Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతుకు బతుకు భరోసా కల్పించినం

-భూసేకరణ చిక్కులు లేకుంటే రెట్టింపు ఫలితాలొచ్చేవి -పలు జిల్లాల్లో రికార్డు సాగు ఎంతో సంతృప్తినిచ్చింది -ఈ ఏడాది కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ ముఖచిత్రం మారుస్తం -మహారాష్ట్ర ఒప్పందం జీవితంలో గొప్ప అనుభూతి -నమస్తే తెలంగాణతో భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

కకావికలమైన వ్యవసాయరంగం.. దారితెన్నూ తెలియని సాగునీటిరంగం! తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో రెండు కీలకరంగాల దుస్థితి! ఇప్పుడు? ఎన్నడూలేనంతగా చెరువుల కింద 15.50 లక్షల ఎకరాల్లో సాగు! అనేక ప్రాజెక్టుల కింద యాసంగిలోనూ రికార్డుస్థాయి ఏరువాక! ఈ విప్లవాత్మక మార్పు తనకెంతో సంతృప్తిని ఇచ్చిందంటున్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. సాగునీటి ప్రాజెక్టులంటే దశాబ్దాల కాలయాపన అనే చరిత్రను తిరుగరాయడానికి ఆకుపచ్చ తెలంగాణ అనే సంకల్ప బలమే తమను ముందుకు నడిపించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు. ఆ విశేషాలు..

చాలా సమయం వృథా అయిందనే బాధ ఈ మూడేండ్లలో సాగునీటి ప్రాజెక్టుల పనులు గరిష్ఠంగా ఏడాది, ఏడాదిన్నర మాత్రమే జరిగినయి. మిగిలిన సమయమంతా భూసేకరణ, కోర్టు కేసుల కారణంగా చాలా సమయం వృథా అవడం ఎంతో బాధించింది. మొదటి సంవత్సరంలో భూసేకరణ చట్టం-2013కు కేంద్రం సవరణలు చేస్తుందని వేచిచూసినం. వాళ్లు చేతులెత్తేసే సరికి రైతులకు ప్రయోజనకరంగా మనకంటూ ఒక విధానం ఉండాలని జీవో 123 రూపొందించాం. ఆ తర్వాత ఏడాదిపాటు సాఫీగా, రైతుల సహకారంతో భూసేకరణ ప్రక్రియ సాగింది. కానీ దానిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం, కోర్టు ఆదేశాలతో ప్రక్రియ అంతా నిలిచిపోయింది. దానితో భూసేకరణ చట్టం తయారుచేశాం. కేంద్రం, రాష్ట్రపతి ఆమోదంతో ఇప్పుడు కుదుటపడింది. ఇలా చాలాకాలం మా చేతులు కట్టేసినట్లుగా ఉండటంతో ఆశించిన స్థాయిలో పని చేయలేకపోయినం. అయినా.. గతేడాది మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నుంచి వచ్చిన ఫలితాలు రైతాంగానికి, ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చినయి. ఒకవేళ ఈ అవాంతరాలు లేకుంటే గత ఏడాది ఫలితాలకు రెట్టింపు స్థాయిలో రైతాంగానికి ప్రయోజనం కలిగించేవాళ్లం.

రీడిజైనింగ్‌తో గోదావరి సజీవం ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై కొందరు అవాకులు, చెవాకులు పేలారు. కానీ తెలంగాణ వైపు కన్నెత్తి చూడకుండా దిగువకు పరుగులు పెట్టే గోదారమ్మను ఒడిసిపట్టి, సజీవంగా నిలుపుకొనే మహత్తర అవకాశం రీడిజైనింగ్‌తోనే దక్కింది. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ జలాశయాలను కలుపుకొంటే నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి దిగువన దుమ్ముగూడెంవరకు 470 కిలోమీటర్ల పొడుగున ఉన్న గోదావరిలో 274 కిలోమీటర్ల మేర నది 365 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. కొత్తగా కట్టే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌లతోపాటు శ్రీరాంసాగర్, సదర్‌మాట్, తుపాకులగూడెం, దుమ్ముగూడెం ఆనకట్ట ఇలా మొత్తం 146.30 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. తద్వారా వ్యవసాయం, చేపల పెంపకం, టూరిజం, జల రవాణా.. ఒకటేమిటి? ఉత్తర తెలంగాణ ఆర్థిక, సామాజిక ముఖచిత్రమే మారిపోతుంది.

