Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రక్షణ ఎగుమతులే లక్ష్యం

-తయారీరంగ పునరుద్ధరణకే మేక్ ఇన్ ఇండియా -జీరో డిఫెక్ట్‌తో అపాచీ ప్రొడక్ట్స్ -తెలంగాణ యువకులందరికీ ధన్యవాదాలు -అపాచీ హెలికాప్టర్ల విడిభాగాల తయారీ -యూనిట్ ప్రారంభోత్సవంలో కేంద్ర రక్షణ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ -రాష్ట్రంలో మూడు ఏరోస్పేస్ సెజ్‌లు -రక్షణ పరిశ్రమలకు అనువైన వాతావరణం -రక్షణ పరిశ్రమల ఉత్పత్తి కారిడార్‌ను హైదరాబాద్‌కు కేటాయించండి -కేంద్రమంత్రిని కోరిన మంత్రి శ్రీ కల్వకుంట్ల తారకరామారావు.

రక్షణరంగ పరికరాల్ని దేశీయంగా తయారుచేయడమే కాకుండా ఎగుమతిచేసే దిశగా ఎదుగాలనేదే లక్ష్యమని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 ఆగస్టు 15న ఎర్రకోట బురుజులపై నుంచి పిలుపునిచ్చిన మేక్ ఇన్ ఇండియా లక్ష్యం ఇదేనన్నారు. ప్రపంచంలోని తయారీదారులను భారతదేశంలో తమ ఉత్పత్తులను తయారుచేయాల్సిందిగా ప్రధాని ఈ మేరకు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. తయారీరంగాన్ని పునరుద్ధరించడమే దీని ఉద్దేశమని తెలిపారు. రక్షణరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గురువారం ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్‌లో బోయింగ్-టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) భాగస్వామ్య సంస్థ టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) తయారీ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, టాటా సంస్థల అధిపతి రతన్ టాటాలతో కలిసి కేంద్రమంత్రి ప్రారంభించారు. అపాచీ యుద్ధ విమానాల ప్రధాన భాగాలు ఇక్కడ తయారుచేస్తారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీబీఏఎల్ సంస్థ నిర్దేశిత లక్ష్యంలోపే తన కార్యకలాపాలు ప్రారంభించడంపట్ల హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచస్థాయి భాగస్వామ్యంతో దేశంలో తయారీచేపట్టడం, రక్షణరంగానికి ప్రో త్సాహమివ్వడం సంతోషకరంగా ఉందని చెప్పారు. రోబోలు తయారుచేస్తే లోపాలుండవని, అదే తరహాలో ఎటువంటి లోపాలు లేని అపాచీ హెలికాప్టర్లు ఇక్కడ తయారుచేస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదిభట్లలో ఉన్న సౌకర్యాలు ఆ కచ్చితత్వాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తితోనూ లోపాలు లేని హెలికాప్టర్లు తయారు చేయవచ్చని ఇక్కడి యూనిట్ తెలియజేస్తున్నదని ప్రశంసించారు. ఇక్కడ తయారుచేసిన హెలికాప్టర్లు నాణ్యతా పరీక్షల్లో ఎలాంటి లోపాలు లేవని (జీరో డిఫెక్ట్) తేలిందన్నారు. ఈ విషయంలో సంస్థ నిర్వహకులు, ఉద్యోగులను ఆమె అభినందించారు. మన తెలంగాణ యువకులందరికీ ధన్యవాదాలు. మీరు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినా ఇంత త్వరగా, చాలా చక్కగా ట్రైనింగ్ పొంది, ఇవాళ చిన్న ప్రొడక్ట్ కాదు.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్ విషయంలో మీ వంతు కృషిచేస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది అంటూ తెలుగులో వ్యాఖ్యానించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా సంస్థ దేశ అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్నదని ఆమె ప్రశంసించారు.

రక్షణ ఉత్పత్తుల కారిడార్ ఇవ్వండి: కేటీఆర్ రక్షణరంగ ఉత్పత్తుల తయారీకి అనువైన వాతావరణం తెలంగాణలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌ను కేటాయించాలని ఆయన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరారు. హైదరాబాద్‌లో రక్షణ ఉత్పత్తులకు దేశంలోనే అతి పెద్ద ఎకో సిస్టం ఉందని తెలిపారు. 10 డీపీఎస్‌యూలు, 25 భారీ డొమెస్టిక్ మాన్యుఫాక్చరర్స్, 1000 ఎమ్మెస్‌ఎంఈ సంస్థలున్నాయన్నారు. వర్క్‌ఫోర్స్, శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలో వైమానికరంగానికి ప్రత్యేకంగా మూడు సెజ్‌లు – అదిభట్ల, నాదర్‌గుల్, శంషాబాద్‌లో ఉన్నాయన్నారు. గత ఐదేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం) భారతదేశానికి ప్రధానంగా తెలంగాణకు, హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిపారు.

