వ్యవసాయంలో సాంకేతిక, ఆధునికత పెరగాలని సీఎం ఆకాంక్షించారు.

ఎన్టీఆర్ కాలంలో పడిన దెబ్బ బడ్జెట్ వివరాలను రహస్యంగా ఉంచుతారని, ఒకవేళ వాటిని ముందుగా బహిరంగపరిస్తే కొన్నిరకాల నష్టాలున్నాయని కేసీఆర్ చెప్పారు. ఉదాహరణకు బంగారంపై పన్ను విధించాలని బడ్జెట్‌లో ఉంటే, అది ముందుగానే లీక్ అయితే వ్యాపారులు ముందస్తుగా కొనుగోలు చేసి పెట్టుకుంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో పన్నులు విధించడం చాలా అరుదుగా జరుగుతుందని, ఓట్లకోసం బడ్జెట్‌లలో ఇప్పుడు అసలే పన్నులు విధించడం లేదని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో పది రోజుల ముందే బడ్జెట్ లీక్ అయిందని, పత్రికల్లో బడ్జెట్ లీక్ అంటూ పెద్ద పెద్ద వార్తలు వచ్చాయని గుర్తుచేశారు. దీంతో అప్పటి సీఎం ఎన్టీఆర్ తన 31 మంది మంత్రులను తొలగించారని చెప్పారు. అప్పుడు పడిన దెబ్బతో ఇప్పటివరకు బడ్జెట్ విషయంలో ముఖ్యమంత్రులు రహస్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో మంత్రులను సీఎం నమ్మే పరిస్థితి ఉండదన్నారు. అందుకే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే గంట ముందు మంత్రివర్గ సమావేశం.. అందునా అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశం హాలులో ఏర్పాటు చేసుకొని ఆమోదించడం ఆనవాయితీగా మారిందన్నారు. తాను మాత్రం ముందుగానే నిర్వహిద్దామని అనుకున్నా.. అసెంబ్లీ కార్యదర్శి ఎందుకొచ్చిన గొడవ సార్ అంటే, ముందు రోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆమోదించామన్నారు.

అది వాంఛనీయం కాదు వాస్తవంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలు, ప్రజా శ్రేయస్సుపై సుదీర్ఘ చర్చలు జరగాలని కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మొదలుకాగానే ఆరోపణలు.. కుంభకోణాలు.. లంబకోణాలు! ఇది వాంఛనీయం కాదు అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ దిక్కులేక.. కొందరు సభ్యులను రోజులు, నెలలు, సంవత్సరాలు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. చివరకు గవర్నర్ మీద పడి కొట్టే పరిస్థితులు కూడా దాపురించాయంటూ మహారాష్ట్రలో జరిగిన ఘటనను ప్రస్తావించారు.

కేశవరావు నా అభిమాన నాయకుడు శాసనసభలో మంచిగా మాట్లాడితే చరిత్రలో స్థానం నిలిచిపోతుందని సీఎం అన్నారు. గతంలో శాసనసభలో భవనం జయప్రద, గౌతు లచ్చన్న, వావిలాల గోపాల కృష్ణయ్య, రాఘవాచారి.. తదితరులు మాట్లాడితే, వారి మధ్య చర్చ జరిగితే ఆసక్తిగా వినేవారని చెప్పారు. తాను కూడా అసెంబ్లీకి విజిటర్‌గా వెళ్లి, ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించేవాడినని తెలిపారు. కే కేశవరావు తన అభిమాన నాయకుడిగా ఉండేవారని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విజిటర్ గ్యాలరీలో బడి పిల్లలు ఉన్నారనే సోయి లేకుండా సభలో గొడవలు చేస్తున్నారని చెప్పారు. పార్లమెంటులో విదేశీ ప్రతినిధులు సమావేశాలను చూసేందుకు వస్తారని.. వారున్నారనే సోయి లేకుండా కూడా అక్కడ కొన్నిసార్లు గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాప్రతినిధుల్లో ఎందుకో అసహనం ఎక్కువవుతున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ గెలిస్తే.. వాళ్లకు ఐదేండ్ల సమయం ఉంది.. రెండుమూడేండ్లు చూద్దామనే ఆలోచన కూడా ఉండటం లేదన్నారు. ప్రజాస్వామ్యానికి చీకటి మబ్బులు కమ్ముకుంటున్నాయా అనే భయం వేస్తుందన్నారు. అయితే కచ్చితంగా సంస్కరణల దశ వస్తుందని, విలువల పునరుద్ధరణ జరుగుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజాసదారాంకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-చట్టసభలు అనే అంశంపై తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం మాట్లాడారు. పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య లక్షణాలు, చట్టసభల పనితీరు, ప్రభుత్వం పనిచేసే విధానం, భారత రాజ్యాంగం, తదితర అంశాలను సదారాం వివరించారు. ఆయనకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో 24గంటల మంచినీటి సరఫరా రాష్ట్రంలో 24గంటలపాటు మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఈ కార్యాచరణకోసం త్వరలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్ శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివారం పట్టణాభివృద్ధి అనే అంశంపై అస్కి డైరెక్టర్ శ్రీనివాసాచారి ప్రసంగించారు. ఇందులో భాగంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. దళితులు, ఎస్టీలకు మంచినీళ్లు ఉచితంగానే ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ యావత్తు ప్రపంచానికే ఆదర్శం కావాలన్న సీఎం.. రాష్ర్టానికి నీటి కొరత రానియ్యబోమని అన్నారు. ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యంవంటి సౌకర్యాలవల్ల పట్టణాలు పెరుగుతున్నాయని చెప్పారు. అందుకే పట్టణాల్లో కనీస వసతులు కల్పించాలని అన్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా సౌకర్యాలు పెంచాల్సి ఉందని చెప్పారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తలెత్తే పారిశుద్ధ్య సమస్యలను అధిగమించేందుకు మంత్రులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిద్దిపేట డ్రింకింగ్ వాటర్ స్కీం, శ్రమదానం కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రజలను భాగస్వాములను చేసిన విధానాన్ని సీఎం వివరించారు. ప్రజాప్రతినిధి ఏ పని చేసినా మన మంచికే అనే నమ్మకం ప్రజల్లో కలిగితే ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చేతులు కడుక్కునే నల్లాలను ప్రజల భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ కింద ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు విధిగా మంచినీరు సరఫరా చేయాలని సీఎం అన్నారు.