పక్కా ప్రణాళిక, డిజైన్లతోనే రిజర్వాయర్ల రూపకల్పన గతంలో ఒక రిజర్వాయర్ కట్టాలంటే సాంకేతిక అంశాలు చూసుకొని ప్రజల గురించి పట్టించుకునేవాళ్లు కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం సాంకేతికంగా, ప్రజల కోణంలో మథనం చేసింది. అందుకే ఎల్లంపల్లి-20 టీఎంసీలకు 19 గ్రామాలు పూర్తిగా, రెండు పాక్షికంగా, మిడ్‌మానేరు-25.8 టీఎంసీలకు 11 గ్రామాలు పూర్తిగా, ఏడు పాక్షికంగా, పులిచింతల-45 టీఎంసీలకు 28 గ్రామాలు పూర్తిగా, నాలుగు పాక్షికంగా ముంపులోకి పోయినయి. కానీ పాలమూరు-రంగారెడ్డి 115 టీఎంసీలకు 32 గ్రామాలు, 14 తండాలు, డిండిలో 23 టీఎంసీలకు కేవలం 8 తండాలు, మల్లన్నసాగర్ 50 టీఎంసీలకు ఎనిమిది గ్రామాలు, ఐదు హామ్లెట్స్ మాత్రమే ముంపునకు గురయ్యాయంటే ఎంత ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించామో అర్థమవుతుంది. కాళేశ్వరంలోని రంగనాయకసాగర్ మూడు టీఎంసీలతో నిర్మిస్తుంటే అందులో ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురికాకుండా ప్లాన్ చేశాం. ఇదీ ప్రజల పట్ల మా చిత్తశుద్ధి.

ప్రభుత్వ చిత్తశుద్ధితోనే రివర్స్ వలసలు ప్రభుత్వం ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదన్నది పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ విమర్శ. చరిత్రలో లేనివిధంగా గతేడాది పాలమూరు జిల్లాలో 4.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చినం. ఈసారి 8లక్షల ఎకరాలకు నీళ్లిస్తం. ఈ ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు.. మేం కట్టినవే ప్రారంభిస్తున్నరని మాట మార్చినరు. ప్రజలు గమనిస్తూనే ఉన్నరు. కల్వకుర్తి ఎత్తిపోతలకు గతేడాది సివిల్ పనులకే రూ.650 కోట్లు ఖర్చుచేసినం. ప్రాజెక్టు చరిత్రలో ఇది రికార్డు. ఈ ఏడాది ఆ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించినం. పాలమూరు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు ఎంత సీరియస్‌గా ఉందో తెలిపేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రభుత్వం నాలుగో ఏడాది (2017-18)లో ఒక గొప్ప, చారిత్రాత్మక ఫలితాన్ని ప్రజలను అందించబోతున్నది. రాష్ట్రంలోని పాత ఐదు జిల్లాలు.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్‌వరకు కాళేశ్వరం ఎత్తిపోతల కింద గోదావరిజలాలను రైతాంగానికి అందిస్తాం. దేశచరిత్ర చూస్తే.. ఒక ప్రాజెక్టు డిజైన్, సర్వే, టెండర్లు, పనులు పూర్తయ్యేందుకు కనీసంగా దశాబ్దం పడుతుంది.కానీ కాళేశ్వరం ఎత్తిపోతలతో రీడిజైనింగ్ పూర్తి చేసిన ఏడాది, ఏడాదిన్నరలోనే రైతాంగానికి సాగునీరు అందించనున్నామంటే ఈ ప్రభుత్వం రైతాంగ గోసను తీర్చేందుకు ఎంత తపిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడైనా మంచినీటి కొరత కనిపించిందా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏప్రిల్, మే నెల వచ్చినయంటే పత్రికల్లో పతాక శీర్షికల్లో మంచినీటి సమస్యపై కథనాలొచ్చేవి. కానీ ఈ ఎండాకాలంలో ఎక్కడైనా మంచినీటి కొరత ఉం దంటూ కథనాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇదంతా కేవలం మిషన్ కాకతీయ ఫలితమే.

అది.. జీవితంలో ఒక జ్ఞాపకాల మూట మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకోవడం.. ఆపై కాళేశ్వరం పథకంలో భాగంగా మేడిగడ్డ బరాజ్ భూసేకరణ కోసం మహారాష్ట్ర రైతులను ఒప్పించడం.. జీవితంలో ఒక గొప్ప మైలురాయిని సాధించామనే ఆత్మ సంతృప్తిని మిగిల్చాయి. ముఖ్యంగా దశాబ్దాలుగా సాధ్యంకాని ఒప్పందాన్ని నెలల వ్యవధిలోనే పూర్తి చేయడమనేది గొప్ప లక్ష్యాన్ని సాధించినట్లయింది. ఆపై మేడిగడ్డ బరాజ్ భూసేకరణ కోసం పార్టీ ప్రజాప్రతినిధులను రంగంలోకి దింపి, ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ.. అనుకున్నది సాధించాం. ఆ శ్రమ ఫలితంగానే ఇప్పుడు మేడిగడ్డ వద్ద బరాజ్ పనులు సాఫీగా, వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రస్థానంలో ప్రతి దశ గొప్ప అనుభూతి.

