Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతును రాజును చేయడమే లక్ష్యం

-రుణమాఫీ అమలు, రూ.8 వేలు ప్రోత్సాహకం చారిత్రాత్మక నిర్ణయాలు -వ్యవసాయశాఖ మంత్రిగా మూడేండ్ల పాలన సంతృప్తినిచ్చింది -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి

మూడేండ్ల పాలనలో తెలంగాణ రైతులు గర్వపడే రీతిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకున్న ఎన్నో నిర్ణయాలు సంతృప్తినిచ్చాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు. స్వరాష్ట్రంలో అన్నదాతలు గర్వంగా తాము రైతులం అని చెప్పుకునే పరిస్థితి తెచ్చామని అన్నారు. రుణమాఫీ పూర్తి చేయడం, పెట్టుబడి కింద ఎకరానికి ఏటా రూ.8 వేలు ఇవ్వడం వంటి నిర్ణయాలు తాను వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మూడేండ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో వ్యవసాయరంగంలో వచ్చిన మార్పుల గురించి నమస్తే తెలంగాణతో మంత్రి పోచారం ప్రత్యేకంగా మాట్లాడారు.

మూడేండ్ల స్వీయ పాలనలో వ్యవసాయరంగంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చారు? ఉమ్మడి పాలనలో కరెంటు, విత్తనం, సాగునీరు.. ఇలా అన్నింటికీ కొరతే, అన్నీ ఇబ్బందులే. తెలంగాణ రైతు గోస తెలిసిన వ్యక్తి, స్వయంగా రైతు అయిన కేసీఆరే.. ముఖ్యమంత్రి కావడంతో రైతుల బాధలు తీర్చడంపై దృష్టి పెట్టారు. జూన్ 2, 2014 పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రమాణ స్వీకారం రోజే బడుగు, బలహీన వర్గాల తర్వాత రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్ సర్కార్‌కు అత్యంత ప్రాధాన్య అంశం అని చెప్పారు. చెప్పిన విధంగానే విత్తనాలు, ఎరువులు సకాలంలో ఇస్తున్నాం. పంటలకు బీమా సదుపాయం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం. సాగునీటి ప్రాజెక్టులు, గోదాంల నిర్మాణం ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నాం. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో వచ్చిన దిగుబడులే మా పనితీరుకు నిదర్శనం.

రుణమాఫీ పూర్తి చేయడం, ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి వంటి కీలక నిర్ణయాలు ఎలాంటి సంతృప్తినిచ్చాయి? రైతులను అప్పుల ఊబిలోంచి బయటికి తెచ్చేందుకు, వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు సీఎం కేసీఆర్ ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి ఇస్తామని ప్రకటించారు. ఇది దేశ వ్యవసాయరంగ చరిత్రలో, రాష్ట్ర వ్యవసాయరంగ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే నిర్ణయం. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం 36 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత దేశంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కింది.

రైతు సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాలు ఏమిటి? రాష్ట్రంలో కోటి 8 లక్షల ఎకరాల భూమి ఉందని అంచనా. కానీ వాస్తవ లెక్కలు లేవు. రైతు సమగ్ర సర్వేతో రైతులు ఎంతమంది, ఎన్ని ఎకరాల భూమి ఉంది. ఏయే పంటలకు మనకు అవకాశం ఉంది. ఇలా ప్రతి అంశం తెలుస్తుంది. ఈ లెక్కలు వచ్చిన తర్వాత వచ్చే ఏడాదిలో రైతులకు ఏటా పెట్టుబడికి ఇచ్చే రూ.8 వేల పెట్టుబడికి ఎంత అవసరం ఉంటుందో తెలుస్తుంది. ఇలా సమగ్ర వివరాలతో అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేసుకునే అవకాశం ఉంటుంది. సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఈవోలు ప్రతి రైతు ఇంటికి వెళ్లి సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. వందశాతం కచ్చితమైన సమాచారం సేకరించేలా ఆదేశాలిచ్చాం. నేను అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా.

రైతు సంఘాల ఏర్పాటుతో మార్కెట్ సమస్యలు ఎలా తీరబోతున్నాయి? రైతు సమగ్ర సర్వే పూర్తయిన తర్వాత పూర్తి సమాచారం వస్తుంది. రెవెన్యూ గ్రామాలవారీగా గ్రామ రైతు సంఘం ఏర్పాటు చేస్తాం. వీటితో మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తాం. మే 2018 వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. గ్రామ రైతు సంఘాలే ఇకపై రైతుల పంటకు ధర నిర్ణయిస్తాయి.

క్రాప్ కాలనీ ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? రైతులు అంతాఒకే పంట వేయడంతో ఉత్పత్తి పెరిగి సరైన ధర రాక నష్టపోతున్నారు. అలాకాకుండా మనకు ఏది ఎంత అవసరం, ఏ పంటకు డిమాండ్ ఉందో అది వేసేలా రాష్ర్టాన్ని క్రాప్ కాలనీలుగా చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకు అనుగుణంగా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.

జీఎస్టీతో ఎరువుల ధరలు పెరుగనున్నాయి. దీనిపై కేంద్రానికి ఏమైనా విజ్ఞప్తి చేయనున్నారా? ఎరువులు, పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 8 వేల పెట్టుబడి ఇవ్వనున్నది. కాబట్టి జీఎస్టీతో ఎరువుల ధర పెరిగినా మన రైతులకు భారం కాదనే అనుకుంటున్నాం. మేం ఇచ్చే పెట్టుబడి రైతులకు కాస్త ఊరటనిస్తుందని భావిస్తున్నాం.

అంతర్జాతీయ స్థాయిలో విత్తన ఎగుమతుల్లో భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటి? ప్రస్తుతం దేశ విత్తన అవసరాల్లో 60 శాతం విత్తనాలు మన రాష్ట్రమే తీరుస్తున్నది. ఇప్పటికే 20 దేశాలకు విత్తనాలు ఎగుమతి చేస్తున్నాం. మన రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థకు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ (ఓఈసీడీ ధ్రువీకరణ) ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలకు మన విత్తనాలు ఎగుమతి చేసేందుకు అనుమతి వచ్చింది. ఇటీవలే సూడాన్‌కు జొన్న విత్తనాలు ఎగుమతి చేశాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.