బడ్జెట్ రూపకల్పన అన్ని పార్టీల్లో జరగాలి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతరు. ప్రతిపక్ష పార్టీలు ఇది తుక్కు బడ్జెట్.. ఇందులేమి లేదు అంటయి! అధికార పార్టీ వాళ్లు ఆహా.. ఓహో.. అంటరు! కానీ అందులేముందో వీళ్లకు తెల్వదు.. వాళ్లకు తెల్వదు! ప్రతి సంవత్సరం ఇదే జరుగుతది. ఇట్ల గాదు..! ప్రతి పార్టీకి ఒక సెక్రటేరియట్ ఉండాలి. ఎవరికి ఏ రంగంలో ఆసక్తి ఉందో వారిని ఆ రంగంలో నిష్ణాతులు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. అక్కడ బడ్జెట్ రూపకల్పన జరగాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో అన్ని జిల్లాలను పరిగణలోనికి తీసుకొని బడ్జెట్ తయారు చేయాలి. అప్పుడే అది అసెంబ్లీలోకి వచ్చినపుడు చర్చ సమయంలో అందరూ బాగా మాట్లాడగలుగుతరు అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీ సెక్రటేరియట్‌లో తయారైన బడ్జెట్ రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా.. లేదా.. అనేదే ఐఏఎస్ అధికారులు పరిశీలించాలని చెప్పారు. అయితే ప్రస్తుతం ఇలా జరగడం లేదన్నారు. ఇప్పటివరకు తగిన సమయం లేకపోవడంతో ఇట్లనే చేశామని, ఇకముందు పార్టీ సెక్రటేరియట్‌లో బడ్జెట్ రూపకల్పన చేయాలని ఉందని వెల్లడించారు. వీలైతే వచ్చే ఏడాది ఇలా చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ శిక్షణ తరగతుల్లో భాగంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-చట్ట సభలు అనే అంశంలో భాగంగా బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. అసలు బడ్జెట్ వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచుతారు? రాష్ట్ర రాజకీయ చరిత్రలో గతంలో ఏం జరిగింది? ఇలా అనేక ఆసక్తికర వివరాలను ఆయన ప్రతినిధుల ముందుంచారు.

అభ్యుదయ పోలీసులుగా పేరు తెచ్చుకోవాలి సమాజంలో మార్పు ఒక రోజులో సాధ్యం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సమాజంలో మార్పు ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని చెప్పారు. అందరం చిత్తశుద్ధితో కలిసి పని చేయాలని సూచించిన అయన.. తెలంగాణ పోలీసులు అభ్యుదయ పోలీసులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్ శిక్షణ తరగతుల్లో భాగంగా శాంతిభద్రతలు అనే అంశంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు పోలీసు కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. పైరవీలు చేయకుంటేనే మంచిదన్నారు. ట్రాఫిక్ సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో అదనంగా బస్‌బేలు ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్‌లో లక్ష సీసీ టీవీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలీస్ కంట్రోల్ అండ్ కమాండ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలీసులకు కొత్త వాహనాలు కొనిచ్చామని.. స్టేషన్ల నిర్వహణకు అయ్యే ఖర్చును బాగా పెంచామని సీఎం చెప్పారు. గ్రామీణ ప్రాంత స్టేషన్ల నిర్వహణకు రూ.25వేలు, పట్టణాల్లో రూ.50వేలు, హైదరాబాద్‌లోని స్టేషన్లకు రూ.75వేలు ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఆధునిక పోలీస్ స్టేషన్లు కడతామని స్పష్టంచేశారు. వరంగల్‌ను పోలీస్ కమిషనరేట్‌గా చేశామని, ఖమ్మం, రామగుండం కూడా త్వరలో కమిషనరేట్లుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నల్లగొండ జిల్లా పోలీసులు దవాఖానలకు వెళ్లి వాటిని శుభ్రం చేసి స్ఫూర్తిగా నిలిచారని, హైదరాబాద్ పోలీసులు కూడా నిలోఫర్ దవాఖానను శుభ్రం చేశారని ప్రశంసించారు. మిషన్ కాకతీయ, చెట్ల పెంపకం, ఇతర కార్యక్రమాల్లో పోలీసులు భాగస్వాములై, ప్రజలతో మమేకం అవుతున్నారని సీఎం సంతోషం వ్యక్తంచేశారు. నల్లగొండ జిల్లాలో జన మైత్రి కార్యక్రమం నిర్వహిస్తూ, స్టడీ సర్కిల్‌లో క్లాసులు చెబుతున్న ఎస్పీ విక్రమ్‌జీత్ సింగ్ దుగ్గల్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.