Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాజధాని రోడ్లకు శాశ్వత పరిష్కారం

-వర్షాలు తగ్గగానే రూ.77 కోట్లతో మరమ్మతులు -రోడ్ల అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్.. రూ.130 కోట్లతో వైట్‌టాపింగ్ రోడ్లు -150 డివిజన్లలో 150 మంది ఇంజినీర్లతో నిరంతర పర్యవేక్షణ -నవంబర్ ఆఖరులోగా జీహెచ్‌ఎంసీలో 224 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ -రోడ్లు తవ్వకుండా ట్రెంచ్‌లెస్ టెక్నాలజీతో పైపులైన్లకు మరమ్మతులు -నగర విస్తృత పర్యటనలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ -సనత్‌నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు పాడైన రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. వర్షాలు తగ్గగానే రూ.77 కోట్లతో మరమ్మతులు చేస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గంలో రూ.58 కోట్లతో 16 చోట్ల చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పాటిగడ్డలో మోడల్ మార్కెట్, గాంధీనగర్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్, హుస్సేన్‌సాగర్ పంప్‌హౌస్, మారేడ్‌పల్లిలో రెండు మంచినీటి రిజర్వాయర్లను ప్రారంభించారు. అమీర్‌పేట డివిజన్‌లో మంత్రులతో కలిసి 50 పడకల దవాఖాన నిర్మాణ పనులను ప్రారంభించారు. మరో 11 చోట్ల పనులకు శంకుస్థాన చేశారు. బన్సీలాల్‌పేట డివిజన్ గాంధీనగర్‌లో ఇండ్లు, మౌలికవసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని స్థానికులకు మంత్రి కేటీఆర్ హామీఇచ్చారు. రోడ్ల నిర్వహణలో ఈ ఏడాది నుంచి వినూత్న విధానాలు అమలుచేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు సుమారు 50 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు రోడ్లను పర్యవేక్షించేవారని, నవంబర్ 1 నుంచి డివిజన్‌కు ఒకరు చొప్పున 150 మంది ఇంజినీర్లు నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. నీళ్లు నిలిచి ట్రాఫిక్‌జామ్‌కు కారణమవుతున్న 350 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారని, ఆయాచోట్ల వైట్‌టాపింగ్ రోడ్లు వేసేందుకు సుమారు రూ.130 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. జీహెచ్‌ఎంసీలో 350 మంది ఇంజినీర్లను అదనంగా భర్తీ చేయబోతున్నామని, 126 మందిని ఇప్పటికే తీసుకోగా, 224 మందిని నవంబరు నెలాఖరునాటికి నియమిస్తామన్నారు.

రూ.ఆరు వేల కోట్లతో అభివృద్ధి రాజధాని రోడ్ల మరమ్మతులకు శాశ్వత పరిష్కారం, కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్సార్‌డీపీ)లో భాగంగా రూ.మూడు వేల కోట్లు, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్డీసీ)కింద రూ.మూడువేల కోట్లతో పనులు చేపడుతున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నగర రోడ్లను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ రోడ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో మూడుచోట్ల రూ.20 కోట్లతో వైట్‌టాపింగ్ రోడ్ల పనులు ప్రారంభించామని చెప్పారు. డిసెంబర్ చివరినాటికి 56 రిజర్వాయర్ల పనులు పూర్తవుతాయని తెలిపారు. పురాతన డ్రైనేజీ పైపులైన్ల వల్ల గతంలో ఎన్టీఆర్ మార్గ్‌లో భారీగుంత ఏర్పడిందని, ఇలాంటివి పునరావృతం కాకుండా రోడ్లు తవ్వకుండానే లీకేజీలను బాగుచేసేందుకు ట్రెంచ్‌లెస్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. 120 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు ఈ విధానంలో చేపడుతామన్నారు. గ్రేటర్ పరిధిలోని నిరుపేదలకోసం నిర్మించనున్న లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లలో 96 వేల ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయని, మరో నాలుగు వేల ఇండ్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. వివిధదశల్లో ఉన్న మోడల్ మార్కెట్లు, కమ్యూనిటీ హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఏడాదిలోగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం ప్రభుత్వం చేపడుతున్న పనులన్నింటినీ విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 50 ఏండ్లు పాలించి అభివృద్ధినిమరిచిన కాంగ్రెస్, మూడున్నర ఏండ్ల టీఆర్‌ఎస్ పాలనను విమర్శిస్తున్న తీరును ఎండగట్టారు. ఇంత తక్కువ సమయంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తున్నదన్నారు. తమకు ఢిల్లీలో బాసులు లేరని, ప్రజలే బాసులన్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, సీ లకా్ష్మరెడ్డి, ఎంపీ దత్తాత్రేయ, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.