Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతురాజ్యం రావాలి

– ప్రగతి బోనమెత్తిన గులాబీలు – రెండు పంటలకు ఎరువులు ఫ్రీ – పండ్ల తోటలకూ వర్తింపు

ప్రతి గ్రామంలో గ్రామ రైతుసంఘం ఏర్పాటు.. వీటి సమాహారంగా మండల, జిల్లా, రాష్ట్ర రైతుసంఘాలు వచ్చే బడ్జెట్‌లో రూ.500 కోట్లతో సీడ్‌మనీ స్కీం.. రివాల్వింగ్ ఫండ్‌తో రైతులకు వడ్డీలేకుండా డబ్బు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పాలన.. అన్ని వృత్తులవారినీ ఆదుకుంటాం కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతాం.. రైతులకు జరిగిన నష్టాన్ని కంపెనీలే చెల్లించేలా చట్టం ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు.. వ్యవసాయ శాఖలో 500 పోస్టుల భర్తీకి ఆదేశాలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే కేసులే.. టీఆర్‌ఎస్ 16వ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ కూలి పనులకూ ఉపాధి హామీ పథకం.. స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి పార్టీ కార్యకర్తల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

తెలంగాణలో రైతే రాజు కావాలి.. తెలంగాణ రైతు రాజ్యం కావాలి! వ్యవసాయం చేయడం ఉత్సవంలా సాగాలి! రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం సమగ్రంగా మారిపోవాలి.. అంతిమంగా బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి! ఇది ఒక రాజకీయ పార్టీ సంకల్పం!! దశాబ్దాల ఆకాంక్షను ఎన్నో త్యాగాలకోర్చి నెరవేర్చిన ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి.. ఎంచుకున్న సామాజిక లక్ష్యం! తన తపనంతా రాష్ర్టాభివృద్ధికోసమేనని చాటిన గులాబీ దళం.. తెలంగాణ ప్రగతి ప్రాంగణం నుంచి గ్రామాలకే తన పయనమని తేల్చిచెప్పింది! తన పదహారవ ప్లీనరీని ఇందుకే అంకితం చేసింది!

టీఆర్‌ఎస్ ప్లీనరీ ప్రాంగణం నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి:రాష్ట్రంలో రైతే రాజు కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన సంకల్పాన్ని చాటారు. తాను ప్రకటించిన ఉచిత ఎరువుల పథకం రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిగా మార్చే మరో విప్లవాత్మక నిర్ణయమని చెప్పారు. ఇది రెండు పంటలకూ వర్తిస్తుందని, పండ్ల తోటలకు కూడా అమలవుతుందని తెలిపారు. నాలుగు వేలు ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశం కాదని, ఈ రాష్ట్రంలో రైతును రాజును చేయడం దాని వెనుక ఉన్న మహత్తర లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పథకంలో ఎవరికీ మినహాయింపు లేదని, అందరు రైతులకు అందుతుందని స్పష్టంచేశారు. శుక్రవారం హైదరాబాద్ నగర శివార్లలోని కొంపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రగతి ప్రాంగణంలో టీఆర్‌ఎస్ 16వ ప్లీనరీ.. పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పదివేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తొలుత అమరవీరులకు సమావేశం నివాళులర్పించిన అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి అధ్యక్షోపన్యాసం చేసిన కేసీఆర్.. రాష్ట్ర అభివృద్ధి చిత్రాన్ని సమగ్రంగా ఆవిష్కరించారు. రైతులు, గొల్లకుర్మలతోపాటు సబ్బండ వర్ణాల సంపూర్ణ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న, తీసుకోబోయే చర్యలను వివరించారు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక చట్టాన్ని తీసుకురానున్నామని ఆయన ప్రకటించారు. రైతులకు జరిగిన నష్టం.. కంపెనీలే చెల్లించేలా ఈ చట్టం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావాలి. రైతు బాగుపడాలి. వ్యవసాయం బాగుపడాలి. సాగునీరు రావాలి. ఎన్ని ఆటంకాలు, అవాంతరాలు వచ్చినా కోటి ఎకరాలకు నీరు తేవాలనే లక్ష్యంగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం అని సీఎం ఉద్ఘాటించారు. ప్రాజెక్టులను అడ్డుకునేవారికి ప్రజలే బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అవినీతిరహితంగా పాలిస్తున్నామన్న సీఎం.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలితే ఉపేక్షించేది లేదని, ఆరోపణలు రుజువు చేయని వారిపై కేసులు పెడుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం విశేషాలు ఆయన మాటల్లోనే..

