Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాజ్‌భవన్‌ రాజకీయ వేదిక కారాదు!

తెలంగాణ ప్రజలది కల్మషం లేని మనసు. అక్కున చేర్చుకునే ఆప్యాయత కలిగిన గుణం. ఆత్మగౌరవాన్ని ప్రాణపదంగా భావిస్తారు. దానికి భంగం కలిగిస్తే ఎంతకైనా తెగించి పోరాడుతారు. అట్లాగే ఎవరైనా తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకోరు. తమ పౌరుషాన్ని చూపించడంలో వెనక్కి తగ్గరు. తెలంగాణ మీద విషం చిమ్మేవారిని చీరి చింతకు కట్టేవరకు వదలరు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక,కండ్లు మండి, కుటిల రాజకీయాలు చేసేవారు దీన్ని తెలుసుకుంటే మంచిది.

రాజ్‌భవన్‌ వేదికగా రాజకీయాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రిగా కొన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరమున్నది. నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్‌ వ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే… ‘సర్కారియా, పూంచీ కమిషన్‌ చెప్పినట్లు- రాజకీయాల్లో ఉన్న వారిని గవర్నర్లుగా నియమించకూడదు. సమాజానికి జీవితాన్ని అంకితం చేసి, శ్రేష్ఠమైన ఆలోచనలు కలిగి, రాజకీయాలతో సంబంధం లేని సమాజ సేవకులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలి.

కేంద్రంలో, ఒక రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తిని ఆ రాష్ర్టానికి గవర్నర్‌గా అసలే నియమించకూడదు. రాజకీయాలు చేసి అక్కడి ముఖ్యమంత్రిని పనిచేయనివ్వరు’ అని మోదీ అన్నారు. కానీ ప్రధాని అయిన తర్వాత ఆయనే తన మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు గవర్నర్‌గా నియమితులయ్యే ఆఖరి నిమిషం వరకు తమిళిసై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. మోదీ సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్లు ఎలా ఉండొద్దని చెప్పారో, ప్రధాని అయ్యాక ఆ మాటల్ని పూర్తిగా పక్కనపెట్టారు.

తమిళిసై గారికి తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలకన్నా.. బీజేపీ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తున్నది. ఆమె వ్యవహారశైలిలోనే ఆ విషయాలు స్పష్టమవుతున్నాయి. అందుకు ఈ మధ్య ఆమె మాట్లాడిన మాటలే చెబుతాయి. ‘15 రోజులు ఒక సంతకం పెట్టకుండా నాన్చి ఉంటే తెలంగాణ శాసన సభ రద్దయ్యేది’ అన్న గవర్నర్‌ వ్యాఖ్యలు సగటు రాజకీయ నేతలా ఉన్నాయే తప్ప మరేమీ కాదు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి అనుమతి కోసం రాష్ట్రప్రభుత్వం గవర్నర్‌కు ఫైలు పంపింది. ఆమె ఫైలు మీద సంతకం పెట్టకుంటే శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టటానికి వీలుండేది కాదు. అంతేకానీ శాసనసభ రద్దు కాదు. మార్చి 31లోపు బడ్జెట్‌ ఆమోదం పొందకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చుపెట్టే అధికారం ప్రభుత్వానికి ఉండదు. అంతే కానీ ప్రభుత్వం కూలిపోయే ఆస్కారం ఎక్కడిది?!

ఆర్నెల్ల లోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుంటే మాత్రమే ప్రభుత్వానికి ప్రమాదం. స్పీకర్‌ గారే మొన్నటి సమావేశాలు ‘సమన్‌’ చేశారు కాబట్టి, అసెంబ్లీ సమావేశాలు జరుపుకొనేవాళ్ళం. రాజ్యాంగం ప్రకారం.. బడ్జెట్‌ సమావేశాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. బడ్జెట్‌ ప్రవేశపెట్టడం అనేది ఆర్నెల్లకోసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఒక భాగం మాత్రమే. అయినా.. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంత తేలికనా? ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నించిన వారికి ఏ గతి పట్టిందో ఈ నేల మీదనే జరిగిన చరిత్ర తెలుసుకోవడం మంచిది.

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ లాంటి వారు సంధించిన ప్రశ్నలకు రాజ్‌భవన్‌ సమాధానం చెప్పగలదా? రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ వ్యవస్థను చాలా ఉన్నతంగా భావించి గౌరవిస్తున్నది. గతంలో నరసింహన్‌ ఉన్నప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తున్నది?

గవర్నర్‌గా తమిళిసై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినా, ప్రభుత్వ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకున్నా.. రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి ఫొటో లేకుండా సంకుచితంగా వ్యవహరించినా మేం హుందాగా, మౌనంగా, దూరంగా ఉన్నాం తప్ప, రచ్చకెక్కలేదు. అనవసరంగా గవర్నరే మీడియాకెక్కి రాజ్‌భవన్‌ను రాజకీయాలకు వేదికగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతికి వివరించాలి. కానీ ప్రభుత్వం మీద ప్రధానికి, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానని స్వయంగా గవర్నర్‌ మీడియాతో చెప్పడం దేనికి సంకేతం?

తన తల్లి మరణం తర్వాత పరామర్శకు ముఖ్యమంత్రి రాలేదని సెం టిమెంటును గవర్నర్‌గారు ముందు కు తెస్తున్నారు. ముఖ్యమంత్రికి వీలుగాకపోతే వారి కుమారుడు, మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురు ఇతర మంత్రులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. అంతకుముందు గవర్నర్‌ గారి మేనమామ మరణిస్తే సీఎం కేసీఆర్‌ స్వయంగా గవర్నర్‌ను పరామర్శించారు కదా! ఎందుకిలా ఈ స్థాయిలో ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు?

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ జుగుప్సాకరమైన రీతిలో రాజకీయ కలయికతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. గతంలో చంద్రబాబు నోట వచ్చిన మాటలే ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు! ‘హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, గవర్నర్‌కు హైదరాబాద్‌ పై సెక్షన్‌-8 ప్రకారం అధికారం’ అన్న మాటల్నే, అప్పట్లో చంద్రబాబు డైరెక్షన్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోయాలని డబ్బు సంచులతో పట్టుబడిన ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడు. వీరి మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్‌ మీద ఏదో ఒక సాకుతో మళ్ళీ దండెత్తి వారి ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారా?

గవర్నర్‌ విషయంలో గౌరవ, మర్యాదలను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. తెలంగాణ ఆవిర్భావం రోజే ఆమె పుట్టినరోజు అని సీఎం కేసీఆర్‌ ఒక తెలంగా ణ ఆడపడుచులా భావించి, గౌరవించి తమి ళిసై గారికి శుభాకాంక్షలు తెలిపారు. చిన్న చిన్న సాంకేతిక అంశాలను ముందు పెట్టడానికి ప్రయత్నిస్తే, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం తెలంగాణ సమాజం ముం దుకుపోతుంది. దేవాలయం లాంటి రాజ్‌భవన్‌ రాజకీయాలకు వేదిక కాకూడదనేదే కేసీఆర్‌ ప్రభుత్వ ఆకాంక్ష.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి)

-వేముల ప్రశాంత్‌ రెడ్డి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.