Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ నేడే

-రెండో విడుతలో 10 మందికి చోటు!
-ఉదయం 11.30 గంటలకు..
-కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్న గవర్నర్
-12కు పెరుగనున్న రాష్ట్ర మంత్రివర్గం
-లోక్‌సభ ఎన్నికల తర్వాత మరికొందరికి?
-ఖమ్మం మినహా అన్ని ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం
-కాబోయే మంత్రులకు సీఎంవో ఫోన్లు
-ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు

మరికొద్ది గంటల్లో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంత్రివర్గంలో కొలువుదీరనున్నవారి పేర్లు ఖరారయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తాజా మంత్రివర్గ విస్తరణలో పదిమందికి చోటు కల్పించనున్నారు. వీరిలో గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు కొత్తగా ఎస్ నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరిగే కార్యక్రమంలో వీరితో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. అనంతరం వీరికి శాఖల కేటాయింపు ఉంటుంది. మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం కేసీఆర్.. క్యాబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించినవారి పేర్లను ఇప్పటికే రాజ్‌భవన్‌కు తెలియజేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇదే విషయంలో సాధారణ పరిపాలన శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు.

మరోవైపు మంత్రులుగా ఎంపికైనవారిని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు కాబోయే మంత్రులకు సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు స్వయంగా ఫోన్లుచేసి, మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. మంగళవారం ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి తరఫున ఆహ్వానించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా రాష్ట్ర క్యాబినెట్‌లో గరిష్ఠంగా 18 మంది మంత్రులు ఉండవచ్చు. ఇప్పటికే కే చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ హోంమంత్రిగా ఉన్నారు. తాజా విస్తరణలో చేరే పదిమందితో కలుపుకొని మంత్రుల సంఖ్య 12కు చేరుకుంటుంది. మిగిలిన ఖాళీలను లోక్‌సభ ఎన్నికల తరువాత భర్తీ చేసే అవకాశం ఉంది.

ప్రమాణం అనంతరం శాఖల కేటాయింపు
మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తరువాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నుంచి వచ్చే ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించిందీ వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీచేస్తుంది.

పాత కొత్తల మేలు కలయిక
మంత్రివర్గ కూర్పులో పాత కొత్తల మేలు కలయిక కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో పనిచేసిన ఈటల రాజేందర్, జీ జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు సీఎం కేసీఆర్ రెండో దఫా అవకాశం కల్పించారు. నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, సీహెచ్ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి కొత్తవారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఇప్పటివరకు మంత్రిగా పనిచేయలేదు. ఆయన మొదటిసారి మంత్రి అవుతున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నిరంజన్‌రెడ్డి తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా క్యాబినెట్ హోదాలో పనిచేశారు.

కొప్పుల ఈశ్వర్ తెలంగాణ మొదటి అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పనిచేయగా, వేముల ప్రశాంత్‌రెడ్డి మిషన్‌భగీరథ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. వీ శ్రీనివాస్‌గౌడ్‌ను గత ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా సీఎం కేసీఆర్ నియమించారు. అయితే కోర్టు కేసు కారణంగా పార్లమెంటరీ కార్యదర్శి పదవులు రద్దయ్యాయి. దీంతో ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగారు. మల్లారెడ్డి గతంలో ఎంపీగా ఉన్నారు. మొత్తంగా అనుభవజ్ఞులతోపాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి మంత్రులుగా అవకాశం కల్పించారు.

ఖమ్మం మినహా అన్ని ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం
మంత్రివర్గంలో ఒక్క ఖమ్మం జిల్లా మినహా అన్ని ఉమ్మడి జిల్లాలకు ఈ దఫా అవకాశం దక్కింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు మాత్రమే మంత్రులుగా ఇద్దరుచొప్పున అవకాశం లభించింది. హైదరాబాద్ జిల్లానుంచి ఇప్పటికే మహమూద్‌అలీ హాంమంత్రిగా ఉన్నారు. విస్తరణలో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అవకాశం దక్కింది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం వచ్చింది. కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్‌కు అవకాశం ఇచ్చారు.

మెదక్ జిల్లా నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా మంత్రివర్గంలో ఉన్నారు. కాగా నల్లగొండ నుంచి జగదీశ్‌రెడ్డి, వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, అదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, రంగారెడ్డి నుంచి సీహెచ్ మల్లారెడ్డి, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు. జిల్లాకు ఇప్పటికే పెద్ద పదవి వరించింది. అపార అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.