ఎరువుల పథకం మరో విప్లవాత్మక నిర్ణయం దేశానికి తెలంగాణను దిక్సూచిగా చేసే మరో విప్లవాత్మక నిర్ణయం ఎరువుల పథకం. రుణమాఫీ చేసినందుకు రైతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావాలి. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నాం. కులవృత్తులు పునరుజ్జీవనం కావాలి. రూ.5 వేల కోట్లతో గొల్లకుర్మలకు 84 లక్షల గొర్రెలను జూన్ 20 నుంచి అందించబోతున్నం. నాయీ బ్రాహ్మణుల కోసం ఒక్కొక్కటి లక్ష రూపాయలతో 27 వేల మోడ్రన్ సెలూన్స్‌ను 100 శాతం సబ్సిడీతో సమకూర్చబోతున్నం. రజకులకోసం ఆధునిక దోబీఘాట్లు, ఇతర పరికరాలను 100 శాతం సబ్సిడీతో అందిస్తాం. మత్స్యకారులకు వంద కోట్ల బడ్జెట్ పెట్టినం. వరంగల్‌లో అతిభారీ టెక్స్‌టైల్ పార్కుకు 15 రోజుల్లో శంకుస్థాపన చేస్తున్నాం. చేనేత కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు 50 శాతంసబ్సిడీ ఇస్తున్నాం. – కే చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు

ధన్యవాదాలు చెప్పేందుకు వస్తే.. ఎరువులు ఫ్రీగా ఇస్త అని నేను మాములుగా చెప్పిన. కేసీఆర్ మా పథకాన్ని నకల్ కొట్టాడు అని కాంగ్రెస్ వాళ్లంటున్నారు. వారికి ఏమాత్రం పౌరుషం ఉన్నా.. ఆ మాట చెప్పొద్దు. నాలుగు వేలు ఇచ్చుడే స్కీం అనుకున్నరు. నా స్కీం అది కాదు. రాష్ట్రంలో రైతు రాజు కావాలి. ఎకరాకు రూ.4వేలు ఇస్తమన్నం. ఇచ్చిన డబ్బుతో యూరియా కొంటారో, డీఏపీ కొంటారో, పెండ కొంటారో, గొర్రె ఎరువు కొంటారో.. అది రైతు ఇష్టం. ఇచ్చే నాలుగువేలు ఒక పంటకు ఇవ్వం. యాసంగి, వానాకాలం.. రెండు పంటలకూ ఇస్తం. ఈ స్కీం మంచిదేనా! అమలు జరుగాలి కదా! (అంటూ ప్రతినిధులను అడుగగా.. వారు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు). రాష్ట్రంలో పండ్ల తోటలున్న వారికి కూడా ఎకరాకు రూ.4వేలు ఇస్తాం. ఎవరికీ మినహాయింపు లేదు అని సీఎం చెప్పారు.

పాతిక ఎకరాలపైబడి ఉన్న రైతులు 0.28శాతమే ఉచిత ఎరువుల పంపిణీతో లబ్ధి పొందే పెద్ద రైతులు కేవలం 0.28% మాత్రమేనని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో రెండున్నర ఎకరాల్లోపు ఉన్న రైతులు 62% ఉన్నారు. ఐదెకరాల్లోపు ఉన్న వారు 24% ఉన్నారు. 10 ఎకరాల్లోపు ఉన్న వారు 11% ఉంటే, 25 ఎకరాలలోపు ఉన్న వారు 3% ఉన్నారు. అందరూ కలిపితే 99.7%. ఇక 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారు రాష్ట్రంలో కేవలం 0.28% మాత్రమే అని వివరించారు.

