భూసార పరీక్షలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. రాష్ట్రంలో 54.27 లక్షల సర్వే నంబర్లు ఉన్నాయి. వాటి అధారంగా భూసార పరీక్షలు నిర్వహించి రైతుల పేరిట సాయిల్‌హెల్త్ కార్డులు జారీచేసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందుకోసం ల్యాబరేటరీలకు రూ.28 కోట్లు కేటాయించాం. సర్వే నంబర్‌వారీగా భూసార పరీక్ష నిర్వహించి పూర్తివిరాలు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం అని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సర్ధాపూర్‌లో రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు.

-1 నుంచి 70 నియోజకవర్గాల్లో సంచార పశువైద్యశాలలు -వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి -పథకాల అమలులో అక్రమాలు సహించం: మంత్రి ఈటల వ్యవసాయం, అనుబంధశాఖలపై కరీంనగర్ జెడ్పీలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పోచారం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు సైతం ఆంధ్రోళ్ల పేర్లే పెట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ముద్దబిడ్డలకు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో వ్యవసాయ వర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారని గుర్తుచేశారు. కొత్తగా ఏర్పాటు చేసే ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, పశుసంవర్థక కళాశాలకు దివంగ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని నిర్ణయించామన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలివ్యవసాయశాఖ పాలిటెక్నిక్ కళాశాల సిరిసిల్లకు మంజూరు చేయడం గర్వంగా ఉందన్నారు. పశువుల సంరక్షణ కోసం గురువారం నుంచి రాష్ట్రంలో 70 నియోజకవర్గాలలో సంచార పశువైద్యశాలలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, అనుబంధంగా ఉన్న ఏడు శాఖలకు నిధుల కేటాయింపు, పథకాల అమలులో ప్రజాప్రతినిధులు అనుసరించాల్సిన పద్ధతులు, ప్రయోజనాలపై సర్వసభ్య సమావేశంలో సుదీర్ఘంగా వివరించారు. ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, బడ్జెట్‌లో రూ.8,500 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు.
నకిలీ విత్తనాలను అరికట్టడంతోపాటు సొంతంగా తయారుచేసుకునే విధంగా విత్తన ఉత్పత్తికి రూ.50 కోట్లు, సూక్ష్మసేద్యానికి రూ.450 కోట్లు, పాలిహౌస్‌కు రూ.252 కోట్లు కేటాయించామని వివరించారు. ఆదర్శరైతుల స్థానంలో త్వరలో వ్యవసాయ విస్తరణ అధికారులను నియమిస్తామని చెప్పారు. ఉద్యానవనశాఖ ఇన్‌పుట్ సబ్సిడీని త్వరలో విడుదల చేస్తామన్నారు.
-బియ్యం కిలో రూ.36కు కొనుగోలు చేసి హాస్టళ్లకు సరఫరా: మంత్రి ఈటెల రాజేందర్ పేదవాడి ఆకలి తీర్చేదిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా ఎవరు ప్రయత్నించినా కఠినచర్యలు తప్పవని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. అర్హులందరికీ ఆసరా ఫించన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు ఉద్యోగులై ఉన్న తల్లిదండ్రులను మాత్రమే ఆసరా నుంచి తొలగించామని స్పష్టంచేశారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ రానివారికి మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియని చెప్పారు. గురువారం నుంచి ఒక్కోవ్యక్తికి ఆరు కిలోల బియ్యాన్ని అందజేస్తామన్నారు.
హాస్టల్ విద్యార్థులకు సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని కిలోకు రూ.36 చెల్లించి మరీ అందజేస్తున్నామని తెలిపారు. 35 వేల ఆంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్త మెనూ అమలయ్యేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గోదాం నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లే వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేస్తామని, రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి అక్రమాలను అరికడుతామని వివరించారు.
-రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు: మంత్రి కేటీఆర్ వ్యక్తి చనిపోతే బీమా డబ్బులు ఎలా వస్తాయో, అలాగే పంట నష్టపోయిన రైతులకు బీమా డబ్బులు అందాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పంటల బీమా పథకం లోపభూయిష్టంగా ఉందని అసంతృప్తి వ్యక్తంచేశారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నదని, ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు.. ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు.
కార్యక్రమాల్లో ప్రభుత్వ చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ ఎంపీ బొయిన్ పల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య రథసారథి రసమయి బాలకిషన్, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు బొడిగె శోభ, పుట్ట మధు, మనోహర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, సుధాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.