సంతృప్తినిచ్చిన మైలురాళ్లు.. మిషన్ కాకతీయ విజయవంతం రాష్ర్టానికి దేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టింది. రికార్డు సాగు, పూడిక మట్టితో రైతులకు దిగుబడి పెంపు, అన్నిరకాల కులవృత్తులకు బతుకుపై భరోసాను కల్పించింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతమున్నా వినియోగించుకోలేని దుస్థితి గతం. కానీ గతేడాది బోధ్ చెరువు కింద ఐదు వేల ఎకరాలు, చింతల్‌బోరి కింద 1500, బజార్ హత్నూర్ కింద 4900 ఎకరాలు.. ఒక మీడియం ప్రాజెక్టు లెక్క చెరువులు రైతులకు అండగా నిలిచినయంటే అది మిషన్ కాకతీయ పుణ్యమే. -నాలుగు దశాబ్దాలుగా ప్రతి ఒక్క ఎన్నికలో నాయకుల వాగ్దానంలోనే నలిగిపోతున్న ఆదిలాబాద్‌లోని లోయర్ పెనుగంగకు మా ప్రభుత్వం పరిష్కారాన్ని చూపడం సంతోషంగా ఉంది. యుద్ధప్రాతిపదికన బరాజ్, కాల్వల పనులు పూర్తి చేసి ఆ రైతుల స్వప్నాన్ని సాకారం చేస్తాం.

-సదర్‌మాట్.. ఐదు దశాబ్దాల పోరాటం. దానికి మేం శంకుస్థాపన చేసినం. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేసి నిర్మల్, ఖానాపూర్ రైతులకు సాగునీరిస్తం. గంగనాల ప్రాజెక్టుకు జీవంపోస్తం. -దేవాదుల ప్రాజెక్టులో నాలుగైదేండ్లు పరిష్కారంలేకుండా ఉన్న రామప్ప టన్నెల్ అంశానికి పరిష్కారాన్ని ఇచ్చినం. తద్వారా మూడో దశ పనులు వేగంగా జరుగుతున్నయి. ప్రాజెక్టు నీటి కేటాయింపును 38 టీఎంసీల నుంచి 60 టీఎంసీలకు పెంచినం. తద్వారా తుపాకుల గూడెం బరాజ్‌ను పూర్తిచేసి వరంగల్‌ను సస్యశ్యామలం చేసేందుకు మార్గం సుగమమైంది. -మహబూబ్‌నగర్ జిల్లా పెండింగు ప్రాజెక్టులద్వారా 4.5 లక్షల ఎకరాలకు నీరివ్వడంతో రివర్స్ వలసలు మొదలవడం చరిత్రను తిరుగరాసినట్లయింది. -స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాల్వలద్వారా సాగునీటికి నోచుకోని మెదక్ జిల్లా రైతాంగానికి సింగూరు కింద తొలిసారిగా 30వేల ఎకరాలకు నీళ్లియ్యడం జీవితంలో చాలా తృప్తినిచ్చే అంశం. -ఆదిలాబాద్ జిల్లాలో పదేండ్లుగా పెండింగులో ఉన్న నాబార్డు, జైకా ప్రాజెక్టులను పూర్తి చేసి 70వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం సంతోషకరం. -భక్త రామదాసు ప్రాజెక్టు.. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ఎంత వేగంగా పని చేస్తుందో తెలిపే సజీవ సాక్ష్యం. ఖమ్మం జిల్లా సస్యశ్యామలానికి సీతారామ ప్రాజెక్టు రీడిజైనింగ్ విజయవంతంగా పూర్తవడం ఆనందంగా ఉంది. ఇంద్రావతి నీళ్ల ద్వారా ఆ జిల్లాలోని 4.5 లక్షల ఎకరాలకు అందించేందుకు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నా. -ఏ ప్రభుత్వమూ పట్టించుకోని మూసీ కాల్వల (బునాదిగాని, ధర్మారెడ్డి కాల్వలు) పునరుద్ధరణను రూ.350 కోట్లతో చేపడుతుంటే ఆ ప్రాంత రైతుల్లో వచ్చిన భరోసా చాలా తృప్తినిచ్చింది. నల్లగొండ జిల్లాలోనూ సాగర్ లోలెవల్ కెనాల్ ద్వారా 50వేల ఎకరాలకు ఈసారి నీళ్లిస్తం. అసలు ఇది పూర్తయితుందా అనే అనుమానంతో ఉన్న ఆ ప్రాంత ప్రజలు ప్రాజెక్టు పూర్తితో ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం సంతోషాన్నిచ్చింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.