రైతులను సంఘటితం చేసేందుకు సంఘాలు చెత్త కాడ ఇనుప ముక్కలు ఏరుకునే వారికి కూడా సంఘాలున్నాయి. కానీ రైతులకు సంఘాలు లేవు. రైతులు సంఘటితం కావాలి. కానీ రైతులు సంఘటితం కాలేరు. అందుకే ప్రభుత్వమే రైతులను సంఘటితం చేస్తుంది. అన్ని కులాల వారితో ప్రతి గ్రామంలో ఆయువుపట్టులాంటి రైతు సంఘం ఏర్పాటు చేస్తం. దీనికి సమాహారంగా మండల, జిల్లా రైతు సమాఖ్యలు ఏర్పాటవుతాయి. వీటికి సమాహారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటవుతుంది. వచ్చే బడ్జెట్‌లో రాష్ట్ర రైతు సమాఖ్యకు రూ.500కోట్లు సీడ్ మనీ ఏర్పాటుచేస్తున్నాం. ఈ డబ్బును బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేస్తాం. అదే సమయంలో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటుకావాలి. రైతులు ధాన్యం అమ్ముకునేటప్పుడు క్వింటాలుకు రూపాయో, రెండు రూపాయలో తీసుకుని, వాటిని కూడా కలిపి, రెండుమూడేండ్లలో రూ.2-3వేల కోట్ల నిధిని తయారుచేస్తాం. రైతుకు రైతే దన్ను కావాలి. అట్ల జరిగిన తరువాత ఏ రైతు కల్లాల మీద ధాన్యం అమ్ముకుంటున్నారో వారికి అండగా ఉండాలి. రైతు సంఘాలు ఏర్పడిన తరువాత వ్యాపారులతో మాట్లాడి, మంచి ధర వచ్చేలా చేస్తారు. అత్యవసరం ఉన్న వారికి ధాన్యం ఉంచుకుని రివాల్వింగ్ ఫండ్ నుంచి డబ్బు ఇస్తారు. మంచి ధర వచ్చిన తరువాత ధాన్యం అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రైతు రాజు కావాలంటే ఉత్తగనే కాడు. ఇవన్నీ చేయాలి అని సీఎం వివరించారు.

క్రాప్ కాలనీలు ఏర్పాటు కావాలి భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులున్న తెలంగాణలో క్రాప్ కాలనీలు ఏర్పాటు కావాలని సీఎం చెప్పారు. ఒకాయన పసుపు పంట పెట్టి, క్వింటాలుకు రూ.15వేలకు అమ్ముకుంటే, వచ్చే సంవత్సరం రైతులందరూ పసుపే వేసి, క్వింటాలు రూ.10కి అమ్ముకునే పరిస్థితి. ఒక రైతు టమాటకు మంచి ధర వస్తే అందరూ టమాట వేసి, రోడ్లమీద పోసుకునే పరిస్థితి. రైతే రైతుకు శత్రువు అవుతున్నాడు. ఈ పద్ధతి పోవాలి. నేనే మూడేండ్ల క్రితం జరిగిన ప్లీనరీలో చెప్పిన. అసెంబ్లీలో సీఎంగా మొదటిసారి మాట్లాడినప్పుడు కూడా చెప్పిన. కాంగ్రెస్ నాయకులు మా స్కీంను నకల్ కొట్టినవ్ అంటుంటే, రైతులపై వారికున్న అకల్ ఎందో మీరే అర్థం చేసుకోవాలి. క్రాప్ కాలనీలు ఏర్పాటు కావాలి. జిల్లాల్లో ఉండే గాలి, భూగర్భ జలాలు, భూసారం తదితర అంశాల ఆధారంగా క్రాప్ కాలనీలు ఏర్పాటుచేస్తం. రైతు సంఘాలు శక్తిమంతం కావాలి. ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలో చెప్తం. ఆ పంటలు వేసేలా రైతు సంఘాలు కృషిచేయాలి. నేనూ రైతునే. వ్యవసాయం బాధలు నాకూ తెలుసు. మనం రైతులం.

