Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతులకు శుభవార్త..ఈ నెల 28 నుంచి రైతుబంధు

-66 లక్షల మందికి రూ.7,600 కోట్ల సాయం
-యాసంగి పెట్టుబడిసాయం పంపిణీకి ఆదేశం
-ఈ నెల 28 నుంచి బ్యాంకు ఖాతాల్లోకి..
-ఎకరం నుంచి మొదలై చివరి రైతు వరకు..
-సంక్రాంతి నాటికి పంపిణీ పూర్తికి ఆదేశాలు
-సీజన్‌ ప్రారంభంలోనే చేతికి పెట్టుబడి సాయం
-ఇప్పటికే రూ.57 వేల కోట్ల రైతుబంధు నగదు
-తాజా పంపిణీతో 65 వేల కోట్ల మైలురాయికి..
-కొత్తగా మరో లక్షమంది అర్హులయ్యే అవకాశం

సాగుకు పెట్టుబడి ఎట్లా అని బెంగపడే పనిలేదు. అదును దాటి పోతుందన్న ఆందోళన అక్కర్లేదు. పంట సీజన్‌ ప్రారంభానికి ముందే ప్రభుత్వ సాయం ఖాతాలో పడిపోతున్నది. రైతు సంక్షేమాన్ని కొత్తపుంతలు తొక్కించిన రైతుబంధు ద్వారా మరో విడత పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈనెల 28 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పెట్టుబడిసాయాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. ఎప్పటిలాగే ఎకరం నుంచి ప్రారంభించి చివరి రైతు వరకు రైతుబంధు సాయాన్ని అందించనున్నారు.

సంక్రాంతి వరకు అర్హులైన ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేయనున్నారు. ఈ సీజన్‌లో సుమారు 66 లక్షల మంది రైతుల కోసం రూ.7,600 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత సీజన్‌ వరకు రైతుబంధు ద్వారా రూ.57,881 కోట్లను ప్రభుత్వం కర్షకుల ఖాతాల్లో జమ చేసింది. యాసంగి పంటసాయం కూడా అందితే ఇప్పటివరకు రైతులకు అందించిన రైతుబంధు నిధుల మొత్తం రూ.65వేల కోట్లు దాటుతుంది.

కొత్తగా లక్ష మంది రైతులు
రైతుబంధు పంపిణీకి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రైతులకు సంబంధించిన వివరాలను నేడు లేదా రేపు రెవెన్యూ శాఖ (సీసీఎల్‌ఏ) నుంచి వ్యవసాయశాఖ సేకరించనున్నది. ఆ తర్వాత ఈ సీజన్‌కు ఎంతమంది రైతులు అర్హులనే విషయంలో స్పష్టత రానున్నది. గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో మరో లక్ష మంది రైతులు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.

క్రయవిక్రయాలు, విభజన, న్యాయపరమైన చిక్కుల పరిష్కారంతో మరిన్ని భూములకు రైతుబంధు వర్తిస్తుందని.. తద్వారా అర్హుల సంఖ్య పెరుగుతుందని చెప్తున్నారు. వానకాలంలో 64.99 లక్షల మంది రైతులకు రూ.7,433.13 కోట్ల నిధులను రైతుబంధు కింద పంపిణీ చేసింది. అయితే ఈసారి 66 లక్షల మంది రైతులు అర్హులయ్యే అవకాశమున్నదని, వారికి రైతుబంధు పంపిణీ కోసం రూ.7,600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అంటే గత సీజన్‌తో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.200 కోట్లు అదనంగా వెచ్చిస్తుండటం విశేషం. ఏటా రైతుల సంఖ్యతోపాటు రైతుబంధు నిధుల మొత్తం కూడా పెరుగుతూ వస్తున్నది.

రూ.65 వేల కోట్లు దాటనున్న సాయం
దేశ విదేశాల్లో ఎక్కడా లేనివిధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో తొలిసారిగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అప్రతిహతంగా కొనసాగుతున్నది. 2018 వానకాలం నుంచి ప్రారంభమై ఈ పథకం ప్రస్తుత యాసంగితో 10వ విడతను చేరుకుంటున్నది. గత వానకాలం వరకు 9 విడతల్లో ఏకంగా రూ. 57,881 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. యేట 65 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఇక ఈ యాసంగి సీజన్‌తో రైతుబంధు పెట్టుబడి సాయం రూ. 65,481 కోట్లకు చేరనుంది.

సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం
‘పంట పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కోవద్దు. ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి రావొద్దు. అందుకే సాగు ప్రారంభానికి ముందే వారి ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం జమ చేస్తున్నం’.. రైతుబంధు ఉద్దేశానికి సంబంధించి పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలివి. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీజన్‌ ప్రారంభానికి ముందే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. యాసంగి సీజన్‌ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు, దుక్కులకు, పలు సాగు అవసరాలకు రైతుబంధు నిధులు అక్కరకొస్తున్నాయి.

రైతుబంధుకు కేంద్రం అడ్డంకులు
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు పెట్టుబడి సాయం అందించి, వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అన్నదాతలకు రైతుబంధు అందకుండా కేంద్రం కుట్రలు చేస్తున్నది. కేంద్రం నుంచి రాష్ర్టానికి న్యాయపరంగా దక్కాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా రాష్ర్టాన్ని, రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. వివిధ రూపాల్లో రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన రూ.40 వేల కోట్లు రాకుండా కేంద్రం తొక్కి పెడుతున్నది. ఈ విధంగా కేంద్రం ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధి విషయంలో ఎన్ని కష్టాలెదురైనా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనుకంజ వేయడం లేదు. ఓవైపు కేంద్రం కక్ష సాధింపు, మరోవైపు ఆర్థిక పరమైన ఇబ్బందులతో అనేక కష్టాలెదురైనా రాజీపడకుండా రైతులకు టంఛన్‌గా రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది.

రైతుబంధు నిధుల్లో ఎలాంటి కోత పెట్టొద్దని, అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో నిధులు జమ చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శికి సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలను జారీచేశారు.
రైతుబంధు దేశానికే ఆదర్శం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పటివరకు రూ.58 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయగా, ఈ విడతతో అది రూ.65 వేల కోట్లకు చేరనుంది. రైతుబంధు నిధులు విడుదల చేసినందుకుగాను రాష్ట్ర రైతాంగం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. సంక్రాంతి లోపు అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందిస్తాం.
-నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

రైతు బాంధవుడు కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని మరోసారి రుజువైంది. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా.. రైతులకు ఇబ్బంది రాకుండా సీఎం కేసీఆర్‌ సరైన సమయంలో రైతుబంధు నిధులను అందిస్తున్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇందుకు రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి , రైతుబంధు సమితి చైర్మన్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.