తాజాగా టాటా-బోయింగ్ సంయుక్తంగా సంస్థను ఏర్పాటుచేశాయన్నారు. టాటా-బోయింగ్ సంస్థలు హైదరాబాద్‌లో తమ సంస్థను ఏర్పాటుచేసినందుకు మంత్రి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. 18 నెలల కాలంలోనే నిర్మాణాన్ని పూర్తిచేసినందుకు అభినందించారు. విడిభాగాలను తయారుచేయడమే కాకుండా హెలికాప్టర్లను పూర్తిస్థాయిలో తయారుచేసే స్థాయికి ఎదుగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బోయింగ్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు లెన్నీ కారిట్, భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్, టాటా సన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ అధ్యక్షులు బాన్‌మలి అగర్వాల్, టీఏఎస్‌ఎల్ సీఈవో సుకరణ్‌సింగ్, బోయింగ్ ఇండియా అధ్యక్షులు ప్రత్యూష్‌కుమార్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారత్‌లో బ్రహ్మాండమైన భవిష్యత్తు భారతదేశంలో భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతున్నదని, అందుకే తాము ఇక్కడ గణనీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టామని బోయింగ్ డిఫెన్స్, స్పేస్ అండ్ సెక్యూరిటీ ప్రెసిడెంట్, సీఈవో లియాన్నే కేరెట్ చెప్పారు.

ట్విట్టర్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్ సంతోషం టాటా, బోయింగ్ సంస్థల ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరవడం సంతోషాన్ని కలిగించిందని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌జెస్టర్ సంతోషం వ్యక్తంచేశారు. అమెరికా, భారత్‌ల మధ్య బలపడనున్న బంధానికి ఇది నిదర్శనమని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రపంచంలోనే ఈ తరహా ఏకైక కేంద్రం -టీబీఏఎల్ యూనిట్‌కు 2016 జూన్ 18న శంకుస్థాపన. -13 ఎకరాల్లో 14వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం. -350 మంది అత్యంత నిష్ణాతులైన ఉద్యోగులు. -ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ ప్రధాన విడిభాగాల (ఫూజ్‌లాజ్)ను ఉత్పత్తిచేసే ఏకైక సంస్థ. -అమెరికా ఆర్మీ సహా వివిధ దేశాల సేనలకు బోయింగ్ సంస్థ ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్లను అందిస్తుంది. -ఇక్కడ సెకండరీ స్ట్రక్చర్స్, మల్టీరోల్ కంబాట్ హెలికాప్టర్లకు చెందిన వర్టికల్ స్పార్‌బాక్స్‌లు కూడా ఉత్పత్తి చేస్తుంది. -ఈ కేంద్రం నుంచి తొలి ఫ్యూజ్‌లాజ్ డెలివరీ 2018లో -ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2300 అపాచీ హెలికాప్టర్లు -అమెరికా ఆర్మీ ఒక్కటే అపాచీ హెలికాప్టర్లను 4.3 మిలియన్ ైఫ్లెట్ అవర్స్ నడిపింది. వీటిలో జనవరి 2018 నాటికి 1.2మిలియన్ ైఫ్లెట్ అవర్స్ యుద్ధరంగంలో ఉన్నాయి. -ఈ హెలికాప్టర్లను భారత్ సహా 16 దేశాల ఆర్మీ వాడుతున్నాయి. -భారత రక్షణశాఖ బోయింగ్‌తో 22 ఏహెచ్- 64 హెలికాప్టర్ల సరఫరాకోసం 2015 సెప్టెంబర్‌లో ఒప్పందం చేసుకుంది. వీటి సరఫరా 2019లో ప్రారంభమవుతుంది.

అంతర్జాతీయ పరిశ్రమను నిర్మించిన తెలంగాణ సంస్థ -నిర్ణీత గడువు కంటే ముందే నిర్మించిన ఆర్క్ బిల్డర్స్ ఆదిభట్లలో గురువారం ఆరంభమైన టాటా బోయింగ్ పరిశ్రమను సందర్శించిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసలు కురిపించారు. సుమారు 13 ఎకరాల్లో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను నిర్మించారు. నిర్ణీత గడువు ఏడాది కంటే ముందే తొమ్మిది నెలల్లో అత్యుత్తమ ప్రమాణాలతో ఈ పరిశ్రమను కట్టిన సంస్థ తెలంగాణకు చెందిన ఆర్క్ బిల్డర్స్ కావడం గమనార్హం. పరిశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న టాటా సంస్థ ఉన్నతాధికారులు సైతం దేశంలోనే ఇది అత్యుత్తమ ప్రమాణాలు గల పరిశ్రమగా అభివర్ణించారు. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని ఆర్క్ బిల్డర్స్ సంస్థ ఎండీ గుమ్మి రాంరెడ్డి ఆనందం వ్యక్తంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.