పైరవీకారులం కాదు. మన స్కీంలో దళారులకు అవకాశం ఇవ్వొద్దు. లంచగొండితనం ఉండొద్దు. సాలార్జంగ్ పుణ్యాన తెలంగాణలో పటిష్ఠ రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఎవరు భూములు అమ్మకున్నారు? ఎవరి భూములు రియల్ ఎస్టేట్ అయ్యాయో అన్ని వివరాలు గ్రామ రైతు సంఘాలు సమాచారం తీసుకోవాలి. తెలంగాణ వచ్చే సమయానికి రాష్ట్రంలో 700మంది వీఆర్వోలే ఉన్నారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీచేశాం. 2112మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించినం. వారికి ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నాం. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున ఉంటారు. భూములు అమ్మకునే సమయంలో వీఆర్వో, గ్రామ రైతు సంఘం సంతకాలు తీసుకునే వ్యవస్థ రావాలి అని సీఎం చెప్పారు.

మే, అక్టోబర్‌లో ఎరువుల సొమ్ము జమ రైతులకు ఇచ్చే డబ్బును రెండుసార్లు డిపాజిట్ చేస్తాం. వానాకాలం పంటకు మే నెలలో, యాసంగికి అక్టోబర్ నెలలో డబ్బు డిపాజిట్ చేస్తాం. ఓ సన్నాసి ఈ సంవత్సరం నుంచే అమలు చేయొచ్చుకదా.. అన్నాడు. ఒక కొత్త వ్యవస్థ నిర్మాణం కావాలి. వచ్చిన డబ్బును ఎప్పుడు లోపలేసుకుందామా అనుకునే వారిలా మనం కాదు. రైతు అప్పులపాలు కాకుండా ఉండేందుకు మనం మంచి పనిచేస్తున్నాం. నాకు చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారు. మీరిచ్చే నాలుగువేలు ఎరువులకే కాదు, విత్తనాలకు కూడా వస్తాయి. మేం గడ్డి కలుపు తీసుకునుడే మిగిలింది అంటున్నారు. ఈ పథకానికి రూ.7-8వేల కోట్లు ఖర్చు అవుతుంది. గత ప్రభుత్వాలు అందరికీ అన్నీ ఇచ్చేవారు కానీ రైతులకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఇవాళ నీతి ఆయోగ్ సహా దేశం మొత్తం తెలంగాణను చూస్తున్నది. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం పకడ్బందీగా ముందుకు సాగాలి. ఏదైనా సమస్యతో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు సీఎం దగ్గరికి వస్తే రెండు నిమిషాల్లో ఇంటర్వ్యూ లభిస్తుంది అని కేసీఆర్ తెలిపారు.

నాడు పిడికెడు మంది.. నేడు 75 లక్షల మంది! పిడికెడు మందితో మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి నేడు 75 లక్షల మంది సభ్యులతో దేశంలోని పెద్ద పార్టీగా అవతరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మరోసారి తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై పార్టీ శ్రేణులందరికీ కే చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికకు సారథ్యం వహించిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి వ్యక్తగతంగా ధన్యవాదాలు తెలిపారు. ప్లీనరీకి వచ్చిన డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ అధ్యక్షులు సహా అందరికీ ఆయన అభినందలు తెలిపారు. ప్లీనరీలో పాల్గొనేందుకు వచ్చిన ఎన్నారైలు మహేశ్ బిగాల, అనిల్ కూర్మాచలం, మోహన్, నాగేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, సతీశ్ తదితరులకూ స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు పిడికెడు మందిమి ఉన్నాం. ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు. మఖలో పుట్టింది పుబ్బలో పోతుందన్నారు. పోరాట పటిమతో పట్టుబట్టి, 15 ఏండ్లు ఉద్యమించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినం. కొద్దిమంది సమూహంగా మొదలైన టీఆర్‌ఎస్.. ఇవాళ 75లక్షల సభ్యత్వాన్ని కలిగి ఉన్న దేశంలోని పెద్దపార్టీగా అవతరించింది అని కేసీఆర్ చెప్పారు.

