-ఐదేండ్లు కలిసి నడిస్తే వందేండ్లు సుఖసంతోషాలు -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటన -టీఆర్ఎస్లో చేరిన కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు -ఆయనతోపాటే వైస్‌చైర్మన్, పీఏసీఎస్‌ల చైర్మన్లు

రాష్ట్రంలోని రాజకీయ నాయకులు ఐదేండ్లు కలిసి నడిస్తే.. మరో వందేండ్లపాటు రాష్ట్రం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా రాజకీయాలకతీతంగా, ఐక్యంగా ముందుకు సాగితే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, వైస్ చైర్మన్ వీ మోహన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లతోపాటు సిరిసిల్లకు చెందిన పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర కీలకనేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చినందున ఈ ఏడాది రైతుల పొలాలు ఎండటంలేదని, కరెంటుకోతలు లేవని అన్నారు. వచ్చే మార్చి తర్వాత రైతులకు 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. వలస పాలనలో 60ఏండ్ల చెరువుల పూడిక తీయటానికే మిషన్ కాకతీయకు రూ.20వేల కోట్లు ఖర్చు చేయాల్సివస్తున్నదని, పాతకాలంనాటి చెరువులను పునరుద్ధరిస్తే గ్రామాల్లో కరువు దూరమవుతుందన్నారు. గతంలో కేవలం రాజకీయాలకే సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగించుకునేవారని, తాము అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు రూ.వెయ్యి పింఛన్లు ఇస్తున్నామన్నారు. తమను ఎవరూ అడగకున్నా.. బీడీ కార్మికుల సంక్షేమం కోసం రూ.వెయ్యి భృతి ఇస్తున్నామన్నారు. సిరిసిల్లలో 50-60వేల మందికి పింఛన్లు వస్తున్నాయని.. ఆత్మహత్యలు దూరం చేసేందుకు, అభివృద్ధి కోసం కలిసి రావాలని అక్కడి నాయకులను కోరానన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవీందర్రావు, మోహన్‌రెడ్డిలను కలిసి రావాలని కోరానని, వారికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తాను త్వరలోనే సిరిసిల్లకు వస్తానని, అక్కడి ప్రజలతో కలిసి ఒకరోజు పూర్తిగా ఉంటానని తెలిపారు. సిరిసిల్ల అభివృద్ధి కోసం రూ.50-60కోట్లు కేటాయిస్తానని సీఎం హామీ ఇచ్చారు.
పునర్నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకే: రవీందర్రావు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకే తాను టీఆర్ఎస్లో చేరినట్లు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినన్ని సంక్షేమ, రైతుమిత్ర కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. రవీందర్రావు కుటుంబం, అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరటంతో సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు కూడా టీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫునపోటీచేసిన వెలుముల శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ పాలకవర్గ సభ్యులు ఎన్ సత్యనారాయణ, సీహెచ్ శ్రీనివాస్, ఏ భాస్కర్, రామ్మోహన్రావు, కాశిరెడ్డి, సైదయ్య, రాజ్‌కుమార్, లోకేష్‌కుమార్, శ్యాం, తిరుమలరావు, సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని 12 మంది సింగిల్‌విండో అధ్యక్షులు, 30 మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీసీ సభ్యులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.