అత్యంత ధనికులైన గొల్ల కుర్మలు మన వద్దే 2001లో ఇంటికో యువకుడిని ఇవ్వండి తెలంగాణ సాధించి మీ పాదాల దగ్గర పెడుతా.. అన్నా. తెలంగాణ సాధించి తెచ్చిన. కరెంటు బాధ పోగొడుతా అన్నా.. పోగొట్టిన. వృత్తిదారులను ఆదుకుంటాం అని చెప్తున్న. దేశంలో అత్యంత ధనిక గొల్లకుర్మలు ఎక్కడున్నారు అంటే తెలంగాణలో ఉన్నారని చెప్పుకోవాలి. దేశంలో అత్యంత ధనవంతులైన రైతులు తెలంగాణలో ఉన్నారని చెప్పాలి. చెరువు కట్టల మీద క్షౌరంచేసే దశ మారాలి. హైదరాబాద్‌లో ఎలా సెలూన్లు ఉంటాయో, తెలంగాణలో నాయీ బ్రాహ్మణుల కోసం 100శాతం సబ్సిడీతో మోడ్రన్ సెలూన్లు ఏర్పాటు చేస్తాం అని సీఎం చెప్పారు.

తెలంగాణలో జీవన విధ్వంసం రాదనుకున్న తెలంగాణ వచ్చింది. ఎటువంటి తెలంగాణ వచ్చింది? తెలంగాణ జీవన విధ్వంసానికి గురైంది. మైనర్ ఇరిగేషన్ చెరువులన్నీ లొట్టపీసు చెట్లతో, మురికి కంప చెట్లతో నిండి ఉన్నాయి. ప్రతి నాలుగేండ్లకు రెండుమూడేండ్లు కరువు. వలస బతుకులు, ఆకలి చావుల తెలంగాణ చేశారు. 24లక్షల బోర్లు వేసి తెలంగాణ రైతు బోర్లా పడ్డాడు. రైతుకు 10 ఎకరాల భూమి ఉన్నా పాన్‌డబ్బా పెట్టుకున్నోడే నయం అనుకునే పరిస్థితికి వచ్చారు. సిరిసిల్లలో గోడల మీద కలెక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు అంటూ నినాదాలు రాయించారు. బస్తీకో పేకాట క్లబ్బు.. గుడుంబా విహారం.. కల్తీ రక్కసి. ఆర్టీసీ మెడపై కత్తి. ఇవాళ ప్రైవేటుపరం చేస్తారా.. రేపు ప్రైవేటుపరం చేస్తారా? అనే పరిస్థితి. అడుగడుగునా అవినీతి కంపు. సచివాలయం నిండా పైరవీకారులు. మంత్రులు కోర్టుల్లో, ఐఏఎస్‌లు జైళ్లలో. ఇటువంటి తెలంగాణ రాష్ట్రం మనకు అందింది. వచ్చిన తెలంగాణను ఏం చేయాలి? ఇక్కడేం జరుగాలి? చేయాల్సిందేంటి? ప్రాథమ్యాలేంటి? అని అనేక ప్రణాళికలు తయారు చేసినం. బతుకుకు భద్రత తేవాలని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినం. 40వేల కోట్లు ఖర్చు చేసి పేదల సంక్షేమం చూసే రాష్ట్రం తెలంగాణ. ఆసరా పెన్షన్ల నుంచి దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నాం.రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నాం. స్కూళ్లలో సన్నబియ్యం పెడుతున్నం. ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే అంధకారం అన్నాడు. కరెంటు బాధ పోవాలని యుద్ధం చేసినం. దాని ఫలితంగా వెలుగులు విరజిమ్ముతున్నది. 9350మెగావాట్ల డిమాండ్ విద్యుత్ సరఫరా చేసినం. భవిష్యత్తులో తెలంగాణకు కరెంటు కోతలుండవని సంతోషంగా తెలియజేస్తున్నా. పారిశ్రామికవేత్తలు గతంలో కరెంటుకోసం ధర్నాలు చేశారు. ఫిక్కీ మాజీ అధ్యక్షుడు ఈ మధ్య లేఖ రాశారు. పరిశ్రమలకు అనుమతులు, పవర్ సరఫరా, లా అండ్ ఆర్డర్ బాగుంది. ఆరు నెలల్లో ఉత్పత్తి సాధించే రాష్ట్రం తెలంగాణ అని ఆ లేఖలో రాశారు. కరెంటు దరిద్రం పోయింది. పరిశ్రమలు వస్తున్నాయి. అవినీతిరహిత పాలన నడుస్తున్నది. పొలాలు పంటలతో కళకళలాడుతున్నాయి. పర్యావరణ రక్షణకోసం ప్రపంచంలో మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారం కార్యక్రమం జరుగుతున్నది అని సీఎం కేసీఆర్ వివరించారు.

ఉపాధి హామీ పథకంలో వ్యవసాయం స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ప్లీనరీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తన అధ్యక్షోపన్యాసం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. మీరందరూ ఎస్ అంటే నేను ఒక తీర్మానం ప్రవేశపెడుతా. వానాకాలం పంట సీజన్‌లో జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల పనులకు ఇబ్బంది ఉంది. నరేగా పథకాన్ని వ్యవసాయనికి అనుబంధంగా చేయాలని టీఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానం ఆమోదిస్తున్నది అంటూ సీఎం ప్రతిపాదించగా ప్రతినిధులందరూ ఆమోదించారు. కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఈ నెల 23న నీతి ఆయోగ్ సమావేశం ఉంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి వస్తున్నారు. ఈ తీర్మానం విషయాన్ని ఢంకా బజాయించి చెప్తా అన్నారు. వ్యవసాయ శాఖలో 500 ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసినం. త్వరలోనే అన్ని పోస్టులు భర్తీ చేసుకుంటాం. మనం రైతు సేవకు, ప్రజల సేవకు పునరంకితం అవుదాం అని సీఎం కేసీఆర్ చెప్పారు.

మంచినీళ్ల బాధ రామాయణమంత తెలంగాణ మంచినీళ్ల బాధ రాసుకుంటే రామయణమంత.. చెప్పుకుంటే భారతమంత. ఈ బాధ శాశ్వతంగా నివారించేందుకు చేపట్టిందే మిషన్ భగీరథ. ఈ సంవత్సరం చివరి నాటికి కృష్ణా, గోదావరి నీళ్లు అన్ని గ్రామాలకు చేరబోతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. రైతు, వ్యవసాయం బాగుపడాలి. సాగునీరు రావాలి. ఎన్ని ఆటంకాలు, అవాంతరాలు వచ్చినా కోటి ఎకరాలకు నీరు తేవాలనే లక్ష్యంగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. అసంపూర్తిగా ఉన్న వాటిని చేపట్టి ఐదున్నర లక్షల ఎకరాలకు నీరు ఇచ్చాం. మహబూబ్‌నగర్‌లోనే నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరు ఇస్తే రివర్స్ మైగ్రేషన్ వస్తున్నారు. కాకతీయ రెడ్డి రాజులు మనకిచ్చిన వరం చెరువులు. అవి ధ్వంసమయ్యాయి. మిషన్ కాకతీయద్వారా 46వేల చెరువులను బాగుచేసుకుంటున్నాం. ప్రపంచం మొత్తం వేయినోళ్లతో పొగుడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు రకరకాల కారణాలతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. సాంకేతిక కారణాలు చెప్పి, కాళేశ్వరం వద్ద పనులు జరుగడం శోచనీయం అన్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి. రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 2,500 కిలోమీటర్లు ఉంటే, తెలంగాణ వచ్చిన తరువాత 5303 కిలోమీటర్లకు తీసుకుపోయినం. జాతీయ సగటు కూడా మించిపోయినం.

తెలంగాణ వస్తే అందరూ చిరునవ్వుతో బతుకాలని ఉద్యమ సమయంలో అనేక వేదికల మీద చెప్పిన. అన్ని కులాలు, మతాలు గౌరవం పొందాలి. దసరా, బతుకమ్మ, బోనాల పండుగలకు కోట్ల రూపాయలు ఇచ్చి నిర్వహిస్తున్నాం. రంజాన్, క్రిస్‌మస్ పండుగను ఎలా నిర్వహిస్తున్నామో ప్రజలకు తెలుసు. తెలంగాణ గంగా జమునా తెహజీబ్‌గా ముందుకు పోతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావాలి. ఉపన్యాసాలు చెప్తే పటిష్ఠం కావు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నాం. కులవృత్తులు పునరుజ్జీవనం కావాలి. రూ.5వేల కోట్లతో గొల్లకుర్మలకు 84లక్షల గొర్రెలను జూన్ 20నుంచి అందించబోతున్నం. నాయీ బ్రాహ్మణుల కోసం ఒక్కొక్కటీ లక్ష రూపాయలతో 27వేల మోడ్రన్ సెలూన్స్‌ను 100శాతం సబ్సిడీతో సమకూర్చబోతున్నం. రజకులకోసం ఆధునిక దోబీఘాట్లు, ఇతర పరికరాలను 100శాతం సబ్సిడీతో అందిస్తాం. గీత కార్మిక సోదరులున్నారు. సమైక్య పాలకులు పాట్టించుకోలేదు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కల్లు దుకాణాలు తెరిపిస్తాం అన్నా.. తెరిచి చూపించినం. మూడేండ్ల నుంచి నడుపుతున్నారు. కల్తీ కల్లు తాగి ఒక్కరూ చనిపోలేదు.

మత్స్యకారులకు వంద కోట్ల బడ్జెట్ పెట్టినం. 27కోట్ల చేపపిల్లలు చెరువులు, రిజర్వాయర్లలో వేశాం. 400గ్రాముల నుంచి కిలోకు పెరిగాయి. గతంలో తెలంగాణ మత్స్యకారులను బేగంబజార్ బ్రోకర్లకు అప్పగించారు. ఇప్పుడు 5వేల కోట్ల సంపదను సృష్టించబోతున్నాం. ఉద్యమం సందర్భంగా సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వస్తుంటే.. ఆత్మహత్యలు వద్దంటూ జిల్లా కలెక్టర్ గోడల మీద రాయించిన నినాదాలు కనిపించాయి. అవి చూసి కండ్లలో నీళ్లు తిరిగాయి. 70ఏండ్ల స్వాతంత్య్రం తరువాత ఈ నినాదాలు చూడాలా! అని ఏడ్చినం. తెలంగాణవస్తే చేనేత కార్మికులను కాపాడుకోవాలనుకున్నాం. పోచంపల్లిలో జోలెపట్టి భిక్షాటన చేసి, ఇంటికి రూ.50వేలు ఇచ్చినం. సిరిసిల్లలో ఒకేరోజు 11మంది చనిపోతే 50లక్షలు పార్టీ తరఫున ఇచ్చినం. ప్రభుత్వం వచ్చాక వారిని పిలిచి మంచి కార్యక్రమం రూపొందించినం. వరంగల్‌లో అతిభారీ టెక్స్‌టైల్ పరిశ్రమకు 15రోజుల్లో శంకుస్థాపన చేస్తున్నాం. 50% నూలు, రంగులు, రసాయనాలకు సబ్సిడీ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేదు. 50వేల పవర్‌లూమ్స్ ఆధునీకరిస్తున్నాం. గద్వాల్, పోచంపల్లి, నారాయణ్‌పేట్ చీరలు చేనేత కార్మికులు అమ్ముకున్నాక మిగిలినవి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. చేనేతకు ప్రథమంగా రూ.1200కోట్ల బడ్జెట్ కేటాయించినం. బీసీ వర్గాల్లోని వృత్తి పనివారలకు సాయం చేస్తున్నాం. ఎంబీసీలుగా 90కులాలున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టాం. వారందరికీ న్యాయం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మీకు తెలుసు అని సీఎం వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.